Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

మరి రెండు రోజుల్లో, యాజులుగారి మేనకోడలు జానకి ఢిల్లీ వెళ్లిపోయింది. సందడి తగ్గి ఇల్లు చిన్నబోయింది. ఆ ఉదయం పడకకుర్చీలో పడుకుని పేపరు చదువుతున్న యాజులుగారు, ఏదో పని మీద అటుగా వచ్చిన మీనాక్షిని ఆపి, జీవన్ ని గురించి అడిగారు...

"అమ్మా, మీనాక్షీ! అబ్బాయి ఊరినుండి ఎప్పుడు వస్తాడు?"

"ఈ రాత్రికి వచ్చేస్తాడండి. రేపు ఉదయమే వచ్చి మీకు కనిపిస్తాడండి." అలా అందిగాని మీనాక్షి, అలాంటి ఉత్తమునితో అంతలా అబద్ధం చెప్పవలసివచ్చినందుకు ఖిన్నురాలయ్యింది. ఎంత ఆపద్ధర్మమైనా కూడా, మంచి మనసున్న మారాజుకి మాయమాటలు చెప్పి బేలుపుచ్చినందుకు బాధపడింది. ఆయన్ని మనసులోనే క్షమించమని వేడుకుంది.

ఇల్లు చేరగానే జీవన్ కి ఆమె చెప్పిన మొదటిమాట, "నీ అజ్ఞాతవాసం గడువు తీరిపోయింది, ఇక నువ్వు బయటికి స్వేఛ్ఛగా వెళ్లి రావచ్చు, తాతయ్యగారి చుట్టాలు వెళ్ళిపోయారు" అన్నది. ఆరాత్రి ఆ తల్లీకొడుకులు హాయిగా భోజనం చేసి, ఆదమరచి నిశ్చింతగా నిద్రపోయారు.

ఆ మరునాడు మధ్యాహ్నభోజనం చేస్తూండగా ఆ ప్రసక్తి వచ్చింది, "ఈ వేళ నువ్వు తాతయ్య గారింటికి వెళ్లి, పాఠం చెప్పి వచ్చావంటే, మళ్ళీ బండి గాటిన పడ్డట్లనిపించింది. మన పుణ్యం బాగుండి ఏ గొడవా లేకుండా ఆ పిల్ల వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందంటే, ప్రాణం తెరిపినిపడ్డట్లై, "హమ్మయ్య" అనిపిస్తోంది. ఔనుగాని, నీదగ్గర చదువుకుంటున్న పిల్లలు ఆ చదువు రంధిలోపడి, ఆ పిల్ల అన్న మాటల్ని వినలేదు కాబోలు, ఇంట్లో ఆసంగతి ఏమీ రాలేదు, బ్రతికిపోయాం!"

"అమ్మా! ఇంకా విషయం ఎత్తొద్దు, పూర్తిగా మరిచిపోదాం. నాకు ఏ దురూహలూ లేవు. అనవసరంగా అపార్ధం చేసుకుని నన్ను బాధపెట్టి, నువ్వూ బాధపడ్డావు! ఇక మళ్ళీ మళ్ళీ ఆ గాయాన్ని రేపవద్దు, నీకు పుణ్యముంటుంది" అన్నాడు జీవన్ ముఖాన గంటు పెట్టుకుని.

కాని మీనాక్షి వెంటనే ఊరుకోలేకపోయింది. "ఆ పిల్ల ఒట్టి తింగరిబుచ్చి! ఎవడు చేసుకుంటాడోగాని..."

"ఊరుకో అమ్మా! అది మనకెందుకు చెప్పు? ఎంత మాత్రం మనకు సంబంధించిన విషయాలు కావవి. ముందు మన సంగతి చూడు, నాకు ఆకలి దంచేస్తోంది" అంటూ కొంటెగా జీవన్ పొట్ట నిమురుకున్నాడు. కొడుకు చిలిపితనం చూసి తనూ హాయిగా నవ్వుకుంది మీనాక్షి.

*      *     *

జీవన్ మృత్యుముఖంనుండి దైవికంగా తప్పించుకుని తిరిగి వచ్చాక, అతడు మరింత అపురూపంగా కనిపిస్తున్నాడు మీనాక్షికి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, కునుకు తియ్యడం మాని, కొడుకుతో ఆ కబురూ ఈ కబురు చెప్పి మరీ తృప్తిపడుతోంది ఆ తల్లి. కొంచెం సేపు కొడుకుని తనివితీరేలా కళ్ళారా చూసుకున్న తరువాతనే ఆమె మిఠాయి షాపుకి వెడుతోంది.

ఒక రోజు మాటల మధ్యలో జీవన్ హఠాత్తుగా అడిగాడు, "ఒకవేళ నేను పుట్టి ఉండకపోతే, తాతయ్య నీకు మరో పెళ్ళి చేసి ఉండేవాడు కదమ్మా?"

ఆ ప్రశ్న విని మీనాక్షి తెల్లబోయింది. ఈవేళ జీవన్ ఇలా అడిగాడంటే, ఆనాడు తాను తిట్టిన తిట్లని వాడింకా మరచిపోలేకపోతున్నాడనే కదా అర్థం! వాటిని తలుచుకుని, వాడింకా లోలోన బాధపడుతూనే ఉన్నాడు కాబోలు! తను చాలా పెద్ద తప్పు చేసింది. అందుకనే ప్రాజ్నుడైన కొడుకుని ఒక స్నేహితుడిలా చూడాలంటారు! నాదే తప్పు అనుకుంది మీనాక్షి మనసులో.

పశ్చాత్తాపం మనసును దహిస్తూండగా ఆమె నెమ్మదిగా ఎలుగురాసిన కంఠంతో మాటాడింది...

"నాన్నా! నాకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక లేదురా. నా మనసు నిండా మీనాన్న జ్ఞాపకాలు పచ్చిగా అలాగే ఉన్నాయి. ఈ జన్మకవి చాలు. సాంప్రదాయబద్ధమైన కుటుంబాలలో పుట్టిన, మాతరం ఆడవాళ్ళెవ్వరూ, మరో మనువు గురించి ఆలోచించలేరు. ఉన్నా లేక పోయినా ఒకే భర్త! నా మనస్సు నిండా మీ నాన్న జ్ఞాపకాలు నింపుకుని, మీ నాన్న పోలికలతో ఉన్న నిన్ను కళ్ళారా చూసుకుంటూ, నా ఈ శేషజీవితాన్ని నేను సంతోషంగా గడిపెయ్యగలను. ఏదో తిక్కలో ఆ రోజున అనకూడని మాటలు అని, నిన్ను బాధపెట్టాను. నన్ను మన్నించరా కన్నా! ఈ పిచ్చి అమ్మను క్షమించి ఇక అవన్నీ మరిచిపో" అంది దీనంగా.

"అమ్మా! రకరకాల మూఢాచారాలు తరతరాలుగా మనుష్యులకు నరనరాలా జీర్ణించి ఉన్నాయి. కానీ మగవారికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి మరొక న్యాయం - అన్యాయం కాదా అమ్మా!"

"ఏమోబాబూ! నేనేం నీలా పెద్ద చదువులు చదవలేదు, ప్రతిదాన్నీ మధించి నిగ్గుతేల్చి చెప్పడం నా వల్లకాదు. పెద్దవాళ్ళు చూపిన దారినే వెడతాను నేను, నా వెర్రి నాకు ఆనందం. మళ్ళీ ఈ విషయం నా దగ్గర ఎప్పుడూ ఎత్తకు. నాకు నచ్చదు" అని కరాఖండీగా తేల్చి చెప్పేసింది మీనాక్షి.

కాని, తల్లి జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని నేటి పరిస్థితులకు నప్పేలా ఒక మంచి కథను రాయా లనుకున్నాడు జీవన్.

*      *      *

రోజులు సామాన్యంగా గడిచిపోతున్నాయి. తన తల్లి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని తను రాసిన కథను జీవన్ ఒక ప్రముఖ వారపత్రిక నిర్వహిస్తున్న కథల పోటీకి పంపించాడు. యాజులుగారి మనుమలకు పరీక్షలు ముగిశాయి. పిల్లలు పరీక్షలన్నీ బాగా రాశామని తాతయ్యకు ధైర్యంగా చెప్పగలిగారు. యాజులుగారు చాలా సంతోషించి, సెలవుల్లో కూడా వచ్చి, ప్రత్యేకం వాళ్లకి ఇంగ్లీషు, లెక్కలు నేర్పమని జీవన్ కి పురమాయించారు. సెలవు రోజుల్లో కూడా పని దొరికినందుకు జీవన్ చాలా సంతోషించాడు.

మరో రెండు కుటుంబాల వాళ్ళుకూడా, తమ పిల్లలు చదువులో చాలా వెనకబడి ఉన్నారనీ, సెలవుల్లో జీవన్ ని వచ్చి ప్రయివేటు చెప్పమని అడిగారు. అంతే కాదు, ఇంటర్లో లెక్కల్లో తప్పిన కుర్రాడొకడు, రోజూ లెక్కలు నేర్చుకోడానికి, కొద్ది రోజులనుండి జీవన్ దగ్గరకి వస్తున్నాడు. వీటన్నింటివల్ల రాబడి ఆశాజనకంగా ఉండడంతో, జీవన్ తల్లిని మిఠాయి కొట్టులో పని మానెయ్యమని మళ్ళీ అడిగాడు.

కాని, "నేను అప్పులు పూర్తిగా తీరీవరకూ ఆ పని మానను గాక మాన"నని ఖండితంగా చెప్పేసింది మీనాక్షి.

చూస్తుండగా చిల్లరమల్లర అప్పులు చాలావరకూ తీరిపోయాయి. కాని స్పెషల్ ఫీజుల్లాంటివి కట్టవలసి వచ్చినప్పుడు, యాజులుగారి దగ్గర అడపా - తడపా తీసుకున్న అప్పు మొత్తం ఐదువేలకు పైనే తేలింది. అదింకా తీర్చవలసి ఉంది.

*     *     *

కిరణ్ టెలిఫోన్ బూతు తెరవడానికి పెట్టిన అప్లికేషన్ "వికలాంగుల కోటా" లో తొందరగానే శాంక్షన్ అయ్యింది. కిరణ్ తండ్రి, పంచాంగం చూసి మంచిరోజు ఏ రోజో చెప్పి, ఆ రోజే విఘ్నేశ్వర పూజ, ఇష్టదేవతారాధన తనే దగ్గరుండి కొడుకుచేత చేయించి బూత్ తెరిపించారు. కిరణ్ కి కాలేజి మిత్రులైన జీవన్, రాఘవ వగైరాలందరూ వచ్చి మిత్రునికి శుభాకాంక్షలు చెప్పారు. ఆ రోజు ఫోను చెయ్యడానికి వచ్చినవారికి, ఒక్కొక్కరికీ ఒక్కొక్క గులాబీ, ఒక్కో లడ్డూ ఇచ్చి సత్కరించారు. పిల్లలకి చాకొలెట్లు పంచిపెట్టి యధాశక్తి పండుగ చేశారు.

ఆ రోజంతా కిరణ్ వెంట ఉండి, అన్నీ సవ్యంగా జరిగేలా చూశాడు జీవన్. ఆ శుభసందర్భంలో కిరణ్ కి కొత్తబట్టలు, ఒక పెన్ను బహూకరించి జీవన్ తన హర్షాన్ని తెలియజేశాడు.

*      *      *

ఆ రోజు జీవన్ ప్రయివేటు చెప్పడానికి వచ్చేసరికి, యాజులుగారు తీరుబడిగా వాలుకుర్చీలో కూర్చుని, పంచాంగం తిరగేస్తూ కనిపించారు. ఎప్పటిలాగే అతడు పిల్లలకి పాఠాలు చెప్పడానికి కూర్చున్నాడు. అంతలోనే "జీవా" అన్నపిలుపు వినిపించి తలెత్తి చూశాడు జీవన్.

యాజులుగారు పంచాంగం మూసి పక్కనపెట్టి, జీవన్ ని ఉద్దేశించి, "చదువయ్యాక ఒకసారి ఇటొచ్చి కనిపించు, నీతో మాటాడే పనుంది" అన్నారు.

పిల్లలకి చదువు చెప్పడం అయ్యాక, వాళ్ళకు సెలవిచ్చి పంపేసి, యాజులుగారి దగ్గరకు వచ్చాడు జీవన్. అతన్ని చూడగానే లేచి, కుర్చీలో నిటారుగా సద్దుకుని కూర్చున్నారు యాజులుగారు...

"జీవా! చిన్నపిల్లాడిగా ఉన్నప్పడినుండీ నిన్ను నే నెరుగుదును. ఇంతవరకూ నాకు నీ అంత నమ్మకస్థు లెవరూ కనిపించలేదు. నీవల్ల కావలసిన పని ఒకటి ఉంది, చేసిపెడతావా?"

"అదేమిటి తాతయ్యా! నాకంత ఇదిగా చెప్పాలా! "యువర్ విష్ ఇజ్ మై కమాండ్", తాతయ్యా !" నేనేం చెయ్యాలో ఒక్కసారి చెప్పండి చాలు, నేను చేసి చూపిస్తా!"

"భేష్! నువ్వు నాకు నచ్చావురా అబ్బాయ్! ఇటు చూడు, రేపుకాక ఎల్లుండే మంచిరోజు. ఆ రోజున బయలుదేరి నువ్వు మా ఊరు - అంటే, మల్లెవాడకు వెళ్ళి రావాల్సి ఉంది. నేను నీకొక ఉత్తరం ఇస్తాను, అది తీసుకెళ్ళి ఆ ఊరిలో ఉన్న నా మిత్రుడు కరణం కామేశానికి ఇస్తివా, ఆ తరవాత పనంతా అతడే నడిపిస్తాడు. పొలం బేరం కుదిరి, డబ్బు చేతికి వచ్చాక దాన్ని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. రొక్ఖం పెద్దమొత్తంలో ఉంటుంది మరి, తేగలవా?"

"తప్పకుండా తెచ్చి మీకు అప్పగిస్తా తాతయ్యా! మీరొక సూట్కేసు ఇవ్వండి చాలు. మీ మిత్రుడు ఏమిస్తే అది, దాంట్లో ఉంచి, భద్రంగా తీసుకువచ్చి మీకు జాగ్రత్తగా అప్పగించే పూచీ నాది, సరా!"

"అసాధ్యుడవురా జీవా! నువ్వు ఎంతకైనా తగినవాడివే ఔదువు! ఆ నమ్మకం నాకుందిలే" అంటూ, ఒక చేత్తో క్రాపింగ్ చాటున దాచుకున్న పిలకను సవిరిస్తూ, బొజ్జ అదిరేలా నవ్వడం మొదలుపెట్టారు యాజులుగారు.

తనన్న మాటలో అంతగా నవ్వొచ్చేందుకు ఏముందో తెలియక జీవన్ బిత్తరపోయాడు. అది చూసి, బలవంతంగా నవ్వు ఆపుకుని, తన నవ్వుకి కారణం ఏమిటో చెప్పసాగారు యాజులుగారు. "నువ్వు అసాధ్యుడవని ఎందుకన్నానో తెలుసా? నా మిత్రు డిచ్చినవన్నీ సూట్కేసులో సద్ది తెస్తానన్నావు చూడు - అందుకే నాకు నవ్వొచ్చింది. మా కామేశం నా మీద ప్రేమతో, ఒక పనసకాయో, ఒక గుమ్మడిపండో లేక ఒక చక్కెరకేళీ అరటిపళ్ళ గెలో ఇస్తే ... ఒక్కొక్కప్పుడు ఆ మూడూ ఒకేసారి ఇచ్చినా ఇవ్వగలడు, తెలుసా? నువ్వు అవన్నీ కలిపి, సూట్కేసులో సద్దాలని చూస్తున్నట్లు నా కళ్ళకు కట్టడంతో నవ్వు ఆగింది కాదు" అంటూ మళ్ళీ నవ్వసాగారు ఆయన.

"బలేవాడివి తాతయ్యా" అంటూ ఈ సారి తనుకూడా నవ్వడం మొదలుపెట్టాడు జీవన్. కొంతసేపు అలా నవ్వి, అన్నాడు, "డబ్బు మాత్రమే కాదు, వస్తువులు కూడా విలువైనవే కదా తాతయ్యా! కాని వేటి స్థానం వాటిది! ఎక్కడుంచదగినవాటిని అక్కడ ఉంచి పట్టుకొస్తాను, సరా! మీరు తమాషా చేసి, నన్ను ఆటపట్టించాలని చూస్తున్నారు, అది నాకు తెలుసు" అన్నాడు నవ్వుతూ.

"సరేరా, అబ్బాయీ! తమాషాలు చాలు. నువ్వింక ప్రయాణానికి తయారైపో... నేనొక సూటుకేసు ఇస్తా.  అవసరాన్నిబట్టి ఒకటి రెండు రోజులు ఆగాల్సి వచ్చినా, లోటు ఉండకుండా కావలసినవన్నీ సద్దుకో. వారం ఆగాల్సివచ్చినా ఆగి, పని పూర్తి చేసుకుని మరీ రావాలి సుమీ! అక్కడున్నన్నినాళ్ళూ నీ కేలోటూ రాకుండా, మా కామేశం కుటుంబం చూసుకుంటుంది. నీకు ఏ ఇబ్బందీ ఉండదు" అన్నారు యాజులుగారు.

"సరే తాతయ్యా! అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక ఉండనా మరి..." యాజులుగారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు జీవన్.

యాజులుగారు పెట్టిన ముహూర్తానికే, చేతిలో విఐపి సూట్కేసు పట్టుకుని, మల్లెవాడ వెళ్ళే సన్నాహంలో రైలు స్టేషన్ చేరుకున్నాడు జీవన్. ముందుగానే టిక్కెట్ రిజర్వేషన్ అయ్యిపోడంవల్ల తిన్నగా ప్లాట్ఫారం మీదికి వెళ్ళిపోయాడు. దారిలో కాలక్షేపంగా చదువుకునేందుకు ఒక వారపత్రిక కొనుక్కుని మరీ, తన కంపార్టుమెంటు చూసుకుని ఎక్కేశాడు. సకాలంలో బయలుదేరింది రైలుబండి. కింది బెర్తు కావడంతో కిటికీ వార సీటులో కూర్చుని, తను కొన్న పుస్తకం తెరిచాడు జీవన్. కాని పుస్తకం మీద దృష్టి నిలవలేదు. తోటల్నీ,దొడ్లనీ తొక్కుకుంటూ; వాగుల్నీ, వంకల్నీ దాటుకుంటూ, కొండల్నీ, గుట్టల్నీ తప్పుకుంటూ తనదైన రెయిల్ ట్రాక్ మీదుగా దూసుకుపోతోంది ఆ రైలుబండి. "ప్రకృతి” అనబడే చిత్రకారుడు, కాలమనే కుంచ పట్టుకుని గీసిన, దారి పొడుగునా కనువిందుగా కనిపించే సుందరతర దృశ్యాలను చూసి ఆనందించకుండా ఈ చదువు పిచ్చేమిటి నాకు - అన్న ఆలోచన వచ్చింది జీవన్ కి. వెంటనే పుస్తకం మూసి సంచీలో పెట్టేసి, కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. ఎన్నో ఊళ్ళూ దాటుకుంటూ, ఆగవలసిన స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆగి, జనాన్ని దింపుతూ, ఎక్కించుకుంటూ గమ్యం వైపుగా సాగిపోతోంది ఆ ఎక్సుప్రెస్  రైలుబండి.

"ఫాస్టర్ దేన్ ఫెయిరీస్, ఫాస్టర్ దేన్ విచ్చెస్, బ్రిడ్జస్ అండ్ హౌసెస్, హెడ్జెస్ అండ్ డిచ్చెస్" ఇలా సాగిన, రైలు బండి నడకకు రిథిం సరిపోయేలా, రైలుబండి మీద, రాబర్టు లూయీస్ స్టీవెన్సన్ చేత (ఇంగిలీషులో) రాయబడిన పోయం, చిన్నప్పుడెప్పుడో చదివినది, జ్ఞాపకం వచ్చింది జీవన్ కి. సరదాగా లయబద్ధంగా దానిని చదువుతూ కొంత పొద్దును తేలికగా గడిపేశాడు. రైలు బండి నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దానికి అనుగుణంగా ఉండే రిథింతో రాయబడిన చక్కని ఇంగ్లీషు పోయమ్ అది!

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలొంచి కనిపించే, క్షణ క్షణానికీ మారిపోతున్న దృశ్యాలను మ్  చూస్తుంటే పొద్దు తెలియకుండానే గడిచిపోతుంది ఎవరికైనా. చీకటి పడ్డాక, వెన్నెల రాగానే వేరే వేరే అందాలతో వింత వింతలుగా కనిపించాయి జీవనుకి వేగంగా కదిలిపోతున్న ప్రకృతి దృశ్యాలు.

ప్రయాణీకులు తొమ్మిదయ్యాక, తెచ్చుకున్నదేదో తిని, నెమ్మదిగా బెర్తులు పరుచుకుని ఒకరొకరు పడుకోడం మొదలుపెట్టారు. అందరితో పాటుగా, తల్లి సద్ది ఇచ్చిన భోజనం తిని, రిజర్వు చేసుకున్న బెర్తు మీద పడుకుని నిద్రపోయాడు జీవన్ కూడా.

తెల్లవారి, జీవన్ లేచి చూసేసరికి, పీఠభూమిని విడిచి రైలుబండి మైదానంలో ప్రవేసించిన దానికి గుర్తుగా, ఎటు చూసినా పచ్చిక బయళ్ళు, పంటపొలాలు, పళ్ళతోటలూ కనిపించసాగాయి. పుట్టి బుద్ధి తెలిశాక అంత సంవృద్ధిగల పచ్చదనం చూసి ఎరుగని జీవన్, రైలు కిటికీలోంచి అటే చూస్తూ సర్వం మరిచిపోయాడు.

పరుగెత్తే రైలుని చూసి కేరింతలు కొట్టే కుర్రాళ్ళు, గడ్డికోస్తూ కబుర్లు చెప్పుకునే పల్లె పడుచులు, పొలంలో పనిచేసుకుంటూ పదమందుకునే పాలేళ్ళు, గోకుల కృష్ణుణ్ణి తలపించేలా అలవోకగా వేణువు నూదుతూ, పాడి పశువుల్ని మళ్ళేసే గోపాలకులు - ఇలా రకరకాలైన మనోహర దృశ్యాలు, ఉదయారుణ శోభను రెండింతలుగా చేసేవి ఎన్నెన్నో అడుగడుగునా కనిపించసాగాయి. కిటికీలోంచి ఆ సజీవ దృశ్యాలు చూడడమన్నది భావుకుడైన జీవన్ కి ఎంతో తృప్తి నిచ్చింది.

ఎన్నెన్నో ఊళ్లను దాటుకుంటూ ముందుకు సాగిపోతోoది రైలు బండి. ఎటు చూసినా ఒడ్డు లొరసుకునే నీటితో నిండి ప్రవహించే పంటకాలువలు, అడప తడప దర్శనమిచ్చే, నిండా పూలతో ఉన్న కలువ, తామర కొలనులు, చిరుగాలికి కుడా వయ్యారంగా తలలూపే వరిపొలాలు చూస్తూ సాగే ఆ ప్రయాణం జీవన్ కి చాలా ఆనందాన్నిచ్చింది. పొద్దు ఎలా గడిచిందో తెలియకుండానే గడిచిపోయింది. గమ్యానికి చేరుకుంది ఆ  పొగబండి. అది నరసాపురం స్టేషన్ లో ఆగగానే బండిలోవున్నజనం మొత్తం అక్కడ దిగిపోయారు. బండి ఖాళీ అయిపోయింది.

నరసాపురం ఒక "టెర్మినల్ పోయింట్" కావడంతో అక్కడకు చేరుకున్న ప్రతి రైలుబండి అక్కడ నుండే తిరిగి వెనక్కి వెళ్ళి పోతుంది. అందరితోపాటు జీవన్ కూడా దిగి, ఆటోమీద నేరుగా హోటల్ కి వెళ్ళిపోయాడు. యాజులుగారు ముందే ఆ ప్రయాణపు తీరు తెన్నులన్నీ చెప్పి ఉంచడంతో హోటల్లో ఒక పూటకు రూం బుక్ చేసుకుని, ఆ రూం లో స్నానం, పానం వగైరాలన్నీ పూర్తిచేసుకుని, కొంతసేపు విశ్రాంతి తీసుకుని, మూడయ్యేసరికి బస్ స్టేషన్ కి చేరుకున్నాడు జీవన్. చించినాడ వద్ద వశిష్ట గోదావరీ పాయపైన ఇటీవలే కట్టబడిన వంతెనమీదుగా కోనసీమలో మల్లెవాడ వైపుగా ప్రయాణమై వెళ్ళే బస్సుని అందుకున్నాడు జీవన్. గోదావరీ పాయలైన వశిష్ట మొదలుకుని వైనతేయం వరకూ ప్రయాణీకులను తీసుకుని, వెళుతూ, వస్తూ తిరుగుతూ ఉండే బస్సుది.

రాజోలు, అమలాపురం, కొత్తపేట తాలూకాలు మూడూ కలిపితే కోనసీమ ఔతుంది. ధవళేశ్వరంవద్ద అఖండ గౌతమీనది తూరుపు కనుమల్ని విడిచి మైదానాన్ని ప్రవేశించింది. ఆపై ఐదు పాయలుగా విడిపోయి, విడివిడిగా ప్రవహించి వెళ్ళి తూరుపు సముద్రం (బంగాళాఖాతం)లో కలియడంతో, ఈ ఐదు గోదావరి  పాయలకు, సముద్రానికి మధ్యలో ఉన్న త్రికోణాకారపు భూభాగాలు ఈ మూడు తాలుకాలుగా ఏర్పడ్డాయి. ఇవి చుట్టూ నీటిచే ఆవరిoచబడివున్న త్రికోణాకారపు భూమి కావడంతో ఈ ప్రదేశానికి ఒకప్పుడు "కోణసీమ" అనే అన్వర్ధనామం ఏర్పడిందిట. దగ్గరలోనే ఉన్న సముద్రపు ఆటుపోటులవల్ల చాలా దూరం వరకూ గోదావరి  పాయలలోని నీరు ఉప్పగా ఉండడమే కాకుండా, భూగర్భజలాలు కూడా ఉప్పగానో, చప్పగానో ఉండేవిట. దానివల్ల అప్పట్లో కోణసీమ వాసులు తాగునీటికి, సాగునీటికి కూడా తెగ ఇబ్బంది పడేవారుట! అక్కడ కొబ్బరి తోటలు విస్తారంగా ఉండేవి గాని, వరి పండే పొలాలు లేవు. కేవలం వర్షాధారపు పంటలు మాత్రమే పండడంతో జనం తినే తిండికి, తాగే నీటికీ కూడా ఆ రోజుల్లో ఇబ్బంది పడేవారుట!

అవి బ్రిటిష్ వాళ్ళు భారతావనిని పాలించే రోజులు. గోదావరి జిల్లాకి సర్వేయర్ గా వచ్చిన సర్ ఆర్ధర్ కాటన్ అనే ఆంగ్లేయుడు కోణసీమ వాసుల దుస్థితిని చుశాడు. అక్కడ భూసారాన్నిగమనించాడు. సుక్షేత్రమైన ఒండలి భూమి ఉన్నా, నీరులేక అక్కడివారు సరైన పంటలు పండించలేక ఇబ్బందులు పడుతూ  ఉన్నారు - అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇర్రిగేషన్ ఇంజనీర్ ఐన ఆయనకి ఒక అద్భుతమైన ఆలోచనవచ్చింది. ధవళేశ్వరం దగ్గర గోదావరీ నదికి ఆనకట్ట కట్టి, కోనసీమకు కాలవలద్వారా నీరు అందించినట్లయితే అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకీ కూడా బ్రహ్మాండమైన కిట్టుబాటు ఉంటుందని అర్థం చేసుకున్నాడు. . వెంటనే అతడు కార్యోన్ముఖుడయ్యాడు. కాలువలవల్ల భూమి సశ్యశ్యామలంగా మారుతుందనీ, మళ్ళీ ఆ కాలువలవల్లే సరుకు రవాణా కూడా జరుగుతుందనీ, పొలాలపై వచ్చే పన్నులు, ఎగుమతి, దిగుమతుల ద్వారా వచ్చే వ్యాపార సుంకం సర్కారుకి చేరడం వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పెరుగుతుందనీ చెప్పి, అప్పటి ప్రభుత్వాన్ని ఎంతో కష్టం మీద ఒప్పించగలిగాడు.

ఆ మహానుభావుని కృషి ఫలంగా, గోదావరీ నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట వెలసింది. కోణసీమ నంతటినీ పడుగు పేకలుగా అల్లుకున్న పంటకాలువలు పొలాలకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా సంవృద్ధిగా - నారికేళాంబువు ల్లాంటి మధురాతి మధురమైన అఖండ గౌతమీ జలాలను అందుబాటులోకి తెచ్చాయి. కొండల్లాంటి కోణసీమ వాసుల ఇక్కట్లు మంచు పెరల్లా ఇట్టే తొలగిపోయాయి. కోణసీమ కాస్తా చూస్తూండగా కోనసీమగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్ కే నందన వనమయ్యింది. గవర్నమెంటుకి కూడా కాలవల ద్వారా సాగుతున్న వాణిజ్యం వల్ల, పంటపొలాల రెవిన్యువల్ల విపరీతంగా రాబడి పెరిగింది. కాటన్ మహాశయుని అంతా ఘనంగా మెచ్చుకున్నారు. కోనసీమ వాసులైతే కృతజ్ఞతా భారంతో ఇప్పటికీ ప్రేమగా తలచుకుంటారు సర్ ఆర్ధర్ కాటన్ ని.

ఆయన కేవలం తన ఉద్యోగధర్మాన్ని పాటించినప్పటికీ దానివల్ల లభ్ధి పొందిన కోనసీమ వాసులు అప్పట్లో తమ కృతజ్ఞతను విధ విధాలుగా వ్యక్తం చేశారుట! సామాన్య గృహస్థులు కాటన్ గారి పేరుమీద - ఆయన, ఆయనగారి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో తులతూగాలని కోరి గుడిలో దైవానికి పూజలు చేయిస్తే, వేదపండితులు తమ దైనందిన గాయత్రీ జపఫలాన్ని మొత్తంగా కాటన్ పేరుమీద ధారపోసీవారుట! ఇప్పటికీ, ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ప్రతిష్టించబడిన - గుఱ్ఱం మీద సవారీ చేస్తున్నట్లుగా ఉన్న సర్. ఆర్థర్ కాటన్ విగ్రహానికి, ఈ కథ తెలిసివున్న కోనసీమ వాసి ఏ ఒక్కడూ కూడా ఆ దారిన వెడుతూన్నప్పుడు కృతజ్ఞతతో చేతులు జోడించి మనసారా నమ్రతతో నమస్కరించకుండా వెళ్ళడు. దివినుండి భువికి సురగంగను తీసుకువచ్చిన అపర భగీరధుడిగా తలుచుకుంటారు ఆయనను కోనసీమ వాసులు. పదిమందికి ప్రయోజనకారిగా ఉన్న ప్రతివ్యక్తిని దైవంగా భావించి పూజించే మన సాంప్రదాయంలో - ఆయనని దైవంగా భావించేవారున్నారన్నా వింతేమీలేదు.

****సశేషం****

Posted in February 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!