Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

తరాలు-అంతరాలు

ఈ మధ్యకాలంలో విపరీతమైన మార్పులతో మనిషి జీవన విధానంలో ఒక ముఖ్యభాగమై పోయి, పలకరింపుల మొదలు ప్రతి పనికీ ఆధార పడేంతగా వచ్చిన అంతర్జాల సామాజిక మాధ్యమాల ఒరవడిలో అందరం మునిగి తేలుతున్నాము. అందులో మంచి ఉండి, సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని అన్ని విషయాలు చిటికలో ప్రపంచం మొత్తం పంచుకోవడానికి వీలు కలుగుతున్నది. అయితే, అందులో ఒకే అంశానికి సంబంధించిన వివరణ విభిన్న రూపాలలో కనపడినప్పుడు ఏది సరైనది అనే సందేహం కలగడం సహజం. ఆ సమాచారాన్ని అందించేవారు వారి స్థితిగతులు, ఆలోచనలు, అనుభవాల సారాన్ని అందులో ఉంచుతారు. అది ఇతరులకు ఎంతవరకు సరిపోతుంది అనేది ఇక్కడ ముఖ్యమౌతుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే ఆహారపు అలవాట్ల విషయంలో ఎక్కువ సమాచారము విభిన్న రీతులలో కనపడినప్పుడు మనలో చాలామందికి ఒక విధమైన సందిగ్ధత ఏర్పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఏ ఆహారం మంచిదికాదు, ఏది చెడ్డది కాదు అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సందిగ్దత (confusion) వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ముఖ్యంగా అంతర్జాల మాధ్యమాల్లో ఏదైనా చెప్పవచ్చు. చివరకు మనం ఇన్ని సంవత్సరాలు పాటించిన ఆహారపు అలవాట్లు అన్నీ చెడ్డవి అని వారు చెప్పే విషయాలు మంచివి అనే నమ్మకాన్ని కలిగిస్తారు. తద్వారా మనలో కూడా ఒక విధమైన తప్పు చేశాము అనే భావన కలుగుతుంది. అయితే అది ఎంతవరకు మన విషయంలో వర్తిస్తుంది అన్న కనీస జ్ఞానం మనకు ఉండాలి. మనిషిలోని జీవ కణాల నిర్మాణం వారు పుట్టిన భౌగోళిక, సామాజిక, నైసర్గిక అంశాల ఆధారంగా జరుగుతుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన శరీరంలోని జీవన ప్రక్రియ సరైన పాళ్ళలో ఉన్నప్పుడు, మనం తీసుకున్న ఆహారం కూడా మన శరీరానికి కావలసిన పోషకాలను అందించిందనే అర్థం కదా. అటువంటప్పుడు మన శరీరంలోని కణాలు ఒక విధానపరమైన ఆహారాన్ని స్వీకరించి శక్తివంతంగా పనిచేస్తూ మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంటే ఇప్పుడు అత్యవసరంగా మన ఆహారపు అలవాట్లను మార్చవలసిన అవసరం ఏముంది. ఈ ఆధునిక వైజ్ఞానిక, సుఖప్రద జీవన శైలిలో మనందరిలో లోపిస్తున్నది శారీరక శ్రమ. మన శరీరాన్ని కష్టపెట్టకుండా, సరైన వ్యాయామం లేకుండా శరీరంలోని క్రొవ్వును కరిగించకుండా కేవలం పెంచుకుంటూ పోతుంటే అప్పుడు ఎటువంటి ఆహారాన్ని తిన్ననూ ప్రయోజనం లేదు. అలాగే మన తరువాతి తరం వారికి సరైన జీవన ఆహారపు అలవాట్లను మనం కలిగించాలి అనే ఆలోచనతో నేను వంద శాతం ఏకీభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే మన తరువాతి తరం వారు మనకన్నా ఆరోగ్య విషయంలో మరింత జాగురూకతతో ఉండి చిన్నప్పటి నుండే శరీరానికి హాని చేసే కొన్ని ఆహార పదార్థాలను వాడటం మానివేస్తున్నారు. అది శుభ పరిణామం.

అవసరం, జీవన వనరుల సౌలభ్యాలకు అనుగుణంగా మనిషి జీవన శైలిలో, ఆలోచనలలో మార్పులు రావడం అనేది అత్యంత సహజం. అందుకు మనం ప్రత్యేకంగా హడావిడి చేస్తూ అందరినీ భయపెడుతూ ఆహారపు అలవాట్లను మార్చుకోమని నియంత్రించకూడదు. కేవలం మన అనుభంతో కలిగిన అనుభూతిని పంచుకుంటూ అవసరమైన చోట అదీ అడిగిన వారికి సలహాలు ఇవ్వడం తప్పనిసరిగా చేయాల్సిన విధ్యుక్త ధర్మం. ఆ పని చేసేటప్పుడు మిగిలిన విషయాలను చేదుగా చూపడం భావ్యం అనిపించుకోదు. ఏది ఏమైనా శ్రుతి మించిన వ్యవహారం తలకు మించిన భారం. అది ఆహారం కావచ్చు, ఆర్ధిక లావాదేవీలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు. వాటిని నియంత్రించుకుంటూ సమతుల్య జీవన మార్గాన్ని మనమే నిర్మించుకోగలము. అప్పుడు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

ఇప్పుడు మరో ముఖ్య అంశాన్ని స్పృశిస్తాను.

వైవాహిక బంధం అనేది కేవలం వంశాభివృద్ధికి మరియు సమాజంలో ఒక స్థాయిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే సాధనం కాదు. పెళ్లి అనే దానికి మన పూర్వీకులు చక్కటి నిర్వచనం ఆ తంతులో చదివే మంత్రాల ద్వారానే చెప్పిస్తున్నారు. ఆ బంధం ఒక అతీతమైన మనసుల కలయిక, పారదర్శకంగా జీవన ప్రయాణాన్ని ఒకరికొకరు తోడుగా కలిసి సాగించే విధంగా ప్రోత్సహించే ఒక ఉత్ప్రేరకం. ఆ విషయాన్ని మరిచి స్వాభిమానం, మా, మీ అనే భేదాభిప్రాయాలు, లింగ వివక్ష తదితర అంశాలతో ముఖ్యంగా మూడో వ్యక్తి సలహాల సముద్రంలో మునిగి చేజేతులా వైవాహిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అనవసరమైన మానసిక అస్తవ్యస్తానికి లోనౌతున్నాము.

శృంగారం అనేది పెళ్లి ద్వారా ఒక్కటైన దంపతుల మధ్యన ఏర్పడే ఆలంబన, అనురాగ, ప్రేమైక బంధ జీవన వ్యవస్థను సుస్థిరం చేస్తూ ఒకరికొకరు చివరివరకు పవిత్ర మనస్సుతో ప్రయాణించేటట్లు చేయగలిగిన సామర్ధ్యమున్న నిరంతర ప్రక్రియ. కష్టమైననూ ఇష్టంతో భౌతిక ఉత్తేజంతో పాటు మనోల్లాసాన్ని పొందే ఒక మధురానుభూతి. కానీ మనిషి ఇతర వక్రమార్గాల అనుకరణ ద్వారా ఆలోచనలను వక్రీకరిస్తూ అంతటి పవిత్ర భావనను పూర్తిగా మలినం చేసి సమాజంలో చెడును చేసే ఉత్ప్రేరకంగా మార్చి వేశాడు. అందులోనే ఇంకొకమెట్టు ఎక్కి నేడు కేవలం పిల్లలు కావాలంటే అనేక ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రక్రియలను ప్రోత్సహిస్తూ సహజ ధర్మాన్ని మరిచి కృత్రిమ సులభ పద్దతులపై మోజు పెంచుకొన్నాడు. మారుతున్న సమాజపోకడలు తరాల మధ్యన అంతరాలను మరింతగా పెంచుతూ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

అలాగే, ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసం కన్నీరు నింపుటకు..’ అని మహా రచయిత వ్రాసిన వాస్తవ సత్యాన్ని మరిచి స్వాభిమానంతో మన భాగస్వామి మీద మనలోని నిజమైన ప్రేమను మనమే సరైన రీతిలో వ్యక్తీకరించకుండా త్రుంచివేస్తున్నాము. అదే ప్రేమను సచ్ఛీలతతో వ్యక్తీకరిస్తూ మన భాగస్వామి తప్పులను ఒప్పులను సమానంగా స్వీకరిస్తూ వెళ్ళిన రోజు, పెళ్లి అనే మాటకు సరైన అర్థం దొరుకుతుంది. కలిసి ఉండటం కాదు కలిసిపోయి ఉండటం అనేది అతి ముఖ్యం. ఆ భావన కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసే సరైన సాధనం అవుతుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in March 2024, ఆరోగ్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!