Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

నెల రోజులు అద్భుతంగా గడిచాయి.

హద్దుమీరని అల్లరి దీపక్ ది. మాటల్తోనే కోటలు కడతాడు. ఆమెనే తన దగ్గరకి వచ్చి నిలిచేలా చేసుకోగల నేర్పు అతడిది.

ఆమె తన గతాన్ని మరిచేలా ముద్దు చేశాడు దీపక్. ప్రతి చిన్న విషయం పట్ల కేరింగ్! తనని ఒక దేవతలా చూస్తున్న అతడి ప్రేమలో పూర్తిగా మునిగి వివశురాలయింది కవిత. ఇప్పుడతనితో అతడు తన హక్కుగా భావించి పోట్లాడుతోంది. అతడి ఫ్లాట్ లో అతని ఇల్లాలి గా ప్రవర్తిస్తుంది. దీపక్ కూడా ఆమెనలాగే చూస్తాడు. మంచిరోజు చూసి అన్నయ్య తో తమ విషయం చెప్పాలని అన్నప్పుడు అంగీకారంగా నవ్వాడతను.”ఇద్దరం కలిసి చెబ్దామ్ లే కవీ!” అన్నాడు కూడా. కానీ ఇప్పుడిప్పుడే మీ తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్నావు. కొంత ‘గాప్’ ఇవ్వాలి మీ అన్నగారికి కూడా! ఇప్పుడు మీ అన్నయ్యకి నీ ‘ప్రజెన్స్’ ఎంతో ముఖ్యం! మనం ఇది కూడా ఆలోచించాలి కదా?” అన్నాడు. మురిసిపోయింది కవిత. ఆమె మౌనంగా ఉండగానే చటుక్కున వాటేసుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు.

******

“ఆ వీకెండ్ లో రెండు రోజులూ మనం బయిటికి వెళ్దాం!” అని అడిగాడు దీపక్. ‘అది తమ ఇంటి పద్ధతి కాదనీ ఇప్పటికే తాను చాలా చనువుగా ఉన్నానని’ అంది కవిత. ఆ శనివారం రానే వచ్చింది. కవిత తన పుట్టినరోజని దీపక్ కి చెప్పలేదు. సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేద్దాం అనుకుంది.

తెల్లవారగానే ఆమె అన్నయ్య, వదినా చాలా హడావిడి చేశారు. కొత్త బట్టలు, హారతులు, కానుకలు చాలా హాపీగా. అదే సంతోషంతో దీపక్ ఫ్లాట్ లో అడుగుపెట్టింది.

తలుపు బార్లా తీసి ఉంది. హాలంతా సద్దుతున్నట్లు ఖాళీగా ఉంది. ఫ్యాన్లు జోరుగా తిరుగుతున్నాయి. ఇల్లంతా తడిబట్ట పెట్టినట్టు ఉంది. చక్కని పెర్ఫ్యూమ్ వాసన.

కవిత ఈ రోజు గులాబీ రంగు చీరలో లేత గులాబీలా విరిసిపోతోంది. ఆమె కన్నులు పెద్దవి చేసి చూసేంత అందంతో, సొగసుతో మెరిసిపోతోంది. ఆమె పైట ఫ్యాన్ గాలికి సున్నితంగా అలలు అలలు గా కదుల్తూ వయ్యారాలు పోతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం. చిరునవ్వుతో దీపక్ బెడ్ రూమ్ వైపు కదిలింది కవిత.

ఏదో పరిచయం ఉన్న రెండవ గొంతు ఆమెని బయటే ఆపింది.

“ఏంట్రా? నాక్కొంచెం హెల్ప్ చేయరా... నా ‘ఫిగర్‘ ని నువ్ కొట్టేస్తావా?’

కవిత ఉలిక్కి పడింది. వాట్? తనకా గొంతు చాలా పరిచయం. ఎక్కడ వింది?

‘యస్! యెస్! సెంట్ పర్సెంట్ ఈ గొంతు తన ఆఫీస్ లో పని చేసే కొలీగ్ దేవేందర్ దే! అదే గొంతు! తన వెంట పడి వేధిస్తే తాను కళ్ళెర్రజేసింది. భయపడ్డట్టు నోరెత్త లేదు మళ్ళీ! ఆ దేవేందర్ ఇక్కడెందుకున్నాడు? ఆ మాట లేంటి? దీపక చాలా గట్టిగా నవ్వాడు. అదేం నవ్వు? ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత భయంకరంగా కూడా నవ్వు ఉంటుందని తెలియదు. ఆ నవ్వు ఆ రూమ్ అంతా ప్రతిద్వనించింది. ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు.

“ఏరా? తమాషాగా ఉందా? నా సిట్యుయేషన్ చూసి?” దేవేందర్ గొంతులో కోపం, తీవ్రత.

“ఏమంటే అనుగానీ ఏం ఫిగర్రా ఆ పిల్లది? ముందు చాలా సిన్సియర్ గా నీ కోసమే... ఆ క్రఫర్డ్ మార్కెట్లో... ఆచెత్త లో... ఆ జనం మధ్య నూటయాభై రూపాయల ‘పర్స్’ కోసం దూరాను. లేకపోతే నాకేం ఖర్మరా ఆ పర్స్ కొనేందుకు? నా చెల్లికి థౌసండ్స్ పెట్టి కొనగల స్థోమత నాది. ఒరేయ్! బెండుగా! ఆ చీప్ రెస్టారెంట్లో ప్లాస్టిక్ గ్లాసులో కాఫీ! ఛీ ... థూ!.. నీకోసం కాదురా ఆ కాఫీ తాగింది? నేను నాహోదా మరిచి నీవిచ్చిన తుక్కు బైక్ మీద తిరిగాను. ఎందుకో తెలుసా? కాలరెగరెయ్యకు. నీ కోసం ఛస్తే కాదు. పిట్ట మాంచి జోరు. ఇన్ని రోజులు ‘దేని చుట్టూ’ ఇలా తిరగలేదు నేను!’ అన్నాడు.

దీపక్ యేనా మాట్లాడుతున్నది? చేష్టలుడిగి నించుండిపోయింది. ఆమెలోని నవనాడులూ కుంగిపోతున్నాయి.

“అయితే నా గురించి చెప్పనే లేదా?” అడిగాడు దేవేందర్.

“నీ గురించా? అయ్యబాబోయ్! అదో సీమటపాకాయ్ రా! అంటించకముందే కాల్చేస్తుంది. ఇలా బ్రోకర్ గాడినని తెలిస్తే నిన్నూ, నన్నూ చంపేసి మన రక్తంలో ఇడ్లీ ముంచుకు తింటుంది!” ఇవి దీపక్ మాటలా? నిజమా? తన చెవులు తనని మభ్య పెట్టడం లేదు కదా? కవిత చేష్టలుడిగి నించుని ఉంది.

“అయితే ఇంక నేను ఆశ వదిలేసుకోవాల్సిందేనా? నవ్వకు బే!” అన్నాడు దేవేందర్.

ఆ మాటలకి పగలబడి నవ్వుతూనే ఉన్నాడు దీపక్.

“ఏంట్రా తెల్లారకుండా అందుకేనా వచ్చేశావ్? చూడు. బాగా విను. నా కవిత మీద ఈగ వాలినా ఊరుకునేది లేదు. అది నాది. నా సొంతం. నా కవిత... నేను రాసింది!” దీపక్ మాటలు తడబడుతున్నాయి. పొద్దున్నే తాగినట్టు ఉన్నాడు.

“కొంపదీసి పెళ్లాడతావేంట్రా?” అదేదో జోక్ వేసినట్టు నవ్వాడు దేవేందర్.

“పెళ్ళి? షాదీ? వారెవ్వా? పైసా కి ఠికాణా లేదు. ఎనకా, ముందు జనాభా లేరు. ఆస్తీ, గీస్తి లేదు. అన్నొకడున్నాడు. దీన్ని తన్ని తగిలేస్తే దిక్కూలేదు, దివాణం లేదు. ఐనా... రేయ్... వదులుకోవాలంటే మనసు రావడం లేదురా. అంత గొప్ప అందం. మోనాలీసా పెయింటింగ్ రా అది. ఒరే చింపాంజీ! అదేమన్నా చూపారా? కైపు! మైమరపు!

‘నాకే గనక కవిత్వం వచ్చి ఉంటే దాని ఒంటినిండా ఖాళీ లేకుండా రాసి పారేద్దును!” దీపక్ పెట్రేగిపోతున్నాడు.

“రాసేయ్! రాసేయ్! కానీ నా సంగతి కూడా చూడ్రా భయ్! చచ్చి నీ కడుపున పుడతా!” దేవేందర్ బతిమాలేస్తున్నాడు.

“సర్లే! సర్లే! శాంక్షన్డ్ రా పోరా భక్తా!” అన్నాడు దీపక్.

“ఇంకొక్కటి!” ప్రాదేయ పడిపోతున్నాడు.

“చెప్పు!”

“ఎలా సెట్ చేస్తావో చెబ్దూ!”

“ధూ! వదలవు కదా? ఇనుకో!” తనకు తెలియకుండానే తన చెవులు అప్రమత్తమయినట్టు గమనించింది కవిత.

“నేనా అమ్మాయికి మా అమ్మ ‘కాశ్మీరీ ‘అని చెప్పానా? పిచ్చిది. కాశ్మీర్ యాపిల్ పళ్ల మీద మోజు కాబోలు నమ్మేసింది. మనం గుంటూరు సీమ మిరపకాయల కారం అని అర్ధం కాలేదు. తాగననీ, నా కావాసనే గిట్టదనీ చెప్పాను. ఓ... కోటి రూపాయల లాట్రీకొట్టినట్టు గెంతింది. ‘నువ్వే నాప్రాణం!’ అన్నానా? అబ్బాబ్బబ్బా! ఏమి ఎక్స్ ప్రెషన్ రా? లైఫ్ లో నాకలాంటి పిల్ల పెళ్ళాం గా దొరుకుతుందో, లేదో కానీ, ఆ సిగ్గులు, ఆ నిగ్గులు... చాల్రా బాబు ఈ జన్మకి. నాకర్ధం కానిది ఒక్కటే! ఓ పట్టాన లొంగదురా. దీని దుంపతెగ! బుర్రే లేదనుకున్నామా? అక్కడికి వచ్చేసరికి యమ బుర్రారా! చాలా కష్టం రోయ్...లొంగదీయడం... చాలా కష్టం. ఒక్క కౌగిలికె పరిమితం. అది కూడా యమ కష్టం!” అన్నాడు దీపక్.

“అయితే ఆశ లేదంటావా?” దేవేందర్ డీలా పడిపోయాడు.

“ఉందబ్బా... ఉంది. ప్లాన్ మీద ప్లాన్ వేస్తా. పిడికిట్లో బిగిస్తా. కొంచెం దగ్గరగా వచ్చి వదిలేస్తా. గిజగిజ లాడుతుందా ప్రేమ మైకం కమ్మి. అప్పుడు ఓదార్పు యాత్ర మొదలెట్టు. ఓదార్పయిపోగానే నీ దారి నీది. ఆమె దారి ఆమెది!”

దీపక్ గ్లాసు విరక్కొట్టిన శబ్దం!

“అబ్బా! అబ్బాబ్బబ్బా! ఏంబుర్ర రా నీది?” దేవేందర్ పొగిడేస్తున్నాడు. అప్పటికి తెలివి వచ్చి ఆ విభ్రాంతి నుంచి కోలుకుంది కవిత. ఇంక అక్కడ ఒక్క నిముషం కూడా ఉండదలుచుకోలేదు. గిర్రున వెనక్కి తిరిగింది. ఆ విసురుకి కొంగు పక్కనున్న పూలకుండీకి తగిలిజారిపడి భళ్ళున శబ్దం చేసింది. నిశ్శబ్దం గా ఉన్న హాల్లో కి ముందు దేవేందర్ పరుగెట్టుకు వచ్చాడు. ఆ వెనుకే దీపక్. గబ గబ గేటు దాటి బయిటికి వస్తున్న కవితకి “కవితా!” గట్టిగా అరిచిన అరుపు వినిపించింది. ఆ గొంతు’ దీపక్’ ది!!

రోడ్డుమీద నిలబడింది. బాధ భరించరానిదిగా ఉంది. కోపం, అసహనం, ఆవేశం మూకుమ్మడిగా ఆమె మీద దాడి చేస్తున్నాయి. ఆలోచనలు కలగాపులగమై పరుగులు పెడుతున్నాయి. తనని రోడ్డుపాలు చేసే విధానం అతి జాగ్రత్తగా ప్లాన్ చేయబడుతోంది. అక్కడ తన చదువు, తెలివితేటలూ ఎందుకూ పనికి రాలేదు. సొసైటీ లో అప్రమత్తం గా ఉండాల్సిన తాను ఒట్టి ఫూల్ లా దొరికిపోయింది.

ఇవన్నీ తిరగబడ్డ ప్రేమలు!! తన అదృష్టం బాగుండి రక్షింపబడింది. కొలీగ్ ‘దామిని ‘గుర్తొచ్చింది.

ఎస్! ఇప్పుడు తాను ఆమె దగ్గరికే వెళ్ళాలి. సరాసరి దామిని దగ్గరికి వెళ్లింది కవిత.

దామిని తాగుబోతు. ఆమెకి తిరగడానికి రాత్రీ, పగలు తేడాలు లేవు. నిక్కచ్చి వ్యవహారం. అన్నీ నిజాలే మాట్లాడుతుంది. తమాషాగా నవ్వుతుంది. సమాజం ఏ విధంగా కుళ్ళిపోతోందో ఆమె నోటివెంట విని తీరాలి. నలుగురు కలిసిన ఏ చోటయినా ఆమె స్పీచ్ ఇచ్చి తీరుతుంది. ఆ మాటలకి, ఆ మాటలలో పదునుకి జనమంతా నిరుత్తరులై నిలుచుని ఉంటారు. ఆ ఆఫీస్ లోనే ఆమె అంటే అందరికీ టెర్రర్.

ఆమె అలా కఠినంగా తయారవడానికి కారణం ప్రేమ! శేఖర్ మాటలు. జరిగిపోయిన ఆ కధని ఎవ్వరూ అడక్కుండా నిర్భయంగా చెప్తుందామే! ప్రేమ కధలు ఎలా ఉంటాయో వ్యంగ్యం గా చెప్తూనే ఉంటుంది. జరిగినదిది!

‘అక్కడే పని చేస్తున్న శేఖర్ కి దామిని అంటే క్రేజ్! నెమ్మదస్తుడు, పిరికైవాడు, జీవితం పట్ల ఆశ కలవాడు, పేద ఇంట్లో పెరిగిన ధనవంతుడిప్పుడు. ఒకరోజు-

“నువ్వంటే ప్రేమ దామిని నాకు!” అన్నాడు తమకంగా, మత్తుగా తనని తాను మరిచి. కళ్ళు అరమోడ్పులవుతున్నాయి అతడికి.

“ఆహా! మాయింట్లో మాత్రం ఒప్పుకోరు శేఖర్! ఇదే మంచి ఆపర్ట్యూనిటీ!! లేచిపోదాం పద! నేను ఇంత అదృష్ట వంతురాలినా? అంది. మత్తు వదలని శేఖర్-

“ఇంట్లో ఒప్పిద్దామ్!” అన్నాడు. దామిని తల అడ్డంగా ఊపింది.

“మా ఇంట్లో ఎంత గొడవలు చెలరేగుతాయో తెలుసా? మా నాన్న రిజైన్ చేసిన మినిష్టరు! మా అమ్మ లోకోద్దారిక! మా అన్న బిజినెస్ మాగ్నెట్! దామినిని చేసుకోడానికి శేఖర్ కి ఉన్న అర్హత లేమిటి? ముఖ్యంగా అతడి హోదా ఏమిటి? డబ్బు ఎంత ఉంది? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు. అదంతా కుదరదు. పద! లేచిపోదాం! కాలో, గంజో కలిసి తాగుదాం!” అంది. బాగా ‘రిచ్’ అవాలనుకున్నాడు దామిని సపోర్ట్ తో. అప్పుడు శేఖర్ కి మత్తు దిగింది. తడబడ్డాడు. అంత సాహసం చేయలేనన్నాడు. ఇంకా చాలా అన్నాడు. దామిని పగలబడి నవ్వింది.

“మరి మన ప్రేమ?” అడిగింది.

“త్యాగం చేయగలను దామినీ!” అన్నాడు ఆవేశంగా. అది విన్నాక దామిని అతడిని వెళ్ళమంటూ తల ఊపింది. అతడు బతుకుజీవుడా అన్నట్టు పారిపోయాడు. అతను వెళ్తుంటే చూస్తూ నిలుచున్న చోటే కొన్ని గంటలు అలాగే ఉండిపోతే హెల్త్ పాడవుతుందని చెప్తూ కుర్చీలో కూర్చోబెట్టారు కొలీగ్స్. ఇదంతా కవితా ఆఫీస్ లో జాయిన్ అవకముందు జరిగిన విషయాలు. కానీ దామిని ఎవ్వరడగపోయినా వ్యగ్యం గా శేఖర్ ప్రేమ కధ చెప్తూనే ఉంటుంది.

******

ఆరోజు ఆఫీస్ అయ్యాక చిన్న గెట్ టూ గెదర్. దామిని ఆహ్వానం మీద నలుగురూ చేరారు. దామిని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. ఎర్రజీరలు ఆమె లోని దు:ఖాన్ని పసిగట్టినట్టు జిగజిగ మెరుస్తున్నాయి. రక్తం కళ్ళల్లోకి పాకుతోందా? అనిపించేట్టు ఉంది.

“తెలుసా? ‘నూపుర్’ ఎక్స్ పైర్డ్. ఎలా? ఉరివేసుకుని చచ్చిపోయింది. దీనిమీద నాకయితే ఎటువంటి పిటీ లేదు. అసలెందుకబ్బా అంత పెద్ద ఎత్తున బిజినెస్ చేయడం? తన దగ్గరున్న డబ్బు జాగ్రత్త పెట్టుకోడం రాలేదంటాను నేను. దాని డబ్బు మీద కన్నేసాడు శంకరన్. దాని చుట్టూ తిరిగి తిరిగి ‘ప్రేమ, ప్రేమ’ అంటూ బిజినెస్ పెట్టించి డబ్బంతా లాగి ఉచ్చు బిగించేశాడు. అప్పులు తీర్చలేక చనిపోయింది తెలుసా? ఇవేం ప్రేమలు?” అంది శార్వాణి. ఆమె ఒక వార్తని చేరవేస్తోంది అంతే. ఎటువంటి భావమూ లేని ఒక వార్త.

“అవును. ఇప్పుడు చాలా కామన్. ‘ప్రేమ’ అనేదే కామన్ వర్డ్. అందరూ ఉత్తినే చెప్పుకునే మాట. లైట్ గా తీసుకోకపోతే చావు తప్పదు. అసలు ఎవ్వరైన ప్రేమలో ఇన్వావాల్వయిపోతారా? జస్ట్. ఎంజాయ్ ది లైఫ్!” అంది జెనీ.

దామినినే చూస్తున్నాను నేను.

ఆమె కళ్ళల్లోకి నీళ్ళు ఉబికి వచ్చాయి. అవి టపటపా రాలాయి. మొహం ఎర్రగా కందిపోయింది. రుమాలుతో గబ గబా తుడిచేసుకుని ఏదో చెప్పాలని నోరు మెదపగానే అంతా సైలెంట్ అయిపోయారు. ఆమె ఒక ఎక్స్ మినిస్టర్ కూతురని కాదు అందరూ గౌరవించేది. ఆమె సున్నితత్వం, వాగ్ధాటి, అందులో ఉన్న నిజాయితీ ఆలోచింపజేసేవి గా ఉంటాయి. ఆమె మాటల్ని ఆసక్తికరంగా, శ్రద్దగా వింటారు. చెప్పే విషయం సూటిగా ఉపయోగపడేట్లు గా ఉండడమే దానికి కారణం!

“మనమేమీ చేయలేం! ధనదాహం అలాంటిది. గ్లోబల్ వ్యవస్థ డబ్బుకి ప్రాధాన్యత అంటగట్టింది. ఒకప్పుడు ధైర్యం ఉన్నవాడు, సమాజ ఐక్యత కోరేవాడు గొప్పవాడు. అది మన వేద సంస్కృతి. ఆధ్యాత్మికత అనాదిగా నేర్పిన పాఠం. ఇప్పుడు డబ్బున్న వాడు గొప్పవాడు. ఏ అడ్డదారి అయినా సరే డబ్బు సంపాదించడం ముఖ్యం. అదే గొప్పతనం. ఈ ధన దాహనికి ప్రేమ, బాంధవ్యాలు అవసరం లేదు. తోటిమనిషిని దోచుకోవడమే. కనిపెంచిన వాళ్ళని కాదని ధనం వెంట పరుగు. అమాయక రైతు భూములు, స్త్రీల మానం, సామాజిక ఆరోగ్యం ఇవేవీ అడ్డు రావు. ఎంత దొరికితే అంత దోచేయడం, చివరికి కొంచెం డబ్బు కోసం కూడా స్త్రీల మీద ప్రేమ నటించి, మోసం చేసి, ద్రోహం చేసి అన్ని రకాల కష్టాలకు గురిచేయడం ఈ పేరాశ లో భాగం!” ఆమె కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలిపడ్డాయి. దామిని ని తామేప్పుడూ చూడనంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆమె మళ్ళీ కళ్ళు గట్టిగా తుడిచేసుకుని _

“దేశానికో, సమాజానికో, వ్యక్తికో డబ్బు ఒక్కటే కనబడినప్పుడు అక్కడ తల్లితండ్రులు, ప్రేమికులు డబ్బుతోనే కొలవబడతారు. ప్రేమాభిమానాలు తమ ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలుగా మారిపోతాయి. కానీ చేరేది గమ్యం కాదు. ఇప్పటి చదువులు, సంస్కారం అనే ముసుగులో నటనలు, మానవత్వాన్ని వెనక్కు నెట్టి ‘డబ్బు నవ్వు’ నవ్వుతున్నాయ్. నిలకడే లేని డబ్బు వెనుక పరుగులేట్టేవాడికి డబ్బు సంపాదించడం సాధనమే కానీ నిలకడ నిచ్చే నీడ కాదు. ఇలా ఉన్నంత కాలం పూజింపబడే భూములు, స్త్రీలు, సమాజం ఏదో ఒక కారణంగా వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఒక్క మెలకువ, ఒకే ఒక్క మెలుకువకోసం నా ఎదురుచూపు, ఆశ!” ఆమె కంఠం దుఖంతో పూడుకుపోయింది. తన మాటల్ని కొనసాగించలేక పోయింది పొంగి వస్తున్నదు:ఖంతో!

*****

టాక్సీ సాగిపోతోంది.

ఎన్నిసార్లు దామిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది! ఆమె మీద తనకి ఏర్పడిన చులకన వల్ల తాను ఆమె ఇంటికి వెళ్లలేదు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఇప్పుడు అదే ఆహ్వానాన్ని మనసారా కోరుకుంటోంది. దామిని అడ్రెస్ తనకి బాగా గుర్తు. టాక్సీ వేగంగా ముంబై రోడ్లమీద దూసుకుపోతోంది. ఆమె ఆలోచనలూ అంతే వేగంగా ఉన్నాయి. ఏడుపు రావడం లేదు. ఏ భావమో చెప్పలేనంత గుండె వేగం. తను దామిని వేష, భాషల్నిచిరాకు పడింది. ఎన్ని సార్లు స్నేహపూర్వకంగా దగ్గరగా వచ్చినా సున్నితంగా తోసిపుచ్చింది. కానీ ఆ అమ్మాయిలో అదే ప్రశాంతత. దామిని రూపం కళ్ళముందుకి వచ్చి నిలిచింది. సిగరెట్లు విపరీతంగా తాగడం వల్ల పెదాలు, పళ్ళు నల్లగా ఉంటాయి. మేకప్ తో మెరిసిపోయే ఆ అందంతో ఆ నలుపు ఎబ్బెట్టుగా అనిపించదు. ఆమె ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు తప్ప ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. ఆమె చుట్టూ జనం మూగి ఉంటారు. కారణం ఆమె చెప్పే జోక్స్ ఆమె ఆఫీస్ కి రాని రోజు కొలీగ్స్ అందరూ మిస్ అవుతారు.

******

టాక్సీ ఆగింది.

చాలా పెద్ద బంగాళా అది. సెక్యూరిటి లోపలికి కాల్ చేశాడు. గేటు తీసి లోపలికి వెళ్ళమని వినయంగా తల వంచి అతి మర్యాదగా చెప్పాడు. దామిని ఆశ్చర్యంతో ఎదురొచ్చింది. చేతిలోని సిగరెట్ ని నలిపి పారేసి కౌగలించుకుంది. కవిత ఆ కౌగిలిలో వణికిపోవడం గమనించి నెమ్మదిగా నడిపిస్తూ తీసుకెళ్ళింది. హాల్లోకి వెళ్ళబోయే ముందు ఎంట్రన్స్ లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వెన్ను మీద రాస్తూ ఉండిపోయింది. అరగంట తర్వాత దామిని కవిత చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. హాలంతా రిచ్ అలంకరణ తో ఉంది. గులాబీ, లిల్లీ ల గుభాళింపు. హాలునిండా జనం. అందరూ ఒకసారి వీరివంక చూసి మళ్ళీ కబుర్లలో మునిగిపోయారు.

“ఈ రోజు నా బర్త్ డే!” అంది దామిని. కవిత మొహం విప్పారింది. విషెస్ చెబుతూ -

“నాది కూడా!” అంది సిగ్గుగా.

“వావ్! గ్రేట్!” ఆనందంగా చప్పట్లు కొడుతూ –

“హాయ్! ఫ్రెండ్స్. మీట్ మై కొలీగ్! ఈ రోజు ఈమె పుట్టినరోజు కూడా!” అంది హిందీలో.

అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు.

“ప్లీజ్! మాకు కొంచెం టైమ్ ఇవ్వండి!” అని ఒంగి ఒంగి సలాం కొడుతూ పర్మిషన్ అడిగి కవితని లాక్కుపోయింది.

“ఏంటి సంగతి? ఇప్పుడు చెప్పు!” అడిగింది ఆప్యాయంగా. ఆమె అమోఘమైన అందాన్ని, గులాబీ రంగుతో ద్విగుణీకృతమైన ఒంటి చాయని కంటిమెరుపుతో చూస్తూ.

కవిత ఒక్కసారిగా బరస్ట్ అయింది. కన్నీళ్ళు ధారాపాతంగా జారి ఆమె ఎదని తడిపేస్తున్నాయ్. నిశ్శబ్దంగా రాలి పడుతున్న కన్నీటిని దామిని రెప్ప వాల్చకుండా చూస్తోంది. ఆమె హృదయం అంతా స్త్రీ పట్ల ప్రేమతో నిండిపోయింది.

ఒక్క స్త్రీయే ప్రేమించగలదు. మాతృహృదయంలోనే ప్రేమ ఉద్భవిస్తుంది. అర్ధమే కాని మనుషులకి స్త్రీ తన మనసు తెలుపకూడదు. గుప్పెట్లో బంధించి ఉంచాలి. కవిత భుజం మీద చెయ్యెసి దగ్గరగా తీసుకుంది.

“నువ్ ఎందుకింత తట్టుకోలేక పోతున్నావో నాకు తెలుసు. సున్నితమయిన ఆడపిల్లవి. ఏమయిందో చెప్తే నేనేం చేయగలనో చూస్తాను” అంది దామిని. కవితని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందామెకి. చాలా అమాయకురాలు. ఎవ్వరినీ నొప్పించదు. నెమ్మదిగా జరిగిందంతా చెప్పింది. అంతా విని దామిని విస్తుపోయింది.

“గాడ్! యు ఆర్ వెరీ లక్కీ! ముందే తెలిసింది. కానీ వాడిని అలాగే వదిలేస్తావా?’ అంది.

కవిత తన తల మీద చూపుడు వేలితో గీత లా గీసి ‘తలరాత’ అని సూచించింది.

“సరే పద! అంది హాల్లోకి తీసుకు వస్తూ.

ఆ సాయంత్రం చక్కని పార్టీ జరిగింది. ఎప్పుడు ఆర్డర్ చేశారో గానీ రెండు కేక్ కటింగ్ లు జరిగాయక్కడ. అన్నీ మరిచేలా డాన్స్ చేస్తూ కవిత కూల్ డ్రింక్ లో కొంచెం ‘రమ్’ జత చేసింది దామిని. కవిత అన్నయ్యకి కాల్ చేసి ఆ ఒక్కరోజు తమ ఇంట్లో ఉండేట్లు ఒప్పించింది. అతను వంద జాగ్రత్తలు వరుసగా చెప్పాడు. అన్నింటిని ఒప్పుకుంది. ఇలాంటిది ఇంకోసారి జరగడానికి వీల్లేదని మాట తీసుకుని వదిలిపెట్టాడు.

“బాబోయ్!” అంది దామిని.

“మా ఇంట్లో నాకు చాలా ఫ్రీడం. మామీద ట్రస్ట్!” అంది. కవిత నవ్వుతూ తాము పెరిగిన వాతావరణానికి, తాను పెరిగిన దానికి చాలా తేడా ఉందని అంది.

రాత్రి పదకొండు!

దామిని సిగరెట్ అందుకుని కవితని ఫ్రెష్ అవమంది. తన జీన్స్, టీషర్ట్ ఇచ్చి మార్చుకోమంది.

“వద్దు ప్లీజ్! ఎక్కడికి ఇంత అర్ధరాత్రి?” అంది.

“నాతో నీకు ఫుల్ సేఫ్టీ బేబీ! ట్రస్ట్ మి! నాకూడా కొన్ని పద్దతులున్నాయి. ఈ రాత్రి నువ్వు ఏడుస్తూ పడుకుని ఉంటే భరించే శక్తి లేనిదాన్ని. అర్ధం చేసుకో! మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నామ్!” అంది త్వరగా రెడీ అవమని చెప్తూ. కవిత జీన్స్ లో చాలా బాగుంది. దామిని మెచ్చుకోలుగా చూసింది. దామిని తల్లి ‘బి కేర్ఫుల్, ఆల్ ది బెస్ట్” అని చెప్పింది. ఎప్పుడు తిరిగి వస్తావని అడగక పోవడం చిత్రంగా ఉంది కవితకి.

“నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ కవీ? మా ఇంట్లో ఫ్రీ గా ఉండనిస్తారు.’’ ఒక ఏజ్ వచ్చాక ఎవరి మంచిచెడ్డలు వారివే’ అంటారు డాడీ! కానీ నామీద గొప్ప నమ్మకం!” అంది. చాలా ఫాస్ట్ డ్రైవింగ్ ఆమెది. భయంతో బిక్క చచ్చిపోతూ ఉంటే ఒక ప్లేస్ లో కారు ఆపింది. జనం పెద్దగా లేరక్కడ.

“లెట్ అజ్ సెలబ్రేట్!’ అంటూ ఒక పెద్ద బంగాళాలో అడుగుపెట్టింది. చాలా అట్టహాసంగా ఎప్పుడూ చూడని విధంగా ఉందా అలంకరణ.

“మేం సాబ్! అందరూ లోపల ఉన్నారు!” అంది హిందీ లో ఒక అమ్మాయి సలాం చేస్తూ. వందరూపాయల నోట్లు ఆమె చేతిలో ఉంచింది దామిని. మళ్ళీ సలాం చేస్తూ వెళ్ళిపోయిందా అమ్మాయి. ఆ అమ్మాయి విచిత్ర వేషధారణ చూస్తూ ఉండిపోయింది కవిత. వెనుక భాగమంతా దాదాపు నగ్నం గా ఉంది. క్షణంలో తిరిగి వచ్చి దారి చూపిస్తున్నట్టు వినయంగా చేతిని చాపుతూ మెలికలు తిరిగే దారిలో తీసుకెళ్లింది. ఒక దగ్గర కిందకి  మెట్లున్నాయి.

కవిత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే _

“అండర్ గ్రౌండ్ పబ్ యార్!” అంది దామిని. లోపల అంతా మంచులో ఉన్నప్పటి చల్లదనం. మ్యూజిక్ అదరగొడుతోంది. లయబద్దంగా డాన్సులు. ఒకరి మీద ఒకరు వాలిపోతూ, సోలిపోతూ ఎన్నెన్నో జంటలు. దామిని ఒకతన్ని పరిచయం చేసింది. అతడు తన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. దామిని కూల్ డ్రింక్ తో వచ్చి కవితకి అందించి ‘హేమ్’ తో మాట్లాడుతూ ఉండమని చెప్పి వెళ్లిపోయింది. దామిని వైపు చూస్తోంది కవిత. పెగ్ మీద పెగ్ వేస్తూ ఒళ్ళు అలిసిపోయేలా డాన్స్ చేస్తోంది. ఉండుండి కెవ్వుమని కేకలు, హగ్ లు. పొగలు, పొగలమధ్య నవ్వులు, నవ్వుల్లో మత్తులు.

“ఓ దామినీ! హు ఈజ్ షి?” చూపుడువేలు కవిత గుండెలకి చాలా దగ్గరగా వేలు పెట్టి అడిగాడు ఒకతను. గాభరాగ పక్కకి జరిగింది కవిత.

“ఎహే షాన్! ఆమె నా కొలీగ్ కవితాశర్మ! ఇదంతా కొత్త ఆమెకి. లీవిట్ యార్!” అంది దామిని హిందీ మిక్స్ చేసిన ఇంగ్లీష్ లో.

“నో! గివ్ మీ షేక్ హాండ్!” పంతం పట్టాడు ఫుల్ లోడ్ లో ఉన్న షాన్.

దామిని ఒక్కసారిగా షాన్ దగ్గరికి వచ్చి _

“టు డె ఇస్ మై బర్త్ డే! యై నాట్ విష్ మీ!” అడిగింది గోముగా.

“ఆర్రే బేబి... కమాన్... హప్పి బర్త్ డే!’ అన్నాడు. క్షణాల్లో ఆ వార్త అందరికీ పాస్ చేయబడింది. గట్టిగా అరిచారందరూ.

“వావ్! థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్!” అంటూ దామిని కూడా చేతులు పైకెత్తి కేరింతలు కొడుతోంది.

“కమాన్!” పిలిచాడు షాన్ దామిని డాన్స్ చేయడానికి.

“షాన్ భై ఒక్కసారి ఇటురా!” అని ఎవరో పిలవగానే తూలుతూ వెళ్ళి పోయాడు. బరువుగా నిట్టూర్చి ఒక మూలగా నిల్చుంది కవిత.

సడన్ గా లైట్స్ ఆఫ్! పిండ్రాప్ సైలెన్స్! అక్కడున్న గోడకి ఆనుకుని భయంగా నించున్న కవిత కళ్ళు నియాన్ లైట్ల వెలుగు ఒక్కసారిగా భరించలేక గట్టిగా మూసుకుని తెరుచుకున్నాయి.

దామిని శరీరమంతా పూల వాన!

“వెయిట్! వెయిట్ గైస్. ఈ రోజు నా ఫ్రెండ్ కవిత బర్త్ డే కూడా!” అని అనౌన్స్ చేసింది దామిని. కేక్ కటింగ్ లో అందరి స్పర్శ భరించరానిదిగా, వేదనగా ఉంది కవితకి. ఆ ‘హగ్’ లేమిటో అర్ధం కాలేదు ఆమెకి.

ఇదేదో డబ్బున్న వాళ్ళ లోకం. చచ్చినట్టు విష్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పింది.

“పాపకి మాటలోచ్చురోయ్!” అరిచాడెవరో అంతే. చప్పట్లు, దరువులు. రెండు నిముషాల్లో డిమ్ లైట్ లోకి వెళ్ళిపోయారంతా. పాటలు,గెంతులు, మందువాసనలతో హోరెత్తిపోతోంది.

షాన్ ఒక పెగ్ తీసుకొచ్చి కర్టెసి కాదంటూ కవితా నోట్లో పోసేసి పోయాడు. మంట, ఎగ ఊపిరి.

“నిన్ను నువ్ కాస్సేపయినా మరిచిపోవాలంటే ఇది కూడా ఉండాలి!” అని సిగరెట్ నోట్లో పెట్టి వెలిగించింది దామిని.

“దమ్ములాగు! స్వర్గం కనిపిస్తుంది. ప్రేమ ని రింగులు రింగులుగా ఊదొచ్చు!” అంది.

కవితకీ రోజు చాలా కసిగా ఉంది. జరిగిన విషయం మరిచిపోయేదా? చిన్నదా? ఎంత దారుణంగా మోసపోయింది తను! ఒక్క దమ్ములాగి ఉక్కిరిబిక్కిరి అయి పొగని బయిటికి వదిలింది లాఘవంగా.

ఆనందంగా కేకలేస్తూ దగ్గరికి తీసుకుంది దామిని.

“అదే స్పిరిట్ అంటే జీవితం ఎంజాయ్ చేయడానికే డియర్!” అంది. అంతే!! సిగేరేట్, మందూ లోకాన్ని మరిపించాయామెకి.

*** సశేషం ***

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in March 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!