Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

ఉదయం నిద్రలేవగానే... రాత్రి వచ్చిన మెసేజ్లు ఓపెన్ చేసి చూసింది ప్రణవి.

అది 'మాయ' షాపింగ్ కాంప్లెక్స్ వారి ఇన్విటేషన్. దాని సారాంశం ఏమిటంటే... 300 కట్టి 'మాయ' లో సభ్యత్వం పొందితే... సభ్యత్వం పొందిన వారికి నిత్యవసర సరుకులు... కారు చౌకగా లభించును. కేజీ కందిపప్పు బయట 150 రూపాయలు అయితే... ఇందులో సభ్యత్వం పొందిన వారికి 30 రూపాయలకే దొరుకుతుందని, వంట నూనె కేజీ 10 రూపాయలకే లభించును అని, తులం బంగారం 3000 కే... ఇవ్వబడును అని, ఇలా అన్ని వస్తువులు చాలా చౌకగా ఉన్న లిస్టు వాట్సప్ లో పంపించారు.

ఆ షాప్ ఎక్కడుంది అడ్రస్ పెట్టారు. ఎవరెవరు ఇందులో సభ్యులుగా చేరి, లబ్ది పొందారో వారి నోటితో వినిపించే వీడియో క్లిప్పింగులు రెండు పెట్టారు.

ఉచితాల వెనుక బిగిసే ఉచ్చు, తక్కువ ధరల వెనుక దాగిన మోసపుటెత్తులు గ్రహించ గలిగే స్థాయికి ఎదిగిన ప్రణవి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

వదిలిపెట్టకుండా ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తూనే ఉంది. ఆ నెంబర్ బ్లాక్ చేసేసింది ప్రణవి. వేరే నెంబర్ నుంచి కాల్ రావటంతో ఎవరో అనుకుని ఎత్తింది.

"మేడం మీ గురించి విన్నాము. మీ టాలెంట్ తెలుసుకున్నాము. మీరు చెబితే చాలామంది మా దాంట్లో జాయిన్ అవుతారు. కొంచెం మా బోటి వాళ్లకు సహాయం చేయండి ప్లీజ్. మీ ఋణం ఉంచుకోము. మిమ్మల్ని మా టీం లో మెంబర్గా చేసుకుంటాం. మీరేం పైసా కట్టనక్కరలేదు. మీరు మా 'మాయ' ను ప్రమోట్  చేయండి అంతే." అంటూ రిక్వెస్ట్ చేశాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి.

"సారీ సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు." అని ఫోన్ కట్ చేసింది ప్రణవి.

"ఇంత పొద్దున్నే ఎవరు చేసారు ఫోను? రాత్రి కూడాఫోన్ మోగుతూనే ఉంది." అంటూ ప్రణవిని అడిగిన గిరిజ కంఠంలో క్యూరియాసిటీ తొంగి చూసింది.

తల్లికి విషయం చెప్పింది ప్రణవి.

"అయ్యో పిచ్చిదానా, వాళ్ళు ఫ్రీగా ఇస్తాం అంటుంటే వద్దంటావేమిటే? వెనకటికి నీలాంటిదే పిలిచి పిల్లని ఇస్తామంటే! కులం తక్కువది అందంట. అలా ఉంది నీ వరుస. సభ్యత్వం పొందితే నీకు వచ్చే నష్టమేమిటి?" అని అడిగింది గిరిజ.

ప్రణవి ఆమె మాటలకు "అమ్మా ఇవన్నీ మోసపు మాటలు. కాస్త రియాలిటీ లోకి వచ్చి చూడు. 150 రూపాయలు ఉన్న కందిపప్పు... 30 రూపాయలకు ఎలా ఇస్తారు. ఎంత రైతు దగ్గర కొనుగోలు చేసి... లాభాపేక్ష లేకుండా అమ్మినా 120 రూపాయలు తేడా ఉంటుందా!?!

అసలు ఎందుకు జనాలు లాజిక్ మిస్ అయి మోసపోతారు? 50వేల పైన ఉన్న తులం బంగారం కేవలం 3000కే ఇస్తానన్నాడు అంటే! ఆ మాటల్లో నిజాయితీ ఎంత ఉందో ఆలోచించు. ఈ రోజు మనకు ఉచితంగా ఇస్తానన్నాడని ఆశపడితే, మనకున్న మంచి పేరుకు తూట్లు పడి మనల్ని వీధిలో పడేస్తుంది. అందువల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇదే కాదు ఇప్పుడు ఫోన్లో మీరు లక్ష రూపాయలు గెలుపొందారు, 50,000 గెలుపొందారు, మీకు ఆ గిఫ్ట్లు వచ్చాయి, ఈ గిఫ్ట్ లు వచ్చాయి, లక్కీ డ్రిప్ లో మీరు గెలుపొందారు అంటూ రకరకాల ఫ్రాడ్ మెసేజ్ లు వస్తూ ఉంటాయి. వాటిని నమ్మకూడదు. మన ఆండ్రాయిడ్ ఫోన్లలో రకరకాల లింక్ లు వస్తాయి. వాటిని నొక్క కూడదు." అంటూ ప్రస్తుతం జరుగుతున్న మోసాలను గురించి గిరిజకు వివరించి చెప్పింది.

"అయితే అలాంటి మోసగాళ్ళు నిన్ను ఎందుకు సహాయం చేయమని అడుగుతున్నారు? అంటే నువ్వు చేసే పనిలో కూడా..." అంటున్న తల్లి మాటల కు అడ్డుపడుతూ...

"లేదమ్మా... నేను అలాంటి పనులు చేయడం లేదు. మార్కెటింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టినప్పుడు, అందులోనూ అమాయకంగా కనిపించే ఆడపిల్లలను టార్గెట్ చేస్తారు. నమ్మబలికి వారిని నట్టేట ముంచేస్తారు. అందుకే ఎవరేం చెప్పినా తలాడించకుండా, వారి మాటల ట్రాప్ లో పడకుండా, వారు మాట్లాడే దాంట్లో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేది గ్రహించుకుని, అడుగు వేసేటప్పుడు ఆచితూచి వేయాలి." అంటూ చెప్పింది ప్రణవి.

"అసలే మొగుడు వదిలేసిన దానివి. ముందే నలుగురు దృష్టి నీ మీద పడుతుంది. దానికి తోడు ఇలాంటి ఫోన్లు వస్తూ ఉంటే... లేనిపోని నిందలు మోస్తావు. నీకు నీ బిడ్డలకు అన్నం పెట్టలేనంత దుస్థితిలో మేము లేము. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో ఉండక... నీకెందుకు ఈ బిజినెస్లు" అంది కోపంగా.

"అమ్మ మాటిమాటికి అలా అనబోక. నీకు ముందే చెప్పాను నా అభిప్రాయం. నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు ఈ పోరాటం సాగిస్తాను. కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ఉద్యోగాలు అంత తొందరగా రావు అమ్మా. బుర్రలో టాలెంట్ ఉన్నా జేబులో నోట్లు ఉండాలి. లేదా ఓట్ల కోసం ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు తొలగాలి. ఒకవేళ ఉన్నా నిజమైన పేదవాడికి, విధి వంచితులకు ఏర్పాటు చేయాలి. అంతేగాని కులం ప్రాతిపదిక మీద, మతం మసిపూసి, లింగ వివక్షతను చూపుతూ ఉద్యోగాలు ఇవ్వకూడదు." ఆవేశం గా అంటున్న కూతురు వంక జాలిగా చూసింది గిరిజ.

ఆమెకి కూతురు దేహీ అని ఎవరి దగ్గరా యాచించ కూడదనే ఉంది. కానీ లోకులు కాకులు. చిన్న గాయమైనా దానిని పొడిచి పొడిచి పెద్దది చేస్తారు. శని చూపునుంచైనా తప్పించుకోవచ్చు గానీ... నరుడి నాలిక నుంచి తప్పించుకోలేము. ఈ పిల్ల  జీవితం చివరికి ఎటు పోతుందో! తన వ్యక్తిత్వాన్ని కాపాడు కొనే దిశలో ఎన్ని అపవాదులను ఎదుర్కోవలసి వస్తుందో? అని మనస్సు లో బాధపడింది గిరిజ.

తల్లితో మొండిగా అంది కానీ ప్రణవికి లోలోన భయంగానే ఉంది.

'తన చుట్టూ మోసగాళ్ళ ఉచ్చు బిగుసుకుంటుందేమో!' ననే అనుమానం ఆమెలో చోటు చేసుకుంది.

'ఫిజికల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ లేని నాలాంటి సున్నిత మనస్సు గల ఆడవాళ్ళకి ఈ మార్గం సరైనది కాదు. వీలైనంత తొందరలో ఈ మార్గాన్ని వదిలేయాలి. కష్టపడి చదివి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి.' అని మనసులో గట్టి నిర్ణయం తీసుకుంది ప్రణవి.

***

ఇంటికి తెచ్చిన హెయిర్ ఆయిల్ బాటిల్స్ అయిపోవడంతో... ఆ రోజు అవి తేవడానికి యారాడ బయలుదేరింది ప్రణవి. తరచూ వెళ్ళాల్సి రావడంతో సీజన్ టికెట్ తీసుకుంది ప్రణవి. మామూలుగా ఉదయాన్నే కాకినాడ పాసింజర్ కి వెళ్ళిపోయి, లింక్ ఎక్స్ప్రెస్ లో రిటర్న్ అయిపోయేది.

ఆరోజు డాక్టర్ గారు యారాడ లోని తయారీ కేంద్రం దగ్గర లేరు. అది లాక్ చేసి ఉండటంతో... డాక్టర్ గారికి ఫోన్ చేసింది.

"ఈరోజు రాలేదమ్మా... ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కొన్ని మూలికలు దొరకలేదు. అక్కడ చేసేదేమీ లేక ఆఫీస్ కి రాలేదు." అని చెప్పాడు.

"సర్ నేను హెయిర్ ఆయిల్ బాటిల్స్ కోసం వచ్చాను. నా దగ్గర ఉన్నవన్నీ అయిపోయి వారం దాటింది. కస్టమర్లు అడుగుతున్నారు. నాకు ఆ బాటిల్స్ అందించే ఏర్పాటు చేయగలరా?" అని అడిగింది.

"నాకు ఎవరూ అసిస్టెంట్స్ లేరమ్మా పంపటానికి. నీకు తెలుసు కదా ఆల్ ఇన్ వన్ నేనేనని. అందువల్ల నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి రేపు రా" అన్నాడు.

"లేదు సర్ నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకు హెయిర్ ఆయిల్ బాటిల్స్ కావాలి. ఏమీ అనుకోకుండా మీరు వచ్చి ఇవ్వగలుగుతారా?" అని అడిగింది.

"లేదమ్మా నేను రాలేను నువ్వు రేపు రా... " అని చెప్పారు డాక్టర్.

"సార్ నాకు మళ్ళీ ఇంత దూరం రావడం కష్టమౌతుంది,"

ఇంట్లో పిల్లల్ని వదిలి రావడం, డబ్బు సమస్యలను దృష్టిలో పెట్టుకొని అంది ప్రణవి.

"సరే ఒక పని చేయి. మా ఇంటి అడ్రస్ చెప్తాను. అక్కడికి వస్తే నీకు బాటిల్స్ ఇస్తాను." అని చెప్పాడు డాక్టర్.

"సరే చెప్పండి" అని డాక్టర్ గారు ఇచ్చిన అడ్రెస్ ను నోట్ చేసుకొంది ప్రణవి.

అది హనుమంత వాకలో ఉంది. ఆటోలు, సిటీ బస్సులు పట్టుకొని అక్కడకు చేరుకుంది.

కొండను తొలిచి ఇళ్ళు కట్టినట్లు ఉన్నారు. డాక్టర్ గారి ఇల్లు ఎత్తులో ఉంది. మెల్లిగా మెట్లు ఎక్కి డాక్టర్ గారు ఇల్లు చేరి కాలింగ్ బెల్ కొట్టింది ప్రణవి.

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in April 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!