Menu Close
Page Title
నంది

nandhi-01శివాలయాలన్నిటిలోను, ఎద్దు రూపంలో కూర్చొని ఉన్న నంది విగ్రహాన్ని, ప్రధాన ఆలయంలో శివలింగము ఎదురుగా ఆ దేవుణ్ణే గంభీరంగా చూస్తూ ముచ్చట గొలుపుతూ ఉండడం మనము చూస్తూ ఉంటాము. ప్రక్క పటంలో పూలతో అలంకరింపడి ఉన్న ఎక్కువగా పూజింపబడే ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహం, 15 అడుగుల ఎత్తుతో 20 అడుగులు పొడవుతో ఉన్న ఈ ఏకశిలా బసవన్నవిగ్రహం, కర్ణాటకలోని బెంగళూరులో బసవన్న గుడిలో వుంది. దానిని విజయనగర రాజుల సామంతుడైన కెంపెగౌడ 1537 లో స్థాపించాడట.

నందీశ్వరుని జన్మ వివరాలలోకి వెళ్తే, వేదకాలంలో శిలాద మహర్షి శివుని గురించి చేసిన తీవ్ర తపః ఫలితంగా యజ్ఞకుండంలో నుంచి వచ్చిన బాలుడిని మహదానంద భరితులై ఆదంపతులు పుత్రునిగా స్వీకరించి ‘నందుడు’ అని పేరు పెట్టారట. శిలాద మహర్షి తన పుత్రుని ఆయుష్షు బహు తక్కువని తెలుకుని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ అతడిని చిరంజీవిని చెయ్యమని కోరాడట. అయన అనుగ్రహించి పార్వతి పరమేశ్వరు లిరువురు నందీశ్వరునికి ఆగమ, తంత్ర మొదలైన శాస్త్రాలన్నీ ఉపదేశించి, పిమ్మట మెప్పుదలగా ఆతడి మెడలో గంటతో కూడిన మాలని వెయ్యగా వెంటనే అతడు సగభాగం వృషభంగా మారినాడట. ఆతడిని పరమేశ్వరుడు తన ద్వారపాలకునిగా నియమించాడు. ఆ నందీశ్వరుడు ఆ జ్ఞానాన్ని తన శిష్యులైన సనక, సనంద, సనాతన, సనత్కుమార, తిరుమలార్, వ్యాఘ్రపాద, పతంజలి, శివయోగి అనే అష్ట మునులకు ఉపదేశించి భూమిపై అన్ని మూలలకు వ్యాప్తి చేయుటకు పంపించాడు. తెల్లని నంది శుచిని, మూర్తీభవించిన న్యాయాన్నీ, సూచిస్తూ జీవుని మనస్సు యోగివలే ఎల్లప్పుడూ ఆలయంలోని దేవునిపై స్థిరంగా నిలపాలని బోధిస్తుంది. ఏ ఆలయములో నైనా దైవదర్శనానికి వెళ్ళుటకు ముందుగా ధ్వజస్తంభానికి మ్రొక్కి, ఆ దేవుని నామాన్ని జపిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసుకుని (ధ్వజస్థంభం నుంచి ప్రధాన ఆలయానికి ఎడమవైపుగా ప్రారంభించి, ఆలయానికి బయటనే తిరిగి ధ్వజస్థంభం చేరుకోవడం ఒక ప్రదక్షిణమౌతుంది- అనగా గడియారం ముళ్ళు తిరిగే పద్దతిని), తరువాత అది శివాలయమైతే పరమ శివుని వాహనమైన నందిని ఆదరంతో నమస్కరించి ఎడమ చేతి బొటన వ్రేలు నంది కుడి కొమ్ముపైన, చూపుడు వేలు గాని మధ్య వేలుగాని ఎడమ కొమ్ముపైన ఆనించి, కుడి చేతితో నంది తోకమొదటి భాగాన్ని స్పృశిస్తూ ఆ కొమ్ముల మధ్యనుంచి లింగ దర్శనం చేసుకోవడం భక్తునికి రివాజు. వైష్ణవాలయమైతే గరుడుడికి, రామాలయమైతే హనుమంతునికి మ్రొక్కి పిమ్మట ఆలయ అంతర్ద్వారం వద్దనుంచి ఆలయ సందర్శకుడు భక్తితో దైవాన్ని ప్రార్ధించడం సాధారణంగా జరుగుతుంది. భక్తి తొమ్మిది విధాలు- శ్రవణము, (దైవ ప్రార్ధనలు వినుట), సంకీర్తనం (దైవ ప్రార్ధన చేయుట), స్మరణము (మనస్సులోనే ధ్యానించుట), అర్చనము -స్వయంగా వీలులేకపోతే ఆలయ అర్చకుల ద్వారా చేయుట, వందనము(ఆ భగవంతునిపై ఏకాగ్రతతో నమస్కరించుట); మనస్ఫూర్తిగా చేసే ఇతర సేవలు- పాదసేవ, దాస్యము, సఖ్యము, నివేదన (ఆత్మ సమర్పణ) -వీటిని అనుసరించువారే భక్తులవుతారు.

nandhi-02ఆంధ్ర దేశంలో ప్రసిద్ధ నందీశ్వర క్షేత్రం 'మహానంది'. ఆ క్షేత్రం నంద్యాల జిల్లా నల్లమల పర్వత సానువులలో అరణ్యాల మధ్య నంద్యాలకు 21 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 215 కి.మీ దూరంలో ఉంది. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనంది క్షేత్రాలు ఉన్నాయి. అవి మహానంది, శివ నంది, వినాయక నంది, సోమ నంది, ప్రధమ నంది, గరుడ నంది, సూర్య నంది, విష్ణు నంది, మరియు నాగ నంది. మహాశివరాత్రికి అన్ని చోట్లా ఉత్సవాలు జరుపుతారు. వీటన్నిటిలో ప్రసిద్ధమైన నందీశ్వరాలయం మహానంది. అది బాదామి చాళుక్యులచే మొదట ఏడవ శతాబ్దంలో నిర్మింపబడి తరువాత పది, పదిహేవన శతాబ్దాలలో వృద్ధి చేయబడింది. దీని ప్రధాన గోపురము విజయనగర పద్దతిని నిర్మింపబడింది. మహానందిలో మూడు మంచినీటి కొలనులు ఉన్నాయి. వీటన్నిలోకి ఆలయ అతర్భాగంలోనే ఉన్న మంచినీటి కొలను చాలా ప్రసిద్ధం. 60 చదరపుటడుగుల వైశాల్యంతో స్వచ్ఛమైన నీటితో విరాజిల్లుతుంటుంది. దాని నిర్మాణం ఐదడుగుల లోతు మించకుండా ఎల్లప్పుడూ గర్భగృహంనుంచి నంది ముఖముద్వారా నీరు పడే విధంగా ఉండి అన్ని కాలాలలోనూ స్వచ్ఛమయిన సమాన నీటి ధారతో నిండుతూ ఉంటుంది. వర్షాకాలం లో కూడా మట్టినీరు రాదు ధార పెరగదు. ఎంతస్వచ్చంగా ఉంటుందంటే కొలనులోబడ్డ చిన్నఉంగరమైనా కూడా నిర్మలమైన గాజుపలకతో చూస్తే కనిపించే అంత స్పష్టంగా కనిపిస్తుంది. కొలనులో నీరు ఐదడుగల మట్టముతోనే ఉంటూ మిగిలిన నీరు పంటపొలాలకు అందచేయబడుతూ వుంటుంది. ఆ విధంగా 2000 ఎకరాలు సాగుబడి అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా వరి, పువ్వులు, పళ్ళు, కాయకూరలు పండిస్తారు. ఈ గోరువెచ్చని ఔషధ విలువలు గలిగిన కొలునులోని నీటిలో స్నానం చెయ్యడం ఒక విశేషానుభవం, ఆరోగ్య ప్రదం.

nandhi-03మహానందికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి లోని ఉమామహేశ్వర ఆలయం వైష్ణవ ఆగమశాస్త్ర పద్ధతిని నిర్మింపబడడానికి ఒక కథ వుంది. ఒకానొకప్పుడు చిట్టెప్ప అనే శివభక్తునికి శివుడు పెద్దపులి రూపములో వచ్చి దర్శనమిచ్చాడట. చిట్టెప్ప పెద్దపులి రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించి 'నేకంటి, శివుని నేకంటి' అని సంతోషంతో అరుస్తూ నాట్యం చేసాడట. ఆ ప్రాంతం కాలగమనంతో నామాంతరం చెంది "యాగంటి" గా మారిందట. పూర్వం అగస్త్య మహాముని ఈ ప్రాంతపు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపబూనుకున్నాడట. కానీ తయారైన తరువాత ఆ దేవతా శిల్పం కాలి బొటన వేలు గోరు విరిగి పోవడంతో దానిని ప్రతిష్ఠించ వీలుకాలేదట. చింతిస్తూ అగస్త్యుడు శివుని గురించి తపస్సు చెయ్యగా ఆయన ప్రత్యక్షమై అది విధిలీల అని తెలియచెప్పి ఆప్రాంతం కైలాసాన్ని పోలియుండడంతో శివాలయానికే అనువైన ప్రదేశమని చెప్పి, అగస్త్యుల వారి ప్రార్ధనపై ఉమామహేశ్వరునిగా అవతరించాడట. 15 ­వ శతాబ్దంలో ఈ ఆలయం సంగమ వంశీయుడైన హరిహర బుక్కరాయలు వైష్ణవ సంప్రదాయంలో నిర్మించాడట. ఆవిధంగా వైష్ణవ సాంప్రదాయంలో నిర్మింపబడ్డ ఆలయంలో శివుడు పూజింపబడుతున్నాడు.

nandhi-04

అక్కడ పుష్కరిణిలోకి నీళ్లు కొండలలోనుంచి నందిముఖం ద్వారా పడుతుండడం విశేషం. అక్కడ మరో విశేషమేమిటంటే ఆలయం దగ్గరకి కాకులు రావని ఆ ప్రాంతీకులు చెబుతారు. ఆవింతని మనమూ చూడవచ్చు. దానికి కారణం అక్కడి కాకులు ఒకప్పుడు అగస్త్యులవారికి తపోభంగం కలిగిస్తుంటే ఆయన వాటిని ఆప్రాంతానికి రాకుండా బహిష్కరించారట. అందువల్ల కాకి వాహనమైన శనీశ్వరుడు కూడా ఆప్రాంతానికి చేరడని ఆ ప్రాంతంవారు వక్కాణించి చెబుతారు. మరో వింత ఏమిటనగా, అక్కడి శివాలయంలోని నంది ప్రతి పదేళ్లకు ఒక అంగుళం పెరుగుతూ వస్తోంది. దీని పురావస్తు శాఖ వారు కూడా అంగీకరించి గుర్తులు పడుతున్నారు. మొదటిలో సందర్శకులు నందిచుట్టు ప్రదక్షిణిం చేయగలిగేవారట. కానీ రాను రాను నంది విగ్రహం పెరగడం వల్ల అక్కడ ప్రదక్షిణానికి చోటు చాలక వీలు కావట లేదట. నంది పెరిగి మండపంలోని రాతి స్థంభం పడిపోయి తీసి వెయ్యడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ కొంతకాలం నివసించి 'యాగంటి నంది పెరిగి పెరిగి కలియుగాంతాన్న లేచి రంకె వేస్తుంద' ని కాలజ్ఞానం లో వ్రాశారట. మనం ప్రస్తుతమైతే ఎదగడం చూస్తున్నాము. 'ట్రోవంట్స్' అనే రకం పెరిగే రాయి 'రుమేనియా' లో దొరుకుతుంది. కానీ అది యాగంటిలో ఎల్లా ప్రత్యక్షమైనదన్న విషయం, దానిని అక్కడి శిల్పులకు ఏవిధంగా గుర్తించగలిగారన్నవిషయం విచారించదగ్గదే.

-o0o-

Posted in March 2023, సాహిత్యం

2 Comments

  1. ' కరణం '

    భావలహరి శీర్షికన,
    నందిపై విశ్లేషణాత్మక వ్యాసం బాగుంది. యాగంటి క్షేత్రంలో పెరుగుతున్న నందీశ్వరుడు
    ఒక అద్భుతమే… మీరన్నట్లు ట్రోవంట్స్ శిలలు మనదేశంలో ఉన్నట్లు ఎప్పుడూ వినలేదు కూడా
    🙏🙏

    • VENUGOPAL Rao Gummadidala

      ధన్యవాదాలు. ఆ అడవుల మధ్య కొండల నడుమ ఉన్న యాగంటి క్షేత్రం ఎంతో సుందరంగా ఉండి మనస్సుకి అహ్లాదాన్ని కలిగిస్తూంటుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!