కృష్ణాతీరాన్న పూజలందుకొంటున్న హరి హరులు
భారతదేశపు ముఖ్యనదులలో కృష్ణానది నాలుగవ పెద్ద నది. పడమటి కనుమలలోని మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహాబలేశ్వరం వద్ద 4300 అడుగుల ఎత్తున ఆవిర్భవించిన ఈ పుణ్య నది సుమారు 850 మైళ్ళు ఆగ్నేయ దిశగా పయనించి, ప్రవాహ మార్గాన్న గల అన్ని ప్రదేశాలకు (మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో) త్రాగునీరు, పంటపొలాలకు జల వనరులని సమకూర్చుతూ, ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవివద్ద బంగాళాఖాతాన్ని చేరుకుంటుంది. సారవంతమైన కృష్ణానది డెల్టా ప్రాంతమంతా సస్యశ్యామలమై, శాతవాహన, ఇక్ష్వాకు, సూర్యవంశరాజులకు కీలకస్థానమై, వారి సాహిత్య సంస్కృతులకు ఆలవాలమై నిలిచింది. ఆ పుణ్య వాహిని అనాదిగా హిందూసనాతనధర్మ, బౌద్ధమత అనుయాయులకు వారి ప్రార్ధనా మందిరాల నిర్మాణానికి ఆలంబనమై నిలిచింది. అందువల్ల నేడు నల్గొండ, కృష్ణ, గుంటూరు జిల్లాలలో వారి నివాస, ఆలయాల శిధిలావశేషాలు లభ్యమవడానికి కారణమైంది.
పురాణకాలము నుంచి ప్రసిద్ధ జ్యోతిర్లింగక్షేత్రములైన శ్రీశైల మల్లేశ్వర ఆలయం, శ్రీ భ్రమరాంబ ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, తరువాతికాలంలో వెలసిన పెద్దకాకాని లోని భ్రమరాంబ మల్లీశ్వర స్వామి ఆలయం, అమరావతి లోని అమరలింగేశ్వర స్వామి, వేదాద్రి యందలి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, త్రికోణేశ్వర స్వామి, కోటప్పకొండ; కోటిలింగ హరిహర మహాక్షేత్రం, ముక్తేశ్వరపురం మున్నగునవి సుందర కృష్ణ తీరాన్న వెలసిన కొన్ని పుణ్యక్షేత్రాలు. వాటిలో కొన్నిటిని దర్శించాలని తలపెట్టాము.
2019 లో అదే కార్తీక మాసం ఆఖరి సోమవారం గనుక పెదకాకాని లోని శ్రీ మల్లేశ్వరస్వామిని అర్చించాలని ఉదయాన్నే హైదరాబాద్ లో కారులో బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరుల మీదుగా మొదట పెద్ద కాకాని చేరుకున్నాము. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు స్థాపింపబడిందో సరిగ్గా తెలియదుగాని వెయ్యేళ్ళ పైనే అవుతుందని వివరించారు అక్కడి పూజారులు. ఆలయానికి తూర్పున 'యజ్ఞాలబావి' అనే దిగుడు బావి ఉంది. దానిని మొదట భరద్వాజ మహర్షి అనేక పుణ్య నదులలో నీరు తెచ్చి బావిలో పోసి దానికి పవిత్రత చేకూర్చాడని తరువాత అక్కడే చాలా యజ్ఞాలు చేసేవాడని చెబుతారు. నేటికి ఆ బావి లోని నీరు అన్ని దీర్ఘకాలిక రోగాలను నయంచేస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాక "కోరిన కోరికలు తీర్చే దేవుడు, కాకాని దేవుడు" అని గట్టిగా నమ్మి పలికే జనవాక్యం. ఇక్కడి దేవుణ్ణి పూజించిన తరువాతే శ్రీ కృష్ణ దేవరాయలకు పుత్రుడు జన్మించాడట. అందుకే శ్రీ మల్లేశ్వరస్వామి సంతాన ప్రదాత అని కూడా చాలామందికి నమ్మకం. యిక్కడ రాహు, కేతు గ్రహాల దోష పరిహారణకై పూజలు జరపడం సామాన్యం గా చూస్తూవుంటాము. మా శ్రీమతి చెబుతున్నా కొట్టిపారేసి ఆఖరి సోమవారం గనుక అక్కడ పెద్దగా జనకూటమి ఉండదన్న నా ధృఢ అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ అక్కడ ఉన్న కిక్కిరిసిన జనకూటమి మా కారుని గుడి దగ్గరకు చేరుకోకుండానే చాలా దూరంలోనే నిలబెట్టేసింది. ఆశతో బయలుదేరిన దేరిన మాకు నిరాశే ఎదురౌతుందేమోననిపించి, దయచూపమని ఆ దేవుడినే మనస్సులో ప్రార్ధించుకున్నాము. అతి కష్టం మీద లోపలి చేరిన మాకు కొల్లేటి చాంతాడంతటి బారులుతీరిన జనరేఖ స్వాగతం బలికింది. ‘జన సందోహం కారణంగా ఆలయం లోపల ఆరోజు శివాభిషేకం చేయుట ఆపివేయడం జరిగినద’ని ఆలయం ముందు ముఖ్య గమనిక వేళ్ళాడదీయడం చూసి నిరాశే నిశ్చయమని తలచి ప్రత్యేక దర్శనం టిక్కట్టు తీసుకుని జనవరుసలో నిల్చున్నాము. గంట గడిచినా వరుసలోని మా స్థితితో ఏమాత్రం పురోగతి లేక ఆ లెక్కని మేము రాత్రికి గాని దర్శనం సాధ్యం కాదనే నిరాశ అధికమవ్వసాగింది. మేము తీరుబడి గా ఆ మహాదేవునికి పంచామృతాభిషేకం చెయ్యాలని తలంచి ప్రత్యేకంగా ఇంటినుంచి గోసామాగ్రితో బయలు దేరిన మాకు మా ఆశ తీరేనా అని అనుమానం పట్టుకుంది. మాపై దయచూపమని ఆ దేవుడినే మనస్సులో ప్రార్ధించుకున్నాము. నాకు ఏదో ప్రేరణ కలిగి శ్రీమతిని లైనులోనే ఉండమని నేను దేవాలయ ఆఫీసుకి వెళ్లి అక్కడ అధికారిని అభ్యర్ధించగా ఆయన మాకు ప్రత్యేక అభిషేకానికై టిక్కట్లు ఇవ్వమని సంబంధిత అధికారికి ఉత్తర్వులు యివ్వడము ఆ టిక్కట్లతో అంతరాలయంలోనికి ప్రవేశం లభించి అతి సమీపంనుంచి లింగ దర్శనం లభించడమే కాకుండా మేము తెచ్చిన ఆవు పాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, అరటి పండుతో రుద్రాభిషేకం చెయ్యడం ఆ పరమేశ్వరుని కృప వల్లనే జరుగుతున్నదనే భావన తృప్తిని యిచ్చి 'నమస్కృతాభీష్ట వరప్రదాభ్యమ్' 'చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం' సకలార్ధ సాధకమనే శ్లోకం గుర్తువచ్చి కృతజ్ఞతలు తెలుపుకుని మరోసారి మనస్సులోనే నమస్కరించి రెట్టింపు ఉత్సాహంతో మంగళగిరి పానకాలస్వామి దర్శనానికి బయలుదేరాము.
పానకాల స్వామి దేవాలయం గుంటూరు-విజయవాడ ముఖ్య రహదారి లో మంగళగిరి వద్ద దేవస్థానం దారిలో ఉంది. కొండపైన పానకాలస్వామి ఆలయం ఉండగా కొండ దిగువున శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఎతైన గాలిగోపురంతో మంగళగిరికి తలమానికంగా ఉంటుంది. ప్రక్కనే ఉన్న ఎత్తైన కొండకి మధ్యలో ఊరివైపు చూస్తూ పానకాలస్వామి ఆలయం ఉంది. దిగువన ఉన్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం పాండవ ప్రథముడు యుధిష్ఠిరునిచే స్థాపింపబడిందనేది స్థల పురాణం. ఈ ప్రసిద్ధ స్థలం క్రీ.పూ 225 లోనే ఉన్నట్టు దాఖలాలున్నా 13వ శతాబ్దం లోని హొయసల రాజుల కాలంలో నిర్మాణం జరిగినట్టు దాని నిర్మాణపద్దతిని బట్టి నిపుణులు నిర్ణయించారు. దీని చరిత్ర బ్రహ్మ వైవర్త పురాణంలో ఉటంకించబడినదట. ప్రస్తుతపు ఆలయ గాలిగోపురం 1807-09 లలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మిచారు. ఆ గాలిగోపురం నాలుగవ అంతస్తు కడుతున్న సమయంలోనే ఒకవైపు వాలిపోతుండం గమనించిన శిల్పులు ఆపి, ఒక కాంచీపురం శిల్పి సలహాపై ప్రక్కనే ఒక నీటి చెరువుని నిర్మించి ఆ వాలిపోవడాన్ని సరిదిద్ది తరువాత మిగిలిన ఏడు అంతస్తులూ, 153 అడుగుల ఎత్తుకి నిర్మాణం పూర్తిచేశారట. పానకాలస్వామి నెలకొని ఉన్న కొండ ఒక నిర్జీవ అగ్నిపర్వతమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కొండ పైన ఆలయములో నరసింహస్వామి విగ్రహం లేదు గాని తెరుచుకున్న నోటి వంటి ఆకారం కొండలోనే యిమిడి ఉంటుంది. దానికి అమర్చి పెట్టిన నరసింహస్వామి ముఖాకారాన్ని కొండ పక్కన పొదిగిన చిత్రంలో చూడవచ్చు. కొండపైకి వెళ్ళబోతూ మధ్యలో పూజా సామాగ్రి, పానకం తీసుకుంటుండగా, వాటిని విక్రయించే యువతి త్వరగా వెళ్ళమని గుడి ద్వారం మూసివేయబడుతుందని తొందర చెయ్యగా, ఇంకా సూర్యస్తమయమైనా కాలేదు ఎందుకు ముందుగా మూసివేస్తున్నారు, ఏదైనా విశేషముందా అని అడిగాను. ఆమె సూర్యాస్తమయం తరువాత దేవతలు వచ్చి ఆ దేవదేవుణ్ణి పూజిస్తారు అందుకని అక్కడ ఎవ్వరిని ఉండనివ్వరని వివరించగా మేము తొందరపడి గుడి లోనికి ప్రవేశించబోతుంటే అప్పుడే పూజారులు ద్వారాలు మూయడానికి సిద్ధమవుతుండడం కనిపించింది. ఇక్కడ భక్తులు ఇచ్చిన ఒక బిందెడు కలిపిన బెల్లపు పానకం ఆ నోటి వలె ఉన్న బిలం లోనికి అర్చకులు వంపుతారు. నిండుదైనా, సగం నిండినదైనా ఆ బిందెలో సగం పోయగానే లోనుండి గుడ-గుడ మని శబ్దం వస్తుంది అది బయట కొంచెం దూరం వరకు అందరికీ వినిపిస్తుంది. ఆశబ్దం రాగానే అర్చకులు ఆపివేసి మిగిలిదానిని భక్తులకు ప్రసాదంగా యిస్తారు. రోజూ ఎందరో భక్తులు పానకము ఇచ్చినా అక్కడ ఒక చీమగాని, ఈగగాని కనబడదనేది ఆశ్చర్యకర విషయం.
తరువాత కొండ క్రింది ఆలయదర్శనం చేసుకుని తరువాతి మజిలీ అయిన అమరావతి లోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకు విజయవాడ వెళ్లాలన్నది మొదట్లో మా యోచన. కానీ అప్పటికే అనుకున్న సమయం దాటిపోవడం వల్ల, అమరలింగేశ్వర స్వామి దర్శనం అంతకు ముందు చాలమారులు చేసుకోవడంవల్ల నేరుగా విజయవాడకి బయలుదేరాము.
విజయవాడలో రాత్రి హోటల్లో బస చేసి తెల్లవారుఝామున తూర్పున మొలుస్తున్న కాంతి పుంజాలు చీకట్లని పూర్తిగా చిమ్మి వేయక ముందే చల్లని ప్రశాంత సమయంలో మాత కనకదుర్గ దర్శనానికి వెళ్ళాము. ఇంద్రకీలాద్రి పై అప్పటికింకా జనకూటమి పెరగలేదు. ప్రత్యేక దర్శనం టిక్కట్లు తీసుకుని ఆలయంలోనికి వెళ్లగా పచ్చని ముఖవర్ఛస్సుతో కాంతులీనుతూ మెరిసిపోతున్న దుర్గమ్మ తల్లిని చూస్తూంటే, ఎంతో ఆనందమయానుభూతి కలిగింది. ఆ తల్లి కరుణామయ వీక్షణాలతో మమ్ములని ఆశీర్వదిస్తున్నట్టనిపించి మా మనస్సులు విచిత్రమైన మధురానుభవానికి లోనయ్యాయి. మమ్మల్నెవరూ తొందర పెట్టకపోవడంతో తీరుబడిగా ఆ తల్లిని
'నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్యపాదారవిందే,నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే'. అని
'రక్షమాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమో ఽ స్తుతే ' అని ప్రార్ధించి,
'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పెద్దమ్మ, సురారులమ్మ, ... దుర్గమాయమ్మ కృపాబ్ధి ...' అని పోతనగారి పద్య సుమంతో పూజిస్తూ, అంతరాలయంలో ప్రార్ధించి గడిపినది కొద్దికాలమైనా ఎంతో తృప్తి నిచ్చింది. తరువాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని మనసారా ప్రార్ధించుకున్నాము. కళ్ళు తెరిచో, మూసుకునో ప్రార్ధిస్తూ ఎదురుగా ఉన్న విగ్రహ పరిధులు దాటి ఆ భౌతిక రూపాని కావల ఉన్న మానవాతీత శక్తిని గాంచి దానిలో మమైక్యమవగలిగితే, మానసికంగా ఆ ఉన్నతశక్తి అనుకంప అనుభవాన్ని పొంద గలిగితే ఆ భగవంతుని ఆశీర్వచనము లభించి ఆ యాత్ర సఫలీకృతమైనట్లే. పిమ్మట కొండపైనుండి కృష్ణాబారేజ్ ని దాని ఎగువున నిండు గర్భణిలా నిండి యున్న జలాశయంతో యున్న కృష్ణవేణిని చూసి మా మనస్సులు ఉల్లాసభరితమయ్యాయి. ఆ దృశ్యం అలా చాలాసేపు చూస్తూనే ఉండిపోయాము.
అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లే NH 65 లో పరిటాలవద్ద 135 అడుగుల ఎత్తుతో గంభీరంగా గదాధారుడై ఆశీర్వదిస్తూ నిలచిన ఆంజనేయునికి నమస్కరించుకుని వేదాద్రి వైపు మా ప్రయాణం సాగించాము.
జగ్గయ్యపేట వద్దనున్న చిల్లకల్లు లో కృష్ణ నానుకుని వేదాద్రి పైన ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం దైవత్వాన్ని స్ఫురింపచేస్తూ ఉండగా కొండలమధ్య మంద గతిని వంపులుతిరుగుతూ ఆ చిరు కెరటాలపై అప్పుడే ఆకాశంలో ఎండతీవ్రతని పెంచుకుంటూ పైకి లేస్తున్న సూర్యుని ధవళ బింబం తళతళ లీనుతూ ప్రకాశిస్తూండగా, ప్రశాంతంగా స్నానఘట్టం మెట్ల ప్రక్కనే పయనిస్తున్ననదీమతల్లి మెరుస్తున్న కిరీటంతో తలవంచి వేదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని, కొండపైన వెలసిన జ్వాలా నరసింహస్వామి యొక్క పాదాలు తాకి నమస్కరిస్తున్నాయా అన్నట్లు ఉన్నది. బ్రహ్మ పురాణం ప్రకారం సోమకాసురుడు బ్రహ్మవద్దనుంచి నాలుగు వేదాలని దొంగిలించి సముద్రగర్భంలో దాచిపెట్టగా బ్రహ్మ తన తండ్రి అయిన విష్ణుని సహాయానికై అర్ధించగా, శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రగర్భాన్న దాగున్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలని బ్రహ్మకి తిరిగి యిచ్చాడట, ఆ వేదాలు మానవ రూపంధరించి తమ శిరముపై కలకాలం ఉండవలసినదిగా అతడిని ప్రార్ధింప, వారి కోరికపై సాలిగ్రామ శిలా కూటమియైన వేదాద్రిపై ఉండేందుకు అంగీకరించాడట. హిరణ్యకశిపుని సంహారానంతరం జ్వాలా నరసింహునిగా అక్కడ వెలసిన మహావిష్ణువు, అల్లాగే కృష్ణ వేణి ప్రార్ధన మేరకు రోజూ పాదార్చనకై అంగీకరించిన శ్రీలక్ష్మీ నారాయణుడుగా వేదాద్రిపై కృష్ణా నదీ తీరాన్న వెలసాడని ప్రతీతి. పురాణకాలంలో ఋష్యశృంగ మహర్షి యిక్కడ లక్ష్మి, నరసింహుల వివాహం జరిపించాడనడానికి కొండపై యున్న శ్రీలక్ష్మినరసింహుల ఆలయం తార్కాణమట.
జగ్గయ్యపేట-ముక్త్యాల రహదారిలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల మహాక్షేత్రానికి చేరుకొని పంచముఖ శివలింగ దర్శనం చేసుకున్నాము. 1980 లో కోటి శివలింగాల స్థాపనకు ప్రారంభించిన కార్యక్రమము ఇంకా సాగుతూనే ఉంది. వెయ్యి రూపాయలు మించని ఖర్చుతో అక్కడ శివలింగ స్థాపనకు ఎవెరికైనా అవకాశం లభిస్తుంది. శివ లింగ స్థాపన ఉదయాన్నే చెయ్యవచ్చు. అక్కడనుంచి ముక్త్యాల జేరుకున్నాము.
హరిహర స్థానంగా పేర్కొనబడే ముక్త్యాలలో హరి చెన్నకేశవునిగాను శివుడు ముక్తీశ్వరునిగాను వెలసి యుండడము మనము చూస్తాము. కృష్ణా తీరాన్న గల బలిచక్రవర్తి యజ్ఞశాలలో వామనునికి మూడవ పాదము నేల ఇచ్చుటకుగాను బలి తన తలని చూపగా వామనుడు తన పాదముతో అతడిని పాతాళమునకు అణచివేసిన కథ మనకి తెలుసు. అప్పుడు శివభక్తుడైన బలి దైనందిన ప్రార్థనలతో అర్చించిన లింగం కృష్ణా నదీతీరాన్న ఉన్నదని అది ఆరునెలలు వరదలలో కృష్ణ నదిలో మునిగి బయట పడిన ఆరునెలలు మాత్రం పూజలకు నోచుకుంటుందని నానుడి.
'కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే;
వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై
బేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిం యశః కాములై;
యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!' అన్న పోతన గారి పద్యం స్ఫురించి, తాను విష్ణుమాయకు బలైపోతున్నాని తెలిసికూడా బలిచక్రవర్తి ఎంతటి ఉదాత్త వాస్తవిక సత్యాన్ని గురువైన శుక్రాచార్యులకే చెప్పగలిగాడన్న భావన ఆయనకు మనస్సులోనే ప్రణమిల్లేలా చేసింది.
దైనందిన ప్రార్థనలకు గాను ఒడ్డున వేరొక శివ లింగ స్థాపన జరిపి దానికి ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు, దాన్నిప్రక్క పటంలో చూడవచ్చు. విష్ణు ప్రతిరూపంగా చెన్నకేశవుడు నిలిచాడని ప్రజల నమ్మకము. ఆవిధముగా హరిహర క్షేత్రం ముక్త్యాలలో వెలసి భక్తులచేత అర్చించబడుతోంది.
మధ్యాహ్నం ఆలస్యంగా బయలు దేరి రాత్రి భోజనం వేళకు ఇంటికి చేరుకొని ఆ యాత్రని తృప్తిగా ముగించాము.