Menu Close
తెలుగే మాట్లాడుదాం (కథ)
-- రాయవరపు సరస్వతి --

"అమ్మా బాగున్నావా?" అంది రవళి తల్లిని హత్తుకుంటూ.

"బాగున్నానమ్మా పాప, నువ్వే వచ్చారు అల్లుడు గారు రాలేదా?" అంది అన్నపూర్ణమ్మ

"నాలుగు రోజులు పోయాక నన్నుతీసుకెళ్లడానికి వస్తానన్నారు" అంది రవళి ముసి ముసి నవ్వులు రివ్వుతూ.

"అమ్మమ్మా నాకు తమ్ముడు పుడతాడట" అంది మూడేళ్ల హాసిని ఆమె కాళ్ళను చుట్టుకుపోతూ.

అన్నపూర్ణమ్మ కుతురువైపు ఆనందంగా చూస్తూ "ఇది నిజమా?" అంది.

"అవునమ్మా నాకు మూడో నెల వాంతులు కావటంతో ఏమీ తినాలనిపించక ఇక్కడ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందామని వచ్చాను" అంది రవళి.

"మంచిపని చేసావమ్మా ఈ సంగతి తెలిస్తే నేనే వచ్చి తీసుకొచ్చేదాన్ని. సరేలే, నువ్వు కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండు" అంది అన్నపూర్ణమ్మ.

"అమ్మా! రవళి ఎప్పుడొచ్చావు తల్లీ?" అన్నారు మాధవరావు గారు మనవరాల్ని ఎత్తుకుంటూ.

"ఇప్పుడేవచ్చాను నాన్నగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది?" తండ్రిని కుశల ప్రశ్నలడిగింది రవళి.

"ఇప్పటికి బాగానే ఉన్నానమ్మా ఏదో పెద్దవయసు వచ్చేసింది కదా. షుగర్, బి.పి.లు ఇప్పుడు కామనై పోయాయి వాటికి మందులు వాడుతున్నాను" అన్నారు మాధవరావు గారు.

"మీ నాన్నగారు తెలుగు పండిట్ గా రిటైర్మెంట్ అయ్యారన్న మాటే గానీ ఇప్పటికీ పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మానటం లేదమ్మా ఒకసారి గుండె పోటువచ్చిన మనిషి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా ఈయనేమో నా మాటలను పట్టించుకోరు" అంది అన్నపూర్ణమ్మ కూతురికి కంప్లైంట్ చేస్తూన్నట్లు.

"దాని ముఖం మీ అమ్మకేమి తెలియదమ్మా అమాయకురాలు. మన వీధిలో వాళ్ళు నాలుగవ తరగతి ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పించమని ప్రాధేయపడటంతో ఖాళీగా ఉంటే నాకూ ఏమీ తోచదని సాయంత్రం ఓ గంట సేపు చెప్పడానికి ఒప్పుకున్నాను. దానికి మీ అమ్మఇలా రాద్ధాంతం చేస్తోంది" అన్నారు మాధవరావు గారు.

"సరే నాన్నా మీరు గట్టిగా మాట్లాడకండి కాస్త నెమ్మదిగా చెప్పండి" ఉచిత సలహా ఇచ్చింది రవళి.

"అలాగేనమ్మా నా జాగ్రత్తలో నేనుంటాను సరేనా!"

"మీరు రెండోసారి తాతయ్య కాబోతున్నారు" అంది అన్నపూర్ణమ్మ భర్తతో.

"నిజమా! చాలాసంతోషమమ్మా నువ్వు మాకు ఒక్కగానొక్క సంతానానివి, నీ కడుపున మరో కాయ కాస్తే ఇల్లు సందడిగా ఉంటుంది" అన్నారు సంతోషంగా మాధవరావు గారు.

"తాతయ్యా నాకు తమ్ముడు పుడతాడు" అంది రమ్య తాతయ్య మెడలో చేతులు చుట్టి హత్తుకుపోతూ.

"అలాగా మరి తమ్ముడ్ని నాకిస్తావా పెంచుకుంటాను"

"ఊహూ నేనెవ్వరికీ ఇవ్వను. ఎంచక్కా తమ్ముడు, నేనూ ఆడుకుంటాము"

"నాకు అన్యాయం చేసి నువ్వేం బావుకుంటావు?" ప్రక్క వాటాలో నుంచి అరుపులు వినిపించడంతో బయటకు తలవంచి చూస్తున్న రవళి,

"ఎవరమ్మా ఆ అరుపులు?" అంది.

"మన ప్రక్కింటిలో ఈ మధ్యే అద్దెకు దిగారులే. అతని భార్య కమలమ్మకు వరసగా ముగ్గురూ ఆడపిల్లలు పుట్టడంతో అతను ఆమెకు చెప్పాపెట్టకుండా కొడుకు కోసం సంవత్సరం క్రితం రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిన ఆమె అలా కేకలు వేస్తోంది" చెప్పింది అన్నపూర్ణమ్మ.

"అతనికి అదేం రోగమట. కొడుకు పుడితే ఆమె కననందా? అయినా అతన్ని కన్నదీ ఒక ఆడదే కదా మళ్లీ ఇప్పుడు మరో ఆడదాన్ని ఆశ్రయించాడంటున్నావు మగాడి బ్రతుకంతా ఆడదాని చుట్టూ తిరగాల్సిందే కదా అవనికి ఆడదే ఆధారమని తెలుసుకోలేని మూర్ఖుడు, అయినా రెండో పెళ్ళానికి మాత్రం మగపిల్లాడు పుడతాడన్న గ్యారంటీ ఏమిటి?" పళ్ళు పట పటా కొరికింది రవళి.

"పుడితే కాదు. ఆల్ రెడీగా ఈ మధ్యనే ఆమె అమ్మాయిని కనేసింది కూడా" అంది అన్నపూర్ణమ్మ.

"మంచి పనైంది వెధవకి మరిప్పుడు దాన్నీ వదిలేస్తాడా?" అంది రవళి ఏవగింపుగా.

"ఆ రెండో పెళ్ళాం పరమ గయ్యాళిదట, ఇతనే అడుగులకు మడుగులొత్తుతున్నాడట, ఆమె కాలిక్రింద చెప్పులా తయ్యారయ్యాడట" అంది అన్నపూర్ణమ్మ.

"తిక్క కుదిరింది వెధవకి ఆడదంటే ఆటబొమ్మ కాదని తెలియజెప్పిందన్నమాట" పడి పడి నవ్వింది రవళి.

"పోనీయమ్మా వాళ్ళ గోల మనకెందుకు?" అన్నారు మాధవరావు గారు లోపలికి వస్తూ.

రవళికి నాలుగు రోజులు నాలుగుక్షణాల్లా గడిచిపోయాయి. ఆ సాయంత్రం ఇంటికొచ్చిన ట్యూషన్ పిల్లలు రవళి తో,

"అక్కా ఈ రోజు నువ్వు మాకు తెలుగు క్లాసు చెప్పాలి" అని పట్టుబట్టడంతో మాధవరావు గారు కూతుర్ని క్లాస్ చెప్పామని ఆయన దేవాలయానికి వెళ్లిపోయారు.

"సరే పిల్లలూ మీరంతా తెలుగు ఏ ఉద్దేశ్యంతో నేర్చుకుంటున్నారు?" అంది రవళి.

"మాకైతే ఆంగ్లభాషే బాగుంటుందక్కా. మా అమ్మా నాన్నలు ఏమన్నారంటే మనం భారతీయులం మన మాతృభాష తెలుగు కాబట్టీ తెలుగుభాషను నేర్చుకోవాలని మమ్మల్ని ఇక్కడకు పంపించారు" అన్నారు నలుగురూ ఒకేసారి.

"శభాష్ బాగా చెప్పారు. అమ్మానాన్నలకు మాతృభాష విలువ తెలుసు కాబట్టి మీరూ ఆ విలువ తెలుసుకోవాలని నేర్చుకోమన్నారు, ఏప్రాంతంలో వారైనా వారి వారి మాతృభాషలను ఎవరికి వారు కాపాడుకోవలసిన బాధ్యత తప్పక ఉండి తీరాలి, మనం ఏదూరప్రాంతలకో వెళ్ళినపుడు ట్రైన్ ఎక్కామనుకోండి, అందులో ఉన్న వారు వాళ్ళ వాళ్ళ భాషలతోమాట్లాడుతుంటారు" అంది రవళి.

"అవునక్కా ఆ మధ్య మేము తిరుపతి వెళ్ళినపుడు ట్రైన్ ఎక్కాము. అందులో చాలామంది హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నారు" అంది లక్ష్మి.

"అవును వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాతృభాషను మర్చిపోకుండా సిగ్గుపడకుండా మాట్లాడుతుంటారు కానీ మన తెలుగు వారు మాత్రం మన భాషను వెనక్కినెట్టి ఆంగ్లంలో మాట్లాడుతుంటారు, మన మాతృభాషను మనమే కించపర్చుకుంటున్నాము, మన ఇళ్లల్లో కూడా అమ్మానాన్నలను మమ్మీ డాడీలని పిలుస్తుంటారు చాలామంది. అది తప్పే కదా పరాయి భాషను గౌరవిస్తూ మన భాషను మనం కించపర్చడం ఎంతవరకు సబబు?" అంది రవళి.

"అవునక్కా మాకు తెలుగు భాష రాకపోవడం వలన మన బస్సుల మీద ఉన్న ఊరు పేర్లను కూడా మేము చదవలేక పోతున్నాము" అంది సునంద నాలుగోతరగతి విద్యార్థి.

"అక్కా మన ఈనాడు పేపర్లో బుజ్జీ శీర్షికలో మా చిన్న పిల్లల కథలు వస్తుంటాయి కదా. వాటిని మా డాడీ చదవమంటే నేను చదవలేక పోతున్నాను" అన్నాడు నాలుగోతరగతి విద్యార్థి కిరణ్.

"చూసావా అలవాటు మీద ఇప్పుడు కూడా మీ నాన్నను డాడీ అనే పిలుస్తున్నావు. ముందు నువ్వా పిలుపును మార్చుకో. అక్కడి నుంచే తెలుగుభాషను మొదలుపెట్టు, నేను మీకోసం మరో పదిరోజులుంటాను, నేనే మీకు స్వయంగా రాయడం, పలకడం నేర్పిస్తాను" అంది రవళి.

"అలాగే అక్కా తప్పకుండా మేము నేర్చుకుంటాము, మన మాతృభాష విలువ మేమూ తెలుసుకుంటాము" అన్నారు నలుగురూ ఒకేసారి.

రవళి అనుకున్నట్లుగానే పది రోజుల్లో వాళ్ళందరికీ తెలుగు భాషను రాయడం, ధారాళంగా మాట్లాడటం నేర్పించడంతో వాళ్లంతా చక్కగా నేర్చుకున్నారు.

"తెలుగు వారందరం తెలుగే మాట్లాడుదాం, మన మాతృభాషను మనం కాపాడుకుందాం, అని పిల్లలందరూ ఎలుగెత్తి చాటుతుంటే వినసొంపుగా వీనులవిందుగా ఉండటంతో ఆమె పరవశించి పోతూ తన గర్భం లో శిశువు కూడా తమ మాతృభాషను నేర్చుకుంటున్నట్లు ఫీలయింది రవళి"

********

Posted in February 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!