Menu Close
వీక్షణం-138 వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-138

వీక్షణం సాహితీ గవాక్షం 138 వ ఆన్లైన్ సమావేశం డా. గీతామాధవి గారి సారధ్యంలో ఫిబ్రవరి17న ఆద్యంతం ఆసక్తిదాయకంగా, రసవత్తరంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులు శ్రీ దాసరి అమరేంద్ర గారినీ,  శ్రీ ఏ కె ప్రభాకర్ గారినీ డా.గీతామాధవి గారు సాదరంగా ఆహ్వానించి సభకు పరిచయం చేశారు. "నంబూరి పరిపూర్ణ గారు పరిచయం అవసరం లేని రచయిత్రి. ఇటీవల మనందరినీ వదిలి వెళ్ళిపోయిన వారికి నివాళిగా వారిని సంస్మరించుకుంటూ ఈ నాటి వీక్షణాన్ని జరుపుకుంటూ ఉన్నాం" అని తెలియజేసారు. దాసరి అమరేంద్ర గారు ఇటీవల స్వర్వస్తులైన తమ అమ్మగారు శ్రీమతి నంబూరి పరిపూర్ణ గారి రచనా పరిణామం అనే అంశమ్మీద ప్రసంగించగా, ఏ కె ప్రభాకర్ గారు ఆత్మీయ వాక్యాలు పలుకుతూ పరిపూర్ణగారి రచనలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు.

నంబూరి పరిపూర్ణగారి వివరాలు: వీరు 1931 జూలై 1న కృష్ణా జిల్లా బొమ్ములూరు గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను విజయవాడ దగ్గర బండారిగూడెంలోనూ, మద్రాసు, రాజమండ్రిలలో హైస్కూల్ విద్యను, ఇంటెర్మీడియేట్ పి. ఆర్. కాలేజీ, కాకినాడలోనూ పూర్తిచేసి, ప్రైవేటుగా బి.ఏ. పట్టభద్రులయ్యారు. సెయింట్ థెరీసా మహిళా కళాశాల, ఏలూరులో టీచర్ ట్రైనింగ్ చేసారు. వీరు అనేక ఉద్యోగాలు చేసారు. 1955-58 మధ్య నూజివీడు, ఏలూరు, గోపన్నపాలెంలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆ తర్వాత 1958-1989 మధ్య 30 ఏళ్ళ పాటు పంచాయితీ రాజ్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా, స్త్రీ శిశుసంక్షేమ శాఖలో లైజాన్ ఆఫీసర్ గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా  వివిధ ప్రాంతాలలో పనిచేసారు. 1989 జూలై 1న పదవీ విరమణ పొందారు.

సాంస్కృతిక రంగంలోని కృషిలో భాగంగా వీరు లోహితాస్యుడుగా స్టేజి నాటకంలోనూ, శోభనాచల పిక్చర్స్ వారి భక్తప్రహ్లాద సినిమా (1941)లో ప్రహ్లాదుడి పాత్రలను పోషించారు. సినిమాల్లో ప్లే బ్యాక్ లేకుండా పాటలూ, పద్యాలు పాడారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆధ్వర్యంలో అనేక రేడియో నాటకాల్లో పాలుపంచుకున్నారు. 1965 నుంచి ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి అనేక రేడియో ప్రసంగాలు ఇచ్చారు. 1944లో కమ్యూనిష్టు పార్టీ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో వేదికలపై ప్రచార గీతాలు ఆలపించారు. 1986లో అక్కినేని కుటుంబరావు గారి దర్శకత్వంలో "ఇద్దరూ ఒక్కటే" అనే టెలీఫిల్మ్ లో ప్రధాన భూమికను పోషించారు. 2004లో, సర్రాజు ప్రసన్నకుమార్ సంగీత దర్శకత్వంలో "స్వర పూర్ణిమ" అనే ఆడియో పాటల ఆల్బమ్ ను విడుదల చేసారు.

సాహిత్య వ్యాసంగంలో భాగంగా మాకురావు సూర్యోదయాలు, నవలిక (1985), ఉంటాయి మాకు ఉషస్సులు, కథా సంపుటి (1998), కథా పరిపూర్ణం కథా సంకలనం (2006) (శిరీష అమరేంద్ర శైలీంద్రలతో కలిసి), శిఖరారోహణ, వివిధ సామాజిక అంశాల పై స్త్రీ సమస్యల పై వ్యాసాలూ, కథల సంపుటి (2016), వెలుగు దారులలో… ఆత్మకథ (2017), పొలిమేర నవల (2018), ఆలంబన నవల 2022లో వెలువరించారు.

పరిపూర్ణ గారి సామాజిక సేవ గురించి చెప్పాలంటే 1944-49 మధ్య వామపక్ష ఉద్యమాల్లో విద్యార్థి కార్యకర్తగా, నేతగా పనిచేసారు. 1950-52 కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా నిర్బంధానికి గురై అజ్ఞాత జీవితం గడిపారు. విజయవాడ హైద్రాబాద్ లలో సంఘటిత, అసంఘటిత మహిళలతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇరవై ఏళ్ళ పాటు ఆలంబన స్వచ్ఛంద సేవాసంస్థకి చేయూతనిచ్చి, క్రియాశీలక పాత్రని పోషించారు. విశాలసాహితీ కథా పురస్కారం (1996), వెంకటసుబ్బు అవార్డులు (2019) వీరిని వరించాయి. ఇక వారి కుమారులు, ముఖ్య అతిథులైన దాసరి అమరేంద్ర గారు కథకులు, వక్త, అనువాదకులు. కథలు, వ్యాసాలు యాత్రాకథనాలు, అనువాదాలు.. ఇలా విభిన్న ప్రకియల్లో 16 పుస్తకాలు ప్రచురించారు. వృత్తిరీత్యా ఇంజినీరు. ఢిల్లీలో నివాసం ఉంటారు. అమరేంద్ర గారు మాట్లాడుతూ "స్వర్గీయ నంబూరి పరిపూర్ణ గారు దాసరి కులంలో జన్మించి వివక్షకు గురియైనా రంగస్థల నటిగా, సినీ నటిగా, రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా ఎలా అందనంత ఎత్తుకు ఎదిగారో వివరించారు. ఆత్మాభిమానం, స్వావలంబన, సాధికారత సాధించి సమాజాన్ని కాచి వడపోసి రచించిన గ్రంథాలు మనకు మార్గదర్శనం చేస్తాయని వివరించారు. వామపక్ష భావాలతో ఎదిగిన తను తన 92వ యేట నిస్పృహతో వివిధ ప్రలోభాలకు గురియైన వామపక్ష వాదులు తమ మూలసిద్ధాంతాలను మూలపెట్టారు అని పరిపూర్ణగారు విచారం వ్యక్తం చేయడాన్ని, ఆమె ఆత్మసంస్కారాన్ని తెలియజేస్తుంది. వారి గ్రంథాలలో కొన్ని అయిన కథా పరిపూర్ణం, పొలిమేర, ఆలంబన, వెలుగు దారులలో, ఒకదీపం వేయి వెలుగులను పరిచయం చేశారు. సుమారు గంట సేపు అనర్గళంగా సాగిన వారి ఉపన్యాసం అద్భుతంగానూ, స్ఫూర్తిదాయకంగానూ జరిగింది.

ఆ తరువాత మాట్లాడిన ఏ కె ప్రభాకర్ గారు పరిపూర్ణగారి కథా సంవిధానాన్ని, విశేషాంశాలని సభకు తెలియజేసి సభలోనివారికి అదే స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలగజేశారు. తరువాత కవిసమ్మేళనాన్ని తొలుత శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారూ, ఆ తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారూ సమర్థవంతంగా నిర్వహించారు. 28 మంది ఉద్దండ కవులు భారత దేశం నుండి, అమెరికా మొ.న పాశ్చాత్య దేశాలనుండీ పాల్గొని తమ కవితా గానాన్ని వినిపించారు.

డా.గీతామాధవిగారు తన కుడిచేతి వ్రేలుకి ఆపరేషన్ చేయించుకుని ఆ కట్టుతోనే పాల్గొనడం అచ్చెరువు గొల్పినది. ఆ వ్రేలు పైనే వారు కవిత చెప్పడం మరో విశేషం. ఆమె పడిన కష్టాలను, ఆగిపోయిన కార్యక్రమాలనూ ఆర్ద్రంగా, ఆవేదనగా, అద్భుతంగా వారి కవితలో వినిపించారు. వసీరా గారు యారాడకొండపై కవితాగానం చేశారు. "యారాడ ఏనుగుపై చందమామ ఊరేగాడు" అనడం మనస్సును తాకింది. కందుకూరి శ్రీరాములు గారు అమ్మ గురించిన ఆర్ద్రమైన కవితని వినిపించారు. ఆచ్ పిట్ట పద ప్రయోగం, ముసలమ్మ ముచ్చట ఎవరికి కావాలి? అనేవి ఇందులోని విశేషాలు. రాజేంద్రప్రసాద్ గారు "తెలుగు వెలుగురా" అని తన కంచు కంఠంతో శ్రావ్యంగా పాడి అందరినీ ఆకర్షించారు. డా.పాతూరి అన్నపూర్ణగారు 'కాలమా నీతో మాట్లాడాలని ఉంది' అంటూ అద్భుతమైన భావుకతను చూపారు. రాము లగిసెట్టి గారు ఇక పరుగెత్తు అని అందరిమనసులను తనతో పరుగెత్తించారు. డా. దేవులపల్లి పద్మజ గారు నవరస మాలికను సరసంగా వినిపించారు. మంచి భావుకత పరిమళించింది. డా.కోదాటి అరుణ గారు పుస్తకం యొక్క ప్రాముఖ్యతను తనకవితలో చెప్పారు. డా.బృంద గారు గానం చేసిన కవితలో అంత్యప్రాసలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా.సి.హెచ్. సీతాలక్ష్మి గారు ప్రేమకు మరణంలేదు అంటూ ప్రేమ ఔన్నత్యాన్ని రసవత్తరంగా చెప్పారు. రామాయణం ప్రసాదరావు గారు "చావుతో సరసం" అనే కవితతో అందరినీ మెప్పించారు. అమృతవల్లి గారు క్రొత్తదనానికి చోటిస్తే అని, ఉమామహేశ్వరరావు గారు కవి గురించి గానం చేశారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు కవిహృదయాన్ని సుందరంగా చెబితే, సాధనాల వెంకటస్వామి నాయుడుగారు కలల పై కవిత్వం వినిపించారు. పిళ్ల వెంకటరమణమూర్తి విచ్చిన్న ముకురం అనే కవిత చదివారు. వారి కవితలోని భాషా విన్యాసం అందరినీ ఆకట్టుకుంది. రవీంద్రగారు అమ్మలేని జీవితం ఎంత దుర్భరమో ఆర్ద్రంగా చదివారు. సత్యమూర్తి గారు మన భారతరత్న పీవీ గారిపై కవిత చదువగా, పీవీగారికి గురువైన వారి నాన్నగారిపై అయ్యలరాజుగారు గానించారు. మోటూరు వెంకట నారాయణరావు గారు "ఈ ప్రశ్నకు బదులేదీ" అంటూ ప్రశ్నించారు. మన్నెం లలితగారు కుక్కకాటుకు అనే కవితలో ఈనాటి యువతుల గురించి చెప్పారు. లోకనాధంగారు మాతృదేవోభవ అంటూ పద్య పఠనం చేసారు. మల్కాని విజయలక్ష్మి గారు పుస్తకం విజ్ఞానదీపికలు అంటూ పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచారు. వృద్ధాప్యం పై మేడిశెట్టి యోగేశ్వరరావు గారు వినిపించిన కవితలోని లయ సౌందర్యాన్ని అద్దుకుంది. ఇంకా ధనమ్మరెడ్డి, గౌరీపతి శాస్త్రి గారు, మొ.న వారు చక్కని కవితలు వినిపించారు.

జనవరి నెలకి గానూ ఉత్తమ కవితా పురస్కారాన్ని డా.చీదెళ్ల సీతాలక్ష్మి గారు అందుకున్నారు.

చివరిగా డా.గీతామాధవి గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి గీతగారు నెలనెలా వీక్షణం సమావేశాలు కాలిఫోర్నియా నుండి నిర్వహించడం కవిలోకానికి నెలనెలా ఓ పండుగ! ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఆత్మీయంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in March 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!