Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ఆంధ్ర రాష్ట్ర నాయకత్వ సమస్య - తొలి ముఖ్య మంత్రిగా శ్రీ ప్రకాశం గారు ఎన్నికైన విధము

జులై 17,1953న మద్రాసు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రాజాజీ గారిని మద్రాసు అసెంబ్లీలో ఒక సభ్యుడు రాయలసీమ అభివృద్ధి సంఘంలో క్రిందటి జనరల్ ఎన్నికల్లో ఓడిపోయినా శ్రీ నీలం సంజీవరెడ్డి గారినే ఎందుకు సభ్యులుగా నియమించారని, ఆయనను ఓడించిన శ్రీ నాగిరెడ్డి గారిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. దానికి జవాబుగా నూతన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలరని తాను ఆశిస్తున్నానని రాజాజీ చెప్పారు.

ఆగస్టు 4,1953న విజయవాడలో సంజీవరెడ్డిగారు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా విశాఖపట్నం తగినదని ఇండియా ప్రభుత్వం ఆది నుంచీ భావిస్తున్నదని తనకు తెలుసునని, తనకు సంబంధించినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పట్టణమైనా రాజధానికి తగి ఉంటుందన్న అభిప్రాయం ఇప్పటికీ కలదని, ఏ ఒక్క దాని మీద తనకు ప్రత్యేక అభిమానం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సోషలిస్టుల సహకారంతో నూతన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి వర్గ నిర్మాణానికి ప్రయత్నించగలదన్నారు. లోక్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీలో అసోసియేట్ సభ్యులుగా ఉన్నారని, సుస్థిర ప్రభుత్వ స్థాపనకు వారు తప్పక సహకరించగలరన్నారు. అదే రోజున చెన్నపట్నం నుండి  బయలుదేరే ముందు సంజీవరెడ్డి గారు విలేఖరులతో మాట్లాడుతూ చెన్నరాష్ట్ర ఆస్తిపాస్తులను ఆంధ్రకు, శేషించిన చెన్నరాష్ట్రానికి పంపిణీ చేయడం తటస్థులైన నిపుణుల సంఘం ద్వారా జరగాలని మద్రాస్ అసెంబ్లీ తీర్మానించినందువల్ల జనవరి వరకు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం వాయిదా పడే అవకాశం లేకపోలేదని అన్నారు.

ఆగస్టు 5,1953న ఢిల్లీలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు కర్నూలును రాజధానిగా అంగీకరించని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర స్థాపన వాయిదా పడగలదని ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులను బెదిరించడానికి సంజీవరెడ్డిగారు ప్రయత్నిస్తున్నట్లున్నదని విమర్శించారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, ఆంధ్ర ప్రజలను చీల్చడానికి సంజీవరెడ్డిగారు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్ర ప్రజలు మోసపోరని సుందరయ్య గారు హెచ్చరించారు. ఆంధ్రకు కేంద్ర స్థానమైన గుంటూరు-విజయవాడలోనే తమ రాజధానిని నెలకొల్పాలనే ఆందోళనను వారు కొనసాగించి తీరుతారని అన్నారు.

సెప్టెంబర్ 6 ,1953న సంజీవరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్ర అసెంబ్లీలోని పార్టీలలో పెద్ద పార్టీ నాయకుడుగా తనను పిలిచి, మంత్రి వర్గ నిర్మాణం చేయవలసిందిగా కోరవలసిన బాధ్యత రాజ్యాంగ రీత్యా గవర్నర్ కు కలదని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడే మంత్రి వర్గం కాంగ్రెస్ మిశ్రమ మంత్రి వర్గంగానే ఉండాలని, అలాంటి మంత్రి వర్గానికి మరొక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం అసహజమని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 7,1953న సంజీవరెడ్డిగారు, ప్రకాశంగారు ప్రధాని నెహ్రూను కలసి చర్చించారు.ఆ సంప్రదింపుల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వారు ఇతర పార్టీల వారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో మిశ్రమ మంత్రి వర్గం ఏర్పరచేందుకు, శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యత్వాన్ని స్వీకరించినట్లైతే ఆయనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తగిన వాతావరణం ఏర్పడింది.

సంప్రదింపుల తరువాత మద్రాసు వచ్చిన సంజీవరెడ్డిగారు సెప్టెంబర్ 8వ తేదీన ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ వాది మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండితీరాలని స్పష్టం చేశారు. ఏమి జరిగినా సరే, నేను మాత్రం ఈ విషయంలో లొంగేది లేదని కూడా అన్నారు. సంజీవరెడ్డి గారు ప్రభుత్వ ఏర్పాటు విషయమై ప్రకాశం గారితో కూడా అనే సార్లు సంప్రదింపులు జరిపారు.

అయితే సెప్టెంబర్ 5,1953న విజయవాడ రామ్మోహన్ లైబ్రెరీలో జరిగిన కృషికార్ లోక్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆంధ్రదేశానికి సంజీవరెడ్డి గారి నాయకత్వం అరిష్టదాయకమని, ముఖ్యమంత్రి కాదగిన అర్హతగాని, యోగ్యతగాని ఆయనలో మృగ్యమని పలువురు లోకపార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. "సంజీవరెడ్డి గారిపై లోక్ పార్టీకి ఏనాడూ విశ్వాసం లేదు, ఇక ముందు ఉండబోదు" అని గౌతు లచ్చన్న గారు అన్నారు.

ఢిల్లీలో సెప్టెంబర్ 19,1953న పార్లమెంట్ లో పత్రికా విలేఖరుల సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు మాట్లాడుతూ ఆంధ్రలో శ్రీ ప్రకాశం పంతులుగారి నాయకత్వాన కాంగ్రెసేతర మంత్రివర్గ స్థాపనలో సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా శ్రీ ప్రకాశం పంతులు గారు పాత కాంగ్రెస్ వాది కావడం వల్లా, ఆంధ్ర దేశానికి ఆయన చేసిన సేవను గుర్తించడం వల్లా, కాంగ్రెస్ హై కమాండ్ వారు ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడ్డారు.

శ్రీ ప్రకాశం పంతులు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి విడిపోయి స్వతంత్ర సభ్యునిగా ఉండే పక్షంలో ఆయనను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమోదించడానికి కాంగ్రెస్ పార్టీ సమ్మతించింది. శ్రీ ప్రకాశం గారితో సంప్రదించడానికి తగు సలహాలతో శ్రీ సంజీవరెడ్డి గారికి అధికారమిచ్చింది.

ఆంధ్ర ప్రజా సోషలిస్ట్ కార్యవర్గం వారు, శాసనసభ్యులు కూడా శ్రీ ప్రకాశం పంతులు గారిని పార్టీ బాధ్యతల నుంచి విముక్తుణ్ణి చేస్తూ తీర్మానించినా అఖిల భారత ప్రజా సోషలిస్ట్ పార్టీ కార్యవర్గం అందుకు నిరాకరించింది. సెప్టెంబర్ 23న ప్రకాశంగారు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి రాజీనామాకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పార్టీలోని సోషలిస్ట్ వర్గం దానిని వ్యతిరేకించింది. సెప్టెంబర్ 25న తన రాజీనామాను ఢిల్లీకి తంతి ద్వారా అందజేశారు. సెప్టెంబర్ 27, 1953న ఆంధ్ర మంత్రి వర్గంలో చేరనున్నందున శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిత్వం ప్రకాశం గారికి దఖలు పడింది.

శ్రీ ప్రకాశం గారి రాజీనామా గురించి సెప్టెంబర్ 27వ తేదీన శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు విచారం వెలిబుచ్చుతూ, నైతికమైన రాజకీయ విలువల కంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, శ్రేయస్సు చాలా ముఖ్యమని తలంచడం చాలా విపరీతంగా ఉన్నదని, శ్రీ ప్రకాశం గారు కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదని తలంచడం దేశంలో పార్టీ రాజకీయాలు ఎంతటి అధోగతికి వచ్చింది తెలియజేస్తున్నదన్నారు.

శ్రీ ప్రకాశంగారు అక్టోబర్ 1వ తేదీ నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యునిగా చేరారు. అటు తరువాత విజయవాడలో డిసెంబర్ 26, 1953న బెజవాడ గోపాలరెడ్డి గారు ఏకగ్రీవంగా ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆంధ్రరత్న భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నుకోబడ్డారు.

***సశేషం***

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in April 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!