Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు
-- పారనంది అరవిందారావు --

తప్పొప్పులు

thappoppulu

కొన్నిఎప్పుడో చేశాను
కొన్నిఇప్పుడూ చేస్తూంటాను
తెలియక చేసిన తప్పులు
తెలిసి చేసిన తప్పులు
తెలిసీ తెలియక చేసిన తప్పులు

తెలియక చేసిన తప్పులు
తప్పులవుతాయా?
తెలిసి చేసిన తప్పులు
ఒప్పుకుంటే ఒప్పులవుతాయా?
ఈ దేహంలో ఉంటాను కాని
ఈ క్రియలకి కర్తను కాను నేను
అని తప్పుకోగలనా?

కర్మయోగం అంతుపట్టని
సాధారణ జీవిని
ఎన్ని పశ్చాత్తాపాలు
ఎన్ని పరితాపాలు
ఎంత ఆత్మ శోధన
ఎంత ఆత్మ పరిశీలన

ఎంత అంతరంగ మధన
ఈ తప్పుల ముళ్ళు
చిక్కని ముళ్ళు
చిక్కుపడిన ముళ్ళు
అంతుచిక్కని ముళ్ళు
వేళ్ళకి వంగని ముళ్ళు
విప్పలేని ముళ్ళు
విప్పగూడని ముళ్ళు

కాలాన్ని వెను తిప్పలేను
కర్మలని తిరగ వేయలేను
మనసు నాదే కాబట్టి
ఒగ్గేసానంటుంది
కాని మనిషి నాలో
ఒప్పుకోనంటుంది

ఏ చెట్టూచేమకో చెప్పి
యెదలో దాచుకోమని చెప్పనా!
ఏ జంతుజాలానికో చెప్పి
ఎవ్వరితో అనవద్దని చెప్పనా

శారీరిక స్వేచ్చ ఇచ్చిన ఈ ముళ్ళు
నా మనస్సుకి మాత్రం వేసాయి సంకెళ్ళు

ఆ రాత్రి

aa-raathri

రాత్రంటే నలుపు కాదు
నలుపంటే నల్లటి చీకటి కాదు
చీకటంటే చిక్కని చీకటి కాదు
చీకటిలో కలిసిన వెన్నెల
వెన్నెలంటే పండు వెన్నెల కాదు
దోర వెన్నెల దోబూచు వెన్నెల
వెండి తీగల రాత్రి
వెండి పాయల రాత్రి
చీకటి ఛాయల రాత్రి
చీకటీ - వెన్నెల పాయలని
కలిపి చిక్కులు తీసి
జడలల్లుతున్న రాత్రి
సన్నగా వీచే గాలులు..
సంపెంగ పరిమళాల్ని
ఆ జడలో జతగా గుచ్చి
గుబాళిస్తున్న రాత్రి
మల్లెల సువాసనకి మత్తెక్కి
మందంగా తలలూస్తున్న
తన్మయ తరువుల రాత్రి
వెలుగు నీడలు …వెన్నెల్లో
ఒంటరి జంటగా
విహరించిన రాత్రి
నిశ్శబ్దపు నీడలు
సవ్వడి చేయక
మెదులుతున్న రాత్రి
అదో రాత్రి ! అందాల రాత్రి !
ఆదో రాత్రి! అరుదైన రాత్రి !
మగత నిద్రలో ముంచిన రాత్రి

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in April 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!