Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఆనాటి, నాటి, నేటి తరాల మధ్యన సామాజిక స్థితిగతులు, జీవన సౌలభ్యాలు, ఆర్ధిక స్థిరత్వాల విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తదనుగుణంగా మనిషిలోని ఆలోచనా సరళి కూడా మారుతూ వస్తున్నది. మొదటి రెండు తరాలలో మన గురించి కాకుండా సామాజిక గౌరవ, పేరు ప్రతిష్టల మీద, మన చుట్టూ ఉన్న సంఘంలో మన ఉనికిని కాపాడుకునే అంశాల మీద ఎక్కువ దృష్టి కలిగి మనకు నచ్చిన, నచ్చని అని కాకుండా మందికి నచ్చిన సూత్రాలను, కార్యాలను ఎక్కువగా ఆచరించేవారు. ఆ విధంగా సమాజ కట్టుబాట్లను పాటించామని ఒకవిధమైన సంతృప్తి ఉండేది. ఆ సమయంలో మన సొంత ఆలోచనా విధానాలకు మనకు నచ్చిన విధంగా జీవించాలనే ఆశకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక విధంగా అది సమాజానికి మంచిని చేసింది. అదేవిధంగా కొంచెం అస్థిరత్వాన్ని, మానసిక ఒడిదుడుకులను సృష్టించింది. ఎలాగంటే, అందరినీ మెప్పించడం అనేది ఒక పెద్ద కార్యం ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉండదు. కనుక అందరికీ ఆమోదయోగ్యంగా నడుచుకోవాలంటే కత్తి మీద సాము లాంటిది అనే చెప్పవచ్చు. అలాగే మనిషి ఆలోచనల విధానం కూడా ఎల్లవేళలా ఒకే విధంగా ఉండదు. ఆ విధంగా ఎంతమందిని ఎంతదూరం, ఎంత కాలమని ఒప్పిస్తూ ఉండగలము? కనుకనే తెలీకుండానే ప్రతి ఒక్కరిలో ఒకవిధమైన విరక్తి భావం కలుగుతూ కొంత వయసు వచ్చేసరికి అది మానసిక ఒత్తిడికి గురిచేసే కారకంగా మారి మనకు హాయిగా జీవించడానికి ఏ విధమైన జీవనశైలి అవసరం అనే విషయాన్ని కూడా మరిచి అనేక రుగ్మతలకు హేతువౌతున్నది.

కాలానుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు, అభ్యుదయ భావాలు ఉదయించాయి. కొన్ని వర్గాల వారికి మాత్రమె లభించిన సౌలభ్యాలు ప్రతి జీవికి దొరకాలనే తపన మొదలైంది. ఆ ప్రహసనంలోనే మనిషి ఆలోచనలలో ముఖ్యంగా నాటి, నేటి తరాలలో స్వగత సొంత ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలైంది. ముఖ్యంగా నేటి తరాలలో ఎదుటివారిని మెప్పించడం కోసం తన నిర్ణయాధికారాన్ని త్యజించడం అనవసరం అనే భావన మెండుగా ఏర్పడడం జరుగుతున్నది.

మునుపు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు పాత పద్దతులలోనే ఆలస్యమైననూ బాగోగులు తెలుసుకునే పనిలో పలుకరించే ప్రక్రియలు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందకున్ననూ, ఆలస్యంగానైనా నిర్దిష్టమైన సమయపాలనతో ఉండడం జరిగింది. ఆ పద్దతి నుండి, నేటి సాంకేతిక అభివృద్ధి పథంలో లభించిన ఆధునిక వసతులతో నిమిషంలోనే పలుకరించుకునే వసతులు ఉన్ననూ అవసరమైనప్పుడు మాత్రమె పలకరింపుల ప్రహసనం కొనసాగాలి అనే తత్వానికి మనిషి అలవాటుపడటం చూడవచ్చు. అది మంచి మార్పు అనుకోవచ్చునా అన్న సందేహం నాలో కూడా కలుగుతున్నది కనుక ఇక్కడ మంచి చెడు అనే ప్రశ్న తలెత్తదు. మారుతున్న కాలం పోకడలు మనిషి జీవన విధానాన్ని కూడా మారుస్తాయి అని సర్దుకుపోవడమే అన్ని విధాలా మంచిది. మరీ కాదు కూడదంటే నేడు వస్తున్న యాంత్రిక మానవ మేధస్సు తో నిర్మితమవుతున్న యాంత్రిక మానవులకు కూడా అనుబంధం ఆప్యాయత ఉండవుకదా అనే మరో అంశం తలెత్తుతుంది. మనిషిలోని శారీరక, మానసిక స్పందనల విషయంలో నాటి తరానికి నేటి తరానికి మధ్యన ఎంతో వ్యత్యాసం కనబడుతున్నది.

ప్రతి జీవరాశి యొక్క భౌతిక దేహము అనేక కణజాల సముదాయము. మన శరీరంలోని కణాల యొక్క సామర్థ్యం విలువకట్ట లేనిది. మనలోని రోగనిరోధక శక్తి అత్యంత బలీయమైనది. కనుకనే ఏదైనా వ్యాధి సంక్రమించినా, అనారోగ్యం కలిగినా, ప్రమాదం సంభవించి భౌతికంగా ఏవైనా దెబ్బలు తగిలి ఇబ్బందులు పడినా మన దేహం ముందుగా స్పందించి తన శక్తిని ఉపయోగించి ప్రతిఘటించడం మొదలుపెడుతుంది. శరీరంలోని ప్రతి కణమూ తదనుగుణంగా మార్పులు చేసుకుని సాధారణ స్థితిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వీటన్నింటినీ నియంత్రిస్తూ అవసరానికి తగ్గట్టు సరైన సూచనలతో దిశా నిర్దేశం చేసే మెదడు ఆ సమయంలో ధృడంగా ఉండాలి. అంటే మనలోని మానసిక ధైర్యం ఏమాత్రం సన్నగిల్ల కూడదు. భౌతికంగా మన శరీరం ఓటమిని ఒప్పుకోదు. చివరి వరకూ పోరాడుతూనే ఉంటుంది. అయితే మన మానసిక ధైర్యం స్థానంలో భయం ఏర్పడడం జరిగితే అదే అనర్ధానికి అసలైన హేతువు అవుతుంది. అందుకే మానసిక ధైర్యానికి మించిన మందులేదు అని నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అట్లని మరీ మూర్ఖంగా వ్యాధి ముదిరి ప్రాణం మీదికి తెచ్చుకోకూడదు. సమయోచితంగా ఆలోచించి తగిన విధంగా వైద్యవిధానాన్ని అమలుపర్చాలి. మన శరీర ధృడత్వ పటిమ మీద మనకు మాత్రమె సరైన అవగాహన ఉంటుంది. ఇది మనందరం ముఖ్యంగా గమనించ వలసిన విషయం.

ఏదో ఒక జీవన్మరణ సమస్య ప్రవాహంలో మనిషి జీవితం కొట్టుకు పోతూనే ఉంటుంది. అయితే ఆ ప్రవాహ ఉధృతిని చూస్తూ దిగులు చెందకుండా సరైన పరిష్కారం కొరకు, మన ఆలోచనలను ప్రక్కదారి పట్టించే అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తూ మనలోని మానసిక స్థైర్యాన్ని స్థిరంగా ఉంచగలిగితే ఆ మనోధైర్యమే చక్కటి పరిష్కారాన్ని సూచిస్తుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in April 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!