Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

జ్ఞానం - ఆనందం

ముందుగా, ‘జ్ఞానానందమయం’ కథలలో ప్రధాన పాత్రలైన జ్ఞానప్రసూనాంబ, కృష్ణానందల గురించి తెలుసుకుందాం.

జ్ఞానప్రసూనాంబ, పూర్తిగా నెరిసిన జుట్టుతో, ముడతలు పడ్డప్పటికీ బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండే మేనిఛాయతో, నుదుటిపై రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో, పాదాలకి ఎప్పుడూ పచ్చటి పసుపు రాసుకుని, జరీఅంచు చీరలు కట్టుకుంటూ, ముత్యపు ముక్కుపుడకా, చెవులకి రవ్వల దుద్దులూ, కళ్ళకు నల్లని కాటుకా పెట్టుకుని, మెడలో కాసులపేరూ, నల్లపూసలూ, చేతులకి బరువైన బంగారు గాజులూ, వాటిమధ్య ఎర్రటి మట్టిగాజులూ వేసుకుని, నడుముకి బంగారు వడ్డాణం, కాళ్ళకి వెండి మువ్వల పట్టాలూ, కాలివేళ్ళకు అందమైన మట్టెలూ అలంకరించుకుని, పేరుకు తగ్గట్టు అపరపార్వతిలా ఉంటుంది! మామూలు చదువులు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, ప్రసూనాంబకు జీవితం నేర్పిన పాఠాల వల్ల కలిగిన జ్ఞానం ఎక్కువ. దానికి తోడూ, పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండటంచేత, ప్రసూనాంబకు అనేక విషయాలపట్ల మంచి అవగాహన ఏర్పడింది. ప్రసూనాంబకున్న మంచితనమూ, సమయస్ఫూర్తి, తెలివితేటలూవంటి మంచి లక్షణాల గురించి తెలిసిన వాళ్ళ ఊరి జనం, తమకి ఏ సలహా కావాలన్నా ప్రసూనాంబ దగ్గరకి వచ్చేవాళ్ళు. ప్రసూనాంబ, వారి సమస్యలను ఎంతో ఓర్పుతో విని, వారికి తగిన సలహాలను ఇస్తూ, పరిష్కారాలను సూచిస్తూ ఉండేది. ప్రసూనాంబ భర్త సుందరం బ్యాంకులో పని చేసి పదవీ విరమణను పొందాడు.

ఇకపోతే, సుందరం, జ్ఞానప్రసూనాంబల ఏకైక సంతానం సదాశివ. సదాశివ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సదాశివ భార్య మీనాక్షి అత్తగారు మెచ్చిన కోడలు! సదాశివ, మీనాక్షిలకు ఒక్కడే కొడుకు. వాడి పేరు విజయ వెంకట శివదత్త ఉమామనోహర శ్రీ కృష్ణానంద! పేరు పెద్దగా ఉందని ఎవరైనా అంటే, 'అవునండీ! వాడు మా ఒక్కగానొక్క వారసుడు! అందుకే వాడికి మేమందరమూ తలా ఒక పేరూ పెట్టాం. చూస్తూ ఉండండి! వాడు పెద్దవాడైన తర్వాత ఇంకా పెద్ద పేరు సంపాదిస్తాడు!’, అని మీసం మెలేస్తూ గర్వంగా చెప్తాడు సుందరం.

ప్రసూనాంబ భక్తీ-భావనా కలిగిన మనిషి. ఎప్పుడూ పూజలూ, నోములూ, వ్రతాలూ, జపాలూ, పారాయణాలూ చేస్తూ ఉండటంవల్ల ఆమె ముఖంలో ఒక దివ్య తేజస్సు కనపడుతూ ఉంటుంది. ఇటు ప్రాపంచిక జ్ఞానం అటు ఆధ్యాత్మిక జ్ఞానం, రెండూ మెండుగానే ఉన్నాయి ప్రసూనాంబకు. అందుకే ప్రసూనాంబను సుందరం 'జ్ఞానం!', అని పిలుస్తూ ఉంటాడు! ప్రసూనాంబ తన మనవడిని, 'ఆనందా..!', 'ఆనందూ', 'కృష్ణా', ‘ఆనందం' అని రకరకాల ముద్దుపేర్లతో పిలుస్తూ ఉంటుంది. ప్రసూనాంబ కృష్ణానందను 'ఆనందం' అని పిలిచినప్పుడల్లా, ‘నిజమే! జ్ఞానం ఉన్నచోట ఆనందం ఉంటుంది!' అని అనుకునేవాడు సుందరం.

ఇంటి మొత్తానికి పదేళ్ల కృష్ణానంద ఒక్కడే పసివాడు కావడంతో కృష్ణానంద అంటే ఆ ఇంటిల్లుపాదికీ ఎంతో గారాబం! కృష్ణానందకి ఆటలన్నా, పాటలన్నా మహాఇష్టం. చదువుకోమంటే మాత్రం కుదురుగా కూర్చోడు! వాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలన్నది ఆ ఇంట్లోని పెద్దలందరి ఆశ! కృష్ణానంద చాలా సందర్భాలలో బుద్ధిమంతుడైన బాలుడే అయినప్పటికీ అప్పుడప్పుడూ చిలిపి పనులు చేస్తూ పెద్దల కోపానికి కారణం అయ్యేవాడు.

అలాంటప్పుడు ప్రసూనాంబ, "మీరంతా కాసేపు ఆగండి! నేను నా ముద్దుల మనవడితో మాట్లాడి పరిస్థితులు చక్కబరుస్తానుగా! వాడు నా బంగారు కొండ! నా మాట వింటాడు!!", అంటూ కృష్ణానందకి మంచి మాటలు చెప్తూ, యుక్తితో వాడిని సరైన దారిలో పెడుతూ ఉంటుంది!

****సశేషం****

Posted in February 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!