Menu Close
Page Title
సాహితీ సీమలో ముత్యాల మువ్వలు

రాగమనేది అనేది అంటురోగం లాంటిది. ఒకరు పాడుతూంటే ప్రక్కవాడి గొంతులో కూడా ఏవోకూనిరాగాలు చిగురిస్తాయి. ఏవేవో నూతన భావాలు చెదురు మదురుగా రేగుతాయి, క్రమంగా ఒక వొరవడిలో పడి అది కవిత్వంగానో సంగీతరూపంలోనో వెలువడుతుంది. ప్రసిద్ధ గాయకుల జీవిత చరిత్రలు పరిశీలిస్తే వారి కుటుంబములోనివారో, వారిని ప్రభావితులని చేయగలిగిన సమీప బంధువులో, మిత్రులో వారిలో ఆసక్తిని పెంచి, ఉత్సాహాన్ని నింపి నిలబెట్టారు. నండూరి సుబ్బారావు గారి విషయంలోను అల్లాగే అయిందట. అధికార్ల సూర్యనారాయణ గారు, మిత్రులు బసవరాజు అప్పారావు కలిసి చెరోవైపు ఇతర కవుల సాహిత్య పరిశీలనలతోను వారి స్వీయ రచనల భావపొందికల ఇంపుసొంపుల విశ్లేషాలతోను వీరిని మద్దెలచేసి ఇరువైపులా వాయించి ఈయనిని కూడా సహితీ సంభారములోకి దింపారట. దాని ప్రభావమే ఒకరోజున కాలేజి నుంచి ‘ట్రాము’లో ప్రయాణం చేస్తుండగా కూనిరాగమై …

"గుండె గొంతుకలోన కొట్లాడుతాది,
కూకుండనీదురా కూసింతసేపు,
మందో మాకో యెట్టి మరగించినాది
వల్లకుందామంటె పాణమాగదురా
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ"-

గా పరిఢవిల్లి తుదకు ‘ఎంకి’ పాటై సాహిత్యసీమలో చిగురించినదట. ఆ ఊపుతోనే క్రమేణా ఎంకికి ప్రేమ మొలకైన, నాయుడు బావగా ఆవిర్భవించిన అతడి ఊహా సుందరిగా ఎంకిని తీర్చిదిద్ది తెలుగు ప్రణయ సాహిత్యంలొనే ఒక సుందరమైన మలుపు తిప్పాడు, నండూరి. తెలుగు భాషకి ‘యాస’ పెంచి క్రొత్తవొరవడి తెచ్చి పెట్టాడు ఒక మువ్వ అయిన నండూరి సుబ్బారావు.

“పూవునెనైతే నే నీవలపు నౌదు! పూనిన్నె జగమంత ధ్యానింపజేతు
నేను కోయిల నైతే  నీ రాగమౌదు! దిశ లహో నిన్నేకీర్తింపగా జేతు!...
రాయి నేనైతే?  నీప్రాణమ్మునౌదు! ముజ్జగము నిన్ను మొక్కగాజేతు!...
నీవు నేనైతే?  నిను నీలోనె కందు!
నేను నేనుగ నుంటె?  నీలొనె యుందు! ”…

"పూలబాసలు తెలుసు ఎంకికి, తోట
పూల మనసులు తెలుసు ఎంకికీ...
పూలతో వియ్యాలు పూలల్లొ కయ్యాలు
మానల్లె నన్నుంచి తానె పూవౌనేమొ
పూలబాసలు తెలుసు ఎంకికి, తోట
పూల మనసులు తెలుసు ఎంకికీ..”
అని నాయుడు బావ మురుస్తూ ఉంటె…
“నీతోనె వుంటాను నాయుడు బావా
నీ మాటే యింటాను నాయుడు బావా”

అంటూ బాసలు చేస్తుంది, ఎంకి.

‘యేడనే నా కాపురమో యెల్తురు పిల్లా?’ అని నాయుడు బావ అంటే
‘నీ నీడలోనే మేడకడతా నాయుడుబావా!’ అని బదులు చెబుతుంది యెంకి.

'ఆరిపేయవె దీపమూ! యెలుగులో నీమీద నిలుపలేనే మనసు!
ఆరిపేయవె దీపమూ!
జిమ్ముమంటా తోట సీకటై పోవాలి, సీకట్లోసూడాలి నీ కళ్ళ తళతళలు!
ఆరిపేయవె దీపమూ!
తళుకుతో నీ రూపు తలుసుకుని, తలుసుకుని సీకట్లో నాకళ్ళు సిల్లులడ సూడాలి!
ఆరిపేయవె దీపమూ!
సూపులే ఆపేసి రూపు వూసేమరసి ఒకరెరుగ కింకొకరు వొరిగి నిదరోదాము!
ఆరిపేయవె దీపమూ!

మరి నాయుడుబావ ఆకాంక్ష ...

“ఎంకితో తీర్తానికెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె
నెత్తి మూటల నెత్తుకోవాలి
కొత్త మడతలు దీసికట్టాలి
అడవి దారుల యెంట నడవాలి
బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి
తాతనాటీ ఊసు తలవాలి
దారిపొడుగున కీసులాడాలి
'తప్పు నీదే' యంట దెప్పాలి
దైవమున్నాడని దడిపించుకోవాలి
ఎంకితో తీర్తానికెల్లాలి ...”

అంటూ ఎగసి పడతాయి ఆ రసవాహినిలో నండూరి వారి భావ కెరటాలు.

మరొక ఎంకి పాట,

"నన్నిడిచి పెట్టే నారాజు, నిన్నె తిరిగి వస్తానన్నాడే…' లింక్ »

“ఎంకి వంటి పిల్ల లేదోయ్, లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్, రాదోయ్
మెళ్ళో పూసల పేరు తల్లొ పూవులసేరు
కళ్ళెత్తితే సాలు కనకాబిసేకాలు!
సెక్కిట సిన్నీ మచ్చ సెబితే సాలదు లచ్చ!
ఒక్క నవ్వే యేలు వొజ్జిర వొయిడూరాలు!
పదమూ పాడిందంటె పాపాలు పోవాల!
కతలూ సెప్పిందంటె కలకాల ముండాల!
రాసోరింటికైన రంగు తెచ్చేపిల్ల!
నాసొమ్ము నాగుండె నమిలి మింగిన పిల్ల!
ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్”

ఈ పాటతో పాటు మరికొన్ని పాటలు ఆయన రసవత్తరంగా పాడుతుంటే 1953 లో వినగలగడం నా అదృష్టం గా భావిస్తాను.

చిరు సవ్వడులతో అందంగా మురిపించే మరొక మువ్వ... ‘యెంకి, నాయుడు బావ’ ల ఆవిర్భావనికి ఒక విధంగా కారకులైన బసవరాజు అప్పారావు … ఆయన జీవితం నలభయ్యోయేటే అర్ధాంతరంగా ముగిసినా, 100 కి పైగా పాటలు అందించి 'భారతి' వంటి ప్రతిష్ఠాత్మక సాహిత్య పత్రికకి ఉప సంపాదకునిగా పనిచేసారు.

అందరూ వేళాకోళాలాడుతూ పాడుకునే ఆయన ఆణిముత్యమొకటి:

"గుత్తి వంకాయ్ కూరోయ్ బావా! కోరివండినానోయ్ బావా!
కూరలోపలా నా వలపంతా కూరిపెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా!
తీయని పాయసమోయ్ బావా! తీరుగవండానోయ్ బావా!
పాయసమ్మునా ప్రేమనియేటి పాలు బొసినానోయ్ బావా!
బాగని మెచ్చాలోయ్ బావా!
కమ్మని పూరిలోయ్ బావా! కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీలతో నా కాంక్ష వేపినానోయ్ బావా!
కనికరించి తినవోయ్ బావా!
వెన్నెల యిదుగోనోయ్ బావా! కన్నులకింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే వెన్న గలిపినానోయ్ బావా!
వేగముగ రావోయ్ బావా!
పువ్వులసెజ్జిదిగో మల్లే పువ్వులు బరచిందోయ్ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా పొదిపిపెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!"

తాజమహల్ చూస్తూ ఆ గాథలోని విషాదాన్ని నెమరువేసుకుంటూ మరొక గీతం:

మామిడిచెట్టును అల్లుకొన్నదీ
మాధవీ లతొకటీ
యేమా రెండింటి ప్రేమసంపదా
యింతింతనలేమూ
చూడలేక పాపిష్టి తుపానూ
ఊడబీకె లతనూ
మోడయిపోయీ మామిడిచెట్టూ
మొగము వేలవేసీ
ముచ్చటైన ఆకులు కాయలనే
వెచ్చని కన్నీళ్ళోడ్చీ
పచ్చనాకులా బొమ్మరింటిలో
పండొక్కటి రాల్చీ
మామిడిచెట్టూ మాధవిలతతో
మాయలో గలసింది
కామితమిచ్చే మామిడిపండూ
కవులకు మిగిలింది!

"ఈ మావి పైనుండి ఈవు కూ కూ యంచు
ఆ మావి పైనుండి ఆపె కూ కూ యంచు
ఏమి బాసలు జేతురే, కోకిలా ఏమి బాసలు చేతురే?
చెలియయును నీవలెనె  చివురుటాకులు మెక్కి
చెవులు పండువు గాగ చిలుకంగ గానమ్ము
చింత నీకేమున్నదే, కోకిలా చింత నీ కేమున్నదే?
చెంత గూర్చొని మోము చెలువు గుల్కగ వలపు
దెలుపుచు బలుకంగ చెలి చెంత లేని నా
చింత లెన్నడు తీరునే,  కోకిలా చింతలెన్నడుతీరునే?
పాడవే కోకిలా, పాడవే యింపుగా!
ప్రాణముల్ హాయిచే పరవశమ్మొందగా!
పాట పాడవే తీయగా, కోకిలా పాటపాడవే తీయగా!"

మరొక తీయని కోయిల పాట:

"కోయిలా కోయిలా కోయబొకే!
గుండెలూ బద్దలు చేయబొకే!
తీయనీ రాగాలు తీయబోకే
తీపితో నా మనసు కోయబోకే!
చిట్టినీ జ్ఞాపకం చేయబోకే
చింతతో ప్రాణాలు తీయబోకే!
కోయిలా కోయిలా కూయబోకే!"

కవి

“కవి యని కీర్తిని గాంచుట కన్నను
ఘన మే మున్నది జగతిన్‌?

కష్ట సుఖమ్ముల చవి జూచుటకన్న
మృష్టాన్నం బెటు రుచిరా?”

జీవయాత్ర

“ఈ మహాసముద్రమ్ములో నెన్నియెన్ని
తీరముల జేరవలయునో క్రూరమౌతు
పాను లెన్నెన్ని గడవగావలెనొ బేల!
ఇల్లలకగానె పండగా యేమె చెపుమ?
నమ్మదగ్గదికాదు సంద్రమ్ముతీరు
పడవ వోటిది తిన్నగా గడపగల్గు
నావికుడు వోయె చుక్కాని నీవె చేత
బూని నెగ్గింపు మీయాత్ర! పన లేడె?”

అతి సన్నిహితుడు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య మరణవార్త విని ఆయన కిష్టమైన యమునాకల్యాణి రాగం పాడలేక, వీడ లేక వ్రాసిన “యమునా సాంత్వనము” :

“ఏలా పాడే నింక యమునాకళ్యాణి, నే
లీలామానవుడు గోపాలుడు లేడాయె? ||ఏలా||

బంగారు గనులలో
చెంగలించే వేళ
పిడుగు బోలినవార్త
వినిపించినా రయ్యొ ||ఏలా||

చెడువార్త వినగానె
చెవులు గింగురుబోయె
ఎంత చించుకొన్న
గొంతు పెగలదాయె ||నేలా||

వెన్నెలకు తోడు మా
వేణుగోపాలుడు
కన్నుల పండువుగ
కనిపించకుంటేనే ||నేలా||

ఈ నాటి యీ నేస్త
మే జన్మకో తిరిగి

​గారవకె
కడుపు చెరు వయ్యేనే

నేలా బాడే నింక యమునాకళ్యాణి, మా
లీలామానవుడు గోపాలుడు లేడాయె!”

చంద్ర గ్రహణము

రాబోకురాబోకురాచందమామ!
రాహుపొంచున్నాడురాతోవలోన!

ఆకొక్కటైనానుఅల్లాడకున్నాది,
మబ్బులపైనేదొమాయకప్పేసింది! ||రాబోకు||

తెల్లన్నినీకాంతి
నల్లనయ్యేనురా!
చల్లన్నినీమోము
సన్నగిల్లేనురా!  ||రాబోకు||

పరమరాకాసిరా
పాపిష్టిరాహువు,
మిత్తిలానినుబట్టి
మింగబొయ్యేనురా?

రాబోకు,రాబోకురా!చందమామ!
రాహు పొంచున్నాడురా తోవలోన!

కావ్యపానము

“కావ్యపానముజేసి
కైపెక్కినానే!
దివ్యలోకాలన్ని
తిరిగొచ్చినానే!

ఎక్కరానీకొండలెక్కివచ్చానే!
పైకెక్కినీకేసిపారజూశానే!
కావ్యదేవతనోటె
కవితవిన్నానే
చీమలనిపించారె
భూమిలోకవులు!

కావ్యపానముజేసి కై పెక్కినానే!”

కవిత్వ ధాటి

నన్నెవ్వ రాపలే రీవేళా
నాధాటి కోపలే రీవేళా !
నోటపలికేదంత
పాటగా మోగేను
కోటివరహా కెత్తు
కెత్తుగా తూగేను ||నన్నెవ్వ||

గుండు ఠాఠామంటు
కొట్టినట్టుగ నేటి
పండితులు ఠా రెత్తి
పరుగుచ్చుకోవాలి ||నన్నెవ్వ||

పట్టుపట్టితినంటె
వాగీశుడే వచ్చి
దాసోహమని పాట
వ్రాసి వల్లించాలి!
నన్నెవ్వ రాపలే రీవేళా
నాధాటి కోపలే రీవేళా !

ప్రణయగీతము

“జలజలమనిపాఱుసెలయేటిచెంత
నిభృతనికుంజంపు నిశ్శబ్దమందు
పాలఱాపానుపుపైబవ్వళించి
పూవులదావికిపొంగుచుమదిని
పిట్టలపాటలవీనులవించు
పండువెన్నెలమేనుపరవశమొంది
పతికౌగిలింపగభయపడితగ్గి
సొక్కిసోలెడునిండుచూలాలివోలె

చక్కనిచందురుసరసకుబోక
నొంటరిగాబోవునొకమొగిలుకన్నె
మోమద్దమందుచెలియ
వన్నెలచిన్నెలవదనమ్ముగాంచి
వలపుముచ్చటలేవొతలపునరాగ
హృదయమ్మునందెల్లవింతరాగమ్ము
పరమాత్మశక్తినాప్రబలిలోగొనగ
చెంతనిలచుచుమిన్నుజీల్చుకుపోవు
నడవి మల్లియచెట్టుకడ కేగి, మేలి

​పూవొండుగొనిదానిబూరగాజేసి,
ప్రణయవాయువులతోబాగపూరించి
రాగబలమునవ్రేళ్ళువేగనాడంగ
నాప్రాణసఖినెమ్మనమ్ముననిల్పి
వలపుసంపదలెశాశ్వతమనినమ్మి
వాయించినానొక్కప్రణయగీతమ్ము
విరహిణీజనమర్మమెరిగినమలయ
పవనుండునేబాడుప్రణయగీతంబు
నుద్యానవనసీమనొంటరిగాను
చల్లనివెన్నెలయెల్లెడగాయ
నెత్తమ్మిపూవులమెత్తనిపాన్పు
పయిమేనుజేరిచి, పరవశమొంది
కలలోనకాంతునికౌగిలిజొక్కి
కరగునాముద్దులకన్నెవీనులను
చల్లనినాపాటమెల్లగానూదు
ప్రణయకవయిత్రినాబాలయేయెఱుగు
నాభావగీతికినన్వయంబెల్ల
ప్రేమకోకిలనాదులేమయేమెచ్చు
నవ్యమాధుర్యమౌ నా గానరసము.”

కయ్యాల విందు

గయ్యాళి పెళ్లాన్ని
కట్టుకుంటేను
కయ్యాల కెన్నటికి
కరువు లేదండీ!

కయ్యాలతో మేడ కట్టించుతాము,
వియ్యాలవారి కది విడిది కిస్తాము!
కయ్యాలతో వంట
కాలు వండేము,
బంతులలో కవే
వడ్డించుతాము!
కయ్యాలె అల్లుడికి
కట్నమిస్తాము!
చుట్టపాతల కవే
చుట్టపెడతాము!

ఏన్నో, ఇంకా ఏన్నెన్నో......

-o0o-

Posted in February 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!