Menu Close
Narendra Babu Singuru
అటు నువ్వే ఇటు నువ్వే : ఇసుక హయా శ్రీ! (కథ)
డా. నరేంద్ర బాబు సింగూరు

ఏమిటి? కధ టైటిల్ ఏదో గందరగోళం లా ఉందనుకుంటున్నారా? మనసు గందరగోళం పడే వయసులో జరిగిన నా అందమైన అనుభవం. కాస్త ప్రేమ గంధం చల్లా!. చదవండి, మీకే తెలుస్తుంది:

***********************************

తెల తెల్లవారుఝాము. సూర్యుడు ప్రసవవేదనలో ఉన్నాడు. నేను పుస్తకాలు చేత పట్టి పరుగు లాంటి నడకతో ఇంటి నుండి బయలు దేరి, నా స్నేహితుని ఇంటికి చేరా. "ఒరేయ్ రాజూ...! తొందరగా రా..రా ట్యూషన్ కి లేటైపోతుంది" అంటూ గాభరా పెట్టా. "వస్తున్నా..." అంటూ వాడి పుస్తకాలు సైకిల్ వెనుక క్యారేజీ కి తగిలించాడు. నేను సైకిల్ ముందు రాడ్ పైన కూర్చున్నాను. "ఊ..ఉ పద పద" అంటూ తొందర పెట్టాను.

అవి మేము తొమ్మిదో తరగతి చదివే రోజులు. మా స్కూల్స్ వేరు, కాని మేము ఉండే వీధి మరియు వెళ్లే ట్యూషన్ మాత్రం ఒక్కటే. వాడికి మాత్రమే సైకిల్ ఉండేది. ఇద్దరం వాడి సైకిల్ పైనే వెళ్ళేది. ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే సైకిల్ పూలింగ్!

పదో తరగతి పాస్ అవ్వాలంటే తొమ్మిది నుండే ట్యూషన్ బెటర్ అని మా అన్నలు పెట్టించారు. శ్రీకాకుళం లో ఫేమస్ మాస్టారు. తెల్లవారు ఝామునే ట్యూషన్ ప్రారంభం. తరువాత స్కూల్ ....ఇల్లు .....ఆట ....చదువు, ఇది మా దిన చర్య. అప్పుడప్పుడు ఒక సినిమా. ఆడుతూ... చదువుతూ... కాలం గడుస్తుంది.

కౌమారం.... పైగా, సినిమా ప్రభావం! మాపై బాగానే ఉంది. అప్పుడప్పుడూ సినిమా విశ్లేషణ కూడా చేసేవాళ్ళం.

వేరు వేరు స్కూల్స్ నుండి వచ్చేవాళ్ళు ఈ ట్యూషన్ కి. అమ్మాయిలు అందరూ ముందు వరస, వెనకాలే అబ్బాయిలు. మాష్టారంటే అందరికీ చాలా భయం. అందరూ కళ్ళు దించుకుని మాట్లాడేవారు, మేము మాత్రం సూటిగా మాస్టారి కళ్ళ వైపు చూసి మాట్లాడేవాళ్ళం. మేము ఆయన దృష్టిలో పడ్డాం! అందుకే దృష్టి మరల్చలేకపోతున్నాం, మనసు ఎంత మొర పెట్టినా!

మా ట్యూషన్ లో ఇట్టే ఆకట్టుకునే అందమైన అమ్మాయి. తనది వేరే స్కూల్. కళ్ళు తిప్పుకోనివ్వని అందం ఆమెది. మేము చూసిన...మాకు తెలిసిన... ఆమే...అపురూప సుందరి! సినిమా భాషలో చెప్పాలంటే జగదేకసుందరి. మేము పెట్టిన పేరు మాత్రం "ఎక్స్ ప్రెస్ సుందరి". ఎందుకంటే తను సైకిల్ చాలా...చాలా.. ఫాస్ట్ ..గా తొక్కుతుంది .

ట్యూషన్ వదిలాక ఓరగా ...ఆరాధనగా ...చూసేవాళ్ళం ఆ అమ్మాయి వంక. అసలు కొంచెం కూడా కనికరం లేదాయే. అసలు మమ్మల్ని పట్టించుకునేది కాదు. ఎంతైనా జగదేక సుందరి కదా!

ఒక రోజు ఎక్స్ ప్రెస్ సుందరి తో ఎలాగైనా...ఏదో ఒకటి, ఏదో ఒక వంక, మాట్లాడాలని నిర్ణయంచుకున్నా. ట్యూషన్ అయ్యింది, అందర్నీ తోసుకుంటూ ముందుగా బయటకు వచ్చేసా. నేను ఆమె సైకిల్ మీద కూర్చున్నా! ఆమె మెల్లగా..  దగ్గరగా... వస్తుంది. ఆమె రావడం చూసి నా గుండె వేగంగా కొట్టుకోడం మొదలు పెట్టింది. తను దగ్గరవుతున్న కొద్దీ... నా గుండె వేగం ఇంకా పెరగసాగింది. ఎదురుగా వచ్చేసరికి గుండె ఆగినంత పనయ్యింది! కనుబొమలు ఎగరేసి "సైకిల్...నాది.." అని. కాస్త తీయని..కమాండింగ్ స్వరంతో అంది. నేను తడబడుతూ... “సారీ... మా ఫ్రెండ్.. ది.. అనుకుని.. కూర్చున్నా" అన్నాను. తను ఠక్కున "అదుగో...డబ్బా సైకిల్..అదీ  మీది.." అంటూ విసురుగా తన సైకిల్ తీసుకుని సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్స్ లా వేగంగా వెళ్ళిపోయింది. నిశ్చేష్టులవడం మా వంతయ్యింది. కాని మాకు ఒక విషయం మాత్రం అర్ధం అయ్యింది. మమ్మల్ని కూడా.. గమనిస్తుందని. ఎందుకో ఏదో తెలియని అనుభూతి, ఆనందం. కానీ నా గుండె వేగం అలానే ఉంది చాలాసేపు.

మరుసటిరోజు తొందరగా బయలుదేరాం. తను వచ్చే దారి మాకు తెలుసు, అందుకే బరాటం వీధి సందు మలుపులో..టీ త్రాగుతూ వెయిటింగ్.

సైకిల్ బెల్ కొడుతూ... రయ్ మని దాటుకు వెళ్ళిపోయింది, కొంటెగా మమ్మల్ని చూస్తూ! సైకిల్ పైన మేము డబుల్స్. రాజు తన శక్తినంతా కూడబెట్టి విశ్వప్రయత్నం చేసాడు. కానీ ఆమె వేగాన్ని అందుకోలేక పోయాం. తనే ముందు చేరింది. తన చిరునవ్వుని మాత్రం అందుకున్నాము. అదో ఊరట! కానీ  ట్యూషన్లో ఆ రోజు ధ్యాస లేక ..మాస్టారి తిట్లు..చీవాట్లు  కూడా అందుకున్నాము. ఎందుకో... మేము నెమ్మదిగా బయటికి వచ్చాం తనకి కనపడకూడదని.

ఆదివారం శెలవు.

సోమవారం మళ్ళా అదే ప్రయత్నం. అన్నీ మర్చిపోయి. గతం గతః . ఈ సారి దగ్గరగా వచ్చామో...  లేక తనే స్లో అయ్యిందో..... అర్థం కాలేదు, మమ్మల్ని చూసి "నన్ను ఓడించండి, మీకో గిఫ్ట్ ఇస్తాను" అంటూ వయ్యారంగా ముఖం తిప్పి ఝమ్మని వెళ్ళిపోయింది. తొమ్మిదో తరగతి పరీక్షలు వచ్చేసాయి, కానీ మేము ఓడించలేక పోయాం. పరీక్షల హడావిడి ముగిసింది. ఈ సంధి కాలం, టీ కొట్టుని అడ్డాగా మార్చింది తనకై వెతుకులాటలో.

ఇక పదో తరగతి కొచ్చాం. ఏదో పెద్దతరహా ఫీలింగ్ అలానే తెలియని భయం ఎందుకంటే ఇక వ్రాయబోయేది పబ్లిక్ పరీక్షలు. పదవ తరగతి ప్రతి విద్యార్ధి విద్యా గమనం లో మరువలేని మలుపు. సరాసరి అన్ని ఫీలింగ్స్ ఇక్కడే మొదలవుతాయి.

స్కూల్ సెలవులైనా ట్యూషన్ ముందే మొదలయ్యింది. ఇక రుద్ధుడే రుద్దుడు. ట్యూషన్ ఇప్పుడు రెండు బ్యాచ్ లు, మాది మొదటి బ్యాచ్. పదోతరగతి ట్యూషన్ మొదటిరోజు. మా కళ్ళు ఎక్స్ ప్రెస్ సుందరి కోసం వెతికాయ్, కనపడింది. ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. చిరునవ్వులే పరిభాష.

బయటికి వొచ్చాక, వెనకనుండి తీయని స్వరం పిలుపు .."హలో" అని, వెనక్కి తిరిగి చూసా. ఎక్స్ ప్రెస్ సుందరి! "హాయ్" అని గద్గద స్వరంతో పలరించాను. నా స్నేహితుడి పరిస్థితి అంతే! "మీ పేర్లు ఏంటీ?" అంటూ తన పేరు చెప్పింది. ముఖంలో లక్ష్మీకళని సూర్యుని పడమటి వార్పులో కలిపి తనకీ పేరు పెట్టారా??? అని అనుకున్నాం. మా పేర్లు చెప్పాము. "ఎల్లుండి నా బర్త్ డే, మీరిద్దరూ రావాలి ... సరేనా?" అంటూ...తన ఇంటి అడ్రస్ చెప్పింది. మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఏదో సాధించిన ఫీలింగ్. సైకిల్ పైన వెళ్తున్నా.... గాలిలో తేలుతున్నట్టు అనిపించింది.

మరుసటి రోజు మాటలు కలిపాము. కొంత దూరం సైకిల్ నడిపిస్తూ వెళ్ళాం. రోడ్డు రాగానే తను బై చెప్పి, "మర్చిపోకండి ..రేపు ..నా బర్త్ డే" అంటూ రయ్ మని వెళ్లి పోయింది. మా ఆనందానికి అవధులు లేవు.

గిఫ్ట్ ఏమివ్వాలా అని తెగ ఆలోచించాం. ఆఖరికి డిసైడ్ అయ్యాం. బొమ్మ గిఫ్ట్ ఇద్దరిది, గ్రీటింగ్ కార్డ్ నా ఒక్కడిదే! ఈ తేడా ఎందుకో మీకు ఆర్థమయ్యుంటుంది అనుకుంటా!

గిఫ్ట్ రెడీ చేసాం. ఒకటి ఎండిన తాటి పండుతో బొమ్మ. ఇంకొకటి గ్రీటింగ్ కార్డ్. హృదయాంతర భావాలతో గ్రీటింగ్ కార్డ్ మొత్తం నింపేసాను. ఎందుకైనా మంచిదని తనకి వెంటనే అర్థం కాకూడదని కోడ్ లాంగ్వేజ్ లో వ్రాసాను. పదాల్ని ..తెలుగుని ఇంగ్లీష్ లో.. ఇంగ్లీష్ ని..ఇంగ్లీష్ గా తెలుగులో..తెలుగు పర్యాయ పదాలతో ఒక పద్ధతిలో వ్రాసాను. తను తెలుసుకోడానికి ఎంత ట్రై చేస్తుందో? నన్ను ఎంత బతిమాలుతుందో? అనే ఊహే గొప్పగా అనిపించింది. కానీ ఎక్కడో... ఏదో మూలన...రవ్వంత అనుమానం. ఇంకా ఎవరెవరిని పిలిచిందో ..ఆమె మనసులో ఏముందో ..తెలుసుకోక ...మాకు మేమే గొప్పగా ఊహించుకుని వెళ్తున్నామా? అని.

సరే వెళ్ళాక చూద్దాం, అనుకూలంగా ఉంటే రెండు గిఫ్ట్స్ ఇద్దాం లేకపోతే ఒకటే! అని మమ్మల్ని మేమే సముదాయించుకున్నాం.

ఉన్నదాంట్లో మంచి డ్రెస్ వేసుకుని తన ఇంటికి చేరుకున్నాం. ద్వారం దగ్గర నిలుచున్నాం, లోపలి వెళ్లాలా...వద్దా?...అన్న సందిగ్థములో. లోపల్ని నుండి "ద్వార పాలకులా నిల్చున్నారేం? లోపలికి రండి"  అది ఆరుపా ..పిలుపా ..అర్థం కాక లోపలికి వెళ్ళాం. వాళ్ళ అమ్మ అరుపు ..అదే... పిలుపు. బిడియంతో ఓ మూలన సెటిల్ అయ్యాం. తను మా దగ్గరకొచ్చి "రండి" అంటూ ఇల్లు చూపించింది "ఇది నా గది, కూర్చోండి" అంది. ఇంట్లో కాస్త హడావిడి కనపడింది. తన ఫ్రెండ్స్ ని లిమిటెడ్ గా పిలిచినట్టుంది. అబ్బాయిలం మేమే! కాస్తా మనసు కుదుట పడింది.

అప్పట్లో కేక్ కట్టింగ్స్ లేవు. వచ్చిన వాళ్ళకి పాయసం, పులిహోర, గారెలు.. బూరెలు. మాకు పళ్లెం నిండా పెట్టి తెచ్చింది. మేము విషెస్ చెప్పలేదు ఇంకా గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. మాకు పెట్టినవి తినేసి కూర్చున్నాం.

పెద్ద ఇల్లు. తన గది కూడా పెద్దదే. గది నిండా పాటల కాస్సెట్స్, మ్యూజిక్ సిస్టం. వాళ్ళ స్థితి చూసాక ఎందుకో తెలీని గిల్టీ ఫీలింగ్, ఎక్కువ తక్కువ అనే భావన. మమ్మల్ని అభిమానంతో పిలిచిందన్న ఆరాధన, ఒక వైపు తన మీద పెంచుకున్న ఆశ. మనసెందుకో గందరగోళం గా ఉంది. వాడికి అదే చెప్పా. వాడు నాకు ధైర్యం చెప్పాడు. "పద గిఫ్ట్ ఇచ్చి వెళ్దాం" అన్నాడు.

తను గది లోకి రాగానే "హ్యాపీ బర్త్ డే" అంటూ బొమ్మ చేతిలో పెట్టాం. గ్రీటింగ్ కార్డు ఇచ్చే ధైర్యం చాలక వెనుకన దాచేసా. "ఓహ్ చాలా బాగుంది" అంటూ "గ్రీటింగ్ కార్డు తెచ్చారుగా ఏది?" అంటూ దాచిపెట్టిన కార్డు లాక్కుంది. మళ్ళీ నా గుండె వేగం పెంచింది.

తను తెరచి "పదాలు అర్థం కావడం లేదు. కోడ్ లాంగ్వేజ్ కదా?. కనిపెడతా!" అంది. నా గుండె వేగం కాస్తా తగ్గించింది.

"ఇసుక... హయా... శ్రీ నా? ...నాకో కొత్తపేరా? ... ఎక్స్ ప్రెస్ సుందరి ..అని  పెట్టారుగా? మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం.

"నాకు తెలుసు. మీరు ట్యూషన్ లో మాట్లాడేదంతా. ఒక్క నిమషం హాల్లోకి పదండి మీకే తెలుస్తుంది"

"జ్యోస్నా" అంటూ తన ఫ్రెండ్ ని పిలిచింది.

"హా! శాండ్ వస్తున్నా" అంటూ మా దగ్గరకు వచ్చింది. మేం అవాక్కైయ్యాము. ట్యూషన్ లో మా ముందు వరస. ఓర్నీ మన మాటలన్నీ మోసేది ఈ అమ్మాయా! అనుకున్నాం. తనని మాకు పరిచయం చేసింది.

ఏకాంతం దొరకలేదు మనసు విప్పడానికి.

నా మనసులో మాట ఏమీ చెప్పకుండా వెళ్తున్నామని, ముభావంగా "వెళ్తాము" అన్నాం. వెంటనే "వెళ్లొస్తాం అనాలి" అంటూ అదే అరుపు ..దూరంనుండి వాళ్ళ అమ్మ ..ఏ గది లో ఉందో గాని. ఇంతలో "నరేంద్రా ఆగు .. కందిపొడి నీకిష్టమని మా అమ్మతో చేయించా, తెస్తా, గది లో కూర్చోండి" అంటూ జ్యోస్నా ని తనతో లోపలికి తీసుకెళ్లింది.

నా ఆశ మళ్ళీ చిగురించింది. ఇదే సమయం. మనసులో మాట చెప్పి తన ముఖం ఎలా వెలుగుతుందో చూడాలని తహ తహ. వాడితో చెప్పా! ఇక నన్ను ఆపొద్దు అని.

ఇంతలో .. ఆజానుబాహుడు, హీరోలా ఉన్నాడు (మాకు మాత్రమే విలన్) గది లోపలికొచ్చాడు. మా కంటే పెద్ద వయసు. మమ్మల్ని చూసి ప్రశ్నర్ధాకంగా ముఖం పెట్టాడు. చేతిలో రంగుల కాగితం కప్పిన గిఫ్ట్. అర్థం అయ్యింది బర్త్ డే కి వచ్చాడని. అతని రాకను చూసి తను పరుగు లాంటి నడకతో వచ్చింది. అతనిని చూసి ఆమె ముఖం ఒక్క సారిగా విప్పారింది. ముఖం లో సిగ్గు. కళ్ళలో కొంటెతనం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మమ్మల్ని చూసినప్పుడు ఇవేం మాకు కనపడలేదు. నా కళ్ళ ముందు తెరలు నెమ్మదిగా...లేస్తున్నాయి...కాదు ..కాదు ఆశల పొరలు తొలగుతున్నాయి.

అతను గిఫ్ట్ ఇస్తూ.. "నీ కిష్టమైన పాటలు" అంటూ ఇచ్చాడు. మేము అక్కడే ఉన్న సంగతి మరిచి... కళ్ళ తో సంభాషించుకుంటున్నారు, ముని వేళ్ళతో పోట్లాడుకుంటున్నారు. సినిమా జ్ఞానం... మాకు అర్థమయ్యింది. నాలో తెలియని బాధ!!!. అసూయ, కోపం వాడి పైన. ఆపుకో లేక పోతున్న.

మా అలికిడికి ఉలిక్కి పడి చూసాడు. ఆమె వెంటనే తేరుకుని మమ్మల్ని చూపిస్తూ..కంగారు కలిసిన స్వరంతో "ఫ్రెండ్స్ - ట్యూషన్ మేట్స్" అంది. మమ్మల్ని అదోలా చూస్తూ, విష్ కూడా చెయ్యకుండా తనతో "మళ్ళీ వస్తా" అంటూ అతను వెనుదిరిగాడు.

ఎందుకో తెలీదు నేను వెంటనే "ఎవరతను?" ఏదో పోగొట్టుకున్న వాడిలా కొంత ఆర్ధ్రత నిండిన స్వరంతో అడిగా. తను షాక్ అయ్యింది నా ప్రశ్నకి ..అదే ..నేను అలా అడిగానని. తనే కొంత తేరుకుని .."నా ఫ్రెండ్. అంత కంటే ఎక్కువ... నా మనసుకి నచ్చిన మనిషి" అంటూ కాస్త కఠినత్వం కూడిన స్వరంతో చెప్పింది. ఈ మాటలు కి నాలో ఉవ్వెత్తిన ఎగిసిన  ప్రేమ అలలు ...తీరం తాకని అలలలా ...వెను దిరిగాయి.

రాజు నా చేయ్యపట్టుకుని.. పక్కకు తీసుకు వెళ్లి "ఒరేయ్ మనకెందుకురా ఇవన్నీ, వదిలేయ్. మనకొక మంచి ఫ్రెండ్ దొరికందని ఆనందిద్దాం. ఎవరి ఆశలు వారివి. ఇక పోదాం పద" అన్నాడు.

ఇంతలో తనే దగ్గరకు వచ్చి "మీరు నా మంచి ఫ్రెండ్స్ అని మీకు మాత్రమే చెప్పాను. ఎవరికీ చెప్పకండి ప్లీజ్" అంటూ ప్రాధేయ పడింది. "అలాగే" అంటూ ముఖం నిస్తేజంగా పెట్టి బయలుదేరాం. కందిపొడి చేతికిచ్చి ద్వారం దగ్గర నిల్చుంది ముఖం లో చిరునవ్వుతో... ఏమీ జరగనట్టు. ఏమీ ఎరగనట్టు.

ఎంతో ఆశ నింపుకుని వచ్చాను. ఎలాగైనా "ఇటునువ్వే ..అటునువ్వే ఎటు చూసినా నువ్వే ..నీ  నవ్వే.....".అని మనసులోని భావాలను చెప్పి, మనసులో ఆనందం నింపుకుని వెళ్తాను అని అనుకున్నాను. కానీ ..ఇలా... చేతిలో కందిపొడితో !!!??

ఏమీ అర్థం కాలేదు. నా కళ్ళలో కనపడని కన్నీరు. ఆర్ద్రత కూడిన చిరునవ్వుతో బయటికి వచ్చా..సాయం సంధ్య వేళ. తన ఇంటినుండి ..నా మనసు పడే ఆశ నుండి!

"ఇసుక... హయా... శ్రీ ????  కోడ్ లాంగ్వేజ్ కని పెట్టారుగా??!

(ఎక్కడో నా హృదయాంతరాలలో... దాగి ఉన్న చిన్న అందమైన అనుభవం! ఈ అవకాశంతో బయటకు వచ్చింది. రప్పించినందుకు సిరిమల్లె కు, చదివినందుకు మీకు నా ఈ కధలో భాగమైన నా చిన్ననాటి మిత్రుడు పట్నాల పైడి రాజుకి నా మనః పూర్వక ధన్యవాదాలు)

********

Posted in October 2023, కథలు

3 Comments

  1. pydiraju patnala

    ఆ రోజుల్ని “ఇంతుందా మన కౌమారంలో” అనేలా మలచిన తీరు అద్భుతం…! పదబంధం లో నా మిత్రుడు

  2. పైడిరాజు పట్నాల...

    నా బాల్య(మిత్రుడు) ఆనాటి అనుభవాలు కళ్ళకు సొంపుగా చూపించిన నరి కి(నరికి కాదు) అభినందనలు,.. డా. నరేంద్ర..

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!