Menu Close
సుశీల కోరిక (కథ)
-- బివిడి ప్రసాదరావు --

"విజయ్"

"ఉఁ"

"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ." మాట ఆపింది సుశీల.

"హండ్రడ్ పర్సంట్." చిత్రమయ్యాడు విజయ్.

ఆ ఇద్దరి మధ్య కొద్ది సేపు చూపులు తప్ప.. మాటలు లేవు.

"నీ ప్రేమలో నిజాయితీ ఉందా?" తిరిగి మాట్లాడింది సుశీల.

"ఎలా రుజువు చేయను?!" ఆగి, ఆ వెంటనే -

"ఐనా ఏమిటిదంతా! ఎన్నడూ లేనిది ఇదేమిటి? ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు!" ఆందోళనవుతున్నాడు విజయ్.

సుశీల అతణ్ణే చూస్తుంది. "కూల్ ప్లీజ్.. కూల్" అంది.

విజయ్ తెములుకోలేకపోతున్నాడు.

"మరేమిటి! ఈ వింత పోకడేమిటి? నీ సందేహాలేమిటి?!" టకటకా అడిగేసాడు విజయ్.

సుశీల వెంటనే ఏమీ అనలేదు.

"మాట్లాడు. ముందు నా ప్రశ్నలు తేల్చు." గందికవుతున్నాడు విజయ్.

"కూల్ విజయ్. ప్లీజ్. నన్ను మాట్లాడనివ్వు." సుశీల సహనం వీడడం లేదు.

విజయ్ అయోమయంలోనే ఉన్నాడు. ఆమెనే చూస్తూ ఉన్నాడు.

ఆ ఇద్దరు.. పార్కులో ఉన్నారు. డీప్ కార్నర్ న ఉన్నారు. పచ్చిక మీద ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్లకి చేరువలోనే ఉన్న ఏపైన చెట్టు నీడ.. వాళ్లిద్దరిని కప్పేసినట్టు.. ఆ చోటున పరుచుకొని ఉంది.

వాళ్లిద్దరూ ఉద్యోగులు. ఓ ప్రయివేట్ కంపెనీలో క్లర్కులు.

తొలుత.. జాబ్ రీత్యా ఏర్పడిన వాళ్ల పరిచయం.. మెల్లి మెల్లిగా పెరిగి.. ప్రేమగా మారి.. స్తిమితమై.. 'పెళ్లి చేసుకుందాం' అన్నంత వరకు వచ్చింది.

దాంతో వాళ్లిద్దరు చొరవ చేపట్టారు. తమ పెళ్లికై.. తమ తమ పెద్దల్ని కదిపారు.

విజయ్ వైపు వారు సమ్మతించేసారు వెంటనే. అందుకు ముఖ్య కారణం - విజయ్.. తమకి ఏకైక బిడ్డ మరియు తమచే అపురూపంగా గారాబం చేయబడ్డ బిడ్డ.. కావడం.

సుశీల వైపు వారు తొలుత నాన్చారు. అప్పుడు విజయే కాదు, అతని వైపు వారూ.. సుశీల వైపు వారిని కలిసారు. వాళ్ల సందేహాలని తీర్చారు. వాళ్లని సరళంగా సమ్మతించేలా చేసారు.

అన్నీ కలిసి రావడంతో.. వాళ్లిద్దరి ప్రేమ.. సవ్యంగా.. వాళ్లిద్దరి పెళ్లికి చేరువైంది.

"మాట్లాడు సుశీ." మళ్లీ విజయే తొందరయ్యాడు.

"ప్లీజ్, నేను చెప్పేది విను." అనురాగం ప్రదర్శిస్తుంది సుశీల.

"వింటున్నానుగా. త్వరగా తేల్చు." ఆత్రమవుతున్నాడు విజయ్.

"నేను.. నిన్ను.. ఒకటి కోరనున్నాను." మెల్లి మెల్లిగా అడుగుతుంది సుశీల.

"వై నాట్. అడగాలా." విజయ్ హుషారయ్యాడు.

ఆ వెంటనే -

"ఐనా ఇంత వరకు.. నువ్వు.. ఎన్నెన్ని.. కోరి.. కోరుకోలేదు. వాటిని.. నేను తీర్చానుగా" విజయ్ సరదా అవుతున్నాడు.

"అవి వేరు." ఆగి,

"అవన్నీ చిన్న చిన్న కానుకలు వరకే.. ఇది మాత్రం పూర్తిగా వేరు.." తటపటాయిస్తుంది సుశీల.

అప్పుడే -

"సరి సరే.. ఏదైనా.. అడిగేయ్" చొరవ చూపాడు విజయ్.

సుశీల వెంటనే మాట్లాడలేదు.

"ఇంతకీ ఏం నీ కోరిక. సెలవు ఇవ్వుమూ." నాటకీయంగా మాట్లాడేడు విజయ్.

సుశీల అవస్థ పడుతూనే ఉంది.

"చెప్పు, కాదు కాదు. అడుగు.  ప్లీజ్.. కోరుకో." అంటున్నాడు విజయ్.

నిముషం తర్వాత -

గట్టి నిశ్వాస కానిచ్చింది సుశీల.

విజయ్ ఆమెనే గమనిస్తున్నాడు.

"కోరుతాను. ఈ మారుది కూడా.. తప్పక.. నువ్వు తీర్చాలి." ఆశ పడుతుంది సుశీల.

"అయ్యో. నేను.. నీ కోరికను..  ఎప్పుడూ, ఏదీ  కాదన్నానా. నీ ప్రతి కోరికనూ తీర్చలే.." హుషారు పరుస్తున్నాడు విజయ్.

సుశీల తంటాలు పడుతూనే ఉంది.

"నీ గురించి నాకు తెలుసు. నువ్వు నా మాట కాదనవు.. నేను కోరిన.. దేనినీ నువ్వు కాదనడంలే.. ఆ నిబ్బరంతోనూ.. ఇప్పుడు ఒక కోరికని.. కోరాలనుకుంటున్నాను.. అడగనా." ఆగింది సుశీల.

"కానీ.. అడిగేసేయ్." రెచ్చిపోతున్నాడు విజయ్.

"మరి.. మరే.. అదే.. మనిద్దరం పెళ్లి చేసుకోవద్దు.. దానికి బదులు.. నువ్వు.." చెప్పుతుంది సుశీల.

విజయ్ తుళ్లి పడ్డాడు. అడ్డు పడ్డాడు.

"ప్లీజ్. విను.. నా కోరిక విను.. ఇదే.. నా చివరి కోరిక.." చకచకా మాట్లాడేస్తుంది సుశీల.

తేరుకోలేకపోతున్నాడు విజయ్.

***

గత వారంన -

మోటర్ బైక్ మీద.. విజయ్ ఇంటికి తిరిగి వస్తున్నాడు.

వీధి మలుపున తిరుగుతుండగా సడన్ గా ఎదురు వచ్చిన సైకిల్ ని గమనించలేదు విజయ్.

అతని బైక్.. ఆ సైకిల్ ని బలంగానే ఢీకుంది.

రెండు బళ్లూ.. భళ్లున చెదిరి.. పడ్డాయి.

విజయ్ ఇసుక కుప్ప మీద పడడంతో చిన్న చిన్న గాయాలతో తెమిలిపోయాడు.

కానీ.. ఆ సైకిల్ మీది.. పార్వతికి కాలువ అంచు ఒత్తిడిగా తాకింది.

పార్వతి తలకి గట్టి గాయం ఐంది. దాంతో ఆమె రెండు కళ్ల చూపు పోయింది.

***

"నువ్వు పార్వతిని పెళ్లి చేసుకో" గమ్మున అనేసింది సుశీల.

"హే.. ఏం అడుగుతున్నావు?!" కదిలిపోయాడు విజయ్.

"అవును. నేను కోరింది సమంజసమైంది. అది అవసరం కూడా.

ఆమె వైద్య ఖర్చులు చెల్లించి.. ఆమె కుటుంబంకి ఆర్థిక సాయంతో ఆగిపోవడం.. సరి కాదు." ప్రాధేయ పడుతుంది సుశీల.

అయోమయమవుతున్నాడు విజయ్.

"తను.. నీ మూలంగానే అలా ఐంది. నువ్వే తనని చేరతీయాలి, తన బాధ్యత్వంని చేపట్టాలి" వడివడిగా చెప్పేసింది సుశీల.

ఏదో చెప్పాలనుకుంటున్నాడు విజయ్. సుశీల మాట్లాడేస్తుంది.

"మన మధ్య ప్రేమ.. నిజమయ్యితే.. కాదు.. నా మీద.. నీ ప్రేమ సరైనదయ్యితే.. నా మీద నీ ప్రేమ పక్కా ఐతే.. నువ్వు.. నువ్వు నా మాట వినాలి.. నా కోరిక తీర్చాలి." పరితపిస్తుంది సుశీల.

"పెళ్లి కాలేదు కనుక.. ఇలా కోరగలుగుతున్నావు. అదే.. మన పెళ్ళి తర్వాత.. ఇదే జరిగితే.. ఇలా జరిగితే..  ఇలా కోరగలవా" విజయ్ బేజారవుతున్నాడు.

"తర్కం వద్దు.. తర్జన భర్జనలు వద్దు.. అవకాశం ఉన్నప్పుడు.. సవ్యంగా తెములుదాం.. బాధ్యతల్ని మన్నిద్దాం" చెప్పుతుంది సుశీల.

విజయ్.. ఆమెనే చూస్తున్నాడు.

"అన్నీ ఆలోచించాను.. బేరీజు వేసుకున్నాను.. స్పృహలోనే ఉన్నాను.. బాధితులకి మేలు చేకూరాలి.. వీలుంది కనుకనే.. నిన్ను నికరంగా.. మనిషిగా నిలబెట్టాలనే.. నిన్ను ఇలా కోరుకుంటున్నాను.

రా. మన పెద్దల్ని కలిసి.. వాళ్లని ఒప్పించి.. వాళ్లతో కల్సి వెళ్లి.. పార్వతిని, ఆమె పెద్దల్ని కలుద్దాం.. వాళ్లకి భరోసా అవుదాం" లేచింది సుశీల.

"మన ప్రేమని హెచ్చించు. నా కోరిక తీర్చు." తన కుడి చేయిని చాచింది సుశీల.

కాస్తా జాగు ఐనా.. సుశీల తీరుతో.. ఆమె చాచిన  చేయిని అందుకొని.. లేచి.. నిల్చున్నాడు విజయ్.

***

పార్వతిని పెళ్లి చేసుకున్నాడు విజయ్.

విజయ్ కి షేక్హేండ్ ఇస్తూ..

"నా మీది.. నీ ప్రేమ.. గొప్పది.. దొడ్డది.. థాంక్యూ" సంబరమైంది సుశీల.

********

Posted in February 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!