"ఇవాళో రేపో నొప్పులు వచ్చేట్టు వుంది నా పరిస్థితి. సెలవు పొడిగించకూడదూ?" బ్రతిమలాడుతున్నట్టు అడిగింది వాసవి.
"లేదు వాసవి. నన్ను బదిలీ చేయించి అక్కడికి రావాలని ఒకతను ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. నేను వుంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ ఆ ఇళ్ళలో నివాసం వుంటున్న వాళ్ళకే ఇస్తారని అనుకుంటున్నారు. అందుకే అక్కడినుండి కదలడం నాకుఇష్టం లేదు. అంతమంచి అవకాశం ఎవరైనా వదులుకుంటారా చెప్పు? ఏదోఒకటి చేసి ఈ బదిలీ రాకుండాచూడాలి. కాస్త ఖర్చు అయినా సరే. ఇంటి గురించి నా తాపత్రయం ఎవరికోసం చెప్పు? నీకోసం పిల్లల కోసమేగా. మీ అమ్మగారు ఈ సాయంత్రానికి వచ్చేస్తారు కదా. ఇంకేం భయం నీకు?" అనునయంగా చెప్పి వూరికి బయలుదేరాడు మాధవరావు.
" నేనూ నీతో వస్తాను నాన్నా." గారం చేస్తూ కాళ్ళకు చుట్టుకున్నాడు ఆరేళ్ళ సాయిచరణ్.
" నాన్న వచ్చే వారం వస్తారులే చరణ్. అల్లరి చేయకు" అని కొడుకుని దగ్గరకు తీసుకుంది వాసవి మనసులో బాధను, కంటిలోచెమ్మను కనబడనీయకుండ దాచుకుంటూ.
ఆమెకు విజయవాడలో ప్రైవేట్ సంస్థలో వుద్యోగం. అతను కర్నూలులో ప్రభుత్వ కార్యాలయ వుద్యోగి. వాళ్ళ పెళ్ళై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా చెరొక చోట వుంటూ వారానికో, పదిహేను రోజులకో కలుసుకుంటూ సంసారం నడుపుతున్నారు. పెళ్ళప్పుడు పెద్దలు చెప్పిందేమో ఆమెకు బదిలీ అవకాశం లేనందున, మాధవరావు భార్య వుండే విజయవాడకు వచ్చేస్తాడని.
మొదటి రాత్రి గడిచాక వాసవి అడిగిన మొదటి ప్రశ్న "మీరు బదిలీ కోసం ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడ్తారు?" అని.
"నీకు దూరంగా నేను మాత్రం వుండగలనా వసూ?" అంటూ బుజ్జగించేడు.
ఆరునెలల తరువాత "కర్నూలులో మనకోసం ప్రభుత్వ క్వార్టర్స్ కోసం ప్రయత్నం చేసాను. రెండు పడక గదుల ఇల్లు అలాట్ అయ్యింది. ఎలావదులుకోను చెప్పు? ఇప్పుడేమయ్యింది? వారం వారం వస్తూనే ఉన్నాను కదా? నాకు వీలు కానప్పుడు నువ్వే వస్తున్నావు." అనేసాడు.
సాయిచరణ్ పుట్టినప్పుడు అత్తగారింటికి వెళ్లి కొడుకును చూసివెళ్ళాడు. బాలసారెకు ఒకరోజు సెలవు పెట్టి సంబరంగా కొడుకు నామకరణం చేసి వెళ్ళాడు. అమ్మను తోడుగా తెచ్చుకుని కొడుకుని మూడేళ్ళు వచ్చేదాక పెంచి వాడిని బళ్ళో వేసింది వాసవి.
మాధవరావు వెళ్ళిన మరునాడే వాసవి రెండో పురిటికోసం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ ఆమె తల్లి దగ్గరే వుండి ఆదుకుంది. ఈసారి ఆడపిల్ల పుట్టింది వాసవికి. లక్ష్మీ దేవి పుట్టింది అని ఉప్పొంగిపోయాడు మాధవరావు. శ్రీదేవి అని పేరు పెట్టుకున్నారు.
నెలలు, సంవత్సరాలు గడిచిపోతునే వున్నాయి. స్కూలు సెలవుల్లో వాసవి సెలవు పెట్టి పిల్లలతో కర్నూలు వచ్చి వెళ్ళడం చేస్తూంది.
హోం వర్క్ చేయలేదని మాస్టారు తనని ఎండలో ఇసుక మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టినప్పుడు ఇంటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సాయి "నాన్న ఇక్కడ వుంటే స్కూలుకి వచ్చి మాస్టారి పని పట్టేవారు కదమ్మా" అంటూ.
ఇంకోసారి ఫుట్ బాల్ ఆడుతూ కింద పడి కాలు బెణికి నడవలేకపోయినప్పుడు, వాసవి సాయం పట్టి స్నానం చేయించినప్పుడు "అందరి ఇంట్లో కొడుకులకు ఏ అవసరం వచ్చినా వాళ్ళ నాన్నలు పక్కన వుంటారు. మా నాన్న మాత్రం ఎప్పుడూ మా దగ్గర వుండరు. మా దురదృష్టం " అని దుఃఖపడ్డాడు.
సైకిల్ తొక్కడం నేర్చుకుంటూ, బాలెన్స్ తప్పి క్రిందపడి మోకాలుచిప్ప దోచుకుపోయి రక్తం చిమ్ముతుండగా ఏడ్చుకుంటూ, కుంటుకుంటూ ఇంటికి వచ్చింది ఎనిమిదేళ్ళ శ్రీదేవి ఒకరోజు.
"మా స్నేహితురాలు సరళ వాళ్ళ నాన్న ఎంచక్క తనతో కూడ ఉండి, సైకిల్ హాండిల్ పట్టుకుని తనుకూడ వెంట పరిగెత్తుతూ సరళకు సైకిల్ తొక్కడం నేర్పించాడు. మాకెందుకమ్మా మా నాన్న ఎప్పుడూ వెంట రాడు, ఏదీ నేర్పించడు?" అంటూ అడుగుతుంటే మాటలురాక, ఆపిల్లను అక్కున చేర్చుకుంది వాసవి. పండగలకో, సెలవులకో తప్ప నాన్న ఇంటికి రాడని అర్థమయ్యాక అడగడం మానేసారు పిల్లలు.
సాయిచరణ్ ఇంటర్మీడియట్ లోకి వచ్చాడు. శ్రీదేవికి, సాయికి తండ్రి దగ్గర ఏమాత్రం చనువు లేదు. తండ్రి అతిథిలా వచ్చిపోవడం వాళ్ళకు అలవాటు అయ్యింది.
"రాకరాక మొగుడు ఇంటికి వస్తే రుచిగా చేపల పులుసు వండిపెడదాము, కోడికూర చేసిపెడదాము అని నీకు తోచదెందుకు? అన్నీ నేనే అడగాలా? ఎక్కడో ఒక్కడూ వుండి తిండికి మొహంవాచి వచ్చాడు పాపం అన్న అక్కర వుంటేకదూ?" అని నాన్న అమ్మని సాధిచడం చూసి పిల్లలకు విసుగు వచ్చేది. వాసవి పిల్లలకు మాంసాహారం అలవాటు చెయ్యలేదు. ఆ వాసనే వాళ్ళకు గిట్టదు. రాను రాను నాన్న వస్తాడంటే సంతోషపడక పోగా చిరాకు పడడం మొదలుపెట్టారు సాయిచరణ్, శ్రీదేవి.
అత్తగారు నీళ్ళ గదిలో జారి పడిందని కబురు వచ్చి పిల్లలని వదిలి చీరాల వెళ్ళింది వాసవి. వెళ్ళిన మనిషి నెల దాకా ఆవిడని చూసుకోడానికి వుండిపోవలసి వచ్చింది. మధ్యలో ఒకసారి వచ్చి అమ్మను చూసి వెళ్ళాడు మాధవరావు. కాలేజికి, స్కూలుకు వెళ్ళే పిల్లలు ఏమి వండుకుంటున్నారో, ఏమి తింటున్నారో అన్న దిగులుతో సగమయ్యింది వాసవి.
ఇంటికి వచ్చాక మరో తలనొప్పి ఎదురైంది ఆమెకు. అత్తగారిని చూసిపోవడానికి వచ్చిన ఆవిడ అన్న కొడుకు ఏదో పనిమీద విజయవాడ వచ్చాడు. తిన్నగా ఇల్లు వెదుక్కుని వచ్చేసాడు. పచ్చని పసిమి రంగులో నలభై అయిదేళ్ళ భారీ విగ్రహం. అత్తింటి తరపు మనిషి అని తప్పనిసరిగా మర్యాద చేసింది.
“పిల్లలు ట్యూషన్ నుండి రావడం ఆలస్యమవుతుంది మీరు భోజనం చేసేయండి” అంటూ వడ్డించింది.
“మా బావ నేను ఒకే కాలేజిలో చదువుకున్నాము. అయితే నాకే ముందు ఉద్యోగం వచ్చింది. జీతం కూడా వాడికన్నా ఎక్కువ."
"ఛామన ఛాయలో కాస్త బక్క మనిషిలా కనబడే మా బావకు ఇంత అందమైన భార్య దొరకడం గొప్ప అదృష్టం సుమండి "అన్నాడు వాసవిని పట్టి చూస్తూ.
వాసవి దిమ్మెరపోయింది. భయపడింది. అతను మరునాడు మళ్ళీ వచ్చాడు. ఆ సమయంలో సాయిచరణ్ ఇంటిలోనే వుండంతో కాస్త నిబ్బరంగా వుంది వాసవి. పిల్లలతో బాటు భోజనం పెట్టింది.
"అయినవాళ్ళ దగ్గరికి వుత్త చేతులతో రాకూడదని ఇవి తెచ్చాను" అంటూ స్వీట్స్, చీర పేకెట్ అందించాడు.
"మిఠాయిలు పిల్లలు తింటారు. ఈ చీర మీ ఆవిడకు పట్టుకెళ్ళండి." అంది నిర్మొహమాటంగా.
"సాయీ మామయ్య సాయంకాలం బస్ కి వెడతారుట. బస్ ఎక్కించిరా." అని కొడుకుకి చెప్పింది అన్యాపదేశంగా అతన్ని వెళ్ళమని సూచిస్తూ, అతను తనకు అన్న వరుస అని గుర్తు చేస్తూ.
సాయి జూనియర్ కాలేజిలో సీనియర్ ఇంటర్ లోకి వచ్చాక ఎక్కడికీ కదిలేందుకు కుదరడం లేదు వాసవికి.
అక్కడ మాధవరావుకు ఈ పదహారు ఏళ్ళలో ప్రమోషన్ వచ్చి పెద్ద పదవిలోకి వచ్చాడు. ఉద్యోగంలో ఆందోళనలతో బాటు వేళకు ఇంటి భోజనం తినే వసతి లేకపోవడం వలన చక్కెర వ్యాధి, హై బి పి పట్టుకున్నాయి.
అతడు విజయవాడ వచ్చినప్పుడు కొడుకు, కూతురు దూరదూరంగా మసలుతారు.
"నెలకోసారి మీకోసం పరిగెత్తుకు వస్తాను. దగ్గర కూర్చుని నాలుగు మాటలు మాట్లాడరెందుకు?" అని ఒకసారి కోప్పడ్డాడు.
"రోజూ అన్ని విషయాలు అమ్మతో చెప్పేస్తాము కదా నాన్నా! కొత్తగా మీతో చెప్పడానికి ఏం కబుర్లు వుంటాయి? కాలేజిలో, స్కూలులో మాకు ఏ సమస్య వచ్చినా అమ్మే కదా తీరుస్తుంది." అనేసాడు సాయిచరణ్.
ఆ రాత్రి నిద్రపట్టలేదు మాధవరావుకు.
"వాసవీ! వీళ్ళకు నేనేమీ కానా? ఎవరికోసం నేను ఒంటరిగా వుంటూ, కష్టపడి సంపాదిస్తున్నాను? ఆ క్వార్టర్స్ మన స్వంతమవుతుందనే ఆశతో కాదూ నేను ఆరోగ్యం బాగులేకపోయినా మీకు దూరంగా వుంటున్నాను? అమ్మ వాళ్ళకు అన్నీ అమర్చి పెడుతున్నదని అనుకుంటున్నారే గానీ, భార్య, పిల్లలకు దూరంగా వుంటూ నాన్న వాళ్ళకోసం ఏమి పోగొట్టుకుంటున్నాడో అర్థం చేసుకోలేరా?" అని వాసవి దగ్గర వాపోయాడు.
ఇల్లు, ఇల్లు అంటూ ఇన్నాళ్ళు మొండిగా దూరంగా వుంటూ, ఇప్పుడు పిల్లలు తనకి చేరువ కాలేదని బాధ పడుతున్న భర్తను ఎలా ఓదార్చాలో తెలియలేదు వాసవికి. కష్టమైనా పిల్లలకోసం సంసార బాధ్యతలను ఒంటరిగా మోస్తూ నలభై నాలుగేళ్ళు దాటేసరికే అలసిపోయింది వాసవి. అందుకే మరో ప్రయత్నం చేసింది.
"సాయి ఎలాగు వచ్చే సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరి హాస్టల్ లో వుంటాడు. నేను వాలంటరీ రెటైర్మెంట్ తీసుకుని పాపతో మీదగ్గరికే వచ్చేస్తాను" అంది.
“అదెలా కుదురుతుంది వసూ? నీది పెన్షన్ వచ్చే ఉద్యోగం కాదాయె. శ్రీదేవిని డాక్టర్ గా చూడాలని నా ఆశ. వీళ్ళిద్దరి చదువులు, అమ్మాయి పెళ్ళి నా ఒక్క జీతంతో ఎలా సాధ్యం చెప్పు? తొందరపడకు కొన్నాళ్ళు ఆగి చూద్దాము" అనేసాడు.
“అప్పు చేయనిదే మన జీతాలతో మనం స్వంత ఇల్లు కట్టించుకోవడం అసాధ్యం. జీవితాంతం అప్పు తీర్చడానికి పోరాడాలి. ఏదో ఈ ప్రభుత్వ క్వార్టర్స్ లోనే వుండి రిటైర్ అయితే కొంత సొమ్ము కడితే మనకు స్వంత ఇల్లు ఏర్పడుతుందని నా ఆశ. నీకోసం పిల్లల కోసమేగా ఇదంతా. ఇంత దూరంలో ఒక్కడినీ వుండి నేనేం బావుకుంటున్నానని?" అన్నాడు మళ్ళీ నిష్టూరంగా. చిన్నగా నిట్టూర్చి, ఎప్పటిలాగే మౌనం వహించింది వాసవి.
మాధవరావు నాన్న పనిమీద కర్నూలు వచ్చి కొడుకు దగ్గర కొన్నాళ్ళు వున్నాడు.
"కోడలు ఒక చోట నువ్వు ఒకచోట అయి సంసారసుఖం ఎటూ లేదు. కనీసం తిండిసుఖమైనా వుండొద్దూ?" అంటూ ఒక వంటమనిషిని కుదిర్చాడు.
పెద్దాయన వెళ్ళిపోయాక కూడా ఆ వంటమనిషిని మానిపించ లేదు మాధవరావు. షుగరు, బి పి అలాగే వున్నా, తిండి ఒంటబట్టి కాస్త లావయ్యాడు కూడా.
ఒకరోజు ముందు చెప్పకుండా భర్తను ఆశ్చర్యపరచాలని వచ్చిన వాసవికి వంటమనిషి మాధవరావు పడకగదిలో అతనికి కాళ్ళు ఒత్తుతుండం చూసి నివ్వెర పోయింది. వాసవి ఎంతో మురిపెంగా దాచుకున్న గంధం రంగు వెంకటగిరి చీర ఆవిడ ఒంటిమీద వుంది.
కోపంతో, రోషంతో ముఖం ఎర్రబడిపోగా, ఒక్క మాటైనా పలుకకుండా వెనక్కి వెళ్ళి విజయవాడ బస్ ఎక్కింది వాసవి.
మరునాడే ఆదరాబాదరా భార్యా, పిల్లల దగ్గరికి వచ్చాడు మాధవరావు.
"నన్ను నమ్ము వాసవి. పిల్లల మీద ఒట్టు. నాకు ఆమెతో ఏ సంబంధం లేదు. ఆరోజు తను గబుక్కున గదిలోకి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంది. నీ చీర కూడా తనకు నేను ఇవ్వలేదు. తానే చొరవగా తీసుకుందేమో. నేను గమనించలేదు కూడా. ఆమెను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టవద్దని చెప్పి పంపించేసాను." అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు. అతనికి ప్రాణమైన పిల్లల మీద ఒట్టు వేయడం వలన వాసవి అతని మాటలు నమ్మింది.
వాసవి సహోద్యోగి కమల తన కూతురు పెళ్ళికి తప్పక రావాలని వాసవిని పిలిచింది. కమల కూతురు వైజాగ్ లో చదువుకుంటోందని తెలుసు వాసవికి. ఆమె భర్త కడపలో ఏదో వ్యాపారం చేస్తాడని తెలుసు గానీ వివరాలు తెలియవు.
అమ్మాయి తనతో చదువుకుంటున్న అబ్బాయినే ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నదని కమల సాధారణ విషయంలా చెప్పింది. పెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో. దేవుడి దర్శనం చేసుకున్నట్టు వుంటుందని ఒకపూట పెళ్ళికి వెళ్ళింది వాసవి.
పెళ్ళిలో కమల అక్కా బావా పీటలమీద కూర్చుని కన్యాదానం చేయడం చూసి ఆశ్చర్య పడింది. అక్కడ తెలిసింది కూతురు పుట్టాక కమలను ఆమె భర్త వుద్యోగం మానేసి వచ్చేయమని అన్నాడని, ఇంకా ఒడిదుడుకులతో సాగుతున్న వ్యాపారం మీద ఆధారపడి, చేతిలో వున్న బంగారం లాటి ఉద్యోగం వదిలిపెట్టడం ఇష్టంలేక, కమల ఒప్పుకోలేదనీ, ఆకారణంగా విడాకులు లేకుండానే వాళ్ళు విడిపోయారనీ.
పెళ్ళి పందిట్లో కమల ముఖంలో ఎక్కడా భర్తతో విడిపోయనన్న అపరాథభావం గానీ, పిల్ల తండ్రి లేకుండానే కూతురు పెళ్ళి చేస్తున్నానని కించపడిన బాధ గానీ కనబడలేదు వాసవికి. పరిస్తితులు అనుకూలించనప్పుడు ధైర్యంగా నిలబడి తలెత్తుకుని జీవిస్తున్న కమల పట్ల మరింత గౌరవం పెరిగింది వాసవికి. తను ఒంటరి పోరాటం చేస్తూ బ్రతుకుతున్నానని నిరాశ పడడం సబబు కాదని కమల కుటుంబ పరిస్థితి తెలిసాక అర్థమయింది ఆమెకు.
సాయి చరణ్ కి కాకినాడ ఇంజినీరింగ్ కాలేజిలో సీట్ వచ్చింది. ఆ ప్రవేశ పరీక్ష కోసం కొడుకుతో సమానంగా నిద్ర కాచి కష్టపడింది వాసవి. తను చదవలేక పోయిన ఇంజినీరింగ్ సాయిని చదివిస్తున్నందుకు గర్వంతో పొంగిపోయాడు మాధవరావు. ఆఫీసులో తోటి ఉద్యోగస్తులకు మిఠాయిలు పంచాడు.
ఆ సంతోషం లో ఉండగానే నెత్తిమీద పిడుగులా పడింది సస్పెన్షన్ వార్త. బాంక్ లో కట్టమని తన క్రింది వుద్యోగికి ఇచ్చి పంపిన చెక్స్ జమకాలేదని, ఆ సొమ్ము తను స్వాహా చేసినట్టు తన మీద నేరం మోపబడిందని తెలిసి కృంగిపోయాడు మాధవరావు.
విషయం తెలిసి పరిగెట్టుకు వచ్చింది వాసవి. అతను నేరం చేయలేదని నిరూపణ అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో, అంత వరకు ఆ అవమానకర పరిస్థితిలో ఒంటరిగా భర్తను వదిలి వెళ్ళలేక తనతో విజయవాడ వచ్చేయమని బ్రతిమలాడింది వాసవి. తాను లేకుంటే ఇల్లు మరొకరికి అలాట్ అవుతుందేమో అన్న భయంతో సుతరాము ఒప్పుకోలేదు మాధవరావు.
కొండంత దిగులుతో వెనక్కి తిరిగి వచ్చింది వాసవి. స్వంత ఇంటికోసం అతనికి అంత తపన దేనికో ఆమెకు అర్థం కాలేదు. సాయి చరణ్ కూడా దూరంగా వెళ్ళిపోవడం వలన ఆమె స్థిమితంగా వుండలేక పోతోంది.
మాధవరావు ఆరోగ్య పరిస్థితి గురించిన దిగులు, అతని ఉద్యోగం ఏమవుతుందో అన్న చింత ఆమెను కృంగదీస్తున్నాయి.
భార్యతో విజయవాడ రానని ఆమెను వెనక్కి పంపాడే గానీ మాధవరావుకు ఒంటరిగా వుండడం నరకప్రాయ మయింది. పాతిక సంవత్సరాలుగా గౌరవంగా బ్రతికిన చోట జనం తనని ఒక మోసగాడుగా చూస్తుంటే భరించలేక ఆత్మహత్య చేసుకోవాలన్నంత విరక్తి కలుగుతోంది. ఈ మానసిక హింస భరించలేక ఒకరోజు వున్నట్టుండి విజయవాడ బయలుదేరాడు.
వెళ్ళేముందు ఇల్లంతా శుభ్రంగా సర్ది, కళ్ళారా చూసుకున్నాడు.
ఈ పరిస్థితి నుండి బయటపడ్డాక, వాలంటరీగా తను, తన భార్య ఉద్యోగవిరమణ చేసి, తన స్వంత ఇంట్ళో తాము హాయిగా గడపాలని కోరుకుంటూ బస్ ఎక్కాడు.
తానొకటి తలిస్తే వేరొకటి జరగడమే జీవితం కదా!
మాధవరావు ఎక్కిన బస్ విజయవాడ దరిదాపులకు వచ్చాక యాక్సిడెంట్ అయ్యింది. వాసవి మాధవరావు మృతదేహం చూడవలసి వచ్చింది.
విజయవాడలో అంత్యక్రియలు ముగిసాయి. నెల రోజుల తరువాత కర్నూలు వొచ్చింది వాసవి. ఆశ్చర్యంగా మాధవరావు మీది కేసు తేలిపోయింది. మోసం చేసిన క్రింది ఉద్యోగిని పట్టుకున్నారు. మాధవరావు మీద సస్పెన్షన్ ఎత్తేసారు. ఈలోగా అశావహుల ఆశలమీద నీళ్ళు జల్లుతూ గవర్న్మెంట్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ప్రభుత్వం క్వార్టర్స్ అన్నీ స్వాధీనం చేసుకుని, పాతవి అన్నీ కూలగొట్టి వివిధ సంస్థలకు ఆ భూమి అలాట్ చేస్తున్నట్టు.
కర్నూలు వచ్చి క్వార్టర్స్ ఖాళీ చేస్తున్న వాసవి మనసులో ఒకటే ప్రశ్న మెదులుతోంది "మనిషికి స్వంత ఇల్లు ఏది? ప్రాణోత్కరణ సమయం వస్తే తనది అనుకున్న స్వంత శరీరాన్నే వదలి పోవాల్సిందే కదా. తన భర్త ఈ ఇల్లు తన సొంతం కావాలని, పదవీవిరమణ తరువాత తనదైన స్వంత ఇంటిలో గడపాలనీ ఆశపడుతూ జీవితంలో ఎన్నో ఆనందకర క్షణాలను చేజార్చుకున్నాడు. చివరకు ఎక్కడో చివరి శ్వాస తీసుకుని వెళ్ళిపోయాడు.
"ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు అన్న తత్వం ఆమె మనసులో మెదిలి కళ్ళుమూసుకుంది వాసవి.
నా మాట: ఫేటర్చెన్ (Väterchen), ముట్టి (Mutti) - నాన్న, అమ్మ ని జర్మన్ భాషలో కొన్ని ప్రాంతాల వారు ముద్దుగా అలా పిలుచుకుంటారు. Uwe Dinkel, Wolfgang Denke - ఈ పేర్లు గలవారెవరూ లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళెవరో, వాళ్ళేమన్నా రాశారో లేదో నాకు తెలియదు. చారిత్రక వ్యక్తులని తల్చుకుంటూనే రాసినా, ఈ కథ పూర్తిగా కల్పితం.