Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
సీ. రావయ్య మాపాలి ప్రత్యక్షదైవమా
         శ్రీభూసతులతోడఁ జెలువుమీఱి
కుండలద్యుతులతో నిండారి యెఱుపెక్కు
         గండముల్ నిడుపైన కన్నుఁగవయు
కస్తూరికాతిలకంబు దిద్దిన నొస
         లలక లల్లలలాడునట్టి శిరము
కరధృతశంఖచక్రగదాబ్జభాసురేం
         దీవరాసితదివ్యదేహ మొనర

తే.గీ. కౌస్తుభాంచితపీనవక్షంబుఁ బీత
      వసనవిలసితవిగ్రహ మసదృశశుభ
      కరపదాంబుజయుగళంబు గనుల యెదుట
      నిలువఁ దనువెల్లఁ బులకించి కొలుతుమయ్య 126

చం. పదకవితాపితామహుని పాటలు బాటలు నిన్నుఁ జేరఁగా
      పదపదమందు భక్తిరసభాండములన్ గొని వేంకటాద్రిఁ జే
      రెద రెదలందు నీదు జగదేకమనోహరచేతనాకృతిన్
      ముద మొదవంగ నన్నమయనోట వచించినరీతి నిల్పుచున్ 127

మంగళమహాశ్రీ
      నిష్కపటభక్తిమెయి నిత్యసుమసేవితవినిర్మలపునీతఘనగాత్రున్
      పుష్కరదళాక్షునిఁ ద్రిపుండ్రధరు వేంకటవిభూతిమయసప్తగిరివాసున్
      పుష్కలకృపాకరు నభూతనభవిష్యసమపూరుషవిశేషు భువనేశున్
      విష్కిరవరేణ్యగము విశ్వమయు విశ్వవిభు వేఁడెద మదాత్మ తరియింపన్ 128

కం. కవితాసుమపూజ యిదే
     రవికాంతసుగంధికందస్రగ్ధర(1) లివిగో
     నవపంచచామరంబులు(2)
     భువి నిను సేవింప జూచు మోహనరూపా! 129
         (1) సూర్యకాంతములు, సంపెంగల సమూహము, వివిధ
             పుష్పములమాలలు
         (2) శివడమరుకము నుండి పుట్టిన పదునాల్గు శబ్దములు
             వింజామరలు కాఁగా

వేంకటేశపారాయణీవృత్తము (స్వీయకల్పితము)
      కల్యాణవేంకటేశఘనపుష్పమఖంబు నందున్
      కల్యప్రసూనముల్(1) నెగడు(2)భాగ్యము గల్గి చేరన్
      తౌల్యంబు(3) లేని స్వామి తనువున్ దమిఁ(4) దాఁక; నేనున్
      ఫల్యస్వరూపినై(5) ప్రణత(6)సేవ యొనర్ప నెంతున్ 130
         (1) అమరిన పుష్పములు (2) వ్యాపించు (3 ) పోలిక
         (4) కుతూహలము / అపేక్ష (5) పుష్పరూపము దాల్చి
         (6) మిక్కిలి నమ్రతగల / స్తుతింపబడినవాన
      (శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పుష్పయాగము – శ్రీనివాసమంగాపురము, సందర్భముగా)

శ్రీబ్రహ్మోత్సవాల ముగింపు
మానిని
     పద్మసరోవరసంభవలక్ష్మికి వల్లభుఁ డంపిన సారె నదే
     పద్మియుగం బతిరమ్యముగాఁ గొనివచ్చుఁ బ్రియంబున నాగతహృ
     త్సద్మనివాసిని తా నగుచున్(1) శ్రితసాగరమధ్యమునన్ వెలయన్
     పద్మభవాదిసురార్చితయౌ సిరి భాగ్యము లిచ్చుత మా కెపుడున్! 131
         (1) అగుచు / నవ్వుచు

సీ. ఎండుఫలంబులు మెండుగా రాజిల్లు
         మకుటమాలలు దాల్చు మాత తానె
    మొగలిరేకుతురాయి మొగలిరేకులదండ
         ముగమున నవ్వొల్కు ముగుద తానె
    సాంబ్రాణిధూపంబు చక్కఁగా సోఁకిన
         ద్రాక్షాకిరీటహారమ్ము లెసఁగ
    పసుపుముద్దలనద్ది పసిఁడిముద్దగు తల్లి
         తనువెల్ల స్నానంబుఁ దగ నొనర్చి

తే.గీ. చందనము నద్ది స్నపనమంజనము పిదప
     నూతనాలంకృతులు సేసి, చేత దర్ప
     ణమ్ము నిడి కుందనపుబొమ్మ కిమ్ము గూర్ప
     నిందుముఖి చూచి మనల దీవించుఁ గాత! 132

వేంకటేశపారాయణీవృత్తము (స్వీయకల్పితము)
      పద్మావతీపదాబ్జభవదివ్యవిభాభృతంబౌ
      సద్మంబునా మనంబు సతతంబుఁ బ్రశాంత మౌతన్!
      పద్మాకరోత్థితోత్సవసుమజ్జనభాసురాంగిన్
      పద్మాక్షవల్లభన్ గృప ననున్ గనఁ బ్రస్తుతింతున్ 133
           (తిరుచానురులో అమ్మవారి శుక్రవారాభిషేకసందర్భమున)
Posted in April 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!