Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

"ఆమె"

‘గృహిణి లేని గృహము అరణ్యంతో సమానమే. ఇల్లాలు లేని ఇల్లు - దేవత లేని దేవాలయమే. ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.’ నారీమణుల ప్రస్తావనతో కూడిన ఇటువంటి సామెతల తెలుగు మాటలు తేనెల మూటలు కదా? ఎందుకంటే తెలుగు సామెతలలో "ఆమె" స్థానం ప్రత్యేకం. వంటగది నుంచి అంతరిక్షం దాకా ఆమె ముద్ర కనిపిస్తోంది. ఏ రంగంలో అడుగుపెట్టినా.. ఆమె విజయాలందుకుంటోంది. ఆమెను ఎంతగా ఎలా పొగిడినా... ఎంతలా చెప్పుకున్నా... బహుశా తక్కువే అవుతుందేమో. అమ్మగా, ఇల్లాలిగా, అక్కా, చెల్లిగా...స్ఫూర్తినిచ్చే మహిళగా ప్రతి బంధంతో ముడిపడి మన దైనందిక జీవనంలో "ఆమె" భాగమైంది.

తెలుగులో స్త్రీ అనే పదంకు దాదాపు 220 పైచిలుకు పర్యాయపదాలు ఉన్నాయని ఒక అంచనా. ఉదాహరణకు "అంబుజాక్షి", "అక్క", "సోదరి", "చెల్లి", "చెలి", "నెచ్చెలి", "పుత్తడిబొమ్మ", "ఇంతి", "ఇందువదన", "కాంత ", "కోమలాంగి", "లతాంగి" మొదలైనవి. ఇన్ని పర్యాయ పదాలతో స్త్రీ ని గౌరవించుకోవడం బహుశా మన తెలుగు భాష లోనే సాధ్యం అని చెప్పుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె' కోసం ప్రత్యేకం ఈ నెల రచ్చబండ చర్చ కార్యక్రమం.

ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టు పూర్వోత్తరాలు ప్రస్తావిస్తూ, గతంలో - వర్తమానం లో మహిళలు సాధించిన విజయాలు కొన్ని చర్చిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజానికి ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా మార్చి నెల 8 వ తేది న నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ఆనాడు 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికాకు పరిమితమైన ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. డెన్మార్క్ దేశ రాజధాని అయిన కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 1917 మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా మహిళలు ‘ఆహారం…శాంతి’ అనే పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ తరువాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలజ్ జా-2 తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కు ను కల్పించింది. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మార్చి 8. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. అమెరికాలో మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.

బావి లోతు తెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదు - అంటారు పెద్దలు. మన పెద్దల ఈ మాటల మూటకు కాసింత సవరణ నేను జోడిస్తాను - "బావి లోతు తెలుస్తుంది గానీ మగువ మనసు లోతు తెలియదు" అని. అది ఎందుకో సోదాహరణంగా-ఉదాహారణలతో చెబుతాను. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్టు కూడా సముద్రం లోతు ముందు దిగదుడుపే. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అంటే ఇదేనేమో! 29,031 అడుగుల ఎత్తైన ఎవరెస్టు మహా శిఖరం, పసిఫిక్ మహా సముద్రంలో 36,161 అడుగుల లోతైన "మెరినా అఖాతం" లో వేస్తే మునిగిపోతుంది కదా? సముద్రం లోతు అంత - మరి లోతైన సముద్రాలలో సంచరించే ఓర్కా తిమింగలం "మనసు లోతు" ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రపు డాల్ఫిన్ జాతి లోనే అతి పెద్దది అయిన తల్లి "ఓర్కా" తిమింగలంకు మగ బిడ్డ పుడితే ఇక ఆ తల్లి తిమింగలం 20-25 ఏండ్ల వరకు ఇంక పిల్లల్ని కనదు. అలాగే ఆడ తిమింగలం పుడితే కేవలం 15 నెలలనుండి రెండేళ్లు వరకు మాత్రమే సాకుతుంది. తాను తెచ్చే ఆహారంలో సగానికిపైగా ఆ 20-25 ఏండ్లు మగబిడ్డకు పెడుతుంది. ఎందుకంటే 2-15 వరకు ఉండే తన తిమింగలాల గుంపునకు తన మగబిడ్డ నాయకత్వం వహిస్తాడనే కోరికతో తల్లి ఓర్కా తిమింగలం ఎంతవరకు చెయ్యాలో అంత వరకు చేస్తుంది. మానవుల వలె 50-90 ఏండ్ల వరకు జీవించే తల్లి ఓర్కా తిమింగలం తన గుంపు క్షేమం గురించి - మనసు లోతు చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జంతువుల వద్ద నుండి శక్తివంతమైన భారత నారీమణుల వద్దకు వద్దాం. ఉదాహరణకు కుంతీదేవి గురించి చెప్పుకుంటే, తన కుమారులకు రాజ్యాధికారం చేపట్టడానికి ఆమె బలంగా ఎంతగా కోరుకుందో చెబుతాను. శ్రీ కృష్ణుని రాయబారం విఫలమవగానే, శ్రీ కృష్ణుడు తిరిగి వెళుతూ హస్తినాపురంలో ఉన్న కుంతీ దేవిని సందర్శిస్తాడు. నేను తిరిగి వెళుతున్నాను, నీ ఐదుగురు కొడుకులకు నీవేమి సందేశమిస్తావో ఇవ్వమంటాడు. "కృష్ణా నేనొకటే మాట చెపుతాను. రాజులకు పరాక్రమ జీవనం వృత్తి. వంశధర్మం. సంధి చెడిపోవడము మంచికే జరిగింది. సభలో కొప్పు పట్టి ఈడ్చి ఇల్లాలిని అవమానించిన విషయం నా ఐదుగురు కొడుకులు మరచారా? ఆనాడు సభలో చేయి చేసుకోవడానికి వీలు లేకపోయింది. ఇప్పుడేమయింది. కీర్తిలేని బ్రతుకెందుకు, పౌరుషముతో బ్రతకండి అని చెబుతాను” అని అన్నది. ఆమె ఈ మాట శ్రీ కృష్ణుడితో చెప్పినప్పుడు పక్కనే ధృతరాష్టుడు తదితరులు ఉన్నారని మనకు వ్యాసభారతంలో తెలుస్తుంది, అయినా కుంతీదేవి "తగ్గేదులే" అని అప్పుడు అనుకోలా? శ్రీ కృష్ణుడు తిరిగి వెళ్ళాడు, యుద్ధము తప్పదని ధ్రువపడింది. ఆ తరువాత కథ మనకు తెలిసిందే.

ఈ నెల రచ్చబండలో మరికొందరు శక్తివంతమైన స్త్రీలను గూర్చి ప్రస్తావిస్తాను. ఖడ్గతిక్కన చోళవంశపు రాజు. మనుమసిద్ధికి ఆయన సామంతుడు. కనిగిరి ఎర్రగడ్డపాడు యాదవరాజు కాటమరాజుకు పుల్లరి విషయమై శత్రుత్వం మొదలై 1260 సంవత్సరంలో పెను యుద్ధానికి కారణమయింది. సైన్యాధ్యక్షుడైన ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడినా, సైన్యాన్ని పోగొట్టుకుని యుద్ధభూమి నుండి వెన్నుచూపి వెనక్కి వచ్చేస్తాడు. ఖడ్గతిక్కన భార్య పేరు "చానమ్మ". పరాజితుడై ఇంటికి చేరిన భర్తకు రెండు బిందెల నీళ్ళు, పసుపు ముద్ద పక్కన పెట్టిచ్చి స్నానానికి ఏర్పాటు చేసిందంట. భార్య చేసిన పరాభవానికే బాధపడుతున్న తిక్కనకు తల్లి ప్రోలమ్మ చెప్పిన మాటలు మరీ అవమానం కలిగించాయి. భోజనంలో అన్ని పదార్థాలను వడ్డించిన తల్లి చివరగా విరిగిన పాలను వడ్డించింది. పాలు విరిగిపోయాయని అడిగిన తిక్కనకు ఆమె "నాయనా నువ్వు శత్రురాజులతో యుద్ధం చేయలేక కత్తి పారవేసి పిరికివాడిలా పారిపోయి నడుము విరిగిన వాడివి అయితివి, అది చూసి పశువుల నడుములు కూడా విరిగినవి. అందుకే పాలు కూడా విరిగినవి ' అని చెప్పింది. పౌరుషంగా యుద్ధభూమికి తిరిగి వెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. అయితే ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉంది. ఇంకొక గాథలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడని అందువల్ల అతనికి సిద్ధయతిక్కన అను పేరు వచ్చిందని మరియొక గాథ ఉంది. సోమశిల వద్దనున్న సోమేశ్వరుని దేవాలయమంటపం ఎదురుగా ఒక వీరుని విగ్రహం ఉంది. అది ఖడ్గతిక్కన విగ్రహం అని అంటారు. పట్టపురాయి వద్దనున్న తిక్కాపూరులో మరియొక సైనికుడు గుఱ్ఱంపై చిత్రించి ఉంది. ఇదికూడా రణతిక్కనదేనని అక్కడి ప్రజలు చెబుతారు. యుద్ధంలో వెనుదిరిగి వచ్చిన భర్తకు ‘గుణపాఠం’ చెప్పే పనిచేసి, అతణ్ని తిరిగి కదనరంగానికి పంపిన చానమ్మ, పోలమ్మ అనే “మహిళల తెగువకు" శిలారూపమే ఖడ్గతిక్కన విగ్రహం అని నాకు అనిపిస్తుంది.

భారత దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన ఆధునిక నారీమణుల్లో కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, పీ.వీ సింధు ఇంకా మరి కొందరి గూర్చి చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో శ్రీకాకుళానికి చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించింది. 2012లో బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ మహిళగా తెలుగు యువతి సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. ఆతరువాత పీ.వీ సింధు 2016 ఒలంపిక్స్ లో వెండి పతకం, 2020 ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకోవడం మనకు తెలిసిందే. ఆధునిక యుద్ధ నారీమణుల్లో పేరొందిన ధీరశాలి "గుంజన్ సక్సేనా". 1999 కార్గిల్ యుద్ధం సమయంలో, అప్పటి ఫ్లైట్ లెఫ్టినెంట్ "గుంజన్ సక్సేనా" గాయపడ్డ 900 మంది భారతీయ సైనికులను రక్షించడానికి, యుద్ధ సామాగ్రి చేరవేయడానికి తన హెలికాఫ్టర్ తో వందసార్లకు పైగా యుద్ధ ప్రాంతంలోకి వెళ్లిన మొదటి మహిళా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. కార్గిల్ గర్ల్‌గా పేరు పొందిన ఆమె తర్వాత శౌర్య వీర్ అవార్డు పొందింది. ఆమె కథ ఎంత స్పూర్తిదాయకంగా ఉందో, ఆమెపై "గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్" అనే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా మీరు చూడకపోతే మీరు చూడాల్సిన సినిమా లిస్టులో తప్పక జతచేయండి. మరో యుద్ధ నారీమణి, శత్రువులను వణికించే ఆధునిక రఫేల్ యుద్ధ విమానం 'సివంగి' మరెవరో కాదు, మహిళా పైలట్ "శివాంగి సింగ్". భారత 73వ గణతంత్ర వేడుకల వేళ నిర్వహించిన 2022 పరేడ్ లో రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్..వాయుసేన శకటంతో కవాతులో పాల్గొన్నారు. వారణాసికి చెందిన శివంగి సింగ్ 2017లో ఐఏఎఫ్‌లో చేరారు. మహిళల ఫైటర్‌ పైలట్‌ శిక్షణకు సంబంధించిన రెండో బ్యాచ్ అభ్యర్థిగా ఆమె ట్రెయినింగ్ తీసుకున్నారు. మొదట చిన్న శిక్షణా విమానాలతో ఆమె ప్రస్థానం మొదలుపెట్టి తరువాత మిగ్ -21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం స్వంతం చేసుకుంది. తదుపరి అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ ‘గోల్డెన్ యారో‌స్‌’లో ఆమె భాగం అయ్యారు. అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్ ఫైటర్ జెట్ లను నడపడం మాటలు కాదు మరి. ఇందు కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందారు. పౌర విమాన పైలట్‌లలో 12.4 శాతం మంది భారతదేశ మహిళలు ఉన్నారు. ఇది తక్కువేనని మీకు అనిపించవచ్చు, కానీ ఈ సంఖ్య ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ. ఉదాహరణకు ఎయిర్ ఫ్రాన్స్ పైలట్‌లలో కేవలం 7 శాతం మంది మహిళలు ఉన్నారు. "భారత్ లో ఈ శాతం 50 శాతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడే నేను సంతోషంగా ఉండబోతున్నాను" అని 2013లో, బోయింగ్-777ను నడిపిన భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌ జోయా అగర్వాల్ - యూరో న్యూస్ అనే ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. వాస్తవ విషయం ఏమిటంటే - భారతదేశంలోని సంప్రదాయవాద కుటుంబ సభ్యుల నుండి ఆమోదం పొందేందుకు ఆడపిల్లలు కష్టపడుతున్నారు. అయితే ఇంజనీర్లు, లేదా డాక్టర్లు, కాకపొతే వంట గది - ఈ మైండ్ సెట్ నుండి ఆధునిక తల్లితండ్రులు ఎంత త్వరగా బయటపడితే మహిళలు అంత ముందుకు దూసుకుపోతారు అన్నది నిజం. విత్తనం మొలకెత్తగానే సరిపోదు అది మహా వృక్షమవడానికి - దాన్ని పెంచి సంరక్షించే వారి పాత్ర కూడా ముఖ్యం. అందరివలె ఆడపిల్లల హృదయంలో ఒక అంతర్గత స్వరం ఉంటుంది, నేను ఫలానా అవ్వాలని - ఇది నిజంగా బలమైన అంతర్గత స్వరం, దీన్ని గుర్తించి 'నీకు ఇది అసాధ్యం కాదు' అని చెప్పడమే - ఆ దిశగా ప్రోత్సహించడమే కుటుంబ సభ్యుల పని. ఆతరువాత పని "వాళ్ళే" చేసుకుపోతారు! కదా?

ఏ రంగంలో ఉన్నా పురుషుల కంటే మహిళలు తక్కువేమీ కాదని దేశం గర్వించేలా చేసి నిరూపించిన భారతదేశంలోని ప్రముఖ మహిళల జాబితా లో కొన్నిపేర్లు మాత్రమే ప్రస్తావించాను. వర్తమాన భారతంలో ఆడబిడ్డ పుడితే అపజయం పాలయినట్టు కుంగిపోయే వాళ్ళు కొందరు మన మధ్య ఉన్నారు. అందుకు భార్య ఒక్కతే కారణమన్నట్టు సతాయించేవాళ్లూ ఉన్నారు. వారి మేకలకు, గేదలకు ఆడబిడ్డ పుడితే సంబరాలు చేసుకుంటారు వీరు, కాని వారి ఇంట్లో ఆడబిడ్డ పుడితే మాత్రం ఎందుకో సహించరు. "ఎవ‌రికైనా చూపించండ్రా, వ‌దిలేయ‌కండి అలా" - అలనాటి తెలుగు ప్రఖ్యాత నటుడు రావు గోపాల రావు కుమారుడు రావు రమేష్ ఒక సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్‌. ఆడబిడ్డ పుడితే ఏడిచే ఈ ఏడుపుగొట్టు రాయుళ్లకు ఈ డైలాగ్ అతికినట్లు సరిపోతుందేమో? మరి కొంతమందికి పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అనుభవించక తప్పదని భయం! బతికి ఉండగానే దారి తప్పిన సుపుత్రులు ఎన్నెన్ని ప్రత్యక్ష నరకాలు చూపిస్తారో వారికేం తెలుసు? అని పుత్ర సంతానం ఉన్న కొంతమంది వీరిని దెప్పి పొడుస్తుంటారు. అయినా వీరు మారరు గాక మారరు. పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు కదా? రావు రమేష్ చెప్పినట్లు ఎవరికన్నా చూపించాలేమో వీరిని!

ఆడపిల్ల పుట్టినంతనే పండుగ జరిగే ఒక తెలుగు ఊరు కు సంబంధించి నా దృష్టికి వచ్చిన స్ఫూర్తి కలిగించే ఒక వార్తా కధనం ప్రస్తావనతో ఈ నెల రచ్చబండ చర్చా కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. హరిదాస్పూర్ గ్రామం - మన తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఉంది. సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూస్తుండడం హరిదాస్పూర్ ప్రజలను కలచివేసింది. ఈ ఊరివాళ్లు ఆడపిల్లలను కాపాడుకునేందుకు తమకు తాముగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. అంతేకాక ఆ ఊళ్లో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందుకే ఊరివాళ్లు, పంచాయతీ పాలక వర్గం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. ఊళ్లో ఎవరికి ఆడపిల్ల పుట్టినా ఊరంతా పండుగ చేసుకోవాలి. ఆ బిడ్డ పెంపకానికి కొంత డబ్బు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే పథకాలు అందేలా చూడాలి అని. ఆ గ్రామంలో కొత్త సంవత్సరం రోజున సత్యవతి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంతోషంగా ఉన్నారు. అంతకుముందే డిసెంబర్‌‌‌‌ 2020 చివరి వారంలో ఆ గ్రామస్తుడైన వెన్నెల దినకర్‌‌కు ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత బానోత్ సంగీత విజయ్‌‌కి మొదటి సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. వారం తిరక్కుండానే ఊళ్లో ముగ్గురికి ఆడపిల్లలు పుట్టారు. అందుకే ఆ ఊళ్లో వారంలో మూడు రోజులు పండుగ చేసుకున్నారు. ఊరంతా కలిసి పంచాయతీ ఆఫీస్‌‌ను రంగు రంగుల లైట్లతో అలంకరించారు. ఆడబిడ్డ పుట్టిన దంపతులను సన్మానించి, కుటుంబ సభ్యులకు విందు ‌ఇచ్చారు. కులమత బేధాలు మరచి ఊరంతా అంతా కలసి సంబరాలు చేసుకున్నారు. ఆహా! చెవిలో అమృతం పోసినట్టు ఉంది కదా ఈ వార్తా కధనం వింటుంటే? మరి ఇంకేం! ప్రతి గ్రామం, ప్రతి ఊరు ఒక హరిదాస్పూర్ కావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఊరికే కోరుకోవడంకాదు సుమా, ఆచరిద్దాం.

చివరిగా, జీవితంలోని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ప్రగతికి బంగారు బాటలు వేస్తున్న మహిళామణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే సిరిమల్లె పాఠకులకు మార్చి నెల 8 వ తేది న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం, ఈలోపు మీ స్పందను కింది కామెంట్ బాక్స్ లో రాయడం మరచిపోవద్దు సుమా !

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in March 2023, వ్యాసాలు

3 Comments

  1. వెంకట్ నాగం

    మంచి విషయం చెప్పారు మిత్రమా! గ్రాంథికం నుండి వాడుక భాష కు వచ్చిన తెలుగు పరిణామ క్రమంలో కొన్ని ఇతర భాష పదాలు వచ్చి కూర్చున్నాయి, ఏంచేస్తాం? పొద్దున్న లేచి తెలుగు పేపరు చదివితే ఏది అచ్చ తెలుగో ఏది సంస్కృతమో అయోమయం! అయితే ఇక్కడ ప్రాముఖ్యత “ఆమె” కు కాబట్టి, పెద్దగా సంస్కృతం, తెలుగు పట్టింపులు లేకుండా వాడుక భాషలోనే లాగించడం జరిగింది. అచ్చ తెలుగులో మాట్లాడాలంటే పక్కా పల్లెటూరు భాషలో మాట్లాడాలేమో? తోడేళ్లు, ఎలుగుబంట్ల మధ్య రష్యాలోని సైబీరియా లో 70 ఏళ్లుగా ఒంటరి జీవితం అగాఫ్యా లైకోవా అనే ఆవిడ గురించి ఆసక్తికరమైన కధనం ఒకటి ఈ మధ్య తెలుగు దిన పత్రికలో వచ్చింది. “ఆమె” విషయం తెలుసుకున్న ఒక రిపోర్టర్‌ మొదటిసారిగా అగాఫ్యా ఉన్న చోటును సందర్శించి ఆమె గురించి కథనాలు రాసి ప్రచురించాడు. అగాఫ్యా కథ ముందు రష్యా లో తరువాత ప్రపంచం అంతా సంచలనం అయ్యింది. ‘ఆమెకు మతి భ్రమించిందని నేను అనుకున్నాను. ఆమె మాట్లాడే భాష కూడా చాలా పాతది. ఆ మాటలు ఇప్పుడు చలామణిలో లేవు. కాని ఆమె వేట పద్ధతులు, ఇల్లు నిర్వహించుకునే తీరు చూసి ఆమె నార్మల్‌గా ఉందని తెలుసుకున్నాను’ అని ఆ రిపోర్టర్‌ రాశాడు. 70 ఏండ్లలో భాష మారిన పద్దతికి ఇదో ఉదాహరణ. ఇంతకీ నా స్పందనలో ఎన్ని సంస్కృత పదాలు ఉన్నాయో! ఈ గొడవ అటుంచి ఇతర భాష పద ప్రయోగం దృష్టితో వ్యాసాన్ని పరిశీలించి, స్పందించిన మీకు అభినందనలు.

  2. GSS Kalyani

    వ్యాసం చాలా బాగుందండీ. వెంకట్ గారికి అభినందనలు!

  3. Naveen Chandra

    మీరు ఆఫెండు కాకుండా ఉంటే ఒక చిన్న కామెంటు చేస్తా. స్త్రీ అనే పదం సంస్కృత పదం. అంబుజాక్షి, వనిత, కాంత,ఇంతి, ఇంకా ఎన్నో కూడా స్సంస్కృత పదాలే. తెలుగు భాషలో 70% వరకు సంస్కృతపదాలు. మీ వ్యాసం లో మొదటి వాక్యం “‘గృహిణి లేని గృహము అరణ్యంతో సమానమే.” లో ఆరు పదాలలో 4 సంస్కృత పదాలు. ఈ లైను చదవండి:”ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టు పూర్వోత్తరాలు ప్రస్తావిస్తూ, గతంలో – వర్తమానం లో మహిళలు సాధించిన విజయాలు కొన్ని చర్చిద్దాం”. దీన్ళో 11 పదాలు సంస్కృతం.4 మాత్రమే తెలుగు”.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!