Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఆత్మపరివర్తన, ప్రేరణ, ఆచరణ....

ఆత్మ పరిశోధన, ఆత్మ పరివర్తన, ఆత్మ పరిజ్ఞానం..ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలు. మనలోని మరో జీవినే మనం ఆత్మ అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఆత్మనూన్యతా భావం ఏర్పడుతూ ఒక విధమైన అభద్రతా భావంతో అసౌకర్యం ఏర్పడుతూ మనసు అశాంతికి గురౌతున్నప్పుడు అందుకు గల కారణాలను శోధించడం మొదలుపెట్టాలి. ఇది పూర్తిగా మానసిక సంబంధమైనది కనుక అప్పుడు ఆత్మశోధన అవసరం అవుతుంది. మన ఆనందాలను, సంతోషాలను హరిస్తున్న ఆ అంశాల యొక్క మూలాలను గుర్తించినప్పుడు వాటిని నిర్మూలించే విధానాలను పరిశోధించి నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా మనతోనే జరుగుతుంది. ఆ ప్రహసనంలో ముందుగా మనలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే దిశగా మన ఆచరణ మొదలుపెట్టాలి. అందులో భాగంగా సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడాలి. ఎందుకంటే మనం అనుకున్నదే సరైనదనే భావన లోంచి బయటకు వచ్చి మన ఆలోచనలలో పరివర్తన రావాలి. ఆ విధమైన ఆత్మ పరివర్తన కలిగిన తరువాత మన విశ్లేషణలకు, విధివిధానాలకు మరింత పదునుపెట్టి మన అశాంతికి మూలమైన విషయాలను గుర్తించి, సరైన పరిజ్ఞానాన్ని సంపాదించి, ఆ పిమ్మట మన జీవన సౌధానికి శాంతిని  చేకూర్చే క్రియలతో ఆచరణ మొదలుపెట్టాలి. నిబద్ధతతో ఆచరించిన ఆ శారీరక, మానసిక ప్రక్రియల పర్యవసానంగా ఏర్పడిన ఆత్మస్థైర్యంతో, ఆత్మసంతృప్తి గా మన జీవనయానాన్ని కొనసాగించాలి.

ఆత్మపరివర్తన తో నీ ప్రవర్తనలో కలిగిన మార్పును (నీ అంతట నీవు చెప్పుకోకుండా) ఎదుటివారు అర్థం చేసుకోగలిగిన రోజు నీలో నిజంగానే ఆత్మపరివర్తన కలిగినదని చెప్పుకోవచ్చు. అంతేకాని స్వోత్కర్ష తో నేను ఇది, నేను అది అని నీ గురించే నీవు చెప్పుకోవడం మానుకోవాలి. నేను ఇలా జీవన విధానాలను అనుసరించినందున నా కుటుంబం ఇంత అభివృద్ధి చెందింది. మేమందరం సమాజంలో మంచి గుర్తింపును పొందాము. చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఎన్నో వసతులు, సంపద సమకూరాయి... ఇలా చెప్పుకుంటూ పోతుంటాము. అందులో ఒక్క సంతోషం అనే పదమే నిజంగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సంతోషాన్ని మనం ఇతరులు కూడా పొందేందుకు సహాయం చేయవచ్చు. అది మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా, కొంచెం ఆర్ధిక సహాయం ద్వారా గాని లేక మంచి సూచనలు ఇవ్వడం ద్వారా గాని అందించవచ్చు. స్వోత్కర్ష అనే మాటకు గొప్పలు చెప్పుకోవడం మాత్రమె కాదు. నీ గురించిన విషయాలు చెప్పడం కూడా అవుతుంది. అయితే కొన్నిసార్లు అది తెలియకుండానే మనలోని కించిత్ గర్వాన్ని కూడా కలుపుకుంటే, అప్పుడు ఆ సన్నివేశం గొప్పలు చెప్పుకునే స్థాయికి చేరుకుంటుంది. ఆ సన్నటి గీతను గమనించి మనం మాట్లాడే మాటలను నియంత్రించుకునే సామర్ధ్యం మనలో కలగాలి. నిజం చెప్పాలంటే నేను ప్రస్తుతం నూతన సంవత్సరం సందర్భంగా ఆ గుణాన్ని అలవరుచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించాలని అనుకొన్నాను. ఎంతవరకు కృతకృత్యుణ్ణి అవుతానో తెలియదు. కానీ నా చుట్టూ ఉన్న స్నేహితుల, బంధువుల, ఆప్తుల అనుభవపూర్వక మంచి గుణాలను మాత్రమె పరిగణించి పరిశోధిస్తూ నా ప్రయత్నాన్ని కొనసాగిస్తే బహుశా నా ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి. ఇది మనుషులుగా మనందరం చేయదగ్గ ఒక మంచి ప్రక్రియ. దీని ప్రభావం ఖచ్చితంగా మనుషుల మధ్యన మంచి సహృద్భావ సంబంధాలను నెలకొల్పుతుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in February 2023, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!