Menu Close
తెలుగు పద్య రత్నాలు 20
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం మరోసారి పోతన మహాభాగవతంలోనిదే. మహాభాగవతంలో ఈ పద్యానికున్నంత ప్రసస్థి, ప్రాముఖ్యం మరే పద్యానికీ లేదంతే అతిశయోక్తి కాదు. దానిక్కారణం కిందన చూద్దాం.

మ.
అలవైకుంఠపురంబులో నగరులో నామూల సౌధంబుదా
పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంకరమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై (గజేంద్ర మోక్షం 79)

గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. నాకింత బలం ఉంది కదా ఈ మొసలి నన్నేం చేయగలదు అనుకుంటూ – అంటే ‘నేను’ అనేది మనసులో ఉన్నంతకాలం – పోరాటం సాగించింది ఏనుగు. ఎన్నటికీ వదలడం లేదు ఈ పట్టు. అప్పుడు, మనసులో మెదిలిన భావన ఏమంటే – ఈ ప్రపంచంలో ఇలా కర్మలు జరగడానిక్కారణం మనమే, అయితే ఈ జననమరణ చట్రంలోంచి బయటకి రావడానికి మన బుద్ధీ, ఇంద్రియాలూ, మనస్సూ ఎందుకూ పనికి రావు. ఈ దరిద్రం తప్పించుకోవడానికి మరో సాధనం ఏదో ఉండి ఉండాలి. దాన్ని ధర్మం అనీ సత్యం అనీ, భగవంతుడనీ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆయన/ఆవిడ కృప ఉంటే తప్ప నేను అశక్తుణ్ణి. ఆ శక్తి, పరమేశ్వరుడు అనుకుంటే, ఆయనే వచ్చి ఏదో చేయాలి తప్ప నా వల్ల కాదు అని మనఃస్పూర్తిగా శరణు జొచ్చే సమయానికి ఏమౌతుంది అనేదానికి ఈ పద్యం సమాధానం చెప్తుంది మనకి.

ఆ వైకుంఠ పురంలో ఏదో మూల సౌధంలో ఎక్కడో ఉన్నాడు భగవంతుడు. ఎలా ఉన్నాడో చూసినవాళ్లకి తప్ప తెలియదు. ఆ వైకుంఠం చూసినవారు భగవంతుణ్ణి చూసారు కనక ఆయనలో ఐక్యమైపోయి మాటా పలుకూ చెప్పలేరు. ఏదైతే మనం వివరించగలమో అది మన బుధ్ధి మీద ఆధారపడుతుంది కదా? అయితే మన బుద్ధీ మనసు వివరించగలిగేది మన పరిధుల్లో ఉన్నది. అందువల్ల అది భగవంతుడు కాదు. భగవంతుడు అవ్యక్తుడు – ఇదీ అని ఎవరూ వ్యక్తపరచలేరు; అవ్యయుడు అంటే ఎన్ని కోట్ల ప్రాణుల్లో ఆయన అంశ ఉన్నా ఇంకా ఎప్పటికీ వ్యయం అయిపోని వాడు. పరిధులు అనేవి లేని వాడు. అటువంటి వాణ్ణి ఎవరైతే వివరించి ‘ఇదీ’ చెప్పగలరో వాళ్ళు అసలు భగవంతుణ్ణి చూసినవాళ్ళు కాదు అంటారు రామకృష్ణ పరమహంస. మరి ఇటువంటి వాడు ఉండే వైకుంఠం ఎలా ఉంటుంది అంటే అది చూడాలి తప్ప ‘ఇలా ఉంటుంది’ అని చెప్పడం అసంభవం కదా. సరే మరి ఇలా ఉంటుంది అని నోటితోనే చెప్పలేం కనక మరి చూడలేని దాన్ని ఎలా వివరించి రాయడం?

అందువల్లే పోతన ‘అలవైకుంఠపురంబులో నగరులో’ అని రాసాక తర్వాత ఏం రాయాలో తెలియక ఆ పద్యాన్ని అలా వదిలేసి బయటకి వెళ్ళాట్ట ఏదో పనిమీద. వెనక్కి వచ్చి చూసేసరికి ఈ పద్యం మొత్తం రాసేసి ఉంది. ‘అరే ఇది ఎవరు పూర్తి చేసారు,’ అని ఇంట్లో ఉన్న కూతుర్ని పిలిచి అడిగాడు. ‘నువ్వే కదా ఓ అరగంట ముందు వచ్చి రాసి వెళ్ళావు?’ అందిట ఆ అమ్మాయి. ‘అదేమిటి నేను బయటకి వెళ్ళి ఇప్పుడే కదా రావడం’ అని పోతన అనేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అందువల్లే ఈ పద్యం సాక్షాత్తూ మహావిష్ణువే పోతన రూపంలో వచ్చి రాసాడని దీనికంత ప్రాముఖ్యం. ఈ పద్యం రాయడానిక్కూడా కారణం ఆ వైకుంఠపురం లో మహావిష్ణువు లక్ష్మీదేవితో ఆ మూల సౌధంలో ఎలా ఉంటాడో ఆయన ఒక్కడు మాత్రమే వర్ణించగలడు కనక.

ఈ పద్యంలో చెప్పేదేమంటే, వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో ఎక్కడో మందారవనాల అవతల (కల్ప వృక్షాలతో నిండిన వనాలు), అమృతం వంటి నీరుండే కొలనులో దొరికే స్ఫటిక మణులవంటి నల్లకలువలతో ఉండే పాన్పుమీద (మందార, వనాంతర, అమృతసరః ప్రాంత, ఇందుకాంతోపలోత్పల, పర్యంక) లక్ష్మీదేవితో వినోదంగా ఉన్న (రమా వినోది), భగవంతుడు (ఆపన్న, ప్రసన్నుండు – ఆపన్నులకి, అంటే శరణుజొచ్చినవారికి స్వహస్తం ఇచ్చి ఆదుకునేవాడు, ప్రసన్నమైనవాడు), ఈ నాగేంద్రం ‘పాహి పాహి’ అనేసరికి ఒక్కసారి లేచాడు - గుయ్యాలించి సంరంభియై (మొర విని బయల్దేరాడు).

భగవంతుడో సాక్షి మనకర్మలకి. మనం ఏదో చేస్తే ఈ జన్మ వచ్చింది. చేసిన పనికి ఫలితం తప్పదు కనక అనుభవించి తీరాలి. ఈ జన్మలో అనుభవిస్తే సరే లేకపోతే ఆయుష్షు చాలకపోతే వచ్చే జన్మకి ఆ కర్మ తప్పదు. అయితే ఈ అనుభవించడంలో ‘చేసేదంతా నేనే’ అనే భావన ఉన్నంతవరకూ ఆయన అలా వినోదంగా చూస్తూ ఉంటాడు మనకేసి. ఎప్పుడైనే ‘ఇంక నేను ఏమీ చేయలేను, కావవే రక్షింపు భద్రాత్మకా’ అనే భావన రాగానే ఆయన బయల్దేరుతాడు. ఎలా బయల్దేరుతాడంటే – ‘గుయ్యాలించి సంరంభియై, సిరికిం జెప్పడు, శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు..’ అంటూ. మనం ఒక అడుగు ముందుకు వేస్తే మనని ఆదుకోవడానికి భగవంతుడు పది అడుగులు ముందుకు వస్తాడు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినదేమంటే మనం ఓ అడుగు వెనక్కి వేస్తే ఆయన పది అడుగులు వెనక్కి వెళతాడు. మరి మళ్ళీ వస్తాడా మరోసారి మనం ముందుకు వెళ్తే? తప్పకుండా. ఎందుకంటే కంచెర్ల గోపన్న చెప్పినట్టూ ఆయన – ‘దాశరధీ కరుణాపయోనిధీ’ కనక.

ఈ పద్య వృత్తం మత్తేభం; అంటే ఏనుగు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలుగులో ముద్రించిన మహాభాగవతం పుస్తకాలకి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సంపాదకులు. ఆయన ముందు మాట రాస్తూ ‘ఈ గజేంద్ర మోక్షం లో పోతన మత్తేభం మీద మత్తేభం ఎలా రాసాడో?’ అంటారు. అందుకే ఈ పోతన భాగవతం అనేది తెలుగువాడు చేసుకున్న అదృష్టం. ఈ పద్యాలు చిరకాలం మన నాలుకలమీద నిలవడానిక్కారణం కూడా పోతన చెప్పినదే – ‘పలికించెడువాడు రామ భద్రుడట…’  ఇప్పుడీ పద్యం, ఇది రాసిన విధం చూస్తే ‘పలికించెడు వాడు, అది పూర్తిగా రాసిపెట్టినవాడు రామభద్రుడట’ అని కూడా చెప్పుకోవాల్సిందే.

****సశేషం****

Posted in February 2023, వ్యాసాలు

2 Comments

  1. డా.పి. చిరంజీవి రావు

    అందుకే అంటారు గీయ చదివితే రాత మారిపోతుందని. పోతన గారి పద్యాలు ఆనిముత్యాలు. శర్మగారు మీ వ్యాస వివరణ అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్డు చిరకాలం తెలుగువారి నాలుకపై పోతన పద్యాలు ఆడుతుండాయి.

  2. శ్రీ (కరణం హనుమంత రావు )

    తెలుగు పద్య రత్నాలు శీర్షికన
    పోతన గారు వ్రాసిన మకరందం లాంటి
    ‘ అలవైకుంఠ పురములో ‘ పద్యానికి
    శ్రీ శర్మ గారు చాలా చక్కని విశ్లేషణ
    అందించారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!