Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

నీ పేరేమో లింగం
నా పేరేమో అంగం
లింగానికి అంగానికి మధ్యన సంఘం
సంఘాన్ని గెలిస్తే స్వాగతిస్తదా శివలింగం
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీవు నల్లరాతిలో దాక్కున్నావు
నేను కాలే కట్టెలో దాక్కున్నాను
ఈ దాగుడుమూతల ఆటలో
ఒకరికొకరు కనబడేది చిదంబర రహస్యమా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నను కన్నది ఓ ఆడది
నిను కన్నది ఏ ఆడది
అడిగితే చూపుతావు బూడిది
ఆడ మగ అహంకారాలు బూడిదపాలా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

అమ్మకు పుడితిని
నాన్నతో నడిస్తిని
భార్యను పడితిని
కొడుకులే నేనుకంటిని
కాటి కట్టెనైతిని...
ఏటి గట్టున పూజలందుకుందిచాలు
చివరి యాత్రకు శంఖారావం ఊదవా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

అమ్మ పాలు తీపని, తాగినపుడు తెలియదు
తెలిసిన ఇపుడు తాగలేను
నాన్న కొట్టుడు మంచి అని, ఏడ్చినపుడు తెలియదు
తెలిసిన ఇపుడు నాన్నతో లేను
ఆడుకునేటప్పుడు బాల్యమే, బంగారమని తెలియదు
తెలిసిన ఇపుడు ఆడలేను
తీపిని చేదుగా, చేదును తీపిగా
నడిపించే తింగరి స్వామి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

అంతా నువ్వైనపుడు నేను ఏమిటి
అంతా నీదైనపుడు నాది ఏమిటి
అంతా నీలో ఉన్నపుడు నాలో ఏమిటి
అంతా నీకైనపుడు నాకేమిటి
అంతాలో అంతమైయ్యే సంతనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఆడదానికి అర్ధభాగమిచ్చావు
ఆడదానిని నెత్తిన పెట్టుకున్నావు
ఆడతనమే ఆదిశక్తిగా నిలిపావు
ఆడగుణమే అనంతంలో నింపావు
ఆడతనముకే అండదండైనా ఆది సంఘసంస్కర్తవు నీవు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీకు అమ్మలేకపోతేనేమి
నాకు అమ్మవు అయితివి
నీకు నాన్న లేకపోతేనేమి
నాకు నాన్నవు అయితివి
నాకు ఎవరులేకపోతేనేమి
సర్వము నీవై నవ్వితివి
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

పచ్చిగా పచ్చితోలు కట్టడం
పచ్చిగా ప్రాణం తీసే విషం తాగడం
పచ్చిగా పచ్చని గంగను మోయడం
పచ్చి అబద్ధమైతే ఎంత బాగుండయ్యా
నీ కష్టం తలుచుకుంటే నా కంట్లో గంగ పారుతున్నదయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

అక్కడి నుంచి ఇక్కడికి
ఇక్కడి నుంచి అక్కడికి
ఎక్కడెక్కడికి ఎగిరినా
చివరికి నీ కాడికే.., నీ కాటికే...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in March 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!