Menu Close
పెళ్ళిసందడి (నాటిక)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

సురేష్ - "ఇవాళ మునిసిపల్ ఆఫీసుకి వెళ్లేను ప్రసాద్. మా ఇంటి ప్లాను ఎప్రూవలు అయిందేమో కనుక్కోడానికి. వాళ్ళు సవా లక్ష క్వెరీసు పెడుతున్నారు."

ప్రసాద్ - "సురేష్, Don't worry. రేపు నేను కమిషనరుతో మాట్లాడతాను."

సురేష్ - "Thanks…మీ బాసు ఊళ్ళో లేడా; తొందరగా ఇంటికి వచ్చేవ్.”

ప్రసాద్ - "మా బాస్ ఊళ్ళోనే ఉన్నాడు. అతని కూతురు పెళ్లి కుదిరింది. పెళ్ళికొడుకు అమెరికాలో ఏదో కన్సల్టెన్సీ ఫర్మ్ ఓనరుట. రెండు వారాల్లో పెళ్లి చేయడానికి ఏర్పాట్లన్నీ నన్నే చేయమని బాస్ ఆర్డరు. ఆ ప్రయత్నాల కోసమే ఇంటికి వేగిరం వచ్చేను. తీరిగ్గా ఆలోచించుకోడానికి టైము కూడా తక్కువ సురేష్. దానికి తోడు ఇటు మినిస్టరుగారు; అటు మగపెళ్లివారు అమెరికా వాళ్ళు. వాళ్ళ లెవెల్లో ఏర్పాట్లు చెయ్యాలి. ఇప్పుడే మొదలు పెట్టేను. ఒక్కొక్కటి అవుతున్నాయి. ఇందాకనే సిద్ధాంతిని పిలిపించేను. పెళ్లి ముహూర్తం డిస్కస్ చేసేను. వచ్చే బుధవారానికి ముహూర్తం పెట్టేడు ఆయన. ఇప్పుడే; ఎవరు చెప్పేరో; ఒక  జ్యూయెలర్ వచ్చి వెళ్ళేడు. ఏవో కొన్ని సాంపిల్సు తెచ్చేడు. ఖరీదులు కోట్ల మీద ఉన్నాయ్, సురేష్.

సురేష్ - "ప్రసాద్, మినిస్టరుగారి కూతురుకు లక్షలు ఖరీదు చేసే నగలు తెస్తాడా వాడు. వాళ్ళ లెవెలును బట్టి సాంపిల్స్ తెచ్చి ఉంటాడు."

ప్రసాద్ - "అవును నిజమే; నాకు వాటి గురించి ఏమీ తెలీదని చెప్పి; అవన్నీ మేడంగారు అమెరికానుండి వచ్చేక ఆవిడే చూసుకొంటారని చెప్పి వాణ్ణి పంపించేను. (చిరునవ్వుతో) ఇప్పటివరకు అయిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అది…ఇంకా ఒక్కొక్కటి చూడాలి. నీకు తెలుసుగా; ఈ విషయాల్లో నాకు ఎక్స్పీరియెన్స్ లేదు. బాస్ ఆర్డరు. చెయ్యక తప్పదు. కిందా మీదా పడి ఏదో చేస్తున్నాను."

సురేష్ - "ప్రసాద్ ఇలా నువ్వు ఒక్కొక్కరితో మాట్లాడ్డం పెట్టుకొంటే వేళకు పని అవ్వదు. అవన్నీకోఆర్డినేట్ చెయ్యడం చాలా కష్టం అవుతుంది.”

ప్రసాద్ - "అయితే నన్నేమిటి చేయమంటావ్."

సురేష్ - "ఇటువంటి పెద్ద ఈవెంట్స్ చెయ్యడానికి; ఈవెంట్స్  మేనేజ్మెంట్ వాళ్ళకి కాంట్రేక్ట్ ఇచ్చేయాలి. వాళ్ళు మనకి కావలిసినట్టూ అన్నీ ఎరేంజ్ చేస్తారు."

ప్రసాద్ - "అవును. నిజమే. మంచి సలహా ఇచ్చేవ్. కాని మన ఊళ్ళో ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలీదు."

సురేష్ - "ఈ ఊళ్ళో ఈవెంట్స్ మేనేజ్మెంట్  కంపెనీ ఒకటి ఉంది. నెల క్రిందటే మా బిల్డింగులో జనార్ధన రెడ్డి గారి కూతురు పెళ్ళికి వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసేరు. They did a very good job. రెడ్డిగారు బాగా satisfy అయ్యేరు. వాళ్ళ కార్డు నా దగ్గర ఉంది. ఇంటికి వెళ్ళగానే వాళ్లకి ఫోన్ చేసి నిన్ను కలవమంటాను."

ప్రసాద్ - "Many many thanks సురేష్. వేళకు దేముడిలాగ వచ్చేవు. నేను చెప్పేనుగా; నాకు ఎక్స్పీరియన్సు లేదు. నలుగురికీ ఫోన్ చేస్తే పనులు అయిపోతాయి అనుకొన్నాను."

సురేష్ - " ప్రసాద్, నువ్వు గాభరా పడకు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో డిటైల్డుగా అన్ని విషయాలు మాట్లాడు. I am sure. They will do a good job. నేను వస్తాను ప్రసాద్. నీకు ఏ హెల్ప్ కావలిసినా; Tell me. don't hesitate."

ప్రసాద్ - "నీ విషయం రేపు కమిషనరికి ఫోన్ చేస్తాను. Don't worry. రేపే నీకు ఎప్రూవల్ వచ్చేటట్టు చూస్తాను."

సురేష్ - "Thank you. Wish you the best. వస్తా."

(సురేష్ కు ప్రసాద్ గుమ్మం వరకు  వెళ్లి, bye చెప్తాడు)

(ప్రసాద్, సెల్ ఫోనులో ఏదో చూస్తూ ఉంటే, సుమారు యాభై ఏళ్ల స్త్రీ ప్రవేశిస్తుంది. ప్రసాద్ అది గమనిస్తాడు .)

ప్రసాద్ - "రండి సుభద్రమ్మగారూ..మా ఆవిడ వంటింట్లో ఉంది."

సుభద్రమ్మ - "మీతోనే పనుండి వచ్చేను ప్రసాద్ గారూ."

ప్రసాద్ - "నాతోనా! ఏం పని.  సరే కూర్చోండి."

సుభద్రమ్మ - "మీ మినిస్టరుగారి అమ్మాయికి పెళ్లి కుదిరిందిట. సిద్ధాంతిగారి భార్య పార్వతమ్మగారు చెప్పేరు."

ప్రసాద్ - "అవునండి. కుదిరింది."

(అంతలో, సంతోషి ప్రవేశిస్తుంది)

సంతోషి - "సుభద్రమ్మగారా, ఏం ఇలా వచ్చేరు."

సుభద్రమ్మ - "మీ ఆయన దగ్గర పనుండి వచ్చేనండి."

సంతోషి - "మా ఆయనదగ్గరా!”

సుభద్రమ్మ - "అవునండి; మినిస్టరుగారి అమ్మాయి పెళ్ళికి ఏర్పాట్లన్నీ మీ ఆయనే చూస్తున్నారటగా."

సంతోషి - "ఆ .. ఈయనే చూస్తున్నారు."

సుభద్రమ్మ - "పెళ్లి రాబోయే బుధవారమే అని చెప్పేరు; పార్వతమ్మగారు."

ప్రసాద్ - "అవునండి ."

సుభద్రమ్మ - (ప్రసాద్ తో) "సంతోషిగారికి తెలుసండి ; మేం ' శుభమస్తు ' వాళ్ళం; అప్పడాలు వడియాలు ఇంటిదగ్గర చేస్తున్నామండి ; అవి మీవంటి వాళ్ళకే కాక, దుకాణాలకి హొటళ్ళుకు కూడా సప్లై చేస్తున్నామండి."

సంతోషి  - "సుభద్రమ్మగారూ ఆ విషయం మీరు ఆయనతో మాట్లాడండి. నాకు వంటింట్లో పని ఉంది; వస్తాను."

(సంతోషి నిష్క్రమించును)

సుభద్రమ్మ - "ప్రసాద్ గారూ, ఆ పెళ్ళికి అప్పడాలు వడియాలు ఎన్ని పడతాయో మీ దగ్గర ఆర్డరు తీసుకొని; వెంటనే పని ప్రారంభిద్దామని వచ్చేనండి. టైము బాగా..తక్కువ. అంచేత కబురు తెలియగానే వచ్చేను. మా చేతిలో చాలా ఆర్డర్లు ఉన్నాయండి. అవి వెనక పెట్టి మీ పని ప్రారంభిద్దామని అనుకొంటున్నామండి."

ప్రసాద్ - "మరేమీ అనుకోకండి సుభద్రమ్మగారూ. నేను అప్పడాలు.. వడియాలు.. ఇలా ఒక్కొక్కదానికి ఏర్పాట్లు చెయ్యడం లేదండి. అది జరిగే పని కూడా కాదు. పెద్ద శుభకార్యం; అంతా ముందునుండి..కొసదాకా..కావలిసిన ఏర్పాట్లన్నీ చెయ్యడానికి- అనుభవం ఉన్న కంపెనీ ఒకటుందండి. వాళ్లకి కాంట్రేక్టు ఇస్తున్నానండి."

సుభద్రమ్మ - "అలాగా; సరే వస్తానండి."

(సుభద్రమ్మ నిష్క్రమించును)

(కొద్ది సేపట్లో ప్రసాద్ కు సురేష్ నుండి ఫోను వస్తుంది. ఫోను ఎత్తుకొని..)

ప్రసాద్ - "హల్లో సురేష్...Good. ఈవెంట్ మేనేజ్మెంటు వాళ్ళని కాంటాక్ట్ చేసేవన్నమాట,... వాళ్ళు బయలుదేరేరా .. thank you సురేష్ ... definitely. ఏ అవసరం ఉన్నా నీతో మాట్లాడుతాను. once again thank you."

(కొద్ది సేపట్లో, ' May we come in సర్ ' అని వినిపిస్తుంది)

ప్రసాద్ - "come in. "

(ముఫై ఏళ్ల వయసు ప్రాంతంలో  ఉన్న ముగ్గురు యువకులు ప్రవేశిస్తారు. ప్రసాద్ కు ముగ్గురూ నమస్కరిస్తారు )

ప్రసాద్ -  "కూర్చోండి. "

రమేష్ - "మేం RRR ఈవెంట్స్ మేనేజెమెంట్ వాళ్ళం సర్."

ప్రసాద్ - "ఏదో సినిమా పేరులా ఉంది. బాగుంది."

(ముగ్గురూ పెదిమలు నొక్కిపెట్టి చిన్న మందహాసం చేస్తారు. ముగ్గురూ ఒకరి తరువాత ఒకరు నిలబడి వారి పరిచయం చేసుకొంటారు)

రమేష్ - "నేను రమేష్ ను సర్. లైటింగ్ ఎండ్ డెకొరేషన్ నేను చూసుకొంటాను సర్."

రాకేష్ - "నేను రాకేష్ ని సర్. నేను వీడియో ఫోటోగ్రఫి లైవ్ స్ట్రీమ్ చూస్తాను సర్."

రాహుల్ - "నా పేరు రాహుల్ సర్. కేటరింగ్ నా స్పెషాలిటీ సర్."

రమేష్ - "సురేష్ సర్ చెప్పేరు సర్. పెళ్లికి A to Z అన్ని ఏర్పాట్లు మేము చెయ్యగలం సర్."

ప్రసాద్ - "ఇది, మినిస్టరుగారి కూతురు పెళ్లి. మగపెళ్లివారు అమెరికా వాళ్ళు. వాళ్ళ లెవెలుకు తగ్గట్టు ఏర్పాట్లు చెయ్యాలి. వచ్చే బుధవారమే పెళ్లి.

రాకేష్ - "అవును సర్; సురేష్ సర్ చెప్పేరు. మీరు ఆ విషయంలో డౌట్ చెయ్యక్కర్లేదు సర్. మేము చాలా పెద్ద ఈవెంట్సు మేనేజ్ చేసేం సర్."

( రాకేష్ బ్రీఫ్ కేసులోనుండి ఒక ఫయిలు తీసి ప్రసాద్ కు దగ్గరగా నిలబడి)

రాకేష్ - ( ఫయిలులోనుండి ఒక్కొక్కటి  చూపిస్తూ) ఇవి మాకొచ్చిన ఎప్రీషియేషన్ లెటర్సు సర్.”

( ప్రసాద్ అయిదారు చూసేక )

ప్రసాద్  - "okay. మీరు ఈ మేరేజ్ ఫంక్షన్ బాగా ఆర్గనైజ్ చేస్తే; ఫ్యూచర్లో ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా మిమ్మలినే పిలిపిస్తాం.

( కొద్ది క్షణాలు ఆగి) అది సరే; మీరు ఏమిటేమిటి ఆర్గనైజ్ చేయగలరో చెప్పండి."

రమేష్ - "సర్, పెళ్లి మండపం డెకొరేషన్ కు మా దగ్గర మూడు ఆప్షన్సు ఉన్నాయండి. చూపించమన్నారా సార్."

ప్రసాద్ - "ఆ.. చూపించండి"

(రమేష్ ప్రసాద్ కు దగ్గరగా వచ్చి తన I Pad లో ఒక్కొక్కటి చూపిస్తూఉంటే సంతోషి ప్రవేశించి ప్రసాద్ పక్కనే కూర్చుని తనూ చూస్తూ ఉంటుంది)

రమేష్ - "ఇది ఒకటి సార్.”

ప్రసాద్ - (మందహాసంతో) "ఇదేమిటి! మండపానికి చిలకపిట్టల బొమ్మలు వేలాడదీసేరు."

రమేష్  - "కొన్ని కమ్మూనిటీస్ వాళ్ళు ఇది ప్రత్యేకించి ఇష్టపడతారు సార్."

ప్రసాద్ - "okay. రెండోది చూపించండి."

రమేష్ - "ఇది రెండోది సార్."

ప్రసాద్ - (రెండోది కొంతసేపు చూసి) "మీ దగ్గర మూడు వెరైటీస్ ఉన్నాయన్నారు. ఆ మూడోది చూపించండి."

రమేష్  - "ఇది మూడోది సార్."

ప్రసాద్ - (అది కొంతసేపు చూసి) "ఆ రెండోది మరోమారు చూపించండి."

రమేష్ - "ఇది సర్; మీరు చూసిన రెండోది."

ప్రసాద్ - (వేలుతో చూపిస్తూ) ఈ ఫ్లవర్స్.. ముఖ్యంగా .. ఈ రోజెస్.. చాలా  బాగున్నాయి."

(రమేష్ ముఖంలోకి చూస్తూ)

ప్రసాద్ - "ఇవన్నీ నేచురల్ ఫ్లవర్సా లేక ..."

రమేష్ - "అన్నీ నేచురల్వే సార్. ఆ రోజెస్.. కాష్మీర్ నుండి వచ్చేయి సార్. చాలా ఫ్లవర్స్ అవుట్ సైడ్ ఆంధ్రా నుండే వచ్చేయండి."

ప్రసాద్ - "అవన్నీ మనకు టైముకు వస్తాయా. "

రమేష్ - "దూరాన్నుండి రావలిసినవి ఫ్లయిటులో వస్తాయి సార్."

ప్రసాద్ - "ఎందుకైనా మంచిది; అవి వేళకు రాకపోతే ఒక ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసుకోండి."

రమేష్  - "అవి డెఫినెట్ గా వస్తాయి సార్. అయినా మీరు చెప్పిన plan B కూడా రడీగా ఉంచుకొంటాం సార్."

ప్రసాద్ - "That is good."

రమేష్ - "మండపం డెకొరేషనుకు ఇది నోట్ చేసుకోమన్నారా సర్."

ప్రసాద్ - "ఆ.. నోట్ చేసుకోండి.”

సంతోషి – “మన సీతాలు పెళ్ళికి కూడా ఇటువంటి డెకొరేషనే చేయిస్తే బాగుంటుందండి."

రమేష్ - "అమ్మాయిగారి పెళ్లా సార్. ఆ పెళ్లి డెకొరేషను కూడా మేం చేస్తాం సర్. మీకు స్పెషల్ రేట్స్ సర్."

ప్రసాద్ - "అమ్మాయిగారు...అంటే, ఈవిడ అక్కయ్యగారి కూతురు; గుంటూరులో ఉంటారు. అవన్నీ తరవాత చూసుకోవచ్చు."

రమేష్  - "ఓకె సర్."

(సంతోషి విసురుగా వంటింట్లోకి వెళిపోతుంది)

ప్రసాద్ - “పెళ్లి 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చెయ్యాలి. రేపు నేను పెర్సనల్ గా ఊళ్ళో ఉన్న రెండు మూడు హోటల్స్ చూసి; ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తాను. మీరు రేపు సాయంత్రం ఫోను చెయ్యండి. ఏ హోటల్ బుక్ అయిందో చెప్తాను. మీరు వెళ్లి ప్లాన్  చేసుకోవచ్చు."

రమేష్ - "అలాగే సర్... సార్ లైటింగు ఎరేంజ్మెంట్స్ , చూపించమన్నారా."

ప్రసాద్ - "చూపించండి."

(రమేష్, ప్రసాద్ కు, I Pad నుండి అవి చూపిస్తాడు)

ప్రసాద్ - "బాగానే ఉన్నాయి. కాని ఈ డెకొరేషను లైటింగ్ ఎరేంజ్మెంట్సు చేస్తున్నప్పుడు హోటల్ గోడలకు మేకులు కొట్టడం వంటి పనులు చేయకూడదు."

రమేష్ - "అలా ఎప్పుడూ చెయ్యం సార్. ఎక్కడా మేకులు కొట్టకుండానే లైటింగు, డెకొరేషను చేస్తాం సర్. మా వర్కర్సు అందరు వెల్ ట్రైన్డు వాళ్ళు సర్. వాళ్ళు పని చేస్తున్నప్పుడు మేము అక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తూ ఉంటాం సర్.”

ప్రసాద్ - "That's good."

(రమేష్, వెళ్లి, కూర్చుంటాడు )

****సశేషం****

Posted in February 2023, నాటికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!