Menu Close
Galpika-pagetitle

పూర్తిచెయ్యని కథ -- తెనుగుసేత:డా.కోడూరు ప్రభాకరరెడ్డి (English Original: An Unfinished Story - O Henry)

డల్సీ (Dulcie) సరుకులు సరఫరా చేసే ఒక పెద్ద దుకాణం (Departmental Store) లో పని చేస్తూంది. ఆ దుకాణంలో కోడి మాంసం మొదలుకొని చౌకబారు నగల వరకు అమ్మే పని ఆమెది. వారంలో డల్సీ సంపాదించిన దాంట్లో 6 డాలర్లే ఆమెకు చెందుతుండేది. మిగిలింది వేరే ఖాతాలోకి జమ అవుతుండేది.

పనిలో చేరిన మొదటి సంవత్సరం డల్సీకి వారానికి 5 డాలర్లు మాత్రమే ఇచ్చేవారు.ఆ డబ్బుతో ఆమె జీవితావసరాలు ఎలా తీరేవో చర్చించాల్సిన విషయమే! ఇప్పుడు 6 డాలర్లు తక్కువేమీ కాదు. ఆరు డాలర్లతో ఆమె బ్రతుకెలా ఈడుస్తుండేదో తర్వాత వివరిస్తాను.

ఒకరోజు మధ్యాహ్నం అంగట్లో డల్సీ తన ప్రక్కనున్న సాడీ (Sadie) అనే స్నేహితురాలితో
"ఈ రాత్రి పిగ్గీ (Piggy) తో డేటింగ్ (dating) చేస్తున్నాను" అంది.

"నువ్వెప్పుడూ ఇటువంటి పని చెయ్యలేదే! నువ్వు అదృష్టవంతురాలివి. పిగ్గీ ఎంతో సమర్థుడు. ఎప్పుడూ అమ్మాయిలను ఎన్నో చోట్లకు తీసుకు వెళ్తుంటాడు. అతనితో ఉన్నoతసేపూ నీకెంతో ఆనందంగా ఉంటుంది డల్సీ!" అంది సాడీ.

ఆనందంతో తలమునకలౌతూ డల్సీ ఇంటికి బయలుదేరింది. తన జీవితపు ఉషోదయాన్ని చూడబోతున్నాననే సంతోషం, ఉద్వేగం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ రోజు శుక్రవారం. క్రిందటి వారం జీతంలో ఆమె దగ్గర 50 సెంట్స్ మిగిలి ఉంది. దారిలో డల్సీ చౌకగా వస్తువులు దొరికే ఒక దుకాణం దగ్గర ఆగి 50 సెంట్స్ కు ఒక ఇమిటేషన్ లేస్ కాలర్ కొనింది. ఆ డబ్బు మామూలుగా అయితే వేరే దానికి ఉపయోగించటానికి నిర్దేశింపబడింది- 15 సెంట్స్ భోజనానికి,10 సెంట్స్ అల్పాహారానికి (breakfast), 10 సెంట్స్ మధ్యాహ్న భోజనానికి (lunch) పోగా ఒక డైమ్(dime-డాలర్ లో పదోవంతు) పొదుపు చేస్తుంది, 5 సెంట్స్ అతిమధురం (liquorice) చుక్కల కోసం వినియోగించాలి. ఆ 5 సెంట్స్ తన తాహతుకు ఎక్కువైనా - సుఖసంతోషాలు లేని ఈ జీవితం ఎందుకు?' అని సమర్థించుకుంటుంది డల్సీ.

సొంతంగా డల్సీ ఒక గదిలో ఒక్కతే ఉంటూంది. దీన్నే ఫర్నిష్డ్ రూమ్ (furnished room) అని పిలుస్తారు. ఈ ఫర్నిష్డ్ రూమ్ కు, బోర్డింగ్ హౌస్ కు తేడా ఉంది. ఫర్నిష్డ్ రూమ్ లో నువ్వు ఆకలితో నక నక లాడుతున్నా అది వేరేవాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. అదే బోర్డింగ్ హౌస్ లో నైతే నువ్వు యే చిన్న ఇబ్బందిలో ఉన్నా అందరికీ తెలుస్తుంది.

డల్సీ మూడో అంతస్తులోని తన గదికి వెళ్ళింది. గ్యాస్ స్టవ్ వెలిగించింది. అది పంచే వెలుతురులో మనం ఆ గదిని పరిశీలిద్దాం! పరుపు, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్, కుర్చీ, టేబుల్ మాత్రం ఇంటావిడ సమకూర్చింది. మిగిలినవన్నీ డల్సీ తెచ్చుకున్నవే! అవి - డ్రెస్సింగ్ టేబుల్ పైన సాడీ బహూకరించిన చైనా కుండీ, ఊరగాయ పరిశ్రమ వాళ్ళిచ్చిన ఒక క్యాలెండర్, కలల గురించిన ఒక పుస్తకం, గాజు పాత్రలో బియ్యం పిండి, పింక్ రిబ్బన్ కు కట్టిన కృత్రిమ చెర్రీ పండ్లు. పాత నిలువుటద్దం ఎదురుగా జనరల్ కిచెనర్ (General Kitchener), మార్ల్ బరో (Marlborough) జమీందారిణి, బెనువెనుటో సెల్లిని (Benuvenuto Cellini) (3/11/1500 - 13/2/1571: ఇటాలియన్ స్వర్ణకారుడు, శిల్పి, సంగీత విద్వాoసుడు, మీదుమిక్కిలి కవి కూడ. అతని ఆత్మకథ ఎంతో ప్రసిద్ధిచెందింది) చిత్రాలున్నాయి. ఒక గోడకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన రోమన్ శిరస్త్రాణంతో ఉన్న ఓ 'కల్లహాన్ (O' Callahan) బొమ్మ ఉంది.

ఏడుగంటలకు పిగ్గీ (Piggy) వస్తానని చెప్పాడు. డల్సీ ముస్తాబయ్యే లోపల మనం మిగతా విషయాలను పరిశీలిద్దాం. డల్సీ వారానికి రెండు డాలర్లు అద్దె చెల్లిస్తుంది. వారాంతంలో అల్పాహారం (breakfast) కోసం 10 సెంట్స్ ఖర్చు చేస్తుంది. డ్రెస్ చేసుకుంటూ కాఫీ కాచుకొని ఒక గుడ్డు ఉడకబెట్టుకుంటుంది. ఆదివారం ఉదయం 'బిల్లీస్' (Billy's) రెస్టారెంట్ లో 25 సెంట్స్ తో యువరాణిలా భోంచేసి వెయిటర్ కు 10 సెంట్స్ 'టిప్' (tip) ఇస్తుంది. జల్సాగా ఖర్చు చెయ్యాలంటే న్యూయార్క్ లో ఎన్నో మార్గాలున్నాయి. పనిచేసే దుకాణంలో వారానికి 60 సెంట్స్ తో మధ్యాహ్న భోజనాలకు (lunch), రాత్రి భోజనాలకు (dinner) డాలర్ అయిదు సెంట్స్ ఖర్చవుతుంది. సాయంకాలపు వార్తాపత్రిక 6 సెంట్స్, ఆదివారం వార్తాపత్రిక 10 సెంట్స్ - అంతా కలిసి 4 డాలర్ల 76 సెంట్స్ అవుతుంది. దానికి తోడు అవసరమైన బట్టలు కొనాలి - ఇక మిగతా వివరాలు వదిలేస్తాను.

పిగ్గీ గురించి ఒక విషయం చెప్పాలి. ఆ పేరు అతనికి పెట్టటంవల్ల పంది జాతికి మచ్చ అపాదించినట్లవుతుంది. అతడు బాగా కొవ్వు పట్టి లావుగా ఉంటాడు. కానీ ఒక మూషికం మనస్సు, గబ్బిలం అలవాట్లు, పిల్లి బుద్ధి కలిగి ఉంటాడు. ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. పస్తులుండే వాళ్లపై అభిమానం చూపిస్తుంటాడు. ఏ అమ్మాయినయినా గంటసేపు గమనించాడంటే ఆ అమ్మాయి ఎప్పటి నుండి పస్తులుంటుందో ఇట్టే చెప్పేయగలడు. దుకాణాల దగ్గరే తారాడుతూ ఎంపిక చేసిన అమ్మాయిలను డిన్నర్ కు ఆహ్వానించి ఎర వేస్తుంటాడు. వీథుల్లో కుక్కలను పట్టుకొని తిరిగే వాళ్లంతా అతడిని ఎంతో నీచంగా చూస్తుంటారు.

పది నిముషాలకు 7 గంటలు అవుతుందనగా డల్సీ ముస్తాబై ఉంది. పాత అద్దం ముందు నిలబడి తన రూపాన్ని చూసి సంతృప్తి పడింది. ఉన్నంతలో బాగా ముస్తాబయ్యింది. డల్సీ ఒక్క నిముషం అన్నీ మర్చిపోయి తన అందం మీద దృష్టి నిలిపింది. ఇంతవరకు తనను ఏ పురుషుడూ బయటకు తీసుకుపోతానని ఆహ్వానించలేదు.

'పిగ్గీ బాగా ఖర్చు చేస్తాడు. అతనితో డేటింగ్ (dating) చేస్తే అద్భుతమైన డిన్నర్, వీనుల కింపైన సంగీతం, చక్కగా అలంకరించుకున్న స్త్రీల పరిచయం, కోరిన ఆహార పదార్థాలు ఉంటాయి' అని మెలికలు తిరుగుతూ చెబుతారు అమ్మాయిలు పిగ్గీ డేటింగ్ గురించి. మళ్లీ మరొకసారి ఆ అమ్మాయిని డిన్నర్ కు తప్పకుండా ఆహ్వానిస్తాడు పిగ్గీ.

ఇంతలో ఎవరో తలుపు తట్టారు. డల్సీ తలుపు తెరిచి ఇంటి యజమానురాలు గ్యాస్ స్టవ్ మీద ఉడకబెట్టిన గుడ్ల వాసనను ఆస్వాదిస్తూ కృత్రిమంగా నవ్వుతూ గుమ్మం బైట నిలబడి ఉండటం చూసింది.

"ఒకాయన నిన్ను చూడాలని క్రింది అంతస్తులో వేచి ఉన్నాడు - మిష్టర్ నిగ్గిన్స్ (Mr. Niggins) తన పేరని చెప్పాడు" అందామె.

డల్సీ చేతిరుమాలు కోసం డ్రెస్సింగ్ టేబుల్ వైపు తిరిగి కొంచెంసేపు అలాగే నిలబడి క్రింది పెదవిని గట్టిగా నొక్కి పట్టింది. అద్దంలోకి చూస్తూ తానప్పుడే ఒక అద్భుత లోకంలో నిద్ర లేచిన యువరాణిగా భావించింది. తానెంతో ఇష్టపడే సన్నగా, పొడుగ్గా ఉన్న జనరల్ కిచెనర్ అందమైన కళ్ళతో డ్రెస్సింగ్ టేబుల్ పైనున్న గిల్ట్ ఫ్రేమ్ లో నుండి విచారంగా తనను మందలిస్తున్నట్లుగా చూస్తున్నాడు. డల్సీ యాంత్రికంగా ఒక బొమ్మలా ఇంటి యజమానురాలి వైపు తిరిగి "నాకు ఆరోగ్యం బాగా లేదనో, మరొకటో చెప్పి నేను బయటికి రాలేనని చెప్పి పంపించెయ్యండి" అంది.

తలుపు వేసుకున్నాక డల్సీ మంచం మీద వాలిపోయి పది నిముషాలపాటు మనసారా ఏడ్చింది. జనరల్ కిచెనర్ అమెకున్న ఒకే ఒక స్నేహితుడు. అతడే డల్సీకి ఆదర్శ వీర సైనికుడు. అంతరంగంలో అతడేదో విచారగ్రస్థుడుగా కనిపిస్తాడు. అందమైన అతడి మీసకట్టు వేరెవరికీ ఉండదు. సున్నితమైన మనిషైనా తీక్షణమనిపించే అతడి చూపంటే డల్సీకి బెరుకు. తన దగ్గరికి వచ్చినప్పుడు అతడడిగే సరదా కోర్కెలు డల్సీకి అనుభవైకవేద్యాలే! ఇప్పుడు జనరల్ కిచెనర్ జపాన్ లో ముందుండి సైన్యాన్ని శత్రువుల పైకి నడుపుతున్నాడు. కిచెనర్ ఆ గిల్ట్ ఫ్రేమ్ నుండి ఎప్పుడూ బైటికి అడుగుపెట్టడు. అయినా అతని ఒక్క చూపు పిగ్గీని ఆ రాత్రి తన ఆలోచన నుండి తుదముట్ట తుడిచేసింది.

డల్సీ ఏడవటం కాగానే మంచం పైనుండి లేచి తనకు ఇష్టమైన డ్రెస్ వేసుకొంది. భోంచేయాలనిపించలేదు. రెండు 'సమ్మీ' (Sammy) పదాలు పాడుకున్నది. తన ముక్కు ప్రక్కనున్న ఎర్ర మచ్చను అద్దంలో ఎంతో ఇష్టంగా చూసుకుంది. ఆ తర్వాత శిథిలావస్థలో ఉన్న టేబుల్ దగ్గరికి కుర్చీ లాక్కొని కూర్చొని తన అదృష్టాన్ని బేరీజు వేసుకుంది.

"ఎంత ఘోరమైన, సిగ్గుమాలిన ఆలోచన వచ్చింది నాకు. ఆ పిగ్గీకి సూచనగానైనా అటువంటి ఒక్క మాట గానీ, చూపు గానీ నేను విసరలేదే" అని గట్టిగా పైకే అంది డల్సీ.

తొమ్మిది గంటలకు బిస్కెట్ బాక్స్, రాస్ప్ బెర్రీ జామ్ (raspberry jam) తో విందు చేసుకుంది డల్సీ. ఫొటోలో ఉన్న జెనరల్ కిచెనర్ కు బిస్కెట్, జామ్ ఇవ్వజూపింది. స్పిoక్స్ (Sphinx-స్త్రీ ముఖమూ, సింహ శరీరమూ, రెక్కలూ గల గ్రీకు పురాణాల్లోని రక్కసి) సీతాకోకచిలుకను చూసినట్లుగా డల్సీని చూశాడు జెనరల్ కిచెనర్.

"నీకు ఇష్టం లేకపోతీ తినటం మానెయ్! పెద్ద ఫోజులు కొట్టి కోపంగా చూడకు! వారానికి ఆరు డాలర్లతో బ్రతికితే ఆ కష్టం నీకు తెలిసి వస్తుంది" అంది డల్సీ నిష్ఠురంగా.

తొమ్మిదిన్నరకు డల్సీ డ్రెస్సింగ్ టేబుల్ పైనున్న జెనరల్ కిచెనర్ ఫోటోను మిగిలిన బొమ్మలను చివరిసారిగా చూసి లైట్లార్పి మంచం మీదికి చేరింది. వారికావిధంగా శుభరాత్రి చెప్పే భావనతో నిద్రకు ఉపక్రమించటం అపరాధమనిపించింది డల్సీకి.

ఈ కథ అంతటితో అయిపోలేదు. అసలు కథ తర్వాతే ఉంది. పిగ్గీ కొన్నాళ్ల తర్వాత డల్సీని తనతో డిన్నర్ కు ఆహ్వానించాడు. డల్సీ ఒంటరితనంతో బాధ పడుతున్నది. జెనరల్ కిచెనర్ అటువైపు తిరిగి ఉన్నాడు. నేనొక దేవదూతల గుంపు చెంత నిలబడి ఉన్నానని కలగన్నాను. ఒక పోలీస్ నా రెక్క పట్టుకొని

"నువ్వా దేవదూతల గుంపులో వాడివేనా?" అని అడిగాడు.

"అసలు వాళ్ళెవరు?" అని పోలీస్ కు ఎదురు ప్రశ్న వేశాను నేను.

"వాళ్ళు వారానికి ఐదారు డాలర్లతో అమ్మాయిలను అంగళ్లలో జీతానికి పెట్టుకున్నవాళ్ళు. నువ్వూ వాళ్ళ గుంపులోని వాడివేనా?" అని రెట్టించి అడిగాడా పోలీస్.

"నీమీదొట్టు! నేనొక అనాథ శరణాలయానికి నిప్పు పెట్టిన వాడిని, కళ్ళు లేని కబోదిని చంపి డబ్బు దోచుకున్న వాడిని. అదే నేను చేసిన  అపరాధం!" అన్నాను నేను ధైర్యంగా తల పైకెత్తి.

మృణాలినీ దర్పణం -- రాజేశ్వరి దివాకర్ల

అహ్మదాబాద్ లో నివసించిన రో జులలో.  జాతీయ స్మారక స్థలం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన అనుభవం మరపురానిదిగా నిలిచింది.  సబర్మతి ఒడ్డున ఉన్న" దర్పణ్" నృత్య  అకాడమీ ప్రపంచాద్యంతంతం నాట్యం నేర్చుకునే ఔత్సాహికులకు బాసట గా నిలిచింది. ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని సారాభాయి 1948లో ‘దర్పణ్’ పేరిట అహ్మదాబాద్‌లో నృత్యం, డ్రామా, సంగీత అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీలో "నతారాణి "అనే ప్రపంచ స్థాయి ప్రదర్శన వేదిక, ఓపెన్ ఎయిర్ కేఫ్, లైబ్రరీ మరియు పుస్తక దుకాణం ఉన్నాయి. అకాడమీ వారానికి మూడు రోజులు తరగతులను అందిస్తుంది.

ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి, నృత్యదర్శ కురాలు, అధ్యాపకురాలు, రచయిత్రి, పర్యావరణ వేత్త మృణాళినీ సారాభాయి గారు, దాదాపు శతాబ్దంపాటు సాగిన తమ సుదీర్ఘ, సుసంపన్నమైన జీవితాన్ని శాస్త్రీయ నృత్యాన్ని పునరుద్ధ రించటంలో, దానికి కొత్త సొబగులు అద్దటం ల్లో సార్థకం కావించుకున్నారు. పద్మ భూషణ్ పురస్కారం తో బాటు అనేక జాతీయ అంతర్జాతీయ గౌరవాలనందుకున్న మృణాలిని గారు "దర్పణ్" ను భరతనాట్యం, కూచిపూడి, కథకళి, జానపద కళలు, సంగీతంతోపాటు చేతివృత్తులకు సంబంధించిన తోలుబొమ్మలాటల" అభ్యాస కేంద్రంగా మలచారు. శిష్యులతోపాటు దగ్గరి వారంతా ఆమెను 'అమ్మా' అని పిలిచేవారు. దర్పణ' అకాడమీ డిసెంబర్‌ 28,1998న గోల్డెన్‌జూబ్లీ వేడుకలను జరుపుకొంది. నాటినుంచి సాంప్రదాయక నృత్య రంగంలో ''మృణాలిని సారాభాయి అవార్డ్‌ఫర్‌క్లాసికల్‌ ఎక్స్‌లెన్స్‌'' అవార్డును ఇస్తున్నారు.

మృణాళిని సారాభాయి నృత్యం ద్వారా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి  తెచ్చేందుకు, ఎనలేని కృషి చేశారు. సంప్రదాయిక కథలతో కూడిన కాలాకృష్ణగోపాల్.. మహాభారత్.. మొదలైన ఆమె నృత్యరూపకాలు ప్రస్తుత సమాజానికి అద్దంపట్టేవిగా రూపు దిద్దుకున్నాయి. దర్పణ రూపొందించిన కళారూపాలు – మహిళల సాధికారత, మానవతావాదం, మతతత్వం, అస హనం, కులవివక్ష, పర్యావరణ వినాశం వంటి అంశాలకు విస్తరించాయి. మృణాళిని ప్రసిద్ధ నృత్యరూపకాల్లో ‘మనుష్య’ (1958), ‘శకుంతల’(1971), చండాలిక, గంగ మొదలైనవి ప్రసిద్ధాలు. సమాజంలోని వివాదగ్రస్థ సమస్యలను సృజనాత్మకతతో ప్రతిబింబించే కళాప్రదర్శనల తయారీకి అకాడెమీలో ‘అహింస కొరకు కేంద్రం’ ప్రారంభించారు. బాలలను ప్రకృతికి దగ్గర చేసే నిమిత్తం వారి కొరకు "ప్రకృతి" పేర క్లబ్ ఏర్పరిచారు. దాదాపు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు.

మృణాళిని మరో వ్యసనం రచన. నృత్యం, పురాణాలపై రచనలు చేశారు. సరోజినీనాయుడు, మహాత్మాగాంధీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను సంకలన పరిచారు. నాట్యం మీది ప్రేమతో కవిత్వం రాసారు. మరొక ముఖ్యమైన రచన "ద వాయస్ ఆఫ్ హార్ట్" పేరుతో ఆత్మకథను రాసు కున్నారు.

దాదాపు ఏడు దశాబ్దాల్లో భారతీయ నృత్య విశ్లేషణలో అగాథాలను ఈ గ్రంథం గణనీయంగా పూడ్చిందని అనేకులు భావించారు. “కళా విమర్శకుడు సదానంద మీనన్ రాసిన గ్రంథ సమీక్షలో ఇలా పేర్కొన్నారు. "నృత్యంలో ఒక ప్రత్యేక తరహా నల్లని రంధ్రం ఉంది. 1957లో ఆడంబరజీవి అయిన రాం గోపాల్ ఆత్మకథ ( Ram Gopal: rhythm in the heavens : an autobiography, by Ram Gopal. Secker and Warburg, 1957) మినహా రుక్మిణీదేవి అరండేల్, ఉదయ్ శంకర్, బాలసరస్వతి లేక కులుచరణ్ మహా పాత్ర వంటి ప్రసిద్ధ నృత్యకారులెవ్వరూ ఆత్మకథ రాసే ప్రయత్నం చేయలేదు.”

భారతదేశ స్వాతంత్య్రో ద్యమం తో, అలాగే స్వాతంత్య్రానంతరం దేశ నిర్మాణంతో ముడిపడిఉన్న మృణాళిని గారి జీవితం నాటి సంగతు లన్నిటినీ ప్రతిబింబించింది. 2012 లో యదవన్ చంద్రన్ రూపొందించిన డాక్యుమెంటరీ, ‘ద ఆర్టిస్ట్ అండ్ హర్ ఆర్ట్’ మృణాళిని జీవిత యాత్రలో అనేక కోణాల ను చిత్రించింది..ఆధునిక నృత్యరూపాలు ఆవిర్భవించినప్పటికీ వాటి వెనుక శాస్త్రీయ సాంప్రదాయబలం ఉండాలని నమ్మిన మృణాళిని గారు పిన్నవయస్సులోనే నృత్యదర్శకురాలిగా మారారు.

చెన్నైలో స్థిరపడిన  కేరళ కుటుంబంలో మృణాళిని జన్మించారు. తండ్రి సుబ్బరామ స్వామినాథన్‌. మద్రాస్‌ హైకోర్టులో పేరుమోసిన బారిస్టర్‌. తల్లి అమ్ము స్వాతంత్య్ర సమరయోధురాలు,
సోదరి లక్ష్మీ (సెహ గల్) సుభాష్‌చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఫౌజ్ లోని "రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా పని చేసారు. మృణాలిని గారు చిన్నతనంలోనే గురువు మీనాక్షి సుందరం పిళ్లై వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె కథాకళి నేర్చుకున్నారు. శాంతినికేతన్‌లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యను అభ్యసించారు.

మృణాళిని భారతీయ భౌతిక శాస్త్రవేత్త అంతరిక్ష కార్యక్రమ పితగా ప్రసిద్ధి చెందిన విక్రం సారాభాయి గారిని వివాహం చేసుకుంది. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ గారి వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. ఎంతో ముందు చూపుతో ఈ దిశలో కావించే కృషి ఉపయోగపడుతుందని  అంతరిక్ష విజ్ఞానంవైపు  దృష్టి పెట్టి ఘనవిజయాలు సాధించారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు కనుకనే, ఛానళ్ళు ఆ ఉపగ్రహాల సాయంతో అందరిని చేరుతున్నాయి విక్రం సారాభాయ్ తన భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వారు సమస్యాత్మకమైన వివాహ బంధాన్ని గడిపారు.

విక్రమ్, మృణాళిని ఇద్దరూ అందరితో మాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదనేవారు. తర్వాత మెల్లమెల్లగా ప్రేమలో పడ్డారు. వాళ్ల పెళ్లి మొదట సంప్రదాయం ప్రకారం జరిగింది, తర్వాత వారు సివిల్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు.

పెళ్లి అయిన రోజు ఇద్దరూ బెంగళూరు నుంచి అహ్మదాబాద్ బయల్దేరారు. అదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతోంది. ఆందోళనకారులు చాలా ప్రాంతాల్లో రైలు పట్టాలు పీకేశారు. దాంతో 18 గంటల్లో గమ్యం చేరుకోవాల్సిన వారు 48 గంటల తర్వాత ఇల్లు చేరారు. అలా విక్రమ్, మృణాళిని రైల్లో ఫస్ట్ క్లాస్ కూపేలోనే హనీమూన్ చేసుకున్నారు.

సెంటర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు కార్తికేయ సారాభాయి, ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాభాయి వీరి సంతానం.

1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ త్రివేండ్రమ్ ‌దగ్గరున్న కోవలం బీచ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. ఉదయం నిద్రలేవకపోయేసరికి ఆయన పడుకున్న గది తలుపులు విరగ్గొట్టారు. లోపల దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకుని కనిపించారు. ఆయన గుండెలపై ఒక పుస్తకం ఉంది. డాక్టర్ ఆయన్ను పరీక్షించి, రెండు గంటల ముందే చనిపోయారని చెప్పారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ వయసు కేవలం 52 ఏళ్లు.

2016 జనవరి 21వ తేదీన తమ 97 వ ఏట మృణాలిని సారాభాయి గారు తుది శ్వాస విడిచారు. నాట్యం చేస్తున్నప్పుడు నిజంగా జీవించినట్లు ఉంటుంది అని తెలిపిన మృణాళిని గారికి కుమార్తె మల్లిక  తమ నృత్యం తో నివాళిని అర్పించారు. ఆభావోద్వేగ ఘట్టం అద్వితీయ మనిపించింది. (ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్యోత్సవం)

అనూహ్య -- శ్రీముఖి

"మేడమ్ అనూహ్య గారికి,

నమస్కారమండీ!!

నా పేరు  శశాంక్, ఉండేది బెంగళూరు.

మీరు "రస వాహిని" వారపత్రికలో వేసిన చిత్రం "విరహోత్కంఠిత" ఎంత బాగుందని? గీతల్లో కూడా అంత రూపలావణ్యతను చూపించవచ్చా? జీవమున్న జవ్వని లా, హృదయాన్ని ఎంతలా కలవర పరుస్తుందని?

ఆమె సుదూరపు వీక్షణాల్లోని ప్రియుని రూపాన్ని స్పష్టాస్పష్టంగా చిత్రించి....క్రింద మీరు పెట్టిన కాప్షన్ మరింతగా కుదిపేసింది,

"నువ్వొచ్చి కలుస్తావన్న ఆశ తో ఎన్నియుగాలు నీ జ్ఞాపకాలు దాచుకోను? నువ్వు సృష్టించే విద్యుత్తరంగాలకు ఎంతకాలం ఆహుతి కాను? అందనంత ఎత్తునుండి అందంగా నను ఓదార్చటమేనా?"

ఆ వాక్యాలు నా పెదాల చివర, ఆ విరహిణి నా కన్నులలో....మొత్తంగా, మనస్సును హత్తుకు పోయాయ్.

మా నాన్నగారు వడ్డాది పాపయ్య గారి అభిమాని. ఆయన చిత్రాలను ఆల్బమ్ గా దాచుకుని చూసుకుంటూ ఉండేవారు. చూసీ చూసి నాకు చిత్రాల మీద ఆసక్తి పెరిగింది. చూడటం వరకే నండోయ్..గీయడం రాదు.

మరోసారి అభినందనలు తెలుపుతూ, సెలవుతీసుకుంటున్న ..

మీ, అభిమాని....శశాంక్."

తన మొబైల్ లో వచ్చిన ఆ మెస్సేజ్  చదివింది అనూహ్య. తనకు బొమ్మలు గీయడం ఇష్టమైన వ్యాపకం. ఈ మధ్యనే మరింత ఎక్కువగా గీస్తుంది.

"రస వాహిని" పత్రికకు పంపితే వారు ప్రచురించడం...అవి జనానికి నచ్చడంతో...మరింత శ్రద్ధ పెట్టింది చిత్రాల మీద. "రస వాహిని" వార పత్రిక యువతరాన్ని ఎక్కువ ఆకర్షించేలా..ఖచ్ఛితంగా, చెప్పాలంటే ఉద్వేగపరిచే రచనలు ప్రచురిస్తూ ఉంటుంది.

ఆ పత్రిక చదివే వారిలో, పెద్దవారు తక్కువ వారేం కాదు, కానీ...ఎవరో సరసులు తప్ప, దానిలోని కథలు గూర్చి, ఎక్కువగా మాట్లాడరు. దాటొచ్చిన కుర్రతనాన్ని, దాచుకున్న అనుభవాల అనుభూతులను, నెమరువేసుకోవడమే తప్ప..వయస్సుకు తగ్గ మాటలు కావనో, హుందాతనంగా ఉండదనో మిన్నకుండి పోతారు.

వేసిన చిత్రం క్రింద, పేరు, మొబైల్ నంబర్ ఉంటుంది. కనుక అప్పుడప్పుడు ఇలా అభినందనలు రావడం మామూలే. చదివి ప్రక్కన పడేయడం సంస్కారం కాదు కనుక, మొబైల్ తీసుకుని, టైప్ చేయసాగింది.

"నమస్కారమండీ శశాంక్ గారు,

నా చిత్రం మీద మీ శ్రద్దకు, అభిమానానికి, థాంక్స్. అయితే...చిత్రమే నాది. క్రిందున్న కాప్షన్ లోని కవితాపంక్తులు నావి కావండీ...అవి, మా సోదరి 'రాయదుర్గం విజయ లక్ష్మి' గారివి. మీ లాంటి వారి ప్రోత్సాహమే, మాకు ఉత్సాహాన్నిస్తుంది. థాంక్స్ ఎగైన్...అనూహ్య."

మెస్సేజ్ పంపి మొబైల్ ప్రక్కన  పడేసింది.

*****

వారాలు  కాదు, నెలలు గడిచి పోతున్నాయ్. అనూహ్య వేసిన చిత్రాలు అచ్చవుతూనే ఉన్నాయి. "రసవాహిని" పత్రికకు అనూహ్య పర్మినెంట్ చిత్రకారిణి అయ్యింది. అభిమానులు అప్పుడప్పుడు అభినందనలు పంపుతూనే వున్నారు.

అయితే...అందరికన్నా ఎక్కువగా, శశాంక్ నుండి అనూహ్యకు, ఈమె నుండి అతనికి..మెస్సేజ్ ల, పరంపర మరింత ఎక్కువైనది. ఎంతగా...అంటే..చిత్రాల గూర్చే గాక, "చిత్తాల"ను, కూడా తెలుపుకునేంతగా దగ్గరయ్యారు.

ఓసారి కాల్ చేసినపుడు అడిగాడు శశాంక్ "మీరు పాటలు కూడా, పాడుతారా?" అని.

"ఎందుకలా అడిగారు?" అడిగింది.

"మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటేనూ..."

"అదా... మైసూర్ పాక్ తింటూ, మాట్లాడుతున్నాను లెండి."

"వావ్..సెన్సాఫ్ హ్యూమర్ కూడా తక్కువేం లేదు మీలో?"

"అన్నీ ఎక్కువేనండీ..." నవ్వింది.

"అనూహ్య...చదువాపేశానన్నారు, ఉద్యోగాన్వేషణ లేదన్నారు..మరి, పెళ్లి ప్రయత్నాలేనా?"

"ఒక వేళ...అయితే?"

"నేను అప్లయ్ చేసుకుందామని.."

మౌనంగా ఫోన్ పెట్టేసింది. ఆమె తనువూ, మనసూ,ఉద్విగ్నత తో, సన్నగా కంపించాయి.

మొబైల్ లో...కోయిల మళ్లీమళ్లీ కూస్తూనే ఉంది. శశాంక్ కాల్ కి, కోయిల కూత రింగ్ టోన్ గా, సెట్ చేసింది!!

.....అవును...అంతరంగాన్ని అనురాగంతో స్పృశించి..వసంతాన్ని నింపిన స్వరం శశాంక్ ది!!!!
చాలా సేపటి తరువాత, అతనిదే మెస్సేజ్ వచ్చింది.

"అనూహ్య...సారీ... మన మధ్య పెరిగిన చనువు, సాన్నిహిత్యంతో ఆ ప్రపోజల్ తెచ్చాను. నీకు ఇష్టం లేదని ఎలా అనుకుంటాను? నీ అభ్యంతరం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. నీ ఫోటో చూశాను, అంతరంగం అర్ధమైనది. నీవు నాఫోటో చూశావ్. నాది బ్యాంక్ ఉద్యోగమని, స్వస్థలం ఒంగోలు అయినా ఉండేది బెంగళూరని, నీకు చెప్పాను. ఏమిటి నీ అభ్యంతరం? ఇష్టం లేక పెట్టేశావా, ఇంకేమైనా కారణమా? నేను చాలా బాధ పడ్డాను. నీవు కాల్ చేసే వరకూ నేను చేయను. నీకే కాదు అనూ, నాకూ..అలగటం తెలుసు. బై....శశి.!"

అది చూసిన అనూహ్య  కళ్ళ తోనే....చివర నున్న అక్షరాలను తమకంగా, స్పృశిస్తూ.. ఉండిపోయింది.

రోజులు గడుస్తున్నాయి. శశాంక్ నుండి కాల్స్, మెస్సేజ్ లు లేవు. ఆగలేక పోయింది అనూహ్య. మొబైల్ తీసుకుని టైప్ చేయసాగింది.

"శశీ....అలకా? అయితే ఫరవాలేదు. నువ్వు ఒకే సారి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి.. మాటాడలేక పోయాను. ఇలాంటి విషయాల్లో తొందర పడకూడదు కదా? ఆలోచిద్దాం. నీ పలకరింపు కోసం..ఎంతగా తపించిపోతున్నానో తెలుసా? అలసిన మనస్సులకు ఆత్మీయుల మాట ఎంతోఊరట నిచ్చి,.... ఊపిరులూదుతుంది.
శశీ!
"మనిషికి వరం స్వరం
మనదనిపించే  స్వరం!
పలకరింపుంటే  చాలు!
శేషించిన బ్రతుకులకు
.....అదే  పది  వేలు!!!"

(ఈ వాక్యాలు కూడా, నావి కావు. "జీఎల్లెన్ గార"నే..కవి గారివి. నా భావాన్ని..భాషగా మార్చలేనపుడు వారి, వీరి మాటలు అరువు తెచ్చుకుంటూ ఉంటాను).

సరే...నా మౌనాన్ని మన్నించి కాల్ చేయి. సహస్ర చెవులతో...నిరీక్షిస్తూ... అనూహ్య."

మెస్సేజ్ పంపి మొబైల్ ప్రక్కన పడేసి, పడుకున్నది.

'ప్చ్...ఏమిటో...బొమ్మలు గీయాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుందీ మధ్య' అనుకుంది.

బాగా నిద్రలో ఉన్న అనూహ్య కోయిల కూతలతో..మేలుకుంది.

"వసంతం వచ్చింది !!" తనలో తానే నవ్వుకుంటూ, అనుకుంది.

పనిమనిషి మల్లి, గది తలుపులు తడుతూంది...ఓ సారి మొబైల్ వైపు, తలుపుల వైపూ చూసింది. ముందు వెళ్లి తలుపు తీసింది.

"అమ్మా, పొద్దు గూకుతుంది..మూడు సార్లు పైకి వచ్చాను...నిదుర పోతున్నారని ఎల్లిపోయాను. టీ  తెమ్మంటారా?" అడిగింది మల్లి.

మొబైల్ వేపు చూస్తూ చెప్పింది.

"అర గంటాగి తీసుకురా" అని వెనక్కి వచ్చేసరికి కోయిల కూయటం ఆపేసింది.

“ఏమిటి అప్పుడే వసంతం వెళ్లి పోయిందా...?" నవ్వుకుంటూ తనే రింగ్ చేసింది.

శశాంక్ తీయటం లేదు. మరోసారి, మరోసారి చేసినా సరే అతను ఎత్తటం లేదు. గంట తర్వాత...శశాంక్ నుండి వాయిస్ మెస్సేజ్ వచ్చింది.

"హాయ్...అనూ, నేను బిజీగా వున్నాను. తర్వాత నేనే కాల్ చేస్తాను. ఓకేనా?
బై...యువర్స్...."
ఆ ...అర్ధోక్తి  తరువాత..చిలిపి నవ్వు తో...ఆగిపోయింది.

మళ్లీ మళ్లీ విన్న అనూహ్య ముందు తృప్తిగా నవ్వుకుంది..క్రమంగా ఆమె మోమును...మనస్సును..దిగులు మబ్బు కమ్ముకున్నట్లయింది.

********

మరునాడు ఉదయంపది గంటలకు,
"అమ్మా....." పిలిచింది మల్లి.
"నీకెన్ని సార్లు చెప్పాను? పనిలో వున్నప్పుడు పిలవొద్దని..." విసుగ్గా అంటూనే తలెత్తి చూసింది
అనూహ్య.

మల్లి వెనుకగా ఎవరో అపరిచితుడు. తన ముందున్న సరంజామాను ఒక ప్రక్కకు జరుపుతూ 'ఎవర'న్నట్లుగా చూసింది.

మల్లి ఒకసారి అతని వైపు చూసి, ఆమెతో చెప్పింది,

"మీ  కోసం వచ్చారమ్మా" అని తన పని అయిపోయినట్లుగా, వెళ్ళిపోయింది.

ఆ యువకుడు ఒకింత దిగ్భ్రమగా చూస్తూండి పోయాడు.

"రండి.....మీరు..." తన దగ్గరగా ఉన్న కుర్చీని చేతితో అవతలగా జరుపుతూ అంది.

"నమస్తే   అండీ.." చేతులు జోడించాడు అతను.

"నమస్తే...ఎక్కడి నుండి వస్తున్నారు?" అడిగింది అనూహ్య.

"రాజమండ్రి అండీ,...'రసవాహిని' పత్రిక ఏజెంట్ ను. పనిమీద ఈ ఊరు వచ్చాను, మిమ్మల్ని కూడా చూసి పోదామని... "

"మీ...పేరు..తెలుసు కోవచ్చా?" అడిగింది.

"నా...పేరు... చంద్రం.!" అతని స్వరం లో..సన్నని కంపన..మొహంలో నమ్మలేక పోతున్న భావం...
అనూహ్యకు తెలుసు...ఆర్టిస్టులను....వాళ్ళు...సినిమావాళ్ళు కానీ, రచయితలు, చిత్రకారులు
ఎవరైనా... తామభిమానించే వారు ఎదురైతే...కొంత ఉద్వేగానికి గురవుతారు ..కొంతమంది.

"ముందు కూర్చోండి" చిరునవ్వుతో చెప్పింది.

అతను కూర్చుంటూ, టేబిల్ మీదున్న డ్రాయింగ్ షీట్ వైపూ, అనూహ్య వైపూ తేరిపార చూడ సాగాడు.

అనూహ్య క్రిందకు ఫోన్ చేసి, కాఫీ, టిఫిన్ పంపమని చెబుతుంది..

"వద్దండీ...ఇపుడే చేసి వస్తున్నాను."

"పోనీ....కాస్త కాఫీ అయినా.."

ఇద్దరూ కాఫీ త్రాగుతూ కాసేపు ఆమె చిత్రాల గూర్చి, రసవాహిని పత్రిక గూర్చి మాట్లాడుకున్నారు.
చంద్రం తన బ్యాగులో నుండి ఒక స్వీట్ పాకెట్, సంపంగి పూల పొట్లం తీసి అనూహ్య ముందు పెట్టి
"తీసుకోండి" అన్నాడు.

"అయ్యో...ఇవన్నీ  ఎందుకండీ?" అంది ఇబ్బందిగా.

పల్చగా నవ్వుతూ..అన్నాడు..

"దేవుడి దగ్గరకు, చిన్నపిల్లల దగ్గరకు, పెద్దవారి వద్దకు వెళ్ళేపుడు వట్టి చేతులతో వెళ్లకూడదంటారు కదండీ?"

తడి అరిటాకు లో చుట్టిన తాజా సంపంగి పూలు!!

"సంపంగి పూలు నాకు చాలాయిష్టం అండీ" అంటూ తడితడిగా ఉన్న ఆ పూల పొట్లాన్ని ఎత్తి తన కళ్ళకు ఆన్చుకుంటూ చెప్పింది "థాంక్స్ అండీ!".

చంద్రం లేచి చేతులు జోడిస్తూ "నమస్కారమండీ.. వెళ్ళొస్తాను" చెప్పాడు.

"అలాగే నండీ, అభిమానంతో, శ్రమతీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు!" అంది అనూహ్య.

వెళ్లబోతున్న చంద్రంతో....

"ఒక్క క్షణం ఆగండి..." అంటూ టేబిల్ మీదున్న వాటిలో వెదికి... ఒక చిత్రాన్ని ..తీసింది.

"మీ పేరేమిటన్నారు ?"

"చంద్రం"

చకచక ఏదో గీసింది కొన్ని నిముషాలు...చిరునవ్వుతో అతని చేతికిస్తూ చెప్పింది.

"వట్టి చేతులతో పంపలేను...ప్రస్తుతం పూర్తయిన చిత్రం ఇదే ఉంది, గుర్తుగా ఉంచండి!" అంది.

..అందుకుని కృతజ్ఞతలు తెలుపుతూ, చిత్రాన్ని చూశాడు చంద్రం..

పున్నాగ చెట్టు క్రింద నిలబడిన ఓ యువతి చెట్టుకొమ్మనో చేత్తో పట్టుకుని..మరో చేయి కనుబొమలు
దగ్గర పెట్టుకుని..ఎవరి కోసమో చూస్తుంది. క్రింద కాప్షన్..."నిరీక్షణ".

చిత్రం క్రింద  ఒక మూలగా...మబ్బుల మాటున ఉండి, సగం కనిపిస్తున్న చంద్రుడు...మిగతా సగం ,...అభినందనలతో, అనూహ్య" అనే అక్షరాలనే మబ్బుల రూపంలో గీసింది..

అద్భుతం!!

ఒక సారి అనూహ్య వైపు చూసి, మరో సారి, కృతజ్ఞతలు తెలిపి మౌనంగా మెట్ల వైపు నడిచాడు చంద్రం.

*******

బస్టాండ్ కి వచ్చిన శశాంక్ దూరంగా వెళ్లి, ఒంటరిగా కూర్చున్నాడు....అతనింకా....ఇంకా మామూలు స్థితిలోకి రాలేక పోతున్నాడు.

అనూహ్యను, ఆశ్ఛర్యానందాల్లో ముంచెత్తాలనే ఆశతో, తొలిసారిగా ఊహించని రీతిలో ఎదురుపడాలనే కోరికతో..పనిలో పనిగా ఆమెతో చర్చించి...పెళ్లి నిర్ణయం కూడా తీసుకోవాలనే..నిశ్చయంతో..నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చాడు శశాంక్.

మాటల సందర్భంలో ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం.. సింహాచలం వచ్చి ఇల్లు కనుకున్నాడు.

గేటు దగ్గరున్న కాలింగ్ బెల్ నొక్కగానే...ఒకామె వచ్చింది.

"ఎవరు కావాలి ?"
"అనూహ్య గారిల్లు ఇదేనండీ?"

"అనూహ్య?"

"అవునండీ..పత్రికలో బొమ్మలు..." మధ్యలోనే అందుకుందామె.

"ఓ..ఆమె పేరు "అహల్య"అండీ.. కలం పేరు అనూహ్య.

మీరు ఎవరండీ?" అడిగిందామె.

"నే..ను..పత్రిక ఆఫీస్ నుండి..."

"అలాగా..ఇదుగో..ఈమెట్లు మీదుగా పైకి  వెళ్ళండి..."

"పోనీ, ఒకసారి వారిని క్రిందకు పిలువ గలరా?"

"ఆమె రాలేదండీ...పోలియోతో ఒక కాలు పని చేయదు కదా..క్రచ్చెస్ తో మాటిమాటికి మెట్లు దిగటం కష్టం."

పిడుగు పాటుకు గురైనట్లు..దిమ్మెర పోయాడు శశాంక్ స్థాణువై పోయాడు.

తనేం వింటున్నాడు?? బుర్ర పనిచేయటం లేదు... కాళ్ళు కదలటం లేదు.

"మల్లీ... వీరిని పైకి తీసుకెళ్లు...నేను ఆమెకు తమ్ముడి భార్యను లెండి." అందామె.

"ఏమిటీ...ఈమె..అనూహ్యకు "తమ్ముడి" భార్యా?!!!"

"రండి బాబు..." పిలుస్తుంది మల్లి.

గందర గోళంగా ఉన్న మనస్సును అదుపు చేసుకుంటూ మెట్లు ఎక్కుతూ అనుకున్నాడు శశాంక్..

నన్ను గుర్తు పడుతుందా? చూద్దాం...తనకు పంపిన ఫోటో లో క్లీన్ షేవింగ్ తో వున్నాడు...ఇపుడు
గుబురు గడ్డంతో.... ఓ గది ముందాగారు...

కుర్చీలో కూర్చుని టేబిల్ మీది డ్రాయింగ్ షీట్ లో..ఏదో గీస్తున్న అనూహ్య..కాదు..అహల్య!!

ఆమె ప్రక్కనే కుర్చీకి ఆనించి ఉన్న క్రచ్చెస్! చూడగానే తెలుస్తూంది..వయస్సు నలభై వరకు..ఉండొచ్చని...!!

తనకు పంపిన ఫోటో...ఈమెదే! కాకపోతే....ఇరవై సంవత్సరాల క్రితం....రూపం అది!! అది కూడా...నడుము పై భాగం!!

అల్లకల్లోలంగా ఉన్న...హృదయం లో..ఉవ్వెత్తున లేచి పడుతున్న నిరాశా, నిస్పృహల, కెరటాలను బలవంతంగా అణచుకుంటున్నాడు..

అతని వివేకం...ఆమె వయసును, వైకల్యాన్ని, కళాహృదయం వెనుకనున్న, సహజస్పందనలను, అవరోధాలను... అర్థం చేసుకోమని హెచ్చరిస్తోంది!.....ఇపుడు...తానెవరో  చెబితే..ఆమె పరిస్థితి ఏమిటో ఊహించ లేనంత వెర్రివాడు కాదు. అందుకే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ...నిజం దాచాడు.....

బస్ స్టాండ్ లో ఒంటరిగా కూర్చుని తమాయించుకుంటున్న శశాంక్ కనుల నుండి ధారాపాతంగా జారి పోతున్నాయి ఆశ్రువుల రూపంలోని ఆశలు!!

జేబులో నుండి రుమాలు తీసుకోబోతుండగా...మొబైల్ మ్రోగుతోంది, .....తీసి చూశాడు...అనూహ్య!

అలాగే చూస్తుండి పోయాడు. మోగుతూనే  ఉంది..ఆగి ఆగి...మళ్లీ మళ్లీ...

"ఉహూఁ..ఇపుడు మాట్లాడ లేను...నేను ఆదర్శవంతుడిని కాకపోవచ్చు కానీ అధముడిని కూడా కాదు, అనూ..అహ.. అహల్య గారు..మిమ్మల్ని అర్ధం చేసుకోగలను...

మన స్నేహం ఇలాగే ఉంటుంది, నేనెప్పటికి...మీ అదృశ్య స్నేహితుడు గానే మిగిలిపోతాను, మీరు కోరుకునేది కూడా అదేకదా?" అనుకుంటూ, మొబైల్ తీసి టైప్ చేయసాగాడు శశాంక్.

"బాగా..బిజీగా వున్నాను, క్షమించవూ? తరువాత కాల్ చేస్తా,
ఓ.కే... నా?  బై...శశి.

(తమ 'కవితా పంక్తులను' 'వాడుకోవడానికి అనుమతించిన శ్రీ.గ.ల.నా.సర్ గారికి, సోదరి రా.విజయలక్ష్మి గారికి, కృతజ్ఞతలు).

Posted in April 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!