Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

9. అశోకుడు

గత సంచికలో అశోక చక్రవర్తి తన ఆధ్వర్యంలో నెలకొల్పిన ఢిల్లీ-తోప్రా అశోక ధర్మ స్థంభం, ఢిల్లీ-మీరట్ ధర్మ స్థంభం, కౌశంబి-అలహాబాదు ధర్మ స్థంభం, నిగాలి సాగర్ ధర్మ స్థంభం, రాంపూర్వ జంట ధర్మ స్తంభాలు గురించి తెలుసుకొనటం జరిగింది. ఈ సంచికలో అశోకుడు నెలకొల్పిన ఇతర ధర్మ స్థంభాల తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతికి సమీపంలో ఉన్న పురాతన నగరం ధాన్యకటకం (ధరణికోట) లో అశోకుడు నెలకొల్పిన స్థూపం (మహా చైత్య) గురించి తెలుసుకుందాము.

లారియా-నందన్ గర్హ్ స్థంభం

Close-view-Lauriya-Nandangarh-Ashoka-Pillar
Photo Credit: Wikimedia Commons
Lauria-Nandangarh-pillar-Ashoka
Photo Credit: Wikimedia Commons

అశోక చక్రవర్తిచే నెలకొల్పబడిన మరొక బౌద్ధ స్థంభం బీహార్ లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ‘బర్హి గండక్’ నది ఒడ్డున ఉన్న లారియా నందన్ గర్హ్ (Lauria Nandangarh) పట్టణంలో ఉంది. ఈ లారియా స్థంభం దగ్గరలో15 భారీ మట్టి దిబ్బలు తూర్పు నుంచి పడమరకు మూడు వరుసలలో ఉన్నాయి. ఈ ఎత్తైన మట్టి దిబ్బలను ఆంగ్లేయ శాస్త్రజ్ఞులు అనేక ఏళ్ళు నిశితంగా పరిశీలించి వీటిని ‘వేదం స్మశాన దిబ్బలు’ గా (Vedic burial mounds) వర్ణించారు. ఒక స్మశానం దిబ్బ-స్థూపం క్రింద గౌతమ బుద్ధుడి చితా భస్మాన్ని పదిలపరచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 300-500 మధ్య కాలానికి చెంది యుండవచ్చు. ఈ నందన్ గర్హ్ స్థంభాన్ని త్రవ్వి పరిశీలించగా అది 70 అడుగులు ఎత్తు ఉన్న భారీ స్థంభంగా నిర్ధారణ అయింది. దీని చివర గుండ్రంగా గంట ఆకారంలో ఉన్న ఫలకం పైన సింహం విగ్రహం నిలబడి ఉంటుంది. ఈ స్థంభం మీద అశోకుడి శాసనాలు అతి సుందరంగా చెక్కబడ్డాయి. కాల క్రమేణా ఈ స్థంభం విధ్వంసానికి గురి కాబడింది. సింహం నోరు కూడా కొంత భాగం విరిగి పోయింది.

లారియా అరారాజ్ (Lauriya Araraj) స్థంభం

లారియా అరారాజ్ బీహార్ లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో లారియా నందన్ గర్హ్ కు 55 కి.మీ. దూరంలో ఆగ్నేయ దిక్కులో(Southeast) ఉంది. ఇచ్చట ఉన్న అశోక స్థంభం మీద అయన ఇచ్చిన 6 శాసనాలు ఉన్నాయి. స్థంభం చివర ఉన్న ఫలకం ఆచూకీ తెలియలేదు. కాలక్రమంలో అది విరిగి క్రింద పడిపోయి ఉండవచ్చు.

ధాన్యకటకం/ధరణికోట (అమరావతి) స్థూపం

Lauria-Nandangarh-lion
Photo Credit: Wikimedia Commons

మౌర్యుల కాలంలో దక్షిణాపథాన ఇప్పటి ఆంధ్రదేశంలో కృష్ణా నదీ తీరాన ‘ధాన్యకటకం’ అనే నగరం విలసిల్లుతూ ఉండేది. మౌర్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత మౌర్య రాజులకు సామంతులయిన ఆంధ్ర శాతవాహనులకు ఈ నగరం రాజధాని. మౌర్య రాజుల పాలనలో, ముఖ్యంగా అశోకుడి పాలనా కాలం లోనే, బౌద్ధ మతం ఆంధ్రదేశంలో విరివిగా వ్యాప్తి చెందింది. దక్షిణ భారతావని అంతటికి ఈ ధాన్య కటకం బౌద్ధ మతానికి కేంద్రంగా వర్ధిల్లింది.

ఆ కాలంలో గౌతమ బుద్ధ ప్రవేశపెట్టిన మంత్రాలను ధాన్యకటకంలోని బౌద్ధులు నిత్యం పారా యణం చేసేవారు. ఈ మంత్రాలను ‘ధారణి’ లు అని పిలిచేవారు. ఈ కారణంగా ధాన్యకటకం ‘ధరణి కోట గా పరివర్తనం చెందింది. ఈ బౌద్ధ ‘ధారణి’ లకు సనాతన ధర్మానికి సంబంధించిన వేదాలే మూలం. మనం కంఠంస్థం చేయటానిని ధారణ అంటారు. బౌద్ధ ‘ధారణి’ పదానికి మూలం ‘ధారణ’ యే. ‘ధాన్యకటకం’ పదం కొంతకాలానికి రూపాంతరం చెంది ‘ధరణికోట’ గా ప్రసిద్ధి కెక్కింది.

అమరావతి

ఈ శాతవాహన రాజులు క్రీ.పూ. 230 నుంచి సుమారు 450 ఏళ్ళు దక్షిణాపథం తో పాటు పశ్చిమ, ఉత్తర

భారతావనిని కూడా పరిపాలించిన ఘనులు. ఈ నగరానికి దగ్గరలోనే ఒక ప్రదేశంలో1780 దశకంలో చింతపల్లి-ధరణికోట రాజు ‘రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు’ అచ్చట ఉన్న అమరేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించి ఆ ప్రదేశానికి ‘అమరావతి’ అని నామకరణం చేయటం జరిగింది. ఈ అమరావతికి సమీపంలో ఉన్న ప్రదేశమే విస్తరించి అంచలంచలుగా ఎదిగి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో రాజధాని అయింది.

బౌద్ధ మహా చైత్య

అశోకుడు నెలకొల్పిన అనేక శిలా శాసనాలు, బౌద్ధ ఆరామాలు, గుహలు, స్థంభాలు ఉత్తర భారతావనికే పరిమితమైనాయి. బహుశా ఇది గమనించే ఈ మౌర్య రాజు క్రీ.పూ. 242 లో ధాన్య కటకంలో ఈ స్థూపాన్ని నిర్మించటం జరిగింది. అప్పటికి ఈయన మౌర్య సింహాసనాన్ని అధిష్టించి 26 ఏళ్ళు అయింది. 'మహా చైత్య' అని పిలువబడే ఈ స్థూపం ఒక మహా అద్భుతమైన భారత శిల్ప సంపదగా శిల్ప శాస్త్రజ్ఞుల చేత అభివర్ణించబడింది. పురాతన శాసనాలలో ఈ కట్టడాన్ని ‘స్థూపం’ అని గాక ‘మహా చైత్య’ (Great Sanctuary) అని సంబోధించటం జరిగింది.

British-Museum-Asia
Photo Credit: Wikimedia Commons">Wikimedia Commons

దీని కట్టడం అశోకుడి పరిపాలన కాలంలో ప్రారంభమయినా, అయన మరణం తరువాత కూడా ఇది కొనసాగింది. అంటే మొదటి శాతవాహన రాజుల పాలనలో కూడా కూడా ఈ మహా చైత్య నిర్మాణం జరిగింది. అశోకుడు ఈ మహా చైత్యం నిర్మిస్తే, శాతవాహన రాజులు దీని చుట్టూ కంచె, పిట్ట గోడలు, వేదిక నిర్మించటం జరిగింది. స్థూపం చుట్టూ బౌద్ధ సందేశాలు, చెక్కబడిన చాపరాళ్లు (slabs) పరచబడ్డాయి. స్థూపం చుట్టూ రాతి స్థంభాలను పాతి, అడ్డ కమ్మీలు వేయటం జరిగింది. రాతి స్థంభాలను చూస్తే ఈ స్థూపం అతి భారీ పరిమాణంలో మొదట నిర్మించినట్లుగా అవగతవుతుంది.

ఈ మహా చైత్యం క్రీ.శ. 2 వ శతాబ్దంలో ప్రపంచ కీర్తి పొందింది. ఈ బౌద్ధ కళాఖండం కొన్ని వందల సంవత్సరాలు బౌద్ధ మత కార్యకలాపా లకు ధాన్యకటకం/ధరణికోట అతి ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. ఆ తరువాత ఇది పూర్తి నిరాదరణకు గురి అయినందువల్ల ఈ అశోక నిర్మిత స్థూపం (మహా చైత్య) పాడు పడి, శిధిలమవటం జరిగింది. దీనిని 1795 సంవత్సరం ప్రాంతంలో ఇచట సంచరించిన ఆంగ్లేయులకు ఈ స్థూపం చూపరులకు ఒక మట్టి-రాళ్లు కలిసిన దిబ్బగా కనపడింది.

1816 లో ఆంగ్లేయ అధికారి ‘Colin Mackenzie’ దీనిని దర్శించినప్పుడు ఈ స్థూపం చుట్టూ

అనేక తవ్వకాలు జరిగినట్లు, తవ్వగా బయటపడిన ఇటుకలను, రాళ్లను అచ్చటి గృహాల నిర్మాణాలకు ఉపయోగించినట్లు కనపడింది. అయన లోతైన తవ్వకాలు జరిపి స్థూపం, దాని వివరాలు వ్రాతపూర్వ

కంగా ఉంచి కొత్త స్థూపం నెలకొల్పటానికి పధకం వేయటం జరిగింది. 1845 లో Walter Elliot అనే అధికారి స్థూపం ఉన్న పరిసరాలను పరిశీలించి పశ్చిమ ద్వారం (gate) దగ్గర త్రవ్వకాలు జరిపి అనేక ప్రతిమలు, విగ్రహాలు, శిల్పాలను పైకి తీసి వాటిని మద్రాసు (చెన్నై) ప్రదర్శన శాలకు (మ్యూజియంకు) తరలించాడు. ఈ కళా ఖండాలు మ్యూజియం బయట ఉంచినందువల్ల చెడి పోవటం మొదలయింది. 1853 లో మ్యూజియం అధికారి వీటిని మ్యూజియం లోపలకు తరలించి వీటి భద్రతకు అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది.

1855 లో ఈ మహా చైత్య భాగాల ఛాయా చిత్రాల నమూనాలు ఈ లండన్ లైబ్రరీలో ఉంచటం జరిగింది. దీనితో సంతృప్తి పడని ఆంగ్లేయ అధికారులు 1859 లో ఈ మహా చైత్య కు సంబంధించిన 121 శిల్ప భాగాలు లండన్ కు పంపించటం జరిగింది! వీటిల్లో స్థూపం క్రింది అష్టభుజ (octagonal) మూల భాగం (మొద్దు = stump), పద్మాలతో నిండిన చతుర్భుజ ఫలకం; వృక్ష పిలకలు; పూర్ణ ఘటాల నుంచి బయటకు వచ్చి అలల లాగా అల్లుకుపోయిన కాండాలు, ఆకులు; సింహ-ఫలకం ఉన్న స్థంభం పై భాగం; ధర్మచక్రం ఉన్న స్థూప భాగం; స్థూపం క్రింది భాగం; మొదలగునవి ఉన్నాయి. అశోక చక్రవర్తి సృష్టించిన ఈ కళా ఖండాలు, సంపద ఇవన్నీ ఈ రోజున లండన్ ప్రదర్శనశాల (museum) సందర్శకులకు కనువిందు చేస్తూ ఉన్నాయి!!

గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం

6-8 వ శతాబ్దాల ప్రాంతంలో బౌద్ధ మతం క్షీణించటం ప్రారంభమయిన దృష్ట్యా ఈ ధాన్యకటకం అశ్రద్ధకు గురి అయినందువల్ల ఈ బౌద్ధ స్థూపం భూమిలోపల పూడి పోయి అధ్వాన్న స్థితిలో కొన్ని శతా బ్దాలే ఉండిపోయింది. 14 వ శతాబ్దంలో ఈ స్థూపానికి మరమత్తులు జరిగినట్లు శ్రీ లంక చరిత్రకారులు ధృవీకరించారు. బౌద్ధ మతంలో చోటు చేసుకున్న మార్పులవల్ల ఈ స్థూపం వజ్రయాన శాఖ బోధనలకు దగ్గర అయింది. కాలచక్ర బోధనలను అనుసరించే ఈ వజ్రయాన శాఖను టిబెట్ దేశ బౌద్ధులు అనుసరించినందువల్ల 2006 జనవరిలో ‘దలై లామా’ అమరావతి దర్శించి కాలచక్రంను ప్రారంభించి, గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం నెలకొల్పటానికి శ్రీకారం చుట్టడం  జరిగింది. ఈ 125 అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణం 2015 లో పూర్తి అయిన దరిమిలా అమరావతి పట్టణం అధిక శోభను సంతరించుకుంది.


Amaravathi-Sthupa
Photo Credit: Wikimedia Commons

ధాన్యకటకం/ధరణికోటలో పాడుపడిన అసలు మహా చైత్య (స్థూపం) ఉన్న ప్రదేశం
Amaravati-stupa-Model-Amaravati
Photo Credit: Wikimedia Commons

మహా చైత్య (స్థూపం) కు ప్రతిరూపం

Dhanyakatakam-MahaChaithya
ధాన్యకటకం/ధరణికోటలోని మహా చైత్య మీద చెక్కబడిన శిల్పాలు
Dhyaan-buddha-Amaravthi
Photo Credit: Wikimedia Commons

2015 లో ధరణికోట/అమరావతిలో నెలకొల్పబడిన 125 అడుగుల ఎత్తు ఉన్న గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం
Ashoka-pillar-Lauriya-Araraj
Photo Credit: Wikimedia Commons

లారియా అరారాజ్ (Lauriya Araraj) అశోక స్థంభం దీని పైన ఉన్న ఫలకం ఏమైందో తెలియదు

వయస్సు మీదపడుతున్న అశోకుడి లో మానసిక ఆందోళన, వేదాంత ధోరణి, రెండవ మహారాణి జోక్యం గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in March 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!