Menu Close
Iruvanti-Sreenivas
శ్రీమతికి ప్రేమలేఖ (కథ)
-- యిరువంటి శ్రీనివాస్ --

ప్రియమైన శ్రీమతి అలివేణి అమ్ములుకి,

ఎలా ఉన్నావు? నువ్వు బాగానే వుంటావులే. అయినా ఎంత కోపం అయితే మాత్రం అలిగి వెళ్ళి ఇన్నిరోజులా దూరంగా ఉండేది. నువ్వు రావని నాకు తెలుసు. చూసి చూసి ఏదో ఒక రోజు నేనే నీ దగ్గరికి వస్తాలే. నిన్ను సర్ప్రైజ్ చేస్తా. చూస్తూ ఉండు. అయినా ఈ ప్రేమలేఖల గోల ఏందో నాకర్థం కాదు. నీకు ప్రేమలేఖలు రాయడం ఇష్టమని మన పెళ్లైన దగ్గరుండి "శ్రీవారికి ప్రేమలేఖ" అంటూ నాకు రాసి నన్ను బలవంతంగా చదివించావు. అలా అని ఊరుకోకుండా నన్ను కూడా రాయమంటూ పోరుపెట్టి నాకలవాటు చేసావు. మరిప్పుడేమో నీకు ప్రేమలేఖలు రాయకుండా నేనుండలేకపోతున్నామరి. అయినా మనసులో ప్రేముండాలికానీ ఈ ప్రేమలేఖలెందుకు?

మీఇంట్లో అందరు అమ్ములు అని పిలుస్తారని, నన్ను కూడా అమ్ములు అని పిలిచేదాకా బతకనిచ్చేదానివి కాదు. నాకేమో అలివేణి అని పిలవటమే ఇష్టం. నీకోసం, నాకోసమని అలివేణి అమ్ములు అని పిలిస్తే ఉడుక్కునేదానివి.

అయినా ఇంత అల్లరి అమ్మాయని తెలిసుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే కాను. పెళ్లి చూపుల్లో అల్లరి, పెళ్ళిలో కూడా అల్లరే. నాకన్ని గుర్తున్నాయిలే. పెళ్ళిచూపుల్లో కాఫీ తెస్తూ అందరికి బాగానే తెచ్చి, నాదగ్గరకొచ్చేసరికి కాఫీ ఒలక బోసి ముసిముసి నువ్వులు నవ్వుకోవటం నేను చూడలేదనుకున్నావా? మీ అమ్మ వాళ్ళు "ఇదేంటమ్మా! అలా అబ్బాయి మీద కాఫీ పోసావంటే", ఏమీ ఎరగనట్లు బుంగ మూతి పెట్టి, నావైపొక కొంటె చూపు విసిరావే, అబ్బో మరి ఆచూపుకే పడిపోయాను మరి.

అలానే మన నిశ్చితార్థంలో నీ ఫ్రెండ్స్ ని నా దగ్గరకు పంపించి నన్ను ఆట పట్టించావు. నాతో పాటు నా ఫ్రెండ్స్ ని కూడా ఒక ఆట ఆడుకున్నారు వాళ్లంతా. నా స్నేహితులంతా ఒకటే గోల, "ఒరేయ్! నువ్వసలే మెతక, నీకు తోడు ఈ అల్లరి, హడావుడి అమ్మాయి నీ భార్యగా, నువ్వు చచ్చావేరా" అని.

పెళ్ళిలో బిందెలో ఉంగరం నా చేతికొస్తే, నా చేతిని గిచ్చి రక్కి, బలవంతంగా నా చేతిలో ఉంగరం లాక్కుని, అదేదో ఉంగరం నీచేతికే అందినట్లు గెలిచినట్లు ఫోజులు కొట్టావే. అప్పుడే బయటపడింది నీ అల్లరంతా, కానీ ఏం లాభం. అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. మన పెళ్లైపోయింది. నేను తప్పించుకోలేక పోయాను. ఇక ఈ అల్లరమ్మాయితో జీవితాంతం కాపురం చెయ్యాలా భగవంతుడా అనుకున్నాను.

అయినా ఇద్దరం ముచ్చుగా మూతి ముడుచుకొని కూర్చుంటే ఏం బాగుంటుదని, నాలాంటి అబ్బాయికి నీలాంటి గోలమారమ్మాయిని కట్టబెట్టాడు ఆ భగవంతుడు. నేను ఎక్కువ మాట్లాడనని తెలుసు కదా! అయినా మీ అమ్మ నాన్న వచ్చినప్పడు నేను వాళ్ళతో మాట్లాడలేదని ఎందుకు మరి ఆ దెప్పులు? ఇంట్లో మాములుగా అంత హడావుడిగా ఉంటావు, మీ ఫ్రెండ్స్ తో, బంధువులతో నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటావు. అలా ఎలా మాట్లాడుతారో, అన్నన్ని మాటలు ఎలా వస్తాయో నాకిప్పటికీ అర్ధం కాదు. నీఅంతట నువ్వు మాట్లాడటమే కాదు, అవతలి వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా! ఎదుటి వాళ్ళు చెప్పేది మొత్తం వినే ఓపిక నీకెక్కడిదిలే? అలాంటిదానివి మా పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అంటీ ముట్టనట్టు ఉంటావు? మా వాళ్ళకేమో నువ్వు గలగలా మాట్లాడుతుంటే వినాలని ఉంటుంది. నువ్వేమో ఏదో ముందు జాగ్రత్త అని ఏం మాట్లాడితే ఏమనుకుంటారోనని ఆలా ఉంటానంటావు. గడుసుదానివే.

అయినా తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర ఎందుకలా నన్ను తక్కువ చేసి మాట్లాడటం. నాకేం నచ్చలేదు. అయినా ఏనాడైనా నేను నీకేం తక్కువ చేసాను. నీకన్నీ సమకూర్చాను, నువ్వడిగినవన్నీ కొనిపెట్టాను. సినిమాలు, షికార్లు తిప్పాను. నిన్ను బాగానే చూసుకున్నాను కదా! అలా అందరి దగ్గర నా గురించి మాటలాడడం, నన్ను చిన్నబుచ్చడం ఏమైనా బాగుందా! నువ్వేమన్నా నేనేమి మాట్లాడననేగా నీ దైర్యం. నేనెప్పుడైనా నీగురించి ఎవరికయినా అలా చెప్పానా? నా భార్య అందమైనదే కాదు, తెలివిగలది కూడా అని అందరికి గర్వంగా చెప్పుకునేవాణ్ణి. ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం నీ పద్ధతి నాకేం నచ్చలేదమ్మాయ్.

వంట చేసినప్పుడల్లా నేను నిన్ను మెచ్చుకోలేదని మూతి తిప్పుకుంటావే. అసలు నువ్వెప్పుడన్న వంట సరిగా చెయ్యలేదా చెప్పు? నీ చేతి వంట కోసమే కదా, నా మిత్ర బృందమంతా అడపా దడపా మనింటికి వచ్చేది. ఏ బ్యాచ్ మనింటికొచ్చినా సగం వంట నేనేగా చేసేది. అదేలే, నీకు కూరగాయలన్ని తరిగి పెట్టేది నేనేగా. అప్పుడు నీ వంటలో నాకేమన్నా సగం క్రెడిట్ ఇచ్చావా చెప్పు? నీకు గుర్తు వుండే ఉంటుంది. పెళ్లైన కొత్తలో వంట చేసి కూరల్లో ఉప్పు తక్కువయిందని కారం, కారం తక్కువయిందని ఉప్పు కలిపి నన్ను టార్చర్ పెట్టావే. అయినా మాట్లాడకుండా నువ్వు చేసినవన్నీ తిన్నాను కదా!

పెళ్లైన కొత్తలో ఒకసారి ఏదో పండక్కి మీఇంటికొస్తే, మీ బామ్మ గారన్న మాటలు ఇప్పటికీ నా చెవిలో మారుమ్రోగుతూనేవున్నాయి. "ఒసేయ్ పిల్లా! నువ్వు నక్కనితొక్కొచ్చావే. ఇలాంటి అబ్బాయి నీకు దొరకటం నీ అదృష్టమే పిల్లా! ఇంకేం చెంగునకట్టుకొని తిరుగు". ఆ మాటన్నందుకు, మీ బామ్మను కావలించుకుని ముద్దుపెట్టుకుంది నేను చూడలేదనుకున్నావా! అయినా అంత అమాయకుడిలా కనపడ్డానా మీ కళ్ళకు?

తెలిసిన వాళ్ళందరూ, మీ ఇద్దరు ఎప్పుడూ ఒకే మాట మీదుంటారు అంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా! దానర్థం మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకుని సంసారాన్ని సాఫీగా నెట్టుకొస్తునట్లే కదా! ఇద్దరం ఏ విషయంలో కూడా తొందరపడకుండా, మనస్పర్థలు లేకుండా ఎంత జాగ్రత్తగా వున్నాం.

అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడేదానివిలే. అయినా నేనేం పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా! నీకు తెలుసో తెలీదో మీ అమ్మానాన్నలకు మాటిచ్చాను. నిన్ను పల్లెత్తు మాటకూడా అననని. అప్పగింతలప్పుడు మీ అమ్మ నాన్న నన్ను పక్కకు పిలిచి "అల్లుడు గారు! అమ్మాయి కొంచెం వసపిట్ట కానీ, గయ్యాళి మాత్రం కాదు. తెలిసి తెలియని వయసు. ఏమన్నా ఎక్కువ తక్కువలు మాట్లాడినా పట్టించుకోకు బాబు" అని నా దగ్గర మాట తీసుకున్నారు.

ఏమండోయ్ శ్రీమతి గారు, నీ ఎదురుగా చెప్పలేకపోయినవి ఏమన్నా ఉంటే ఇలా ప్రేమలేఖలో రాసి నీ దృష్టికి తీసుకురావటానికి. అంతేకాని నిన్నేమీ ఇబ్బంది పెట్టాలని, నీ మనసు కష్టపెట్టాలనే ఉద్దేశ్యం మాత్రం అస్సలు లేదోయ్. అలాంటి మాటలేమన్న పొరపాటుగా దొర్లితే సరదాగా తీసుకొని, నన్ను క్షమించేసేయాలి మరి. సరేనా! ప్రతి ఉత్తరం చివరన ఈ డిస్క్లైమర్ లేకపోతే ఇంకేమన్నా ఉందా!

ఆమ్మో! ఇప్పటికే చాలా రాసాను. ఇంకా చాలా చాలా చెప్పాలని వుంది కానీ, తర్వాత ప్రేమలేఖ కోసం ఉంచుకోవాలి కదా! అందుకే ఈ సారికి ఇంతే. ఉంటా మరి.

ఇట్లు

నీ ప్రియమైన శ్రీవారు - రామం.

నాన్నా!, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళొచ్చారు. పది సంవత్సరాల కూతురు అమ్ములు పిలుపుతో, రాసిన ఉత్తరాన్ని జాగ్రత్తగా మడతవేసి షర్ట్ జేబులో పెట్టుకుని లోపలి గదిలోంచి బయటికి వచ్చాడు రామం.

అప్పుడే ఆటోలోంచి దిగుతున్న అమ్మమ్మని, తాతయ్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అమ్ములు.

రండి అత్తయ్యగారు, మామయ్యగారు ప్రయాణం బాగా జరిగిందా? పలకరించాడు రామం. చేతిలో వున్న బాగ్ అందుకోబోయాడు.

పర్వాలేదులే బాబు..లోపలి వచ్చారు ఇద్దరు.

కాళ్ళు కడుక్కుని రండి, కాఫీ తెస్తాను.

వద్దు నాయనా, ఇప్పుడేమి వద్దు అంటూ బాగ్ లోపల పెట్టి కాళ్ళుకడుక్కుని వచ్చి హాల్లో కూచున్నారు ఇద్దరు.

అమ్మమ్మ అంటూ వొళ్ళో వచ్చి కూర్చుంది అమ్ములు.

రావే చిట్టితల్లి, ఎన్ని రోజులయ్యిందే నిన్ను చూసి అంటూ దగ్గరకు తీసుకుంది అమ్ముల్ని అమ్మమ్మ శారదమ్మ.

ఎదురుగా గోడకి తగిలించిన కూతురు అలివేణి ఫోటో, దానికి ఒక పెద్ద దండ, ఆ రోజే మార్చినట్టుగా వుంది. అది చూసి కళ్ళనీళ్లు బొటబొటామంటూ వచ్చాయి.

ఊరుకో...అన్నట్టు తనమీద చెయ్యి వేసాడు రఘురాం.

అమ్మమ్మ! ఎందుకేడుస్తున్నావ్?

ఏంలేదులేమ్మా, అంటూ చీరచెంగుతో కళ్ళుతుడుచుకుని..నువ్వెళ్ళి కాసేపు ఆడుకో అంటూ అమ్ముల్ని బయటకి పంపింది.

ఏమండి చూసారా! అమ్ములు అచ్చం మనమ్మాయి అలివేణి లాగానే వుంది ఇప్పుడు. చిన్నప్పుడు మనమ్ములు కూడా ఇంతే ఉండేది గుర్తుందా మీకు.

అవునన్నట్లు తలూపాడు రఘురాం.

ముగ్గురి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది కాసేపు.

అత్తయ్య గారు, మామయ్య గారు.. రేపటి కార్యక్రమానికి అంతా రెడీ. పంతులుగారు కూడా ఉదయం కొంచెం ముందే వస్తానన్నారు.

రఘురాం మధ్యలో కల్పించుకుని..అయినా బాబు..ఇవన్నీ మేముచేయాల్సినవాళ్ళం.. నువ్వు చేస్తున్నావు..నీకెందుకని చెబితే వినవు.

అవును నాయనా, చెట్టంత కూతురే లేదు, కాన్పుకి వెళ్లి పండంటి బిడ్డతో ఇంటికివస్తుందనుకుంటే, నీకు కూతుర్నిచ్చి మా కూతుర్ని తీసుకెళ్లిపోయాడు ఆ భగవంతుడు. రేపటికి పది సంవత్సరాలు అది పోయి. కన్నవాళ్లకు మాకు క్షోభ తప్ప ఏమి మిగల్లేదు. అంటూ మళ్ళీ బోరుమంది శారదమ్మ.

బాబు, జరిగిందేదో జరిగిపోయింది, ఆ భగవంతుడు అలా రాసాడు మా రాత. నువ్వుకూడా ఒక్కడివి ఎంతకాలం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటే వినవు. కన్నతల్లి కాకపోయినా అమ్ములికి అమ్మ ఉంటుంది కదా అంటే వినవు.

ఏమీ మాట్లాడలేదు రామం. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళలో స్పష్టంగా కన్నీటి పొర కనపడుతోంది వాళ్ళిద్దరికీ.

నెమ్మదిగా కళ్ళు తెరిచి, కళ్ళు తుడుచుకున్నాడు.

అత్తయ్య గారు, మామయ్య గారు, మీకు తెలుసు ఇంతకుముందు చెప్పే వుంటాను. అలివేణి ని పెళ్లి చూపుల్లో చూసినప్పటినుంచి నా జీవితమే మారిపోయింది. అదోరకమైన అనుభూతి, వల్లమాలిన అభిమానం, ప్రేమ. పెళ్లైన తర్వాత ఒకరకంగా తనే నా సర్వం అయింది. తాను లేకుండా వుండలేనేమో అనిపించింది.

అది అలా నా జీవితాంతం ఉండిపోవాలని కోరుకున్నాను. ఒక్కొక్క సారి తను నన్ను చూసి "ఏమండి! ఏమిటిలా అయిపోయారు అని నవ్వేది". అలాగుండటం నాకు ఆ భగవంతుడిచ్చిన వరం అనుకున్నాను. కానీ ఇప్పుడు తను లేకపోవటం అదే నా పాలిట శాపం గా మారింది అనుకున్నాను మొదట. కానీ ఎందుకో నాకు తను లేకపోయినా, తన జ్ఞాపకాల్లో ఉండటమే నాకు ఇష్టంగా వుంది. ఇదేదో నేను సినిమా డైలాగులు చెబుతున్నానని అనుకోకండి. ఇది వాస్తవం. నా మనసు లోతుల్లోంచి వచ్చిన మాటలు. తను బ్రతివున్నప్పుడు తనకి ఇలాగ, ఇవన్నీ చెప్పలేకపోయాను.

రామం వైపు శారదమ్మ, రఘురాం అలా చూస్తుంది పోయారు. ఒకమనిషిని ఇంతలా ప్రేమిస్తారా? అలివేణి ఇప్పుడు ఈలోకంలో లేకపోయినా, ఇంకా తనపై ఇంతటి వాత్సల్యం  వున్న రామాన్ని మనసులోనే అభినందించారు. ఇలాంటి మనుషులు కూడా ఈ కాలంలో ఉన్నారా అనిపించింది.

రామం ఇంకా చెబుతున్నాడు.

మొదట నేననుకున్నాను. స్వతహాగా నా మనస్తత్వం వల్లనేమో తనంటే ఇంతటి విపరీతమైన ఆప్యాయత, మమకారం అని. కానీ కాదని తెలిసింది. ఒకమనిషి ఇలా ఉండటం కేవలం వాళ్ళవల్లనే కాదు. ఎదుటివాళ్ళ స్పందన మీద కూడా ఆధారపడి ఉంటుందని అర్ధమయింది క్రమంగా. అవునండీ! అలివేణి మీకు అల్లరిచిల్లరి హడావుడి అమ్ములుగానే తెలుసు. కానీ తనలో ఎదో తెలియని సున్నితత్వం బహుశా మీకు తెలియదేమో. లేకపోతే అది మా పెళ్లయినతర్వాత బయటకొచ్చిందేమో. తనలో వున్న గోము, గారం, గారాబం, లాలిత్యము అన్ని నాకోసం దాచిపెట్టిందేమో అనిపించింది.

తన వలపు అనే అమృత వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను. తను చూపించే ఆప్యాయతకు ఉబ్బితబ్బిబ్బు అయ్యేవాడిని. తను చాలాసార్లు నన్ను గట్టినా కావలించుకుని, నాగుండెమీద తలపెట్టి ఏడుస్తూ నామీద మమతని, మమకారాన్ని వ్యక్తం చేసేది. అందుకేనేమో ఇప్పుడు తను మనమధ్యలో లేకపోయినా, నాకు నా పక్కనే ఉన్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

రామం గొంతు గద్గదమైంది.

అత్తయ్యగారు, మామయ్యగారు, నేనేదో లెక్చర్ ఇస్తున్నానని అనుకోకండి. మాఇద్దరి మధ్య బంధం అంత బలంగా పెనవేసుకుపోయింది.

అయ్యో బాబు! నిన్ను బాధ పెట్టాలనికాదు. కానీ అమ్ములుకోసం .. అంటూ రఘురాం ఏదో చెప్పబోయాడు.

తనెప్పుడు నాలాంటి బాబు కావాలని అంటుండేది. కానీ తనలాంటి పాప నిచ్చింది. నేను మళ్ళీ పెళ్లిచేసుకున్నా ఆ వచ్చే అమ్మాయి నాకు భార్యగా ఉండగలదేమో కానీ, అమ్ములికి అమ్మగా మాత్రం వుండలేదు. అమ్ములికి అమ్మ, నాన్న రెండు నేనే. నా శాయశక్తులా అమ్ములికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. మీరు, మా పేరెంట్స్ వున్నారు కదా!

సరే నాయనా! నీ ఇష్టం శారదమ్మ రఘురాం వైపు చూస్తూ.

అవును బాబూ ఇకనుంచి ఈ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టం.

ఇదుగోండి ఈ ఉత్తరం తనకివ్వండి, అంటూ తన జేబులోంచి రాసిన ప్రేమలేఖని శారదమ్మకి ఇచ్చాడు రామం.

తను పుట్టింటికొచ్చినపుడల్లా, నువ్వు రాసిన ఉత్తరాల్ని తీసుకెళ్లి ఇస్తే రోజంతా చదువుకొని మురిసిపోయేది పిచ్చిది, అంటూ రామం రాసిన ప్రేమలేఖని అలివేణి ఫోటో ముందు పెట్టారు శారదమ్మ, రఘురాం దంపతులు.

అలివేణి అమ్ములు! నా ప్రేమలేఖను త్వరగా చదువుతావుకదూ! తన ఫోటో వైపు అలాచూస్తూ మనసులో అనుకున్నాడు రామం.

********

Posted in March 2024, కథలు

16 Comments

  1. రాధాకృష్ణ మారావఝల

    అద్భుతమైన రచన. చాలా బాగుంది. మనసుని తాకింది. భార్య ఉండగానే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం చాలా సాధారణమైన ఈ రోజుల్లో ఇలాంటి కధలు నిజంగా కనువిప్పు కలిగించేవే. సమాజంలో రచనల ద్వారా రచయితలు తీసుకుంటున్న సామాజిక బాధ్యతను మీరు నిదర్శనం.

  2. jyothirmayi

    chaalaa bagundi , ending chaalaa badha gaa anipinchindi very emotional and heart touching.Congratulations andi. Meeru telugu movie stories koodaa try cheyocchu kada.

    • Sreenivas

      ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు నా కథ మీకు నచ్చినందుకు.

  3. పవన్

    అద్భుతం గా రాసారండి ! కళ్ళు చెమర్చాయి ! అందమైన సున్నిత భావాలని అలవోకగా అందుకుని పొందిక గా అమర్చారు ! పాట గుర్తకొస్తుంది ! “alivaeNee ఆణిముత్యmaa “

  4. Raji

    చాలా చాలా బాగుంది. మొదటిలో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నట్లు రాశారు, తరువాత పూర్తి గా మార్చే శారు . చివరకు బాధ అనిపించింది.

  5. మధు బుడమగుంట

    ఎంత హృద్యంగా, మానవబంధాల మనుగడ మృగ్యమై పోతున్నఈ వాస్తవ స్వార్థ లోకంలో గారం, గారాబం, గోము వంటి సున్నిత హృదయస్పందన పదాలను జొప్పించి కథను మంచి సాహిత్య విలువలతో మలిచారు. మనఃపూర్వక అభినందనలు.

  6. A.Vital prasad

    మీ పాత కథలు అన్ని హాస్యం గా వుండే వి, కానీ ఈ కథ కూడా హాస్యం గా మొదలుపెట్టి బాధా గా ముగించారు, చాలా బావుంది

  7. రామలింగేశ్వరావు

    శ్రీనివాస్ ఉత్తరం చాలాబాగా వ్రాసారు , కానీ చివరివరకు చదివిన తరువాత కళ్ళలో నీళ్లు వచ్చాయి . ధన్యవాదములు మిత్రమా.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!