Menu Close
GSS-Kalyani
విజయ రహస్యం (కథ)
-- G.S.S. కళ్యాణి --

"అమ్మా! మా స్కూల్లో జరిగిన సైన్స్ ఒలింపియాడ్లో నేను రెండో స్థానంలో నిలిచాను. నన్ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నారు!", తల్లి ఉమకు ఉత్సాహంగా చెప్పాడు అప్పుడే బడినుండి ఇంటికి వచ్చిన పదమూడేళ్ళ కృష్ణదత్త.

"అబ్బో! మంచిది! ఈసారి కూడా బాగా చదివి జాతీయ స్థాయి పోటీలకు అర్హతను సాధించు!", కృష్ణదత్తను ప్రోత్సహిస్తూ అంది ఉమ.

"అలాగే అమ్మా! కానీ, ఈ పొటీలో మొదటి స్థానం విజయకి వచ్చింది. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయ నాకు గట్టి పోటీనిస్తుంది. కాబట్టి నేను ఈసారి మరింత కష్టపడి చదివాలి!", అన్నాడు కృష్ణదత్త.

"నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు ఏ పుస్తకాలు కావాలన్నా నేను కొనిపెడతా", అంది ఉమ చిరునవ్వుతో.

"అమ్మా! నీకో సంగతి తెలుసా? ఆ విజయా వాళ్ళ నాన్న ఎవరో కాదు. మాకు స్కూల్లో సైన్సు పాఠాలు నేర్పించే వేణూ సార్!! విజయకి ఇంట్లో కూడా సైన్సు విషయాలు ఆయనే నేర్పిస్తారట. అందుకే పోటీలో విజయకన్ని మార్కులొచ్చాయి. నాక్కూడా అలా పోటీకి ఎలా చదవాలో చెప్పేవాళ్ళుంటే బాగుండు! ఎందుకంటే ‘విజయ’ రహస్యం ఏమిటో తెలిస్తే కానీ నేను ఈ పోటీలో విజయాన్ని సాధించలేననుకుంటా", అన్నాడు కృష్ణదత్త కాస్త దిగులుగా.

అక్కడే ఉండి ఉమ, కృష్ణదత్తల సంభాషణను విన్న కృష్ణదత్త తాత ఎనభయ్యేళ్ళ సీతారామయ్య, తను కూర్చున్న పడక కుర్చీలోంచి చేతికర్ర సహాయంతో ఆయాసపడుతూ లేచి, "ఒరేయ్ కృష్ణయ్యా! నువ్వేమీ పోటీ గురించి దిగులు పడకు. ఒలింపియాడ్ ట్రోఫీ నీదే! నేను నీకు శిక్షణను ఇస్తా! సరేనా?", అన్నాడు బోసినవ్వులు నవ్వుతూ.

అడుగులో అడుగు వేసుకుంటూ తనవైపు మెల్లిగా నడుచుకుంటూ వస్తున్న సీతారామయ్యను చూసి కృష్ణదత్త, "నేను చదువుకుంటాలే తాతా! ఈ వయసులో నీకెందుకా కష్టం? అయినా, సైన్సు విషయాలు నీకేం తెలుస్తాయ్?! సైన్సు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఈ కాలం సైన్సు నీ ఊహకు కూడా అందదు తాతా! నువ్వెప్పటిలాగే సీతా రామా అనుకుంటూ నీ గదిలో రెస్ట్ తీస్కో!", అంటూ హేళనగా మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణదత్త.

కృష్ణదత్త మాటలకు కాస్త నొచ్చుకున్నాడు సీతారామయ్య.

"ఏదో చిన్నపిల్లాడు! మీ గురించి తెలియక కృష్ణదత్త అలా మాట్లాడాడు. వాడిని క్షమించండి మామయ్యగారూ!", సీతారామయ్యతో వినయంగా అంది ఉమ.

"పర్లేదులేమ్మా! వాడి మీద నాకేమీ కోపం లేదు. పోటీలో వాడు గెలిస్తే చూడాలని అనిపించింది. అందుకే అలా అన్నా! నా కోరిక తీరేమార్గం ఆ భగవంతుడే చూపిస్తాడు", అన్నాడు సీతారామయ్య తిరిగి పడక కుర్చీవైపుకు వెడుతూ.

ఆ రోజు సమయం రాత్రి ఏడు గంటలు కావస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. కృష్ణదత్త తను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వీధి తలుపు తెరిచాడు. అక్కడ వేణు తన కూతురు విజయతో కలిసి నిలబడి ఉన్నాడు.

వేణూని చూసి ఆశ్చర్యపోతూ, "గుడీవినింగ్ సార్!", అన్నాడు కృష్ణదత్త అసంకల్పితంగా.

"గుడీవినింగ్ కృష్ణా! మీ తాతగారు ఉన్నారా?", అడిగాడు వేణు.

కృష్ణదత్త వేణూకి బదులిస్తూ ఉండగానే,"రండి వేణూ గారూ! లోపలికి రండి", అంటూ వేణూని తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది ఉమ.

"ఏరా వేణూ?! బాగున్నావా?", అంటూ వేణూని ఆప్యాయంగా పలకరించాడు సీతారామయ్య.

"బాగున్నాను మాష్టారూ!", అంటూ సీతారామయ్య పాదాలకి నమస్కరించాడు వేణు.

"ఏమిటీ విషయం?", వేణూని అడిగాడు సీతారామయ్య.

"మాష్టారూ! ఇది మా అమ్మాయి విజయ. రాష్ట్రస్థాయి సైన్సు ఒలింపియాడ్ కు మీ కృష్ణదత్తతోపాటూ మా విజయ కూడా ఎంపికయ్యింది. ఈ పోటీకి కృష్ణదత్తకు మీరే శిక్షణ ఇస్తారని నాకు తెలుసు. కృష్ణకు కొత్తవిషయాలు నేర్పుతున్నప్పుడు దయచేసి మా అమ్మాయికి కూడా అవి నేర్పించండి మాష్టారూ! ఒకప్పుడు మీ దగ్గర సైన్సు పాఠాలు నేర్చుకుని ఇవాళ నేను వాటిని నలుగురికి నేర్పించే స్థాయికి ఎదిగాను. మీ దగ్గర విద్యను నేర్చుకుంటే మా విజయ పొటీలో రాణిస్తుందని నా నమ్మకం", అన్నాడు వేణు ఎంతో వినయంగా.

"దాందేముందీ! తప్పకుండా నేర్పుతా", అని వేణూకి హామీ ఇచ్చాడు సీతారామయ్య.

కాసేపు కబుర్లు చెప్పాక వేణు, విజయలు వెళ్ళిపోయారు.

"అమ్మా! ఏమిటిదంతా? నాకు చాలా అయోమయంగా ఉంది. మా సైన్సు టీచర్ కి తాతయ్య పాఠాలు నేర్పటమేమిటీ? తాతయ్య గుమాస్తాగా చేసి రిటైర్ అయ్యారని చెప్పావు కదా? సైన్సుతో తాతయ్యకు సంబంధమేమిటీ?", ఉమపై ప్రశ్నల వర్షం కురిపించాడు కృష్ణదత్త.

"అంతా నేను వివరంగా చెప్తా విను. మీ తాతగారు గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం చేసి రిటైర్మెంటును పొందిన సంగతి వాస్తవమే! అయితే ఆయనకు సైన్స్ అంటే చిన్నప్పటినుంచీ అమితమైన ఇష్టం. సైన్సులో పై చదువులు చదవటానికి తగిన ఆర్థిక పరిస్థితులు ఆ కాలంలో లేక ఆయన గుమాస్తా ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది. అయితేనేం?! ఖాళీ సమయాల్లో గ్రంథాలయానికెళ్ళి సైన్సు పుస్తకాలు చదువుతూ, సైన్సుకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సైన్సులో ఉన్నత చదువులు చదువుకుంటున్నవారితో తరచుగా సైన్సు విషయాలను చర్చిస్తూ తన జ్ఞానాన్ని పెంచుకుని పొలంలో పనికొచ్చే చిన్న చిన్న పరికరాలను కూడా తయారుచేసేవారు మీ తాతయ్య. ఆయనకున్న సైన్సు పరిజ్ఞానం గురించి ఎరిగినవాళ్ళు తమ పిల్లలకు ట్యూషన్ చెప్పమని అడిగి, తాతయ్య దగ్గరకు వాళ్లను పంపించేవారు. అలా తాతయ్య దగ్గర చదువుకున్న వాళ్ళల్లో మీ వేణు సార్ ఒకరు. తాతయ్య వృత్తిపరంగా గుమాస్తా అయితే ప్రవృత్తిపరంగా వైజ్ఞానిక శాస్త్రవేత్త!", అంటూ కృష్ణదత్తకు అసలు విషయం చెప్పింది ఉమ.

కృష్ణదత్తకు ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం కలిగి, "తాతా! నేను నా మాటలతో ఇందాక నిన్ను బాధ పెట్టాను. ఐ యాం వెరీ సారీ! ఇకనుంచీ నువ్వే నాకు సైన్సు నేర్పాలి", అంటూ సీతారామయ్యను ప్రేమగా  కౌగలించుకున్నాడు.

సీతారామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

“అంతా ఆ భగవంతుడి దయ!", అని అనుకున్నాడు సీతారామయ్య.

అంతలో ఆఫీసునుండీ ఇంటికి వచ్చిన కృష్ణదత్త తండ్రి విశ్వనాథానికి జరిగిన విషయాలన్నీ చెప్పింది ఉమ.

"మన కృష్ణదత్తకు సైన్సు అంటే చాలా ఇష్టం రా! సైన్సు ఒలింపియాడ్ కోసం వాడికి శిక్షణ నేనే ఇస్తున్నా", తన కొడుకుతో గర్వంగా చెప్పాడు సీతారామయ్య.

“అలాగా?! సైన్సు విషయంలో వాడికి  నీ పోలికలే వచ్చినట్లున్నాయ్ నాన్నా! నీ శిక్షణలో వాడు కచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు!", అన్నాడు విశ్వనాథం సీతారామయ్య పక్కన కూర్చుంటూ.

"నిజమే! విజయ రహస్యం తెలుసుకున్నాక ఇక మన కృష్ణకు ఈ పోటీలో తిరుగేముంటుందీ?! నాకిది మంచి కాలక్షేపం కూడానూ!”, తన మనవడు అందుకోబోయే విజయాన్ని మనసులో తలుచుకుని మురిసిపోతూ అన్నాడు సీతారామయ్య.

"మీ కోరిక తీరుతున్న ఈ శుభసందర్భంలో ఒక కప్పు వేడి కాఫీ తీసుకోండి మామయ్యగారూ!", అంటూ చిరునవ్వుతో కాఫీ కప్పును సీతారామయ్య చేతికి అందించింది ఉమ.

********

Posted in April 2024, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!