Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

దుర్గాదేవి

ఉ.
ఏకడగంటిచూపునకు నీశదృగగ్నిమృతుండు భావజుం
డే కృతకృత్యుఁడై మఱల సృష్టికి దోహదుఁ డౌచు లేచె న
వ్యాకృతిఁ దాల్చి; శంకరముదావహ; మాశ్రితముక్తిదాయకం;
బా కనుచూపె యొక్కతృటి నానఁగ మాపయిఁ జాలు శాంభవీ!..................................36
చం.
చిటుకులగ్రామవాసిని! వసింపు మనంబను క్షేత్రమందు సం
కటములఁ బాపి భక్తజనకల్మషపాపహరైకసాధనం
బెట నయినన్ దలంప జగదీశ్వరి! నీపదపద్మసేవ; సం
దిట నను నీ కటాక్షతటినీప్లుతపుత్రునిఁ జేసి చూడుమా!..........................................37
ఉ.
చీరనుఁ బంపి నీ కృపకుఁ జేసితె పాత్రుల మమ్ము?; నమ్మ నీ
వారము శాంకరీ! దివిజవారము(1) సేసెడి వందనార్చనల్
వారమువారమున్(2) గొనుచు వారలఁ జల్లఁగఁ జూడ నీదు కై
వారము(3) సల్ప భక్తపరివారము వారముఁ(4) జేరె నల్లదే!.....................................38
........(1) సమూహము (2) క్షణక్షణము (3) స్తోత్రము (4) వాకిట

త్రిప్రాసకందము

తను విచ్చితి; మను విచ్చితి;
చను విచ్చితి వమ్మ! నిన్నె సతతము వేఁడన్
కను విచ్చినఁ గనుబొమ లను
ధను విచ్చిన శరవరంబె తత్కృప గాదే?...................................................................39
తే.గీ.
చూచి తిని వెళ్ళె నాఁ డమ్మ చోద్యముగను
చూచితిని వెళ్ళి నేఁ డమ్మ సుందరమగు
దివ్యరూపంబుఁ జిటుకుల దృగ్యుగంబు
యుగయుగంబుల భాగ్యంబు నొంది తనియ...........................................................40
పం.
తటిల్లతాసమాద్భుతస్వధామధామశాంకరీ
కటాక్షవీక్షణల్ కరాగ్రకమ్రకంకణస్ఫుర
త్కటిత్రశింజినీవిభూతిదాయకాంఘ్రినూపుర
స్ఫుటచ్ఛటారవంబులే ప్రభూతభాగ్య మిచ్చుతన్!.......................................................41
పం.
కృతజ్ఞతాన్వితాంజలుల్ మహేశ్వరీ! కటాక్షసం
భృతా! సుతాసుతస్తుతా! కవిత్వసత్వదాయినీ!
నతాశ్రితావనవ్రతా! పునఃపునర్విభావరీ(1)
లతాంతగంధకుంకుమప్రలక్షితాంఘ్రిపంకజా!............................................................42
.....(1) పసుపు
Posted in March 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!