Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
జక్కన, గజపతుల యుగం

ఇక రెండవ ఆశ్వాసం నుండి విక్రమార్కుని విజయపరంపరలు అతను బ్రహ్మచేత తన నుదిటి వ్రాత తిరిగి వ్రాయించుకోవడం. ఇంద్రుని మెప్పించి ముప్పై రెండు బొమ్మలున్న సింహాసనాన్ని పొందడం దానిమీద కూర్చొని రాజ్యం చేస్తూ ఎక్కడెక్కడో ఉన్న అపూర్వ వస్తు సంచయాన్ని జయించి అడిగిన వారికి దానం చేయడం -ఇత్యాదులతో జక్కన విక్రమార్క విజయాన్ని పాఠక జన రంజకంగా రచించాడు. ఆ కథను ఆరుద్ర అపర జక్కనవలె పాఠకులకు వివరించడం ఆంద్ర సాహిత్యాభిమానులకు ఒక వరం.

జక్కన పలుమార్లు తీర్థయాత్రలు చేసినట్లు ఉన్నాడని అందుకే విక్రమార్క చరిత్రలో తీర్థ యాత్రల ప్రసక్తి, పుణ్యక్షేత్రాల ప్రశంస విరివిగా ఉన్నాడని అన్నాడు ఆరుద్ర. కాశీలో మరణిస్తే అట్టివారు ఎలా గణనకెక్కుతారో లెక్కల్లో పద్యం వ్రాశాడు జక్కన.

జక్కన శ్రీనాథుని కన్నా కొంచెం ముందు వాడేమో కాబట్టి శ్రీనాథుడు జక్కనను చూచి కొన్ని పద్యాలు వ్రాసినట్లు కుందుర్తి ఈశ్వరదత్తు గారు కొన్ని పోలికలను చూపించారని ఆరుద్ర చెప్పి ఆ పట్టికను ఇచ్చారు. చాలా పోలికలనే ఈశ్వర దత్తు గారు సేకరించారని ఆ పట్టిక ద్వారా తెలుస్తున్నది.

అయితే జక్కన రచనలో కన్నా శ్రీనాథుని రచనా శిల్పంలో పైచేయిగా ఉన్నదని, యజ్ఞోపవీతాన్ని జక్కన కేవలం వర్ణనతో సరిపెడితే శ్రీనాథుడు యజ్ఞోపవీతాలను రత్నాల హారాలను కలిపాడు. నీర్కావిదోవతిపై పసిడి మేఖలు కట్టించాడు శ్రీనాథుడు అన్నాడు ఆరుద్ర.

జక్కన కాలం గూర్చి ఆరుద్ర విపులంగా చర్చించారు. శ్రీనాథునికి లేక ఎర్రనకు ముందు వెనకా అన్న విషయాన్ని పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గూడా తెల్పాడు ఆరుద్ర. జక్కన సంస్కృతాంధ్ర భాషలలోని సామెతలు, లోకోక్తులు చక్కగా వాడాడు. జక్కన పద్యాలలోని చమత్కారం గూర్చి తెలిపే పద్యంతో ఆరుద్ర తన వివరణ ముగించారు.

ఇంచుక సూదివేదన వహించిన మాత్ర నృపాంగనాకుచో
దంచితసౌఖ్యకేళి సతతంబున గంచులి గాంచు నాజిని
ర్వంచన దీవ్రబాణనికరక్షతదేహుల కబ్బవే మరు
చ్చంచల లోచనా ఘన కుచస్తబకద్యుతి సంగ సౌఖ్యముల్? (విక్రమ 4-71)

సూది గుచ్చుకొన్న బాధతో బాణాల దెబ్బలను పోల్చిన జక్కన పద్యంలో మానవుని కోర్కెలు, వాటికై అతని అవస్థలు తెలుస్తున్నాయి.

గజపతుల యుగం

శ్రీనాథుని అవసానదశలో ఆయన కష్టాలకు ఎవరు కారణం అంటే మన సాహిత్య కారులు గజపతులను చూపిస్తారు. దానికి కారణం – రాజమండ్రి లో రెడ్డిరాజుల పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఓడ్ర గజపతులు ఆక్రమించుకొని కొంతకాలం పాలించారు. ఆ రాజ్యంలో ప్రభువులకు, ఉద్యోగులకు తెలుగంటే అభిమానం, ఆసక్తి ఏమాత్రం లేదు. పన్నులు నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవారు. అందువల్ల శ్రీనాథుని చివరిదశ వీరి చేతిలో చిక్కి అవస్థల పాలైంది అని ఆరుద్ర వివరించి గజపతుల చరిత్ర ప్రారంభించారు. (స.ఆం.సా. పేజీ 795).

యావద్భారతం యవనుల దండయాత్రలకు లోనై హైందవ స్వాతంత్ర్యము అంతరించుకున్న వేళ కపిలేశ్వర, పురుషోత్తమ, వీరరుద్రులనే వారు తురుష్కుల నెదిరించి హైందవ మతమును, ధర్మమును కాపాడి శాంతి స్థాపన చేశారు. అంతేకానీ శ్రీనాథుని బాధించారని గజపతుల చరిత్రను అపార్ధం చేసుకోరాదని, ఆనాటి పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకోవాలని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.

గజపతులకు కవులపై గల గౌరవం గూర్చి ఆరుద్ర కొన్ని సంఘటనలను తెలియజేసారు. అవి-

అజ్జరపు పేరయలింగం అనే కవి ‘ఒడయనంబివిలాసం’ అనే కావ్యం వ్రాశాడు. అందులో తన పూర్వీకులకు గజపతులు అగ్రహారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. (ఆ.క.త. 6-174) (స.ఆం.సా. పేజీ 795).

పిల్లలమర్రి పిన వీరభద్రుని రెండవ కుమారుడు మల్లేశ్వరుడు గజపతుల ఆస్థానంలో ఉండి ‘పెనుమళ్ళ’ అనే అగ్రహారాన్ని స్వీకరించాడు. అందుకే అతని ఇంటిపేరు పిల్లలమర్రి అని గాక పెనుమళ్ళ గా మారిపోయిందని ఆరుద్ర తెల్పారు.

పెనుమళ్ళ వంశీయుడు సోమన తన సీమంతినీ కల్యాణం లో మరికొన్ని విషయాలు తెల్పాడు. ఇంటిపేర్లు మారడం వల్ల గజపతులు అగ్రహారాలు కవులకు ఇచ్చారనీ, అవి పుచ్చుకొన్న కవులకు ఇంటిపేర్లు పోయి అగ్రహారాల పేర్లే ఇంటి పేర్లుగా స్థిరపడ్డాయని తెల్పుతూ ఆరుద్ర ఏనుగు లక్ష్మణ కవి ఇంటిపేరు కూడా మారిన విషయం తన సుభాషిత రత్నావళి అనే గ్రంథ అవతారికలో తెల్పిన సంగతి తెల్పి ఆ పద్యం ఇచ్చారు. (ఆవ-29).

అనంతర కవుల కావ్యాలలో ఉన్న ఈ పూర్వ విషయాలను బట్టి గజపతులు ఎందఱో కవులకు ఏనుగులను, అగ్రహారాలను ఇచ్చి సత్కరించినట్లు తెలుస్తున్నదని ఆరుద్ర వివరించారు.

గజపతుల వివరాలు

వీరి (గజపతుల) వివరాలు తెలిసినంత వరకు ముగ్గురున్నారని వారి పేర్లు వివరాలు ఇచ్చారు ఆరుద్ర.

  1. కపిలేశ్వర గజపతి (క్రీ.శ.1434-1468)
  2. పురుషోత్తమ గజపతి (క్రీ.శ.1468-1497)
  3. ప్రతాపరుద్ర గజపతి (క్రీ.శ.1497-1538)

వీరు మువ్వురూ తాత, తండ్రి, మనుమలు అన్నారు ఆరుద్ర.

కపిలేశ్వరుడు రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు గంగ వంశపు రాజుల వద్ద మంత్రిగా ఉండేవాడు. అటు తదుపరి ఆ రాజులేని సమయంలో రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. గంగ వంశం వారికి కూడా ‘గజపతి’ అనే బిరుదు వుండేది.

అయితే కపిలేశ్వరునితో ‘గజపతి’ అనే మాట రూఢీ అయింది. కపిలేశ్వరునికి పట్టాభిషేకం చేసుకోవడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. దానికి కారణం క్రీ.శ.1419-20 లోనే లాంగూల గజపతి అనే రాజు రాజమహేంద్రవరాన్ని ఆక్రమించుకొని ఉండడమే అని ఆరుద్ర తెల్పారు. అయితే ఇదంతా స్థానిక చరిత్రలు.

కపిలేశ్వర గజపతి క్రీ.శ.1434 లో గంగవరపు భానుదేవుని రాజ్యభ్రష్టుని చేసి తానూ రాజైనాడు. క్రీ.శ.1439 లో పట్టాభిషిక్తుడైనాడు. యితడు మేధావి. శూరుడు. పదవీభ్రష్టుడైన భానుదేవుని మళ్ళా సింహాసన మెక్కించడానికి చూసిన శిలావంశీయులైన నందాపురం రాజులను, ఒడ్డాది మత్స వంశపు రాజులనూ, యలమంచిలి చాళుక్యులనూ జయించి రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. క్రీ.శ.1443 నాటికి ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన విశాఖ జిల్లా కోరుకొండ వరకు తన రాజ్యాన్ని విస్తరింప జేసుకొన్నాడు. యితడు క్రీ.శ.1448 లో రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని కమ్మల మెట్టును కైవసం చేసుకొన్నాడు. రాజమండ్రికి రాజ ప్రతినిధి గా తన తమ్ముని కుమారుడైన రావదేవ నరేంద్రుని నియమించాడు.

**** సశేషం ****

Posted in April 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!