Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
కవితా శక్తి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
చం. కవితల కున్న శక్తిఁ గన ఖడ్గము లైనను వాల్చు మస్తముల్, 
      కవి తల నున్న భావము నెకాయకి పద్యముగా వచించినన్
      భువి తలయున్న వారు తమపూర్వుల మాటలు విస్మయింతురే?
      కవినిఁ “గపీశ్వరా!” యనినఁ గందము(1) గూర్చిన గంధ మట్టిదే
          (1) ‘పీ’ పట్టినట్టి నోటను, ‘వీ’ పట్ట దదేమొ నీకు ‘వీ’ ’పీ’ లందున్, ‘పీ’ పై రుచి పుట్టెనొ నీ, కీ పట్టున......... అని
                నడివీధిలో ఒక కవి ఆశువుగా చెప్పిన స్పందనపూర్వక కందపద్యము ఈనాటికీ మఱపు రానిది కదా!!!

చం. రవి కనలేని దైనఁ గడుప్రస్ఫుటమౌ కవి కంచుఁ బల్కరే?
      రవిశశితారకం బిలను రాజిలు సత్కవితల్ రచించి యీ
      భువి విడి యేఁగినన్, సుకవిపోషకులెందఱొ ఖ్యాతి గాంచరే?
      కవి నుడువంగఁ(1) బాఱెఁ గద కట్టలు ద్రెంచుక దేవగంగయే
           (1) “కదలు మిట మాని దివిజగంగాభవాని!” అన్నకవి అడిదము సూరకవి

కం. అస్మజ్జీవితసత్యము
      విస్మయమును గూర్చు నేఁడు, వేఁడియె బరువై
      అస్మజ్జనకులు కోరఁగ
      “తస్మై నమ” యన్న వాన తథ్యము కురిసెన్
Posted in April 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!