Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 6
సత్యం మందపాటి

స్పందన

మన చుట్టూ చూస్తున్న సామాన్య మానవ మనస్థత్వం ఎలా వుంటుందంటే, మనకి బాగా ఇష్టం వున్నవాళ్ళు ఏంచేసినా మనకి బాగానే వుంటుంది. మనకి ఏమీ సంబంధం లేని వాళ్ళు, మనం ఇష్టపడని వాళ్ళు సరిగ్గా అలాటివే చేస్తే మనకి ఏమాత్రం నచ్చకపోగా, కొండొకచో కోపం కూడా వస్తుంది. అలనాటి రోజుల్లో అలాటి సందర్భాలు రెండు మూడు చూశాక, ఇలాటి మనస్థత్వం మీద ఒక కథ వ్రాయాలనిపించింది. ఆ ఆలోచనా ఫలితమే అనగనగా ఆనాటి ఈ కథ. నాకిష్టమైన కథల్లో ఒకటి. ఈ కథలో వ్రాసింది చిన్న విషయమే అయినా, ఈరోజుల్లో ఈ ‘మనవాళ్ళు’ అనేది విస్కృతమై, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, చివరకు వారివల్ల సమాజంలోనూ కుల గజ్జి, మత పిచ్చి, ప్రాంతీయ వాదం మొదలైన చెత్తకు వ్యాపించి, మనిషి మనుగడనే బాధ పెడుతున్నది కూడాను. ఈ కథ చదివి ఎలావుందో మీ అభిప్రాయం చెబుతారు కదూ!

శ్రుతి - అపశ్రుతి

(ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రిక ఆగస్ట్ 11, 1971 సంచికలో ప్రచురింపబడింది)

Sruti-Apasruti image

“ఇన్నాళ్ళూ ఊరుకుని ఇప్పుడు తొందరపడుతున్నదేం మీ నిర్మల?” నవ్వుతూ అడిగాను.

“ఛ! దానిదేం లేదండి. అంతా మా అమ్మా నాన్నలదే. దాని ముఖం, దానికేమైనా అసలు తెలిస్తే కదా” అన్నది పార్వతి చెల్లెల్ని వెనకేసుకొస్తూ.

రైలు వేగంగా పరుగులు తీస్తున్నది. చెట్లూ చేమలూ హడావిడిగా వెనక్కి పరుగెడుతున్నాయి. పచ్చటి పొలాల్లో నల్లని అందమైన పడుచులు, పనులు ఆపి వయ్యారంగా నుంచుని దీక్షగా రైలుబండిని చూస్తున్నారు. సూర్య కిరణాలు పడి పక్కనే కుంటలో ఉన్న నీళ్ళు తళతళా మెరుస్తున్నాయి.

ఆ నీళ్ళ మిలమిలలు పార్వతి ఎత్తయిన ఎర్రటి బుగ్గల మీద పడి మెరుస్తుంటే గమ్మత్తుగా ఉంది.

పార్వతి బాగుంటుంది. పార్వతి ముక్కు మరీ బాగుంటుంది. సన్నగా నునుపుదేరి కవ్విస్తూ వుంటుంది. ఆ అందమేనేమో నన్ను ఆమెను చూసిన మరుక్షణంలోనే పరవశుణ్ణి చేసి, ఆమె వశం చేసిందేమో.

“పార్వతీ, నువ్వు ఇప్పుడు ఎంత బాగున్నావో తెలుసా? తామరాకు మీద తళతళా…” నెమ్మదిగా, రహస్యంగా అంటున్న నా నోటికి తాళం వేసింది.

“ష్! ఇది మన ఇల్లు కాదు. పెద్దగా అరుస్తారేం? అంతా వింటున్నారు మీ మాటలు”

“ఆఁ! విననీ, నా దగ్గర నేర్చుకుంటారు”

“ఆహాఁ, మీ మాటలే నేర్చుకోవాలి. ఇక బాగుపడినట్టే” అన్నది పార్వతి చిలిపిగా చూస్తూ.

ఆమె ముఖం చూస్తే ముచ్చట వేసింది. అలా దోసిట్లో దాచుకోవాలనిపించింది. కానీ మేము రైలుబండిలో కదా వున్నది, అందుకని ఊరుకున్నాను.

ఎప్పుడూ మెల్లగా పోయే ట్రైన్ ఈరోజెందుకో ఏమో వేగంగా పోతున్నది.

కొంచెం దూరంలో తాటిచెట్టు క్రింద ఎవడో కూర్చుని ఏదో త్రాగుతున్నాడు.

“ఏమండోయ్, ఇటు చూడండి” మోచేత్తో పొడుస్తూ అన్నది పార్వతి.

“ఏం?”

“వాడు చూడండి. ఇందాకాటినించీ నన్నే చూస్తున్నాడు తినేసేలా. కోరచూపులూ వాడూను” ఎవ్వరికీ వినపడకుండా మెల్లగా అన్నది పార్వతి.

పార్వతి చూపించినది, నాకెదురు సీటులో కూర్చున్న పాతికేళ్ళ కుర్రాడిని.

నేను అటు చూశాను. అతను దీక్షగా కిటికీలోనించీ బయటకు చూస్తున్నాడు.

“ఏమిటి పార్వతీ. అతనెటో చూస్తుంటే నిన్నే చూస్తున్నాడని అంటావేం?”

“ఆఁ! వాడివన్నీ పిచ్చి వేషాలు. ఇందాకటినించీ కన్నార్పకుండా నావేపే తినేసేలా చూస్తున్నాడు. మీతో చెప్పేసరికీ భయపడి అటు తిరిగాడు. ఫూల్!” పార్వతి విసుగ్గా అన్నది.

“ఊఁ! పోనీలే. ఇప్పుడు చూడటం లేదుగా” మళ్ళీ ప్రకృతిని చూడటంలో ముణిగిపోయాను.

ఏపుగా పెరిగిన పైరు, చల్లగాలికి తలవంచుకుని కొత్త పెళ్ళి కూతురిలా సిగ్గ్గుపడుతున్నది.

నీలాకాశంలో తెల్లటి మబ్బులు అందమౖన కన్నెపిల్ల నున్నటి శరీరం మీద జార్జెట్ చీరలాగా మెత్తగా జారిపోతున్నాయి.

మళ్ళీ మోచేత్తో పొడిచింది పార్వతి, “ఏమండీ” అంటూ.

ఈసారి కొంచెం గట్టిగానే చేయి ఝాడించిందేమో కడుపులో కలుక్కుమన్నది.

“ఏమిటి, పార్వతీ?” బాధగా అన్నాను.

“వాడు చూడండి, బాటసారి సినిమాలో నాగేశ్వర్రావులా లావటి కళ్ళజోడు వాడూను. మిర్రిమిర్రి చూస్తున్నాడు. జీవితంలో ఎన్నడూ ఆడపిల్లల్ని చూడనట్టుగా. వఠ్ఠి మేనర్లెస్ బ్రూట్” కొంచెం కోపంగానే అయినా నెమ్మదిగా అన్నది.

అటు చూశాను. అతను మావేపే చూస్తున్నాడు. చూపు మామూలుగానే వుంది.

“ఏమిటి పార్వతీ. అతను ఎంతసేపని కిటికీలోనించీ బయటకు చూస్తాడు? కాసేపు ఇటు తిరిగితే ఏమయింది? పైగా అతను మామూలుగానే చూస్తున్నాడే. నాకేమీ చెడుగా అనిపించటం లేదు.”

“అవున్లెండి. మీకెప్పుడూ అంతే!” మూతి ముడుచుకున్నది పార్వతి.

ఆ పోజంటే నాకు మహా ఇష్టం. కానీ… ఊరుకున్నాను.

“లాల్ బహదూర్ శాస్త్రిగారిని హత్య చేశారట సార్. అది సహజ మరణం కాదుట” నల్లగా, లావుగా ఉన్నాయన సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు.

అసలు సిగరెట్టు ఆరోగ్యానికి ఏమీ మంచిది కాదుట. మరి ఈయన సిగరెట్టు మీద సిగరెట్టు త్రాగుతాడేం? ఆత్మహత్యా ప్రయత్నం చేయటం లేదు కదా!

“లేదండీ. ఆయనది సహజ మరణమే. ఏమాత్రం అనుమానమున్నా మనవాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు” స్టూడెంటు కుర్ర్రాడు అంటున్నాడు.

ఈ స్టూడెంటు కుర్ర్రాడు ప్రభుత్వపు పార్టీ కాబోలు. ఏమయితేనేం? ఈమధ్య స్టూడెంట్లు రాజకీయాల్లోకి దిగిపోయారు. కామరాజుని ఓడించింది కూడా ఓ స్టూడెంటు కుర్రాడే కదా!

పొట్ట దగ్గర ఫెడీమని తగిలింది. ఈసారి బాగా గట్టిగానే మోచేత్తో పొడిచింది మా ఆవిడ.

“అబ్బా” అన్నాను నొప్పి పుడుతుంటే.

”మేలుకునే వున్నారు కదా! పిలిస్తే పలకరేం? వాడు చూడండి, కోర మీసం వాడూను. అసలు నేనటు చూస్తే చాలు తెగ కులుకుతున్నాడు. ఏమిటి వాడి ఉద్దేశ్యం? అసలు ఏమిటి మీ ఉద్దేశ్యం? వాడిని తన్ని తగలెయ్యక మీరు చూస్తూ ఊరుకుంటారేం?” తీక్షణంగా అన్నది పార్వతి.

నెమ్మదిగా అన్నాను, “డ్రిల్లు మాస్టర్ని కదా, ఆరడుగుల పొడుగున్నానని కనపడినవాడినల్లా తంతే ఎవరూ ఊరుకోరు అమ్మడూ!” అన్నాను.

“అబ్బ, ఏం తెలివిగా మాట్లాడారండీ. ధైర్యం లేకపోతే చెప్పరాదూ. నేనే వాడ్ని నాలుగూ దులుపుతాను. కొక్కిరాయి క్రాఫూ వాడూనూ”

“అదికాదు చిట్టీ, చదువుకున్న దానివి నువ్వు కూడా అలా మాట్లాడతావేం? నేను రోడ్డు మీద అమ్మాయిలు కనపడితే చూడనూ…”

గుర్రున మిర్రి మిర్రి చూసింది నన్ను.

సర్దుకుంటూ అన్నాను, “అహఁ! అది కాదు నా ఉద్దేశ్యం. మామూలుగా అలా చూస్తాం. అంతే. అందులో తప్పేమిటీ? ఇహఁ అతన్ని ఏమని అడుగుతావు? ఏమయ్యా, ఎందుకు నన్నలా చూస్తావు అనా? అడుగు. నువ్వు నా వైపు చూస్తేనే కదా అది నీకు తెలిసింది. మరి నువ్వు నావేపెందుకు చూస్తున్నావు అని అతనంటే ఏం చెబుతావు?”

“ఆఁ! ఏడిశాడు” అన్నది పార్వతి.

“ఈమధ్య తెలుగు సినిమాలు కూడా చప్పగా తయారయాయి సార్. హిందీ సినిమాలే నయం. ఏవో నాలుగు మంచి పాటలు, రంగుల్లో పిక్చరైజేషనూ...“ ఇంకా ఏదో అంటున్నాడు ఇందాకటి స్టూడెంట్.

అవును బాబూ. అసలు ఇంగ్లీషూ, హిందీ సినిమాలు ఎవ్వరికీ పూర్తిగా అర్ధంకావు గదా! అదో హిపోక్రసీ. అర్థంకాని ఇంగ్లీషు సినిమా చూసి బాగుంది అన్నవాడే, అర్ధమయే తెలుగు సినిమా చూసి చెత్త సినిమా అంటున్నాడు.

ఆలోచనల్లోనించీ తేరుకుని చటుక్కున చేయి అడ్డం ఉంచాను, మోచేత్తో పొడవబోతున్న పార్వతిని వారిస్తూ.

పార్వతి ఆ కొక్కిరాయి ముఖం గురించి ఏదో అనబోతూ ఉన్నదిగానీ, ఈలోగా ట్రెయిన్ బెజవాడ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది.

రామ్మూర్తి స్టేషనుకి వచ్చాడు. ప్లాట్ఫారం మీదే నుంచుని కాసేపు అదీ ఇదీ మాట్లాడాడు.

కళ్ళజోడు విలన్ ప్లాట్ఫారం మీద తిరుగుతున్నాడు.

రామ్మూర్తి పార్వతితో అంటున్నాడు, “అక్కయ్యగారూ, మన నిర్మలని రేపు చూడబోయే అతను ఇతనే అనుకుంటాను. నేను ఫొటోలో చూడటం వల్ల సరిగ్గా గుర్తులేదు. పరిచయమూ లేదు”

ఎవరా అని అటు చూసిన పార్వతి కళ్ళజోడు విలన్ని చూసి ఉలిక్కిపడింది.

“ఇతనా!” అంది అప్రయత్నంగా.

“అవును. మీ నాన్నగారు నాకు మొన్న అతని ఫొటో చూపించారు. మన నిర్మలని చూడటానికి వస్తున్నాడు. ఇంజనీర్. ఢిల్లోలో పని చేస్తున్నాడు. పెద్ద జీతగాడు. ఎంతో మంచివాడు. కట్నం కూడా ఏమీ తీసుకోడు. పెళ్ళి కూడా నిరాడంరంగా చేయాలి అన్నాడు అని చెప్పారు. భీమవరంలో వాళ్ళ నాన్నగారూ వాళ్ళూ ఉంటున్నారనీ, అతను సెలవు పెట్టి వస్తున్నాడనీ చెప్పారు కూడాను.”

అదోరకంగా మారిన మా ఆవిడ ముఖం మళ్ళీ ఎందుకో వికసించింది.

బెజవాడ స్టేషన్ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. మగవాళ్ళూ, ఆడవాళ్ళూ, పిల్లలూ, కూలీలు అందరూ ప్లాట్ఫారాల మీద ఇటూ అటూ పరుగెడుతుంటారు.

అటే చూస్తున్న నన్ను గట్టిగా కుదిపి, “ఏమండీ మిమ్మల్నే. సమయం సందర్భం లేకుండా మీరూ మీ ఆలోచనలూను.” అన్నది పార్వతి.

“మళ్ళీ ఏమిటి?” అన్నాను ఆలోచనలలోనించీ తేరుకుంటూ.

అప్పటికే రైలు బయల్దేరంది. రామ్మూర్తి చేయి ఊపుతున్నాడు. నేనూ చేయి ఊపాను.

“కళ్ళజోడు కొంతమందికి ఎంతో అందాన్నిస్తుంది కదండీ. అతన్ని చూడండి. కళ్ళజోడు పెట్టుకుని ఎంత ఠీవిగా, హుందాగా వున్నాడో. పెద్ద ఫిలాసఫర్ లుక్. అచ్చం ఇంగ్లీష్ సినిమాల్లో మైకెల్ కెయిన్ లాగా ఉన్నాడు కదూ!”

కళ్ళు తిరిగినట్టయింది. ఏమిటబ్బా, మా ఆవిడేనా అంటున్నది అనుకున్నాను.

పార్వతి చేతిని ప్రేమగా నా చేతిలోకి తీసుకున్నాను. చటుక్కున గిల్లాను.

“అబ్బా” అన్నది బాధగా.

అవును, పార్వతే అంటున్నది. నేను కలగనటం లేదు.

“ఏమండీ, మన నిర్మలకు అతను సరైన జోడీ అండీ. పొడుగ్గా అందంగా గ్రెగరీ పెక్ లాగా వున్నాడు కదా”

పార్వతి ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడకపోయినా, హాలీవుడ్ నటీనటుల పేర్లన్నీ తెలుసు.

“ఛ! లేడు. లేడంటే నిజంగా లేడని కాదు. అహఁ! అలా కోపంగా చూడకు. ఊఁ! సరే. ఉన్నాడు. కానీ ఇతనికి కోర మీసాలు పార్వతీ. కోర మీసంగాళ్ళకి కులుకెక్కువ” అన్నాను.

‘ఎవడండీ అలా అన్నది. వాడికి మీసాల సంగతేమీ తెలీదు. కోర మీసమే అసలు అందం. ఒమర్ షరీఫ్ ఎంత బాగుంటాడో! మీసం మంచి గంభీరత్వాన్నిస్తుందండీ. మీరూ ఉన్నారు ఎందుకు?”

నా అదృష్టం బాగుండి నన్నెవరితోనూ పోల్చలేదు. అసలు మా ఆవిడకి కాలేజీలో చదివేటప్పుడే పేర్లు పెట్టటం అలవాటు. ఎర్రబుగ్గలమ్మాయికి ఏపుల్ అనీ, ఓ కళ్ళజోడు అబ్బాయికి బుచ్చిబాబు అనీ.. ఇలా..

“ప్లీజ్… పుస్తకం..” అడుగుతున్నాడు కళ్ళజోడు విలన్.

“ఆఁ! ఏమిటి?” అడిగాను.

ఇంతలో మా ఆవిడ అట్ట దులిపి చేతిలోని నవల అందించింది.

అది నేను కావాలని కొనుక్కున్న ముళ్ళపూడి వెంకటరమణగారి నవల.

అతను పుస్తకం చూడటంలో ముణిగిపోయాడు.

అతన్ని పరీక్షగా చూశాను. నెమ్మదిగా పార్వతితో అన్నాను.

“పార్వతీ, అతనిది కొక్కిరాయి క్రాఫు”

“ఏం కాదు. అతని క్రాఫింగుకేం. అచ్చం రాక్ హడ్సన్ క్రాఫులా వుంది”

“అయినా, అతనిది ముఖం కోతి ముఖం పార్వతీ”

“ఎవరండీ అన్నది. అతని ముఖం టోనీ కర్టిస్ ముఖంలా బ్యూటిఫుల్గా వుంది”

“అతను మంచివాడు కాదు చిట్టీ! ఎన్నడూ జీవితంలో అమ్మాయిలను చూడని వాడిలా మిర్ర్రిమిర్రి చూస్తాడు అందరినీ”

“ఇంకా నయం! ఎదురుగా కూర్చున్న మనుష్యుల్ని చూడటంలో తప్పేముంది? చూడటానికి కాకపోతే ఆ దేవుడిచ్చిన కళ్ళూ, బోలెడు డబ్బు పోసి కొనుక్కున్న కళ్ళజోడు ఎందుకు?”

సరే, ఇక నేనేమన్నా పార్వతి అతన్ని సమర్థించేస్తుంది. కారణం? అతను ఢిల్లీలో పెద్ద ఇంజనీరు. పెద్ద హోదా. పెద్ద జీతం. అన్నిటికీ మించి కట్నం కూడా అడగని సహృదయుడు. ఎంతో మంచివాడు. రామ్మూర్తి ఉవాచ మరి!

దీక్షగా చూశాను అతన్ని. మంచివాడిలాగానే వున్నాడు. శ్రద్ధగా పుస్తకం చదువుకుంటున్నాడు.

పార్వతి వేపు చూశాను. తన చెల్లెలి భర్త కావటానికి అతనికి అన్ని అర్హతలూ ఉన్నాయనే అభిప్రాయంతో చాల సంతోషంగా అతన్ని చూస్తున్నది.

మా ఆవిడ పద్ధతి చూస్తే ఆశ్చర్యం వేసింది. అతన్ని మొదటినించీ అసహ్యించుకుంటూనే ఉన్నది. అతని ప్రతి చేష్టనీ విమర్శిస్తూనే ఉన్నది. తిడుతూనే ఉన్నది. కాని అతను చాల మంచివాడనీ, చదువూ, డబ్బూ, హోదా అన్నీ ఉండటమేగాక, కట్నం తీసుకోడనీ తన చెల్లెల్ని చూడటానికి వస్తున్నాడనీ తెలియగానే, అతన్ని ఎంతో గౌరవంగా, గొప్పగా చూస్తున్నది. అతని ప్రతి చేష్టనీ పొగుడుతూనే ఉన్నది. మెచ్చుకుంటున్నది.

అసలు ఆ మనసు అనేదే అలాటిదేమో! చాల విచిత్రమైనది. ఒకే వస్తువుని, ఒకే మనిషిని, ఒకే చేష్టని నచ్చితే మెచ్చుకుంటుంది, నచ్చకపోతే తిట్టుకుంటుంది.

మనసనేది ఒక వాయిద్యం లాంటిది. వాయించేటప్పుడు అతని మానసిక స్థితినిబట్టి, ఒకే మనిషి, ఒకే వాయిద్యం మీద శ్రుతులే కాక అపశ్రుతులూ పలికిస్తాడు.

“ఢిల్లీలో పెద్ద ఉద్యోగమేనుట. పెద్ద కారూ, పెద్ద జీతం, పెద్ద బంగళా” నెమ్మదిగా నా చెవిలో చెబుతున్నది  పార్వతి.

“ఎక్స్క్యూజ్ మి” కళ్ళజోడు విలన్ (అలా అంటే ఇక పార్వతి ఊరుకోదు కాబోలు) చనువుగా నా ఒళ్ళోని పేపర్ తీసుకున్నాడు.

మా ఆవిడ నా చెవిలో జోరీగలా అంటున్నది, “అబ్బ, ఎంత సోషల్గా, కలివిడిగా వున్నాడో” అని.

“రేపు పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు అతను మనల్ని చూసి ఆశ్చర్యపోతాడు కదండీ. అంతా కథలోలాగా వుంది అనుకుంటాడు కదూ” అన్నది పార్వతి

“అవును” అన్నాను, ఇక ఏమనాలో తెలియక.

ట్రెయిన్ గుడివాడ ప్లాట్ఫారం మీద ఆగింది. సూట్కేస్ తీసుకుని దిగి మామగారి కోసం చుట్టూ చూశాను.

“ఏమోయ్ కృష్ణమూర్తీ, ప్రయాణం బాగా జరిగిందా?” అంటూ వచ్చారు మామగారు.

పార్వతి గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది.

“నాన్నా, పెళ్ళికొడుకు చాల బాగున్నాడు. మంచి సంబంధం” అన్నది.

“నువ్వెప్పుడు చూశావమ్మా? అతను సెలవు దొరకక ఇంకా రాలేదు. నాలుగు రోజుల్లో వస్తాడుట. అందుకే పెళ్ళిచూపుల కార్యక్రమం నాలుగు రోజుల వాయిదా...” ఆయన ఇంకా ఏదో చెబుతూనే వున్నారు.

ట్రెయిన్ వేపు చూశాను. కళ్ళజోడు విలన్ ఇటే చూస్తున్నాడు.

పార్వతి వేపు చూశాను.

“కోతి వెధవ! బాటసారి పోజూ వాడునూ. ఆ కొక్కిరాయి బుధ్ధులు పోతేగానీ వాడు బాగుపడడు!” అంటున్నది నా జీవిత సగభాగమైన నా ప్రియ పార్వతి!

****సశేషం****

Posted in February 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!