Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

గోన బుద్ధరాజు (రంగనాథ రామాయణం)

క్లుప్తంగా. విట్ఠలుని పేరు పాండురంగ విట్ఠల నాథుడుగా ఉండవచ్చు. “నామైక దేశీ నామగ్రహణం” అనేది శాస్త్ర సమ్మతము. కాబట్టి అంత పెద్ద పేరు గాకుండా ఉచ్చారణ కొరకు “రంగనాథ రామాయణం” అని పాండురంగ విట్ఠల నాథుడు అనేదానిలో ‘రంగ’ మాత్రము గ్రహించి ‘నాథుడు’ చేర్చి రంగనాథ రామాయణమని పేరు పెట్టి ఉండవచ్చునని పింగళి లక్ష్మీ కాంతం గారి నిర్ణయం. ఇది కొందరికి నచ్చలేదు. ఒక పేరును ముక్కలు చెయ్యడం సబబు కాదు అని శిష్టా రామకృష్ణ శాస్త్రి గారు అభిప్రాయ పడ్డారు. మొత్తం మీద ఈ గ్రంథానికి రంగనాథ రామాయణం అనే పేరు రావడానికి కారణం ఈ విధంగా నిర్ణయించారు. అది, కవిపండిత పోషకుడైన బుద్ధరాజు ఆస్థానంలో రంగనాథుడు అనే కవి ఉండవచ్చు. బహుశా అతడు అచ్చవెల్లి రంగనాథుడు కావచ్చు. అతడు బుద్ధరాజుకు, రంగనాథ రామాయణం రచించుటలో సహాయపడి ఉండవచ్చు. అది ఎరిగిన ప్రజలు, పండిత కవులు దీనిని రంగనాథుని పేరనే రంగనాథ రామాయణం అని పిలిచి ఉండవచ్చు. అయితే బుద్ధరాజు గొప్ప పండితుడు, సత్కవి. అతనిని గూర్చి ‘సర్వజ్ఞుడనఘండు, చతుర వర్తనుడు, సకల పురాణ విదార తత్పరుండు...” అని చెప్పడం వల్ల, బుద్దరాజు రచించుతూ రంగనాథుడను వాని సహాయం తీసుకొని ఉండవచ్చు. కార్యభారం చేత రంగనాథుని సహాయం తీసుకోవడం సమంజసమే. (ఈ వాదనలన్నీ చదివిన తరువాత నాకు తోచిన విషయం. నేను – అనగా ఈ వ్యాస కర్తిని సి.వసుంధర ను ఈ క్రింది విధంగా ఊహించడం జరిగింది. పాండురంగ విట్ఠల నాథుడను పేరు, విట్ఠల విభునికి పూర్తి పేరు. ఎవరికైనా పూర్తిగా పేరు పిలవడం జరగని పని. అందువల్ల వాడుకలో సౌలభ్యం కోసం మొదటి లేక చివర లేక మధ్యలో ఏది సులభంగా ఉంటే దానితో పిలవడం మనుషులకు అలవాటు. అందువల్ల పాండురంగ విట్ఠల నాథుడు అన్న దానిలో ‘రంగ’ అనేది తీసుకొని అతడు ప్రభువు కాబట్టి నాథుడు అని చేర్చి “రంగనాథుడు” అని పిలిచి ఉండవచ్చు. ప్రజలు, కవి పండితులు అని అనుకొన్నచో ‘రంగనాథ రామాయణం సహజమే అనిపించును. ఇది కేవలం నాయొక్క ఊహ మాత్రమె. పరిశోధనతో చెప్పినది కాదు.)

ఏది ఏమైనా రంగనాథుడు సహాయం చేసినంత మాత్రాన అతని పేర ఎలా గ్రంథానికి పేరు ఏర్పడుతుంది? విట్ఠల విభుడు అంత శ్రద్ధగా పుత్రునితో తన పేర రాయమని చెప్పినప్పుడు దానికి మరొకరి పేరు ఎలా వస్తుందన్నది కూడా ఆలోచింపవలసిన విషయమే.

‘రంగనాథ రామాయణం’ అన్న పేరును గూర్చి ఆరుద్ర మరి ఒక కోణంలో కూడా చర్చించారు.

రంగనాథ రామాయణం ఒక ద్విపద కావ్యం. వాల్మీకి వలె గానయోగ్యంగా రంగనాథ రామాయణం రచించడం జరిగింది. ద్విపద సంప్రదాయంలో ఉన్న దానిని గూర్చి ఆరుద్ర మాటలు ఇక్కడ ఉటంకిస్తున్నాను.

“ద్విపద సంప్రదాయంలో ఎవరైనా ఒకరిపేర కావ్యం చెప్పడమంటే వారికి అంకితమివ్వడమనే అర్థం. చూడండి ఈ శతాబ్దం లోనే ఉన్న మడిక సింగన ద్విపద భాగవతాన్ని ఎలా వ్రాశాడో” అని ఉదహరించాడు. దాని సారాంశం – ఆరుద్ర మాటల్లో, నా మాటల్లో కొంత-

“మడిక సింగన వ్రాసిన భాగవతాన్ని కందామాత్యుని పేర చెప్పిన దానికి ద్విపద భాగవతం, దశమస్కందం” అనే పేర్లేగాని “కందామాత్యు భాగవతం” అనే పేరు లేదుగదా” అని ఆరుద్ర అలాంటివి ఎన్ని ఉదాహరణలనెన్నైనా చూపవచ్చని చెప్పి పింగళి వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తూ,

“...(పింగళి వారు) సక్రమంగా ఆలోచించినా అది బలవత్తరం కాదని తోసిపారేసి వేరే సమర్ధించుకోవడం వల్ల ఇలా జరిగింది.” అని వివరించారు. దీనిని గూర్చి మరికొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను గూడా ఆరుద్ర వివరించారు. (స.ఆం.సా. పేజీ 604-607).

రంగనాథ రామాయణం    

రంగనాథ రామాయణం ద్విపద కావ్యం. వాల్మీకి వలె గానయోగ్యంగా బుద్ధ భూపతి ద్విపద ఛందస్సులో రచించాడు. ఇందులో వాల్మీకి రామాయణం లోని కథలే గాక, మరికొన్ని ఇతర కథలను కూడా చేర్చడం జరిగింది. రామునికి వారధి కట్టడంలో సహాయపడిన ఉడత కథ బుద్ధరాజు చేర్చినదే.

వివిధ రామాయణాలను – ఇటు ఉత్తర భారత దేశంలో, అటు విదేశాలలో ఉన్న రామాయణాలపై విశేష పరిశోధన చేసినవారు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు. వీరి పరిశోధనా ఫలితంగా ఎన్నో విషయాలు తెలిసాయి. మల్లంపల్లి వారు చేసిన కృషిని తెల్పుతూ ఆరుద్ర మల్లంపల్లి వారు పరిశీలించిన రామాయణాలకు సంబంధించిన విషయాలను ఒక పట్టికగా ఇచ్చారు. ఆ పట్టికను వివరించడంలో ఆరుద్ర చూపిన ఓర్పు ప్రశంసనీయము. వాటిని మనం క్లుప్తంగానైనా తెలుసుకోవాలి. (స.ఆం.సా. పేజీ 608).

రంగనాథ రామాయణంలో ద్విపదలు కాండాల వరుసలో ఈ విధంగా ఉన్నాయి.

(1) బాల – 2493, (2) అయోధ్య – 1834, (3) అరణ్య – 1580, (4) కిష్కింధ - 1345, (5) సుందర - 1177, (6) యుద్ధ – 8881.

ఇప్పుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి పరిశోధనల నాధారంగా చేసుకొని ఆరుద్ర వివరించిన విషయాలు సంక్షిప్తంగా తెలుసుకొందాం. మల్లంపల్లి వారు క్రోడీకరించిన వాటిలో లాహోరు ప్రతి, ఇటాలియన్ ప్రతి ఉన్నాయి. వీటివల్ల, ఉత్తర భారతంలో, విదేశాలలో రంగనాథ రామాయణ ప్రతులు ఉన్నట్లు తెలుస్తున్నది. లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీలో రెండు రంగనాథ రామాయణ ప్రతులున్నట్లు తేలింది.

ఒక ప్రతిని జి.ఇ.హే అనే దొర నుండి గ్రంథాలయం వారు కొన్నారు. (ఆరుద్ర తేదీలతో సహా ఇచ్చారు). రెండవది తాళపత్ర ప్రతి. ఇది చాలా చరిత్ర గల్గిన ప్రతి. తాటాకులు బారెడు పొడవున్నాయి మరియు లావుగా ఉన్నాయి. వీటిని ‘శ్రీ తాళం రాజ తాళం’ అని పిలుస్తారు. ఇది లంకను సాధించిన ముత్తుస్వామి అనే తెలుగు దాక్షిణాత్యుని పారాయణ గ్రంథం. ముత్తుస్వామి క్రీ.శ.1802 వరకు కాండిని పాలించాడు. శత్రువులు ముత్తుస్వామి ని చంపివేస్తే ఆయన సేవకుడు రంగనాథ పారాయణ ప్రతిని (ఈ తాళపత్ర ప్రతిని) 32 ఏళ్ళు భద్రపరచి హార్సీ అనే దొరకు అమ్మాడు. ఇదంతా చెప్పి “హార్సీ దొర ఈ రంగనాథ రామాయణ ప్రతిని గ్రంథాలయానికి భాహూకరించాడు.” అని తెల్పారు ఆరుద్ర.

ఆనాడు బ్రిటీష్ వారు భారతీయ గ్రంథాలను సేకరించి ప్యారిస్ లోని రాజుగారి గ్రంథాలయానికి పంపేవారు. రంగనాథ రామాయణం ప్యారిస్ లోని నేషనల్ లైబ్రరీ లో భద్రపరిచారు. అక్కడ ఉన్న ప్రతిలో రంగనాథ రామాయణం గ్రంథకర్త పేరు గోన బుద్ధ భూపతి అని స్పష్టంగా ఉంది. (కార్డు నెంబర్ 38 -838 -H -271 -1) అని మల్లంపల్లి వారి మాట. ఇంకా మన తెలుగుదేశంలో గ్రంథ ముద్రణ కర్తలు, పీఠికా రచయితలూ రంగనాథ రామాయణాన్ని గూర్చి శ్రద్ధ తీసుకొని పరిశీలించాలని మల్లంపల్లి వారు సూచించారు.

రంగనాథ రామాయణం -పాత్రలు, వర్ణనలు, సంభాషణాదులు

బుద్ధ భూపతి రంగనాథ రామాయణాన్ని రచిస్తూ “హారతి కర్పూర నీహార గోక్షీర తారకాకృతి” అని  శారదాదేవిని కొలిచాడు. ఇది పోతన గారి శారద నీరదేందు ...” అన్న పద్యంలో ఛాయగా కనిపిస్తుంది.

బుద్ధభూపతి పాత్రలను ప్రవేశ పెట్టడంలో ఎంతో ఔచిత్యం కనపరచాడు. అయోధ్యను వర్ణించి “ఆ వురి దశరథుం డను మహారాజు చాప విద్యాపార శైల కార్ముకుడు పరిపాలిస్తున్నా” డని చెప్పడంలో దశరథుని విలువిద్యను తొలుదొల్త నే వర్ణించాడు.

 

**** సశేషం ****

Posted in March 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!