Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

10. అశోకుడు

గత సంచికలో అశోక చక్రవర్తి తన ఆధ్వర్యంలో బీహార్ లో నెలకొల్పిన లారియా-నందన్ గర్హ్, లారియా అరారాజ్ స్థంభాలు మరియు ఆంధ్రదేశంలో కృష్ణా నదీ తీరాన ధాన్యకటకం/ధరణికోట (అమరావతి) స్థూపం గురించిన వివరాలు తెలుసుకోవటం జరిగింది. ఈ సంచికలో బౌద్ధమత వ్యాప్తికి అశోకుడు ప్రారంభించిన, నిర్వహించిన కార్యక్రమాల గురించి, నీతి, న్యాయం విషయాలలో తీసుకున్న నిర్ణయాలు, అయన ప్రర్తించిన తీరు, తదితర సంగతుల గురించి తెలుసుకుందాము.

బౌద్ధ ధర్మం పోషణ, అభివృద్ధి, ప్రచారం

క్రీ.పూ. 268 లో చక్రవర్తిగా మౌర్య సింహాసనం అదిష్టించిన తరువాత 8-9 ఏళ్లకు (క్రీ.పూ. 260-259) అశోకుడు బీహార్ లోని ‘గయ’ వెళ్లి అచ్చట ‘మహాబోధి’ వృక్షాన్ని దర్శించి, గౌతమ బుద్ధ బోధించిన ధర్మ సూత్రాలను ప్రచారం చేయటంతో పాటు అనేక సంఘ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టటం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలలో ముఖ్యమైనవి మానవులకు, పశువులకు వైద్య సౌకర్యాలు కల్పించటం; వైద్య మూలిక, ఔషధ మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించటం; బావులను త్రవ్వించటం; రహదారుల ప్రక్కన చెట్లను నాటించటం; తదితరమైనవి. ఈ కార్యక్రమాలను తన రాజ్యంలోనే గాక, ఇరుగు పొరుగు రాజ్యాలలోనూ (చోళ, పాండ్య, సత్యపుత్ర, తామ్రపర్ణి, గ్రీకు) నిర్వహించేటట్లు చేయటం జరిగింది.

తన పాలనలో 10-11 వ ఏట (క్రీ.పూ. 258-257) అశోకుడు బౌద్ధ సంఘంకు దగ్గరగా జరిగి 256 రోజులు పాటు తన రాజ్యం అంతా తిరిగి బౌద్ధ ధర్మ సభలు నిర్వహించటం జరిగింది. 12 వ ఏట (క్రీ.పూ.

256) ఆయన బౌద్ధ ధర్మం గురించిన శాసనాలను అనేక రూపాలలో చెక్కించి వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను నిర్వహించమని తన అధికారులను (రజ్జుకలు, ప్రదేశికారులు) ఆజ్ఞాపించి, వారిని

తమ అధికార పరిమితి ప్రదేశాలలో పర్యటించి ధర్మబోధనలను పరీక్షించి, తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే ఏట ‘ధర్మ మహామాత్ర’ ఉద్యోగిని నియమించి బౌద్ధ ధర్మాన్ని ప్రజలలోకి మరింత వ్యాప్తి చేయాలని ఆయనను ఆదేశించాడు. 14 వ ఏట గౌతమ బుద్ధుడి పూర్వ జన్మలో (23 వ జన్మలో) అవతరించిన Koṇāgamana Buddha (కొణాగమన బుద్ధ; బుద్ధ కనకముని)

(Kanakamuni) విగ్రహాన్ని భారీ పరిమాణంలో నెలకొల్పటం జరిగింది. ఈ కనకముని బుద్ధుడి పేరు మీదనే నేపాల్ లోని ‘లుంబిని’ కి 20 కి.మీ. దూరంలో వాయువ్య దిశలో ఉన్న నిగాలి సాగర్ లో ‘నిగాలి సాగర్’ ధర్మ స్థంభం నెలకొల్పబడింది.

మూడవ బౌద్ధ ప్రతినిధుల సభ (Third Buddhist Council)

అశోకుడి కాలం ముందునుంచి బౌద్ధ సన్యాసులలో విభేదాలు పొడచూపి ఆయన కాలంలో అవి మరింత తీవ్రమైనాయి. నిజమైన సన్యాసులు-నకిలీ సన్యాసుల మధ్య ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనిని భరించలేక అశోకుడు అందరు గౌరవించే బౌద్ధ సన్యాసి, పాటలీపుత్ర వాసి అయిన “మొగ్గలి పుత్త్ర-తిస్స” ను (Moggaliputta-Tissa) ఆహ్వానించి బౌద్ధ మతాన్ని ప్రక్షాళన చేయమని కోరటం జరిగింది. ఈయన వెంటనే వేలాది నకిలీ సన్యాసులను బహిష్కరించి, కొందరిని బౌద్ధ వస్త్ర-రహితులుగా చేసి, మరి కొందరిని మట్టుబెట్టి, బౌద్ధ ధర్మాన్ని ప్రక్షాళన గావించాడు. ఆ తరువాత ‘ఉపోసత’ వేడుక (Uposatha Ceremony) కార్యాన్ని నిర్వహించాడు.

తదుపరి అశోకుడి ఆజ్ఞతో ఆయన అనేక మంది నిజమైన బౌద్ధ సన్యాసులను ఆహ్వానించి మూడవ బౌద్ధ ప్రతినిధుల సభను అశోకుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభలో గౌతమ బుద్ధ ఉపదేశాల గురించి వివరంగా చర్చ జరిగింది. వీటిని అనుసరించి బుద్ధుడు ఉపదేశించిన “తెర వాద (స్థవీరవాద) బుద్ధిజం” {Theravada/Sthaviravāda Buddhism; (Sect of the Elders)} కు అత్యధిక స్పందన, మద్దతు లభించింది. సన్యాస జీవితానికి అతి ముఖ్యమైన ‘ధ్యానం’, ‘ఏకాగ్రత’ అత్యవసరం అని ఆయన బోధించటం జరిగింది. అప్పటికి ఆయన రాజు అయి 17 ఏళ్ళు పూర్తి అయ్యాయి.

బౌద్ధ ధర్మ వ్యాప్తి  

మొగలిపుత్ర-తిస్స సలహా మీద అశోకుడు పొరుగు దేశాలలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి తొమ్మిది బౌద్ధ ప్రతినిధి బృందాలను క్రీ.పూ. 250 లో పంపించటం జరిగింది. ఒక్కొక్క బృందం 5 గురు సన్యాసులున్నారు. అనుభవజ్ఞులైన సన్యాసుల ఆధ్వర్యంలో ఈ బృందాలు వెళ్లాయి. శ్రీలంకకు వెళ్లిన బృందంలో అశోకుడు తన జ్యేష్ఠ పుత్రుడు (ప్రధమ భార్య, పట్టపు రాణి ‘దేవి’ పుత్రుడు) మహీంద్ర (మ హీంద) తో పాటు మరో నలుగురు సన్యాసులను (ఇత్థియా, ఉత్థియా, శంబాలా, బద్ధశల) పంపించాడు. ఈ బృందం శ్రీలంకకు అశోకుడి పాలనలో 18 వ ఏట వెళ్ళింది.

అదే ఏట (క్రీ.పూ. 250 లో) అశోకుడు ఇటువంటి బౌద్ధ ధర్మ బృందాలను కాశ్మీర్, గాంధార (ఆఫ్గనిస్తాన్), హిమాలయ, గ్రీకు, సువర్ణభూమి (బర్మా, థాయిలాండ్), వనవాస (ఉత్తర కెనరా ప్రాంతం: కర్ణాటక), అపరాంతక (పశ్చిమ తీరంలోని కొంకణ రాజ్యం) రాజ్యాలకు కూడా పంపించటం జరిగింది.

పాలనలో 19వ ఏట (క్రీ.పూ. 249 లో) శ్రీ లంక రాజు 'దేవనామప్రియ తిస్స" కోరిక మేరకు అశోకుడు తన పుత్రిక “సంఘమిత్ర” (సంఘమిత్త; మహీంద్ర సోదరి) తో ఒక బోధి వృక్షాన్ని శ్రీలంకకు పంపించి అచ్చట ఆమెతో నాటించాడు. ఈ బౌద్ధ భిక్షుణి అచట అనేక మంది స్త్రీలను బౌద్ధ సన్యాసినులుగా మార్చటం జరిగింది.

అశోకుడి కృషి వల్లనే అంతర్గత వివాదాలవల్ల, కుమ్ములాటలవల్ల క్షిణించిపోతున్న బౌద్ధ ధర్మం ఒక మతంగా నిలబడిందని చరిత్రకారులు ఘంటాపధంగా చెప్పటం జరిగింది.

బౌద్ధ ధర్మం స్వీకరించినప్పటి నుంచి అశోక మౌర్య ప్రజలలో నైతికత పెంపొందించటానికి ఆనందం, సంతోషం, సుఖం అత్యవసరం కనుక వాటిని పెంచటానికి గట్టి కృషి చేయటం జరిగింది. ఈ సుఖ సంతోషాలు ఉండాలంటే “నీతి యెడల మక్కువ, విధేయత, అణకువ, పాపభీతి, అత్యధిక శక్తి, ఉత్సాహం, పరిశీలనా నేర్పు” తప్పని సరి. కాని ఆయన దృష్టిలో అత్యధిక ప్రజలు ఈ కోవలో లేనందువల్ల, వారికి బోధనలు జరిపి, శిక్షణ ఇచ్చి; వారిని ప్రోత్సహించి; తరువాత వారి ప్రవర్తనలను పర్యవేక్షించటం జరిగింది. ఈ పని నిర్వహించటానికి భౌద్ధ ధర్మాన్ని పాటించే రాజాధికారులు, మహామాత్రలు, తదితర అధికారులను అశోకుడు నియమించాడు. తాను నమ్మిన బౌద్ధ ధర్మాన్ని కొంతమంది ప్రజలు అనుసరించనప్పుడు, తిరస్కరించినప్పుడు అశోకుడు వారిని హింసలకు బలి చేయటం కూడా జరిగింది. ఈ క్రమంలో నరమేధం భారీగానే జరిగింది. ఆయన కోపానికి ముఖ్యంగా అజీవికలు {(నాస్తికులు; విధిని మాత్రం నమ్మే, (కర్మను-నమ్మని) యాచకులు)} బలి అయ్యారు. ఈ క్రమంలో సుమారు 18,000 అజీవికలు బలి అయ్యారు. అశోకుడి కోపానికి బలి అయి శిరచ్చేదన గావించబడిన వారిలో తన తమ్ముడు (జైన/జీన) మతస్థుడు, తన తల్లి రెండవ పుత్రుడు “వితాశోక” (Vitasoka) ఒకరు. ఇది తెలిసిన తరువాత అశోకుడు అమితంగా దుఃఖించి తన ఆజ్ఞను ఉపసంహరించటం జరిగింది.

ఇది జరిగిన తరువాత తన అత్యంత హేయమైన పాలనను, అభిప్రాయాలను విసర్జించి దయా పూరిత పాలనను ప్రారంభించటం జరిగింది. అలా అని తన పరిపాలనలో మరణ శిక్ష పూర్తిగా విడనాడలేదు. ఇది హంతకులకు, దొంగలకు, హేయమైన నేరాలకు పాల్పడినవారికి మాత్రమే పరిమిత మయింది. ఈ శిక్ష అమలు జరిపేముందు ఖైదీకి, అతని బంధువులకు 3 రోజులు వ్యవధిలో నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. ఈ విరామం వల్ల ఖైదీ నిరపరాధి అయితే ఆవ్యక్తి మామూలు జీవితం గడపటానికి వీలవుతుంది. ఒక వేళ అపరాధి అయితే, మరణించే లోపల, దైవ చింతన, ప్రార్ధన, ఉపవాసం, మొదలగు వాటిని అమలు పరచుకోటానికి సమయం ఉంటుంది. ఇవి జరిపితే ఆవ్యక్తికి పైలోకంలో అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మరణశిక్ష పట్ల అశోకుడికి చాలా సందిగ్ధత ఉన్నా, దానిని మాత్రం నిర్ములించలేదు. కాని సుదీర్ఘ పాలనాకాలంలో 25 సందర్భాలలో మాత్రం ఆయన మృత్యుద్వారం వద్ద ఉన్న అనేకమంది ఖైదీలను విడుదల చేయటం, మరి కొందరికి శిక్ష తగ్గించటం జరిగింది.

పరిపాలనలో తనకు తన పితామహుడు, తండ్రికి మధ్య ఉన్న వ్యత్యాసం

అశోకుడు అందించిన అనేక శాసనాల ద్వారా గత పాలకులకు (తన పితామహుడు చంద్రగుప్త, తండ్రి బిందుసార) తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అన్వేషించటం జరిగింది. వారు “మానవులలో కేవలం ‘నైతికత’ను పెంపొందిస్తే చాలు, వారు పురోభివృద్ధి సాధించగలరు” అనేది కాంక్షించారు. కాని వారు అనుకున్నంతగా సాధించలేకపోయారు.

దీనిని గమనించి, పరిశీలించి వారు ఎచ్చట విఫలం అయ్యారో తెలుసుకున్న తరువాత, తాను ఏవిధంగా ప్రజల అభివృద్ధిని పెంపొందించగలనో అని ఆలోచించటం జరిగింది. దానికి అనుగుణంగా తన ఆలోచనలను, సూచనలను, ఆజ్ఞలను, ఉత్తరువులను శిలా శాసనలద్వారా తెలియ జేసి, వాటి ఆచరణలను తన మంత్రులు, మహామాత్రులు, అధికారులను భాద్యులుగా చేయటం జరిగింది. విఫలాలను మూటగట్టుకున్న అధికారులకు దండనలు విధించటం కూడా జరిగింది.

భూత దయ

తన ప్రజల యెడల ఎంతో కర్కశంగా ఉన్నా, లక్షలాది కళింగుల మరణానికి కారణమయి, తదుపరి పాలనలో వేలాది బౌద్ధేతర సన్యాసుల ప్రాణాలను హరించిన అశోకుడు, జంతువులు, పక్షులు, మత్స్యా ల (చేపల) యెడల అత్యధిక దయ చూపించి, వాటి సంరక్షణకు కొన్ని శిలా శాసనాలను ప్రవేశ పెట్టటం జరిగింది. ఇటువంటి శాసనాలు ఆకాలంలో ప్రపంచంలో ఏ రాజ్యంలోనూ, ఏ దేశంలోనూ లేవు. ఈ శిలా శాసనాల మేరకు జంతు బలి, జంతు వధ, నిషేధించబడింది; రాజ వంటశాలలో మాంసాహారం వండటం చాలావరకు తగ్గించబడింది; పశు వైద్యశాలలు నెలకొల్పబడ్డాయి; జంతువుల రవాణా కొరకు ప్రత్యేక

సదుపాయాలు కలిగించబడ్డాయి. జంతువుల విషయంలో మాంసాహారం యెడల అశోకుడి 2,270 ఏళ్ల క్రిందటి ఈ ఆలోచనలు, ప్రవర్తన గంగా పీఠభూమిలో ఈరోజుకు కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డాయి!!

ఆ కాలంలో వివేకవంతులు, వృద్ధులు ఈ రాజ శాసనం సమస్త జంతుజాతికీ అన్వయించాలని కోరుకున్నారు. కాని అశోకుడు ఈ అభిప్రాయాన్ని సమర్ధించినా ఇది విజయవంతం అవటానికి కొన్ని మినహాయింపులు ఇవ్వటం తప్పనిసరి అని భావించి, కొన్ని సవరణలు చేయటం జరిగింది.

దీని గురించి ఆయన ఇచ్చిన రాజ శాసనం ఈ విధంగా ఉంది. “ఈ నా పాలనలో 26వ ఏట (క్రీ.పూ. 252) కొన్ని జంతువుల విషయంలో హింస పూర్తిగా నిషేధం. అవి: చిలుకలు, గోరింకలు, ఎర్ర పెద్ద బాతులు, అడవి బాతులు, గండు చీమలు, గబ్బిలములు, తాబేళ్లు, ఎముకలులేని చేపలు, ముళ్లపందులు, అడవి పందులు, తెల్ల పావురాలు, పెంచుకున్న పావురాలు, ఉడుతలు, ఎద్దులు, ఉడుములు, ఖడ్గమృగాలు, కొన్ని చతుష్పాద జంతువులు, మేకలు, గొర్రెలు, ఆడ గొర్రెలు, మగ కోళ్లు (పుంజులు), ఆరు నెలలు దాటని అన్ని రకాల జంతువులు, మానవ ప్రగతికి సంబంధించిన ఇతర జంతువుల రకాలు. జంతువుల శరీరాలపైన పెంకులను (ఉదాహరణకు: తాబేళ్లు, ముళ్ల పందులు) కాల్చ కూడదు; అనవసరంగా, జంతువులను నాశనం చేయటానికి అడవులను కాల్చకూడదు; బ్రతికున్న జంతువులకు ఇతర జీవించి ఉన్న జంతువులను ఆహారంగా వినియోగించకూడదు. చేపలను పవిత్రమైన చాతుర్మాస్య కాలంలోను (జులై నుంచి అక్టోబర్: శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసం చివరి వరకు), అమావాస్య చివరి రెండు రోజులు (13-14), పౌర్ణమి మొదటి రోజున, ప్రతి ఉపవాసం రోజున చేపలను పట్టకూడదు, భుజించకూడదు. ఎందుకంటే ఈ నాలుగు మాసాలు మత్స్య ఉత్పత్తి సమయం.”

“ఈ పుణ్య కాలంలో, దినాలలో ఏ ఇతర జాతుల జంతువులను వధించకూడదు. ముఖ్యంగా గజ వనం (elephant park), మత్స్యకారుల సంరక్షరణలో ఉన్న చేపలను వధించకూడదు. పక్షం (రెండు వారాలు) లో అష్టమి రోజున, నెలలో 15 వ రోజున, పునర్వసు (ఇది అశోకుడి జన్మ నక్షత్రం) రోజున, చాతుర్మాస్య రోజులలో, పండుగ రోజులలో ఎద్దులకు, గొర్రె పోతులకు, అడవి పందులకు, ఇతర మగ జంతువు లకు ‘సుంతీ’ (బీజ గ్రంధులు తొలగించటం చేయటం) నిషిద్ధం. అలాగే ఎద్దులకు వాతలు వేయకూడదు.”

అశోకుడి ఈ ఆదేశాలను అయన అధికారులు, రాష్ట్ర పాలకులు తీవ్రంగా పరిగణించి వీటిని అమలు పరచటానికి తగిన చర్యలు తీసుకొనటం జరిగింది.  కాని నిజానికి అశోకుడు అసలు, సిసలయిన శాఖాహారా లేక శాఖాహార అభిమానియా అనేది నిర్ధారణగా తెలియదు!

ఆ కాలంలో ఉత్తర భారతావని లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశంలోని ప్రజలలో అత్యధికులు పశు మాంసం, ముఖ్యంగా గేదె మాంసం కు, ప్రాధాన్యత ఇచ్చేవారు. వీటి తరువాత గొర్రె, మేక మాంసం. వీరిలో కొందరు అడవి జంతువులలో లేడి, అడవి పంది, కొంగ, నెమలి, అడవి బర్రె మాసం కూడా తినేవారు. ఈ అలవాట్లు వల్ల ఆరోజులలో పశు-జంతు సంపద కాల క్రమేణా చాలా తగ్గిపోయింది. ఈ పరిస్థితి క్రీ.పూ. 600-400 నుంచి 400-200 మధ్య జరిగింది. ఈ మొదటి దశలో/కాలంలో 15 జంతు జాతులుంటే అవి రెండవ దశకు 9 జాతులకు దిగిపోయింది. ముఖ్యంగా మౌర్యుల కాలం వచ్చేటప్పటికి మత్స్య జాతి దాదాపు కనుమరుగు అయిపోయింది!

ఈ పరిస్థితిని గమనించే భూత దయామయుడయిన అశోకుడు మత్స్య జాతి, ఇతర జంతు సంపద అంతానికి అడ్డుకట్ట వేసి అహింసకు నాంది పలికినట్లయింది.


వార్థక్యాన్ని సమీపించిన అశోకుడి శేష జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in April 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!