Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. దగ్గర ఉన్న దాని విలువ, దూరమైతే తెలియును,
    మరణించిన తరువాతనే, మనిషికి విలువ పెరుగును!
  2. ద్వేషమనెడు జాడ్యానికే, ప్రేమ మంచి ఔషధము,
    మనసున కలిగే అలజడికి, ఓదార్పే ఔషధము!
  3. విద్యాహీన నాయకులకు, పనివాళ్ళే చదువరులు!
    జ్ఞానహీనులవుతున్నారు, సిరితో పట్టభద్రులు!
  4. అప్పు తెచ్చిన ధనమెప్పుడు, ఉచితమంటూ యివ్వకు,
    అప్పే పుట్టని తరుణమున, దిక్కు తోచక వగచకు!
  5. సౌందర్యము నిలువదెపుడూ, శాశ్వతముగ భువియందు,
    పరిమిత జ్ఞానము చాలదే, పండిత సమూహమందు!
  6. బ్రతుకు పరాన్నభుక్కైతే, హేయమనిపించుకొనును!
    పెద్దల దూషణ చేయుటే, నీచమనిపించుకొనును!!
  7. పాషణమును కరిగించు శక్తి, సంగీతముకు ఉన్నది!
    మాటలు చెప్పని భాష్యాన్ని, తెలుపును మౌనమన్నది!
  8. అమ్మ పెట్టే గోరుముద్ద, చవులూరించే విందు!
    జీవితాలు బుగ్గి చేసే, చెడ్డ వ్యసనమే మందు!!
  9. గురివిందగింజ మనస్కులు, ఒప్పుకొనరే తప్పును!
    గాలిమాటలు ఆపకుంటె, వదిలిస్తారు తుప్పును!!
  10. చెప్పుడు మాటలు విందువా, ఎదురయేను సమస్యలు!
    కంటికి కనబడేవైనా, కావెప్పుడూ నిజాలు!!

**** సశేషం ****

Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!