ఇప్పు డైననాలోచించు యెవరు నేను
భార్య భర్త పిల్ల లెవరు భవము జూడ
నీదు సంసార సాగర బంధమందు
తత్వమొకటి దాగున్నది తరచి జూడు
సజ్జనుల సహవాసపు సంగమముల
తొలగి పోవు మోహమ్ములు తొంగి జూడు
మనసు మూలల వెలుగొందు మానవాత్మ
జీవుడయిన దేవు డయిన నీవె గదర
వయసు మళ్ళిన యెక్కడ పడతి హేల
ఎక్కడుండు నీరెండిన యే టి జాడ
ధనము లేకున్న పరివార దర్ప మేది
బ్రహ్మము తెలుసు కొన్నచో బ్రమలు తొలగు
సంపద వయసు నీ పరి జనుల హే ల
క్షణము లోన గతించును కాలమందు
జగము మిథ్య, శాశ్విత మేది సత్య మేది
జ్ఞానివై పరబ్రహ్మము జాడ వెదుకు
రాత్రి పగలు ఋతువు లెల్ల ధాత్రి వెంట
పరుగిడుచునుండు కాల ప్రవాహ మందు
ఘడియ ఘడియ కు ఆయువు కరుగు చుండె
యేల !ఆశా పిచాచపు గోల నీకు
తిరుగు చున్నావు యజ్ఞాన తిమిర మందు
మేను మరచి,నేను వదలి లోన జూడు
తీర్చియున్నది అద్వైత తేజ మొకటి
జ్ఞానమే సత్యమగు జూడ జగము మిథ్య
మూఢ మతి తెలుసుకొనుము ముక్తి పధము
..........సర్వేజనా సుఖినోభవంతు....