Menu Close
వీక్షణం-139 వ సాహితీ సమావేశం
-- పిళ్ళా వెంకట రమణమూర్తి --
vikshanam-139

వీక్షణం సాహితీ గవాక్షం 139వ అంతర్జాల సమావేశం తేదీ మార్చి14న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో వీక్షణం వ్యవస్థాపకులు డా.గీతామాధవి గారు స్వాగత వచనాలు పలికి, ఈనాటి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య సి.హెచ్. సుశీలమ్మ గారిని పరిచయం చేసారు. వీరు 'నెచ్చెలి' మాస పత్రిక లో, ఆ'పాత'మధురాలు అనే శీర్షికను నిర్వహిస్తున్నారని, ఇవేళ 'అలనాటి రచయిత్రుల అభ్యుదయ భావాల కథలు' అనే అంశమ్మీద ప్రసంగించబోతున్నారని తెలియజేసారు. ఈ సమావేశానికి నిర్వహణ బాధ్యత వహించిన శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారు ఆత్మీయ వచనాలు పలికి, ముఖ్య వక్తను ప్రసంగం చేయమని ఆహ్వానించారు.

ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య” (శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు 'ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. స్తీవాదం – పురుష రచయితలు, కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర, విమర్శనాలోకనం (విమర్శ వ్యాసాలు), విమర్శ వీక్షణం (విమర్శ వ్యాసాలు) మొ.న రచనలు చేసారు.

ఆచార్య సుశీలమ్మ గారు ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమర ఉద్యమాల సందర్భంగా పురుషులు కారాగారాలకు వెళ్తే, స్త్రీలు నిస్పృహ చెందకుండా కథల ద్వారా సాటి స్త్రీలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసారని, స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు కౌటుంబిక వ్యవస్థలో స్త్రీ పాటించవలసిన ప్రముఖ పాత్రను కూడా తెలిపారని చెబుతూ, ఈ సందర్భంగా స్త్రీ రచయిత్రుల కథా కధనాలు ప్రస్తావిస్తూ, 1874 లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించిన 'బండారు అచ్చమాంబ గారు' 1901 వ సంవత్సరంలో ప్రథమ అభ్యుదయ భావాల కథల సృష్టి కర్తగా గుర్తింపు పొందారని, వారి 'ధనత్రయోదశి' తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి కథగా గుర్తింపు పొందిందని ఉటంకిస్తూ, అలనాటి కథ అంటే 1901 నుంచి కథారచయితలు బందరులో మహిళా సమాజ స్థాపన చేసి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి కృషి చేసారని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, కుటుంబంలో స్త్రీ స్వాతంత్ర్యం అంత అవసరం అని తెలిపారు. ఈ సందర్భంగా 1902లో అచ్చమాంబ గారి రచనయైన 'దంపతుల కలహం' అనే కథను సోదాహరణంగా వివరించారు. తరువాత 1892లో నెల్లూరు జిల్లాలో జన్మించిన 'పునకా కనకమ్మ గారు'  జాతి వివక్షత లేని బాలికా పాఠశాలను కస్తూర్బాయి పేరిట స్థాపించిన అభ్యుదయ భావాలు గల రచయిత్రుల కోవకు చెందుతారని, వీరు 'జమీన్ రైతు' అనే దినపత్రిక స్థాపించారని, అంతే కాకుండా 'నేను అభాగ్యుడిని', మరియు 'ఉరి' అనే శీర్షికతో రెండు కథలు వ్రాసారని తెలిపారు.

1931లో స్త్రీ హితైషిణీ మండలి స్థాపించిన కనపత్రి లక్ష్మి గారు కుటీర లక్ష్మి (రామలక్ష్మి) అనే స్త్రీ అభ్యుదయ భావాలను వ్యక్తం చేసే కథను సోదాహరణంగా వివరించారు. దుర్గా బాయ్ దేశ్ ముఖ్ గా ప్రసిద్ధి చెందిన గుమ్మిడిదల దుర్గాబాయ్ 1929లో (బాల వితంతు శారదాంబ ఆత్మ కథ) ను 'నేను ధన్యనైతిని' అనే శీర్షికతో కథను వివరించారు.

ప్రథమ దళిత వాద కథా రచయిత్రిగా గుర్తింపు పొందిన పులవర్తి కమలావతి గారి రచన 'మాదిగ' (1931 జూన్ మాసంలో వాసవి అనే పత్రికలో) ప్రచురితమై ఆనాటి కాలంలో దురాచారంగా ఉన్న అంటరానితనం కు బాసటగా నిలిచిన కథగా అభివర్ణించారు. అలాగే సి. హెచ్. రమణమ్మ గారు వర్గపోరాటం అనే అంశంపై వ్రాసిన 'ఆదర్శ ప్రాయురాలు- కమల'  పురుషాహంకారులకు కనువిప్పు కలిగేలా చేసిందని తెలిపారు.ఎల్లాప్రగడ సీతాకుమారి 'కులమా - ప్రేమా' అనే కథను, ఆచంట శారదాదేవి గారి *ఈ ఒక్కరోజు* అనే కథను, కూడా ప్రస్తావించారు. చివరగా గుడిపాటి వెంకటాచలం గారి తమ్ముని భార్య అయిన కొమ్మూరి పద్మావతి గారి 'శోభ' అనే కథను వివరించి తన పరిశోధనలో ఇప్పటికే 14 మంది అలనాటి అభ్యుదయ రచయిత్రులు వారు వ్రాసిన కథలు సేకరించి నెచ్చెలి మాస పత్రిక ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ముగించారు.

అనంతరం వీరి ఉపన్యాసం పై డా.గీతామాధవి గారు, డా నీహారిణి గారు, వసుధారాణి గారు, గాడేపల్లి మల్లికార్జునుడు గారు, అవధానం అమృతవల్లి గారు తమ స్పందనను తెలిపారు. తదుపరి డా.మామిళ్ళ లోకనాధం గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. మొదటగా డా గీతా మాధవి గారు లోకనాధం గారిని సభకు పరిచయం చేసారు.

ఈ కవి సమ్మేళనంలో వసుధారాణిగారు రెండు లఘు కవితలు చదువగా, డా. నీహారిణీ గారి కాలబింబం అనే కవిత, డా.కె.గీతామాధవి గారి కుట్ర అనే కవిత,గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి నవశకం పిలుస్తోంది అనే కవిత, వసీరా గారి ప్రేమ సాగరసంగీతం కవిత, మేడిశెట్టియోగేశ్వరరావు గారి నీడలు మొలిచేచోట కవిత, సాధనాల వెంకట స్వామి నాయుడు గారి గాలిలో దీపం కవిత, ఉప్పలపాటి వెంకట రత్నం గారి తలవంచుకునే అనే కవిత, సూరి రాధిక గారి అసూర్య పశ్యను అనే కవిత, రామాయణం ప్రసాదరావు గారి మహా కవయిత్రి అనే కవిత సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కవి సమ్మేళనంలో డా. నీహారిణి కొండపల్లి, కందుకూరి శ్రీరాములు, వసీరా, డాక్టర్ కె.గీతామాధవి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, రామాయణం ప్రసాదరావు, రాము లగిశెట్టి, శ్యామరాధిక, పద్మశ్రీ చెన్నోజ్వల, డాక్టర్ దేవులపల్లి పద్మజ, మోటూరి నారాయణ రావు, అవధానం అమృతవల్లి, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, పిళ్ళా వెంకట రమణమూర్తి, మేడిశెట్టి యోగేశ్వరరావు, గౌరీపతి శాస్త్రి కె. వి. ఎస్, లింగుట్ల వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి వెంకటరత్నం, డాక్టర్ కోదాటి అరుణ, వీరరాఘవులు చిట్టాబత్తిన, దేవి గాయత్రి, బొమ్మిరెడ్డి వినోదరెడ్డి, డాక్టర్ వేము వందనం, బొమ్మిరెడ్డి వినోద్ రెడ్డి, నాగేంద్రమ్మ పరుచూరి, నాళం నరసమ్మ, మాసుంబి, సిరివరపు అన్నపూర్ణ, గాడేపల్లి మల్లికార్జునుడు, గంగారపు గోవిందరావు, మల్లాప్రగడ రామకృష్ణ, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి మొ.న వారు సుమారు 32మంది కవిశ్రేష్ఠులు పాల్గొని కవి సమ్మేళనాన్ని సుసంపన్నం చేసారు. ఈ సందర్భంగా గత ఫిబ్రవరి 2024 వీక్షణం కవితా పురస్కార గ్రహీతగా డా.మామిళ్ళ లోకనాధం గారి పద్య శీర్షిక 'తెలుగు భాష-వెలుగు దివ్య తేజ' కి లభించింది అని తెలిపి, అనంతరం ముఖ్యవక్తగా విచ్చేసిన ఆచార్య సుశీలమ్మ గారికి, కవి సమ్మేళనం లో పాల్గొన్న కవిమిత్రులకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో చేసిన వందన సమర్పణానంతరం సభ ముగిసింది. ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు.

ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in April 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!