Menu Close
Garimella Venkata Lakshmi Narasimham
మలుపులు తిరిగిన జీవితం (కథ)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

నవరంగపట్నంలో గోపాలరావుగారు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టరుగా పని చేస్తున్నారు. సుగుణగారు ఆయన ధర్మపత్ని. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దవాడు శంకరం. వాడి చెల్లెలు హేమలత. చిన్నది అందాలరాశి. ఇద్దరూ తెలివిగా చదువుకొంటున్నారు. ఇంటా బయటా అందరూ హేమలతను 'హేమా' అని పిలువనారంభించేరు. గోపాలరావుగారికి తమ పిల్లల్ని కాన్వెంటు స్కూల్లో చదివించాలని కోరిక ఉండేది. ఆ స్కూలు ఫీజులే కాక, డ్రెస్సులకు జోళ్ళకు అయ్యే ఖర్చు తూగలేక ఆయన ఆ జోలికి పోలేదు. ఇద్దరు పిల్లలను సర్కారువారి బడిలో చేర్పించేరు. పండుగకు పేవుమెంటుమీద అమ్ముతున్న దుస్తులే పిల్లలకు కొంటున్నప్పుడు, వారికి నచ్చిన బట్టలు దుకాణంలో కొనలేకపోతున్నానని ఆ తండ్రి పడ్డ మనోవ్యధ ఏ తండ్రికీ రాకూడదు. మండుటెండలో కాలికి జోళ్ళు లేక, కాలుతున్న భూమిపై పాదాలు మోపలేక, ఇంటికి పరుగులు తీస్తున్న పిల్లలను చూస్తున్న తల్లి ఎంత దుఃఖించిందో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఇంటి పరిస్థితిని కొంతవరకు అవగాహన చేసుకొన్న కొడుకు, మనసులోని ఆశలను దిగమ్రింగుకొంటున్నాడు. ఫలితం శూన్యమయినా, హేమలత అప్పుడప్పుడు చిన్నచిన్న వాటికి మారాము చేస్తూండేది.

శంకరానికి చెల్లెలిపై ఎనలేని ప్రేమ. బడికి రాకపోకల సమయాలలో చెల్లెలి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎప్పుడూ రోడ్డు ప్రక్కనుండే నడవమని హెచ్చరించేవాడు. రోడ్డు దాటవలసినప్పుడు చెల్లెలి అరచేయి పట్టుకొని రోడ్డు దాటించేవాడు. మండుటెండలో పరుగులెత్తవలసిన సమయాలలో, చెల్లెలి సంచి కూడా తన భుజాన్న వేసుకొని చెల్లెలి భారం తగ్గించేవాడు. ఒకరోజు బడికి వెళుతున్న సమయంలో హేమ నడకను ఆపి, ప్రక్కనుండి పోతున్న కారును కళ్లప్పగించి చూస్తూంటే,

"చెల్లీ, ఎందుకు ఆగేవ్. ఏమయినా ఇబ్బందా." అని ఆత్రుతతో అడిగేడు, అన్న.

"ఇబ్బంది ఏమీ లేదన్నా."

"తొందరగా పద. బడికి లేటయిపోతాం." అని అన్న హెచ్చరిస్తే, నడక ప్రారంభిస్తూ,

"అన్నా. కారు ఒకటి కొంటే ఎంతవుతుంది." అని అడిగింది, చెల్లి.

"నాకేం తెలుసు. అయినా ఇప్పుడు నువ్వేమయినా కారు కొంటావా." అని కొంటెగా జవాబిచ్చేడు.

"నేను పెద్దయితే తప్పకుండా కొంటాను అన్నా. కారులో తిరిగితే మజా వస్తుంది." అని ముసిముసి నవ్వులతో జవాబిచ్చింది.

"తొందరగా నడూ. బడికి లేటయి టీచరు కేకలేస్తే అప్పుడు వస్తుంది, మజా." అని చెల్లిని తనతోబాటు పరుగులెత్తించేడు, అన్న.

శంకరం పన్నెండవ తరగతిలోనికి వచ్చేడు. హేమ ఎనిమిదిలో ప్రవేశించింది. ఒకరోజు కొడుకు పైచదువుల విషయంలో ఆలోచనలో పడ్డ సుగుణ గారు భర్తతో ఆ విషయం లేవనెత్తి,

"ఏమండీ, మనవాడి స్కూలు చదువు ఈ ఏడాదితో అయిపోతుంది కదూ."

"అవును. అది ఈ ఏడాదితో సరి."

"వాడి పైచదువు ఏమిటి చేద్దామనుకొంటున్నారండి."

"ఓ డిగ్రీ అయినా చేయించకపోతే వాడికి బ్రతుకుతెరువు ఉండదు. దేముడి దయవల్ల మన ఊళ్ళో డిగ్రీ కాలేజీ ఉంది. అందులో వాణ్ణి B.A. చేయిస్తాను."

"ఏమండీ, అంత మంచిమార్కులు తెచ్చుకొంటున్నాడు కదా, ఇంజినీరు చదివించలేమా. కాకినాడలో ఇంజినీరు కాలేజీ ఉందికదా. అక్కడ మా అక్కయ్యగారి ఇంట్లో ఉండి చదువుకొంటే ఖర్చులు ఉండవు కదా. మా అక్కయ్య, బావగారు వాళ్ళ దగ్గర ఉంచుకోడానికి కాదనరు."

"సుగుణా, అన్నయ్యగారు పౌరోహిత్యం చేసుకొంటున్నారు. ఆరుగురు పిల్లలు. వాళ్ళమీద మన భారం వెయ్యడం బాగుండదు. ఇంతకూ ఉండడానికి, తిండికి ఖర్చు లేకపోయినా ఇంజినీరింగు పుస్తకాలికి, ఇంకా చాలా వాటికి బోలెడు ఖర్చు అవుతుంది. అవి మనం భరించలేము. మనం B.A. చేయించేక వాడి అదృష్టం." అని కొడుకు భవిష్యత్తు అదృష్టానికి ముడిపెట్టేరు, గోపాలరావుగారు. ఆ సంభాషణ అక్కడితో ముగిసింది.

శంకరం పన్నెండు చెప్పుకోదగ్గ మార్కులతో పాసయ్యేడు. గోపాలరావుగారికి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాలు హనుమంతరావు గారితో పరిచయముంది. కొడుకుతోబాటు ఆయన్ని కలిసేరు. ప్రిన్సిపాలుగారు మర్యాదగా ఆహ్వానిస్తూ,
"రండి, రావుగారు. వీడు మీవాడా." అని, శంకరాన్ని సూచిస్తూ అడిగేరు.

"అవును, సర్. మా వాడే. పన్నెండు పాసయ్యేడు. మీ కాలేజీలో B.A. లో చేర్పిద్దామని వచ్చేను. ఇదిగోనండి వాడి మార్క్సు లిస్టు." అని, అది అందించేరు.

ప్రిన్సిపాలుగారు మార్కులు చూసి, మీ వాడు ఇంత మంచి మార్కులతో పాసయ్యేడు. B.A. ఎందుకు. వాణ్ణి B.Sc. లో చేర్పించండి, రావుగారూ." అని సలహా ఇచ్చేరు.

"B.A. కన్నా B.Sc. కి ఖర్చు ఎక్కువవుతుందంటారు. వచ్చే ఏడాది నేను రిటైరు అయిపోతున్నాను. అన్నీ అలోచించి B.A. లో చేర్పిద్దామనుకొంటున్నాను." అని వినయంగా తన నిర్ణయానికి కారణం చెప్పేరు, గోపాలరావుగారు.

"మీ వాణ్ని B.Sc. లో చేర్పించండి రావుగారూ. రెండు మూడు నెలల్లో వాడికి ఫుల్ స్కాలర్షిప్ వచ్చేటట్లు నేను చూస్తాను.” అని హనుమంతరావుగారు సలహా ఇస్తూ హామీ ఇచ్చేరు. ప్రిన్సిపాలుగారి సలహా, హామీ ఫలితంగా శంకరం B.Sc. లో జాయినయ్యేడు.

శంకరం ఎప్పటివలె శ్రద్ధగా చదువుకొంటున్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల తాను ఇంజినీరింగులో చేరడానికి ప్రయత్నాలు కూడా చేయలేకపోయానని అర్థం చేసుకొన్నాడు. అట్టి పరిస్థితులు చెల్లికి రాకూడదని నిశ్చయించుకున్నాడు. B.Sc. అయిపోగానే ఉద్యోగంలో ప్రవేశించి, చెల్లిని M.B.B.S. చదివించాలని అనుకొన్నాడు. తెల్ల కోటు వేసుకొని, మెడకు స్టెతస్కోపు తగిలించుకొని హాస్పిటలులో పనిచేస్తున్న చెల్లిని చూడాలని కలలు కంటున్నాడు. తన ఉద్దేశాలు చెల్లితో పంచుకొని, కష్టపడి చదువుకొని మంచిమార్కులు తెచ్చుకోమని తరచూ సలహా ఇస్తూండేవాడు.

గోపాలరావుగారు 1976 లో రిటైరు అయ్యేరు. స్కాలర్షిప్పు ఉండడం మూలన్న శంకరం పెద్ద ఇబ్బందులు లేకుండా B.Sc. 90% ఏవరేజితో పాసయ్యేడు. ప్రిన్సిపాలు హనుమంతరావుగారికి ఆ ఊళ్ళో ఉన్న ఒక ప్రయివేటు హైస్కూలు యాజమాన్యంతో బాగా పరిచయముంది. శంకరం మీద ఆయనకున్న మంచి అభిప్రాయం వల్ల అతడిని ఆ స్కూల్లో లెక్కలు టీచరుగా వేయించేరు. కొడుకు చేతికి అందడంతో గోపాలరావుగారికి ఉపశమనం లభించింది. హేమకు చిన్న చిన్న సరదాలు తీరుతున్నాయి. తక్కువ వ్యవధిలో శంకరం టీచరుగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. ట్యూషన్లకు పిల్లలు రావడం ప్రారంభమయింది. కుటుంబ భారమంతా కొడుకు భుజాన్న వేసుకోవడంతో గోపాలరావుగారు, సుగుణగారు నిశ్చింతగా ఉన్నారు.

హేమ అన్నవద్ద ముద్దులు కురుస్తూ తరచూ సినిమాలకు వెళ్లడం ప్రారంభించింది. చదువు మీద శ్రద్ధ దిగజారుతోంది. వయసు పెరుగుతుండడంతో హేమలోని అందాలు వికసించ నారంభించేయి. అందరూ అందమయినదని పొగుడుతూ ఉంటే హేమ తన సొగసును అద్దంలో అదే పనిగా చూసుకొని మురిసిపోతోంది. ఒకరోజు అద్దం ముందు కూర్చుని తన సొగసును అన్ని కోణాలలో చూసుకొంటూ, ఒత్తుగా నున్న తన పొడుగుపాటి జడ చివరి సగభాగాన్ని అరచేతితో పట్టుకొని హేమ గిర్రున తిప్పుతూ ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటే, వెనుకనుండి వస్తున్న తండ్రి ముఖానికి ఆ జడ తగిలి ఆయన కళ్ళజోడు కింద పడ్డాది. అది గ్రహించి, " సారీ నాన్నా." అని నేలపైనున్న కళ్ళజోడు అందుకొని తండ్రికి అందించింది. కూతురు ప్రవర్తనలో వస్తున్న మార్పును గ్రహిస్తున్న రావుగారు,

"అమ్మా, ఈ సంవత్సరం నీకు ముఖ్యమైనది. అన్నలాగ కష్టపడి మంచిమార్కులు తెచ్చుకొంటే, నిన్ను M.B.B.S. చదివించాలనుకొంటున్నాడు, వాడు." అని హితోపదేశం చేసేరు.

"నాన్నా, నాకు M.B.B.S. చేయాలని లేదని అన్నతో చెప్పేను. వాడు మీకు చెప్పలేదా?" అని తండ్రి ఆశలమీద చన్నీళ్ళు జల్లింది. "ఎందుకు." అని తండ్రి కారణం కోరితే,

"నాన్నా, రకరకాల రోగుల్ని, ఎక్కడెక్కడి వాళ్ళని, చేత్తో ముట్టుకొంటూ డాక్టరు పని చేయలేను. నాకు అసహ్యం." అని ముఖము, చేతులతో అసహ్యాన్ని తెలియబరిచింది, కూతురు.

ఎప్పుడయినా శంకరం తమ స్కూలు రోజులు చెల్లి ఎదుట జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంటే,

"అన్నా. అవి జ్ఞాపకం ఉంచుకోవలసిన రోజులా. మంచి బట్టలు వేసుకొన్నామా. కాలికి జోళ్ళయినా ఉండేవా. అవన్నీ తలచుకొంటే నాకు అసహ్యం వేస్తుంది. ఆ రోజులు ఎప్పుడో మరచిపోయేను." అని గత స్మృతులకు పాతర వేసింది, హేమ.

"గతాన్ని మరచిపోకూడదమ్మా. గతం మనకు పాఠాలు నేర్పుతుంది." అని అన్న పలికిన సత్యాన్ని గ్రహించలేక,

"నాకు ఆ పాఠాలు అక్కరలేదన్నా." అని అవివేకంతో పలికి అక్కడినుండి జారుకొంది.

హేమ మెడికల్ ఎంట్రన్సు పరీక్షల జోలికి పోలేదు. పన్నెండు పాసయ్యేననిపించుకొంది. ఒక్క ఇంగ్లీషులో మాత్రం మంచి మార్కులు తెచ్చుకొంది. చెల్లెలను డాక్టరు చేద్దామనుకున్న శంకరం ఆశలు అడుగంటేయి. తల్లిదండ్రులు అంతటితో చదువు ఆపి, పెళ్లి ప్రయత్నాలు చేద్దామన్నారు. కనీసం డిగ్రీ అయినా లేకపోతె పెళ్లికి కష్టమని అన్న అభిప్రాయపడ్డాడు. తల్లిదండ్రులతో చర్చించి తను చదివిన కాలేజీలో B.A. లో చేర్పించేడు. అన్న సలహాతో, హేమ ఇంగ్లీషు ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకొంది.

శంకరం ఆర్థికంగా స్థిరపడ్డాడు. బ్యాంకు రుణంతో ఒక టు బెడ్రూమ్ ఎపార్ట్మెంటు స్వంతం చేసుకొన్నాడు. కొడుకు అభివృద్ధిని కళ్లారా చూసుకొంటున్న గోపాలరావుగారు, సుగుణగారు ఉప్పొంగిపోతున్నారు. ఇహ త్వరలో వాడిని ఓ ఇంటివాడిని చేయాలని తహతహలాడుతున్నారు. శంకరం ఎప్పుడూ ఆలోచించేది, చెల్లెలి భావి జీవితమే. తన కాళ్లపై తాను నిలబడగలిగే శక్తి, చెల్లెలకు కల్పించాలని అతడి ఉద్దేశం. B.A. తో దాని చదువుకు మంగళం పాడితే, తన కోరిక నెరవేరదనుకొన్నాడు. ఏమి చేయడమో అంతు చిక్కడం లేదు.

హేమ కాలేజీలో 'బ్యూటీ క్వీన్' అనే బిరుదు పొందింది. తోటి స్తూడెంట్సు మాట కలుపుదామని 'హలో' అని పలకరించినా సున్నితంగా అరచేయి ఊపి, వారికి ఆ అవకాశం ఇవ్వక తప్పించుకొనేది. సినిమాలకు గాని షికార్లకు గాని తోటి ఆడపిల్లలతో అయినా కలసి వెళ్లడం ఇష్టపడేది కాదు. చదువు మాట ఎలా ఉన్నా ఇంగ్లీష్ డిబేట్సులో తప్పక పాల్గొనేది. మంచి డిబేటర్ గా పేరు తెచ్చుకొంది. ఆ సంవత్సరం విశాఖపట్నంలో ఇంటర్ కాలేజియేట్ డిబేట్స్ నిర్వహిస్తున్నారు. వాటిలో పాల్గొనడానికి తమ కాలేజీ నుండి హేమ ఎంపికయింది. విశాఖపట్నం వెళ్లి రాడానికి, బసకు భోజనానికి కాలేజీ వారు ఖర్చులు భరిస్తున్నారు. పట్నం వెళుతున్న అవకాశాన్ని తన సరదాలు తీర్చుకోడానికి వినియోగం చేసుకొందామనుకొంది హేమ. విశాఖపట్నంలో లేటెస్ట్ డ్రస్సులు, పెర్ఫ్యూమ్సు, మేకప్ మెటీరియల్సు, జోళ్ళు కొనడానికి అన్న వద్ద డబ్బులు దండిగా దండుకొంది.

విశాఖపట్నంలో డిబేటింగ్ కాంపిటిషన్సు ముగిసేయి. అందాల తార రెండవ బహుమతి అందుకొంది. వార్త నవరంగపట్నం చేరుకొంది. హేమ కాలేజీకి మంచి పేరు తెచ్చిందని ప్రిన్సిపాలుగారు సంతోషించేరు. చెల్లెలి ఘనతను తెలుసుకొని, శంకరం ఆ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకున్నాడు. హేమ పర్సు ఖాళీ అయినవరకు బజారులోనే ఉంది. తిరుగు ప్రయాణమయి ఇల్లు చేరుకొంది. తన బహుమతిని సగర్వంగా తల్లిదండ్రులకు అన్నకు చూపించింది. సుగుణగారు ఆ బహుమతిని దైవ మందిరంలో భగవత్సాన్నిధ్యంలో పెట్టి నమస్కరించేరు. హేమ విశాఖపట్నంలో తాను ఖరీదు చేసిన సామగ్రిని అత్సుత్సాహంతో తల్లిదండ్రులకు అన్నకు చూపించింది. ఆ సీను ముగిసేక గోపాలరావుగారు, “హేమా, నీ సరదా తీరా నీకు కావలిసినవి కొనుక్కొన్నావ్. బాగుంది. మరి మా కోసం అటుంచు; అన్న కోసం ఏవయినా తెచ్చేవా." అని వ్యంగ్యంగా అడిగేరు. హేమ ఖంగు తింది. నిజానికి అన్నకు ఏదయినా కొనాలన్న ఆలోచనే హేమకు తట్టలేదు. జవాబు ఏమియ్యడమో తెలియలేదు.

"సారీ అన్నా, నా షాపింగు అయ్యేసరికి దుకాణాలు మూసేస్తూ ఉండేవారు. టైము లేకపోయింది." అని ఓ డొంకతిరుగుడు సంజాయిషీ ఇచ్చింది.

"ఫరవాలేదమ్మా. నిజానికి నాకు ప్రత్యేకించి ఏదీ అవసరం లేదు." అని అన్న ఆ సంభాషణకు తెర దింపేడు.

హేమ B.A. పాసయింది. కేవలం ఇంగ్లీషులో మంచి మార్కులు తెచ్చుకొంది. చెల్లెలి చదువు విషయంలో శంకరానికి సందిగ్ధం ఏర్పడింది. B.A. తో ఆపేస్తే, ఏ ఉద్యోగమూ దొరకదు. ఈ రోజుల్లో పెళ్లికొడుకులు ఉద్యోగం చేస్తున్నవారినే కోరుకొంటున్నారు. ఇటు ఉద్యోగమూ లేక అటు పెళ్ళీ కాక చెల్లెలు భవిష్యత్తు అంధకారమవుతుందని చింతించసాగేడు. ఏదీ తోచక కాలేజీ ప్రిన్సిపాలుగారి సలహా కోరేడు. ఆయన M.A. (English) లో చేర్పించమన్నారు. కేవలం ఇంగ్లీషే కావున తప్పక మంచి మార్కులతో పాసవుతుంది అని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి, అని సలహా ఇచ్చేరు. శంకరం తల్లిదండ్రులతో విషయం చర్చించి ప్రిన్సిపాలుగారి సలహా పాటించడానికి నిర్ణయించేడు. హేమ విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో M.A. (English) విద్యార్థిని అయింది. హాస్టల్ జీవితానికి అలవాటు పడడం కష్టమవుతోంది. హాస్టల్ భోజనం రుచించక తరచు హోటల్ భోజనం చేయ నారంభించింది.

ఓ శుభముహూర్తాన్న శంకరం ఓ ఇంటివాడయ్యేడు. కొత్తకోడలు సునీత B.Sc. డిగ్రీ పొందింది. ఉపాధ్యాయినిగా ఒక ఏడాది అనుభవం ఉంది. సునీత రాకతో అత్తగారు సుగుణకు, భర్త శంకరానికి సదుపాయమయింది. కొత్తకోడలు అడుగు పెట్టిన వేళ; శంకరం పేరు నలుమూలల వ్యాపించి, దగ్గరలోనున్న బొరిగుమ్మపల్లినుండి విద్యార్థులు ట్యూషన్లకు రావడం ప్రారంభమయింది. భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకొని ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్ ప్రారంభించడానికి నిశ్చయించుకొన్నారు. శంకరం ఉద్యోగానికి స్వస్తి చెప్పేడు. ఊరి నడిబొడ్డున కోచింగ్ సెంటర్ ప్రారంభించేడు. సత్ఫలితాలు రావడంతో అది లక్ష్మీకటాక్షమయింది.

ఒకరాత్రి హేమ ఒక డేన్సు ప్రోగ్రాం చూడడానికి వెళ్ళింది. ప్రోగ్రాం అవగానే బయటకు వచ్చింది. కుంభ వర్షం కురుస్తోంది. కనుచూపు మేరలో ఆటోలు లేవు. బిక్కు బిక్కు మంటు పైన నిలబడి ఉంది. అంతలో అదే ప్రోగ్రాం చూసి ఆడిటోరియంనుండి బయటకు వచ్చిన ఒక యువకుడు, హేమ పరిస్థితి గమనించి,

"మేడం, ట్రేన్స్పోర్టు కోసం చూస్తున్నారా." అని హేమనుద్దేశించి అడిగేడు. యువకుడు తెల్లని లక్నో కుర్తా పైజామా వేసుకొని స్మార్టుగా ఉన్నాడు.

"అవునండి. ఆటోల కోసం చూస్తున్నాను. ఏదీ కనబడడం లేదు." అని సున్నితంగా చెప్పింది, హేమ.

"ఈ వానలో ఆటోలు రావండి. Can I drop you at your place." అని ఆ యువకుడు మర్యాదగా అడిగేడు. హేమ ఒక క్షణం ఆలోచించింది. రాత్రి ఒంటరిగా తెలియని వ్యక్తితో వెళ్లడం సురక్షితమేనా అని. మనిషి మర్యాదస్తుడిగా కనిపిస్తున్నాడు. అతని ఆఫర్ కాదంటే మరో దారి లేదు. అలా ఆలోచించి,
“If you can do I feel obliged." అని మృదువుగా అంటూ, మనసులో 'బ్రతుకు జీవుడా' అనుకొంది.

ఇద్దరూ వానలో వడి వడిగా వెళ్లి కారులో ఆసీనులయ్యేరు. హేమ తన గమ్యస్థానం చెప్పింది. యువకుడు కారు నడుపనారంభించేడు. అతడు హేమనుద్దేశించి, "సారీ. చెప్పడం మరచేను. I am Sekhar. నేను హైదరాబాదులో ఉంటాను. పనిమీద వైజాగ్ వచ్చేను." అని తన పరిచయం చేసుకొన్నాడు.

" I am Hema. A.U. లో M.A. ఇంగ్లీష్ చేస్తున్నాను." అని హేమ తన పరిచయం చేసుకొంది.

"శేఖర్ గారూ, హైదరాబాదులో మీరు బిజినెస్ చేస్తున్నారా." అని సంభాషణ పొడిగించింది.

"బిజినెస్ … అంటే బిజినెస్సే అనుకోండి. ఫిల్మ్ ప్రొడక్షన్ లో మా డేడీ వద్ద ట్రైనింగు అవుతున్నాను. మా డేడీ ఎ. ఆర్.విఠల్ గారు యురేనస్ ప్రొడక్షన్స్ ఓనరు."

"Oh. I See. యురేనస్ ప్రొడక్షన్స్ వారి సినిమా, 'గల్ఫు లో గర్ల్ ఫ్రెండు' లాస్ట్ ఇయరు హిట్టయింది కదా. నేనా సినిమా నాలుగుమార్లు చూసేను." అని ఉత్సాహంతో చెప్పింది.

"అది హిట్టయిన తరువాత, మా డేడీ మరో ఫిల్ము తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవో రెండు కథలు డైరక్టరుగారితో డిస్కస్ చేస్తున్నారు. వైజాగ్ లో స్వంత స్టూడియో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాని ప్రోగ్రెస్ చూడడానికి లాస్ట్ మంత్ వచ్చేను." అని శేఖర్ వివరాలు చెప్పేడు.

"మీరు ఇక్కడకు వచ్చి సుమారు నెలయి ఉంటుంది. మీ ఫేమిలీని మిస్ అవడం లేదా." అని కుశల ప్రశ్న వేసింది హేమ.

"అవుతున్నాను. ముఖ్యంగా మా మమ్మీని. రోజూ ఫోనులో మాట్లాడుతూంటాను." అని కారు కొద్దిగా ఆపి, "ఇటు వెళితే నేనుంటున్న హొటల్ వస్తుందండి." అని చూపించేడు, శేఖర్.

"ఏ హొటలండీ."

"Dolphin hotel. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నేనెప్పుడు వచ్చినా అక్కడే ఉంటాను."

హేమ ఏదో ఆలోచించుకొంది. తన హేండ్ బేగును శేఖరుకు తెలియకుండా సీటు కిందకు, బయటకు కనపడకుండా పెట్టింది.

హేమ హాస్టల్ సమీపించింది. కారు ఆగింది.

"శేఖర్ గారూ, మీకు థేంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. Many Many thanks." అని హేమ కారు దిగబోయే ప్రయత్నం చేస్తూండగా,

"You are welcome. ఈ వానలో మీరు నాకు మంచి కంపెనీ ఇచ్చేరు. I am thankful to you." అని చిన్న చిరునవ్వుతో స్పందించేడు, శేఖర్.

హేమ వడి వడిగా రూమ్ చేరుకొంది. కారు వెను తిరిగింది.

హేమ రాత్రంతా ఆలోచనలో పడ్డాది. వాన మూలంగా శేఖర్ తో పరిచయమయిందని వరుణునికి ధన్యవాదాలు చెప్పుకొంది. శేఖర్ ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కొడుకు. అతణ్ణి మంచి చేసుకొంటే సినీమాల్లో తప్పక ఛాన్సులు దొరకొచ్చు. తన అందం మీద తనకు అంత భరోసా ఉంది. కారులో ఉండగానే ఆ ఆలోచన వచ్చింది. అందుకే, ఎందుకైనా పనికొస్తుందని, కారు సీటు కింద శేఖరుకు తెలియకుండా తన హేండ్ బేగ్ ఉంచింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి, అని ఆలోచనలో పడ్డాది. మరునాడు ఉదయం శేఖర్ అది గమనించి, బేగు తనకు ఇవ్వడానికి హాస్టలుకు వస్తే ఎలా డీల్ చెయ్యాలి. దాన్ని నాకు అందజేయమని సెక్యూరిటీకి ఇచ్చి శేఖర్ వెళిపోతే, కథ ముందుకు ఎలా నడపడం. మరో ఆలోచన. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి, వర్కుకు వెళ్లడానికి కనీసం పది గంటలవుతుంది. అంచేత పది గంటలు కాకుండా అతడు కారులో బేగు చూడలేడు. అందుచేత పది గంటలు కాకుండా బేగు మరచిపోయేనన్న మిషతో తను డాల్ఫిన్ హోటలుకు వెళ్లి శేఖరును కలియాలి. అలా చేస్తే శేఖరుతో కొంత సేపు గడపొచ్చు. అతనికి చేరువవడానికి ఆ అవకాశం వినియోగించుకోవాలి. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ చిన్న కునుకు తీసింది, హేమ.

అటు హొటల్లో శేఖర్ కూడా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. హేమ అందానికి ముగ్ధుడయిపోయేడు. చక్కగా ఉంది. చదువు కూడా బాగుంది. ఎలాగయినా హేమను తన దానిగా చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. హేమ కుటుంబ వివరాలు తను అడగలేదు. హేమ చెప్పలేదు. అవి ఏవయినా తన కన్నా పెద్ద స్టేటస్ లో ఉండి ఉండరు. ఆడపిల్లని పై ఊళ్ళో చదివిస్తున్నారంటే ఎడ్యుకేటెడ్ ఫేమిలీ అయి ఉంటుంది. అన్ని విధాలా బాగుంది. అయితే హేమను మళ్ళీ కలియడమెలా. హాస్టలుకు వెళ్లి కలయడం మర్యాదగా ఉండదు. హాస్టల్లో ఫోను ఉందో లేదో. ఉన్నా అది ఎవరి వద్ద ఉంటుందో. అనవసరంగా హేమకు సమస్యలు తేకూడదు. అలా పరి పరి విధాల ఆలోచిస్తున్నాడు. కలిస్తే కదా కథ కదులుతుంది. కాని కలియడమెలా, అని ఆలోచిస్తూ నిద్రపోయేడు.

తెల్లవారింది. హేమ కాలకృత్యాలు ముగించుకొంది. దుస్తులు ఏవి ధరించడమా అని సీరియస్ గా ఆలోచించింది. సల్వార్ కమీజ్ కన్నా చీర కట్టుకొంటే, బాగా ఎట్రీక్టివ్ గా తయారవ్వచ్చుననుకొంది. స్నానం చేయగానే దట్టంగా బాడీ స్ప్రే వేసుకొని గతనెల తను కొనుక్కున్న లైటు బ్లూ జార్జెట్ చీర ఆకర్షణీయంగా కట్టుకొంది. తొమ్మిది గంటలు దాటింది. ఆటోలో డాల్ఫిన్ హొటల్ చేరుకొంది. రిసెప్షన్ కు వెళ్లి, తన పేరు హేమ అని, శేఖర్ గారిని కలియడానికి వచ్చేనని చెప్పింది. రిసెప్షనిస్ట్ శేఖరుకు ఫోను చేసి విషయం చెప్పింది. శేఖర్ ఆడబోయే తీర్థం ఎదురయిందనుకొన్నాడు. ఉప్పొంగిపోయేడు. సైటుకు వెళ్ళడానికి తయారుగా ఉన్నాడు. అద్దంలో చూసుకొని ఎదుగుతున్న బట్టతలను కప్పిపుచ్చుతూ ఉన్న క్రాఫును మరోమారు సరి చేసుకొని, త్వరగా రిసెప్షన్ కు వెళ్లి, హేమను, "what a surprise. హేమ గారు. ఏమి ఇలా వచ్చేరు." అని పలకరించేడు.

"లాస్ట్ నైట్ నా హేండ్ బేగ్ మీ కారులో మరచిపోయేనండి. అది కలెక్ట్ చేసుకోడానికి వచ్చేను. సారీ ఫర్ ది ట్రబుల్." అని హేమ చిరునవ్వుతో చెప్పగానే,

"నో ట్రబుల్. ప్లీజ్ కం. నా రూముకు వెళదాం." అని శేఖర్ హేమతో రూములో ప్రవేశించేడు.

హేమకు ఒక సోఫా ఆఫర్ చేసి, ఎదురుగానున్న సోఫాలో తను కూర్చున్నాడు.

అందాలొలుకుతున్న హేమను చూస్తున్న శేఖర్ మనసు ఉర్రూతలూగింది.

"మీకు ఇక్కడకు రావడంలో ఏమయినా ఇబ్బంది అయిందా." అని శేఖర్ అడిగేడు.

"ఇబ్బంది కాలేదండి. ఆటో వాడు స్ట్రైటుగా ఇక్కడకు తీసుకొచ్చేడు."

ఇద్దరి మనసులోను వీలయినంతసేపు కలసి కబుర్లు చెప్పుకోవాలని ఉంది.

"హేమగారూ మీరు బ్రేక్ ఫాస్ట్ చేసేరా." అడిగేడు శేఖర్.

"లేదండి. మీరు వర్కుకు వెళ్లిపోకుండా బేగ్ కలెక్ట్ చేసుకొందామని తొందరపడి వచ్చేను."

"నేనూ బ్రేక్ ఫాస్ట్ చెయ్యలేదులెండి. can you please give me company." అని మృదువుగా అడిగేడు.

"Sure. Thank you."

"రెస్టారంట్ ఇప్పుడు క్రౌడెడ్ గా ఉంటుంది. ఆర్డర్ చేసి కావలసినవి ఇక్కడికే తెప్పిస్తాను." అని ప్రైవసీ ఉంటుందని మనసులో అలోచించి అన్నాడు.

"మీ ఛాయిస్ ఏమిటో చెప్పండి ఆర్డర్ చేస్తాను." అని మెనూ కార్డు హేమకిచ్చేడు.

"ఏ ఐటమ్సు బాగుంటాయో మీకే బాగా తెలుసు. So, your choice is my choice." అని బంతిని శేఖర్ కోర్టులో పడేసింది.

శేఖర్ ఆర్డర్ చేసిన ఇడ్లి, పెసరట్టు ఉప్మా, కాఫీ, పట్టుకొని నీటుగా తయారయిన యువకుడు టేబులు మీద పెట్టి వెళ్ళేడు. అవి ఆరగిస్తూ ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటున్న సమయంలో,

"శేఖర్ గారూ, మీ స్థూడియోస్ కనస్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందండి." అని హేమ అడిగింది.

"సివిల్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంజినీర్లు ఎక్విప్మెంట్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు. కొన్ని ఇంకా ఫారిన్ నుండి రావాలి. మరో ఆరు నెలల్లో పూర్తవ్వచ్చు." అని స్టేటస్ రిపోర్ట్ ఇచ్చేడు, శేఖర్.

"మీ స్టూడియోస్ చూడడానికి మా వంటి వారికి పెర్మిషన్ ఇస్తారా." అని చిరునవ్వుతో అడిగింది, అందాల భామ.

"మీకు చూడాలని ఉందా. చెప్పండి. You are always welcome. మీకు ఎప్పుడు చూడాలని ఉన్నా, నాకు చెప్పండి. నేను మిమ్మలిని పికప్ చేసుకొని మా స్టూడియోస్ కు తీసుకువెళతాను." అని శేఖర్ చిరునవ్వుతో స్పందించేడు.

"వీక్ డేసులో క్లాసులుంటాయి. ... కమింగ్ సన్డే మీకు వీలవుతుందా." అని, ఏదో రోజూ క్లాసులకు వెళుతున్నట్టు ఇంప్రెస్స్ చేయాలని అడిగింది.

"సన్డే నాకు వీలవుతుంది. What time."

"మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫరవాలేదా."

"It's okay. సన్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్, ఐ విల్ బి ఎట్ యువర్ ప్లేస్."

ఇద్దరి మనసులు గాలిలో తేలుతున్నాయి.

కొంత సమయమయ్యేక శేఖర్ కారులో హేమను హాస్టలు వద్ద డ్రాప్ చేసి, వర్కుకు వెళ్ళేడు.

హేమ చేత్తో హేండ్ బేగును గిర గిర తిప్పుతూ ఊహా లోకాల్లో విహరిస్తూ రూముకు వెళ్ళింది.

కథ సానుకూలంగా ముందుకు అడుగులేస్తోందని శేఖర్ 9th క్లౌడ్ లో ఉన్నాడు. తొందరగా హేమను చేరువ చేసుకొని, తన మనసు విప్పి, కోరిక నెరవేర్చుకోవాలని కుతూహలపడుతున్నాడు. అటు, హేమ శేఖరును మంచి చేసుకొని తన ఆశయాలు నిజం చేసుకోవాలని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇద్దరూ ఎదురు చూస్తున్న ఆదివారం వచ్చింది. శేఖర్, హేమకు స్టూడియో చూపించి, లంచ్ కు Sun N Sand హోటలుకు తీసుకెళ్ళేడు. భోజనం చేస్తూ మధ్యాహ్నం మూడు దాకా సరదాగా కబుర్లు చెప్పుకొన్నాక, ఎవరి గూటికి వారు చేరుకొన్నారు. అలా రెండు మూడు వారాలు గడపడంలో ఇద్దరూ ఒకరికొకరు బాగా చేరువయ్యేరు. ఒకరినొకరు సంబోధించుకోడంలో, 'గారు' పదం 'నేనెందుకు అడ్డు' అని జారుకొంది.

ఇహ ఆలస్యం చేయకూడదనుకొన్నాడు, శేఖర్. సమయం చూసుకొని ఒక రోజు శేఖర్ తన మనసులోని కోరిక హేమ చెవిలో వేసేడు. హేమ తన నిర్ణయం తెలియజేయడానికి ఒక రోజు టైము కోరింది. "సరే, No hurry. నీకు పూర్తిగా ఇష్టమయితేనే మన పెళ్లి. నువ్వు కాదన్నా ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉంటుంది." అని శేఖర్ హేమ మీద ఒత్తిడి తేలేదు. కారణం, హేమ తప్పక ఒప్పుకొంటుందని నమ్మకం. హేమ రాత్రంతా ఆ విషయం ఆలోచించుకొంది. తన అన్న ఇంత స్టేటస్ ఉన్న సంబంధం తేలేడు. ఎంత చిన్న సంబంధమయినా కట్నాలు తప్పవ్. శేఖర్ ను చేసుకొంటే సినిమాల్లో ఛాన్సు తప్పక వస్తుంది. అంతేకాదు; హైయ్యర్ సర్కిల్ లో లగ్జూరియస్ లైఫు, జీవితమంతా ఎంజోయ్ చెయ్యొచ్చు, అని అనుకొంది. తన అంగీకారం తెలియజేయడానికి ముందు శేఖర్ కు తన ఫేమిలీ బ్యాక్ గ్రౌండ్ చెప్పడం ముఖ్యమనుకొంది. ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో అది తెలిసేక ఎటువంటి సమస్యలొస్తాయా తెలీదు. అందుచేత తన వివరాలు విన్నాక శేఖర్ అంగీకరిస్తే తన అంగీకారం చెప్పదలచుకొంది.

మరునాడు ఉదయం శేఖరును కలసినప్పుడు హేమ అతనికి తన కుటుంబ వివరాలు చెప్పింది. హేమ ఎందుకు చెప్పిందో శేఖర్ బోధపరుచుకొన్నాడు. "Hema, I am happy with your family background." అని సంతోషం తెలియబరుస్తూ అన్నాడు. దానికి స్పందిస్తూ హేమ చిరునవ్వుతో తన అంగీకారం చెప్పీ చెప్పడంతో, శేఖర్ ఉబ్బి తబ్బిబ్బై ఒక్క మారుగా హేమకు హగ్ ఇవ్వబోయేడు. హేమ, "అబ్బాయిగారికి తొందర ఎక్కువవుతోంది. వెయిట్ చెయ్యి. అన్ని సరదాలు తీరుతాయి." అని కొంటెగా అంటూ తప్పించుకొంది. శేఖర్ హేమతో బజారుకెళ్లి ఒక డైమండ్ ఉంగరం హేమ వేలుకు తొడిగేడు. హేమ సంతోషానికి అంతు లేకపోయింది.

శేఖర్ మమ్మీకు కథ చెప్పేడు. హేమ కుటుంబ వివరాలు చెప్పేడు. డేడీకి ఆ వివరాలు మమ్మీనే చెప్పమని బ్రతిమలాడేడు. శేఖర్, హేమల ప్రేమపూరణం, హేమ కుటుంబ వివరాలు, పార్వతిగారు విఠల్ గారికి చెప్పేరు. ఆయన ఆ సంబంధానికి ఎంతమాత్రం ఒప్పుకోనన్నారు. స్టేటసులు అడ్డువచ్చేయి. పార్వతిగారికి మనసులో కొంత సుముఖత ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. భర్త నిర్ణయం కుమారునికి తెలియజేస్తూ, "నాయనా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఆయన ఏదంటే అదే జరుగుతుంది. అయినా, అమ్మాయి చాలా అందమయినదంటున్నావు. కాబట్టి ఆ పిల్లని ఒకమారు మన ఇంటికి తీసుకురా. పిల్లని చూసేక ఒప్పుకుంటారేమో చూద్దాం. అమ్మాయికి ఏమీ భరోసా ఇవ్వకు." అని హితవు పలికేరు.

హేమ అన్నకు జరిగిన కథ చెప్పడమా, లేదా అని సంధిగ్ధంలో పడ్డాది. చెబితే పర్యావసానం ఎలా ఉంటుందో. ఈ అవకాశం చేజార్చుకొంటే, ఇంత మంచి అవకాశం తనకు రాదని నమ్మకం. అందుచేత తన ఫ్యూచర్ తనే నిర్ణయించుకోవాలనుకొంది. ప్రస్థుతానికి కన్నవారికి, అన్నకు గోప్యంగానే ఉంచాలనుకొంది.

హేమ హైదరాబాద్ జూబిలీ హిల్స్ లోని ఒక విశాలమయిన బంగళాలో శేఖరుతో బాటు అడుగు పెట్టింది. సమయం చూసి, శేఖర్ వినయంగా తల్లిదండ్రులిద్దరికి హేమను పరిచయం చేసేడు.

భార్యను తమ గదిలోనికి పిలిచి విఠల్ గారు ఇలా అన్నారు. "నేను ముందే చెప్పేను. ఈ సంబంధానికి నేను ఒప్పుకోనని. పందిట్లో ఈ ఒక్కపిల్లే కాదు. అమ్మాయి తల్లిదండ్రులు. వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. వాళ్ళని, ఎవరని గెస్ట్లకు పరిచయం చేయమంటావ్. అవన్నీ ఆలోచించు. పిల్ల అందంగా ఉంది. ఒప్పుకొంటాను. పిల్ల కోరితే నేను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తాను. అదీనూ డైరెక్టరుగారిని అడగాలి." అని ఖచ్చితంగా చెప్పి తన ఆఫీసుకి వెళ్ళిపోయారు.

విఠల్ గారి నిర్ణయం పార్వతిగారు శేఖరుకు బరువు గుండెతో తెలియజేసేరు. శేఖర్ కు తండ్రిపై పట్టరాని కోపం వచ్చింది. సినిమాలో చాన్సు వస్తుందని హేమ మాత్రం సంతోషంగా ఉంది.

శేఖర్ "రా. హేమా." అని హేమను గార్డెన్లోనికి తీసుకెళ్ళేడు. ఇద్దరూ ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు. శేఖర్ సంభాషణ ప్రారంభించేడు.

"హేమా, మనం వేరే వెళ్లి రేపే రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకొందాం. పద." అని కోపం దిగమ్రింగుకొంటూ అన్నాడు.

"But, what about our future life." అని నిలదీసి అడిగింది, హేమ.

"నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నాకు చాలా పరిచయాలున్నాయ్, హేమా. I am sure. ఆరు నెలల్లో ఎస్టాబ్లిష్ కాగలను. ఓన్లీ సిక్స్ మంత్స్, నువ్వు కోపరేట్ చేస్తే చాలు...స్టేటసుట .. స్టేటస్. నేనూ వస్తాను ఆ స్టేటసుకు. " అని తండ్రి మీద కారాలు మిరియాలు నూరేడు.

"శేఖర్, నువ్వు గాలిలో మేడలు కడుతున్నావ్. నేను రిస్క్ తీసుకోలేను. సినిమాల్లో ఛాన్స్ వదులుకొని, నీ వెంట రాలేను." అని తన నిర్ణయం చెప్పింది, హేమ.

"మన పెళ్లిమాట ఏమిటంటావ్."

"నేను మీ ఇంటి కోడలు కాలేనని మీ నాన్నగారు చెప్పిన తరువాత మన పెళ్ళిమాటే లేదు." అని కూల్ గా శేఖర్ కు గుడ్ బై చెప్పింది.

"You are most selfish." అని నిలబడి జోడుతో భూమి మీద ఒక కిక్ కొట్టి వెళిపోయేడు, శేఖర్. హేమ వ్యంగ్యంగా ఓ చిరునవ్వు విసిరింది.

తనకు సినిమాల్లో వేయాలని ఉందని హేమ పార్వతిగారికి వినయంగా చెప్పింది. భార్య ద్వారా విఠల్ గారు హేమ కోరిక విన్నారు. కథ ముందుకు నడిచింది. డైరెక్టరుగారు హేమను చూసి ఓకే అన్నారు. స్క్రీన్ టెస్ట్ మున్నగునవి హేమకు అనుకూలంగా వచ్చేయి. యురేనస్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న చిత్రం, 'ఎండమావులు' లో హీరోయిన్ పాత్రకు ఎంపికయింది. కాంట్రేక్ట్ సైన్ చేసి 25 లక్షలు ఎడ్వాన్సు అందుకొంది. హేమ సంతోషానికి అవధులు లేకపోయాయి. బ్యాంకు రుణంతో బంజారా హిల్స్ లో ఒక విశాలమయిన బంగళాలో గృహప్రవేశమయింది. సర్వసదుపాయాలు సమకూర్చుకొంది. తన కలలు కంటూన్న విలాసవంతమయిన జీవితం తనను వరించిందని గర్వపడ్డాది.

చదువుకు గుడ్ బై చెప్పేనని, ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర వేస్తున్నానని, క్లుప్తంగా మూడుముక్కలు రాసిన ఉత్తరం హేమ అన్నకు పంపింది. తరువాత ఆరు నెలలు వ్యవధిలో, శంకరం తల్లిదండ్రులిద్దరకు అంత్యక్రియలు చేసేడు. చిరునామా తెలియక ఆ విషయం హేమకు చేరలేదు.

హేమ నటించిన మొదటి చిత్రం 'ఎండ మావులు' రిలీజ్ అయింది. అది సూపర్ హిట్ అయింది. హేమ ఒక్కమారుగా తారాపథం చేరుకొంది.

ఒక ప్రముఖ పత్రిక హేమను ఇంటర్వూ చేసింది. ఆ ఇంటర్వూ వివరాలు సునీత పేపరు ద్వారా తెలుసుకొని,

"హేమ బంజారా హిల్స్ లో బంగళాలో ఉంటున్నాదట. రెండు కార్లున్నాయట." అని భర్త శంకరంతో ఇంకా వివరాలు చెప్పబోతూంటే,

"సునీతా, నువ్వెందుకు అలా ఎక్సయిట్ అయిపోతున్నావ్. అది మనతో ఎప్పుడో తెగతెంపులు చేసుకొంది.” అని శంకరం సంభాషణ కట్ చేసేడు.

హేమ యురేనస్ వారి మరో చిత్రానికి 75 లక్షలకు కాంట్రేక్ట్ సైన్ చేసింది. మరో ప్రముఖ సినీ నిర్మాత కౌశిక్ తీయబోతున్న సినిమా కథలో హీరోయిన్ ప్రపంచ అందాలరాణి. ఆ పాత్రకు హేమ అత్యంత అనుకూలమయినదని డైరెక్టరుగారు సలహా ఇవ్వడంతో హేమకు ఆఫరు వచ్చింది. ఆ సంగతి విఠల్ గారికి తెలిసింది.

"నువ్వెంతమాత్రం మరో ప్రొడ్యూసర్ తీస్తున్న సినిమాలో వేయకూడదు." అని హేమకు విఠల్ గారు నొక్కి చెప్పేరు.

"అటువంటి షరతులు నా కాంట్రేక్ట్ లో లేవు. వారు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చేరు. అది వదులుకోలేను." అని నిర్మొహమాటంగా చెప్పింది, హేమ. విఠల్ గారికి చేయునది లేక పోయింది.

శంకరం, దగ్గర బంధువుల ఇంట పెళ్ళికి హైదరాబాద్ ప్రయాణమవుతున్నాడు. ఆ సమయంలో సునీత దరి చేరి, “హైదరాబాదు ఎలాగూ వెళుతున్నావ్. వీలు చూసుకొని ఓ మారు హేమను కలువు." అని మెల్లగా చెప్పింది.

"నువ్వింకా దానికోసం ఎందుకు ఇలా తాపత్రయపడుతున్నావ్. నాకేమీ బోధపడడం లేదు." అని శంకరం అయిష్టం తెలియబరుస్తూ అన్నాడు.

"శంకరం. నిజం చెప్పు. నువ్వు దేనికోసం అష్టకష్టాలు పడి, దాన్ని పై ఊళ్ళో పెట్టి చదివించేవ్. అది జీవితంలో బాగుపడాలనేగా. నీ కోరికలు, దాని కోరికలు తీరేయి కదా. అది తప్పులు చేసింది; ఒప్పుకొంటాను. దాన్ని మళ్ళీ కుటుంబంలో కలుపుకోడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. వెళ్లి కలువు. 'అన్నా నేను కారు కొన్నాను' అని నీకు చూపిస్తే, నువ్వు తప్పకుండా గర్వపడతావ్." అని భర్తకు నచ్చచెప్పింది. శంకరం మెత్తపడ్డాడు.

"సరే. దాని కోసం హైదరాబాదులో ఎక్కడికి వెళ్ళమంటావ్. ‘సార్, మా చెల్లెలు హేమ పెద్ద ఫిల్మ్ స్టార్. ఎక్కడ ఉంటుందో చెప్పగలరా’ అని కనిపించిన ప్రతీవాణ్ణి అడిగితే, పిచ్చివాణ్ణి అనుకొంటారు." అని సునీత ముఖంలోనికి చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు, శంకరం.

“హైదరాబాదులో టేక్సీ లో కూర్చొని, బంజారా హిల్స్ లో సినిమా ఏక్టరు హేమగారింటికి తీసుకెళ్లమంటే, వాడే తీసుకెళ్తాడు.” అని చిరునవ్వుతో చెప్పింది, సునీత.

"ఎడ్రసుల దగ్గరనుండి అన్నీ తెలుసన్నమాట." అని తనూ ఓ చిరునవ్వు విసిరేడు, శంకరం.

"పేపర్లో ఆవేళ పడ్డాది కదా. ఎందుకైనా మంచిదని నోట్ చేసుకు ఉంచేను.” అని సగర్వంగా చెప్పింది, సునీత.

శంకరం బంధువుల ఇంట పెళ్లిలో పాల్గొన్నాక టేక్సీలో బంజారా హిల్స్ లో చెల్లెలు బంగళా చేరుకొన్నాడు. గేటువద్ద సెక్యూరిటీ వాడు అడ్డుకోగానే తను ఫలానా అని చెప్పేడు.

"అదిగో మేడమ్ గారు ఎక్కడికో బయలుదేరుతున్నారు." అని దూరంగా కారులో అడుగు పెడుతున్న హేమను చూపించేడు, సెక్యూరిటీ వాడు.

"అది వెళ్లిపోకుండా ఒక్కమారు నన్ను కలియనీ ." అని శంకరం బ్రతిమలాడినా ఫలితం లేకపోయింది. కారు బయలుదేరి గేటు చేరుకొంది. నల్ల కళ్ళజోడు ధరించిన ఆ వయ్యారిభామ అన్నను చూసే ఉంటుంది. కాని సెక్యూరిటీ స్టార్ట్ అయిందని ఎయిర్పోర్ట్ నుండి సెక్రటరీ రెండు మార్లు ఫోను చెయ్యడం మూలాన్న బహుశా చూసీ చూడనట్లు వెళిపోయింది. శంకరం ఇంటికి వెళ్ళేక జరిగినది చెప్పి, సునీతకు చీవాట్లు పెట్టేడు.

హేమ, కౌశిక్ ప్రొడక్షన్ వారు తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటన ప్రారంభించింది. కథలో హీరోయిన్ ప్రపంచ అందాలరాణి అయ్యేక, తన ప్రజాదరణ సద్వినియోగం చేసుకోదలచి సామాజిక కార్యకర్తగా సేవలు చేస్తూ, దేశం నలుమూలలా ఖ్యాతినార్జిస్తుంది. సినిమా షూటింగులు జరుగుతున్నాయి. ఒక సన్నివేశంలో హీరోయిన్ మురికివాడలోని స్త్రీలు, పిల్లలతో కలసి మెలసి వారికి ఆరోగ్యసూత్రాలు బోధపరచాలి. హేమ ఆ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకోలేదు. డైరెక్టరు, ఆ సన్నివేశం హీరోయిన్ పాత్రలో హైలైటని, అది మారిస్తే హీరోయిన్ ఇమేజ్ నీరుకారిపోతుందన్నారు. ఆయన ఆ సీను తప్పనిసరి అన్నారు. హేమ మొండిపట్టు పట్టింది. ఎంతమాత్రం మురికివాడలో అడుగు పెట్టనంది. ప్రొడ్యూసర్ కౌశిక్ గారికి ఒళ్ళు మండింది. ఆ పాత్రకు మరొకరిని ఎంపిక చేసుకొని, హేమ కాంట్రేక్ట్ రద్దు చేసేమన్నారు. ఆ విషయం ప్రొడ్యూసర్ల మీటింగులో తీవ్రమయిన చర్చకు వచ్చింది. ప్రొడ్యూసర్లందరూ ఏకాభిప్రాయానికి వచ్చి హేమను బోయికాట్ చేయడానికి నిశ్చయించేరు. అక్కడితో ఆగలేదు. కౌశిక్ ప్రొడక్షన్ వారు తమకు తీరని నష్టం కలుగజేసిందని హేమను కోర్టుకు లాగేరు.

హేమ అనతికాలంలో కష్టాల్లో చిక్కుకొంది. ఆదాయం పోయింది. జీతాలు ఇచ్చే స్థోమత లేక పనివారినందరిని మాన్పించుకోవలసి వచ్చింది. కోర్టు కేసులో వాయిదాకు వెళ్ళవలసిన ప్రతిసారి లాయరుకు ఫీజు చెల్లించాలి. బంగళాను విక్రయించి బ్యాంకు అప్పు తీర్చింది. సిటీకి దూరంగా సింగిల్ బెడ్ రూమ్ ఎపార్ట్మెంట్ లోనికి మారింది. చేయునది లేక, కౌశిక్ గారికి క్షమాపణ చెప్పుకొని కోర్టు కేసులోనుండి బయటపడ్డాది. ఏ దారిద్ర్యాన్ని తను ఛీదరించుకొందో, ఆ దారిద్ర్యం తన్ను వెంటాడింది.

ఒకరోజు సునీత న్యూస్ పేపర్ చదువుతూ ఓ ప్రముఖ వార్త చూసింది. యువకులను ఉర్రూతలూగించిన అలనాటి మేటి తార హేమ, ఊరి చివర తిండి బట్టలకు కరువై తలదాచుకొంటోంది అని ఆ వార్తలో ఉంది. హేమ మురికివాడకు దగ్గరలో నివసిస్తున్న వివరాలు కూడా ఆ వార్తలో ఉన్నాయి. సునీత నిర్ఘాంతపోయింది. శంకర్ కు ఆ వార్త చూపించింది.

"Hell with her." అని చిరాకుగా అని ఆ పేపరు కింద పడేసాడు, శంకరం. సునీత శంకరంకు దగ్గరగా కూర్చొని,

"శంకర్, శాంతంగా ఆలోచించు. హేమ బ్లండర్స్ చేసింది. నిజమే. కాని అది మన ఇంటి పిల్ల. అది కష్టాల్లో ఉన్నప్పుడు, ఆదుకోవడం మన ధర్మం. తిండికి కూడా ఇబ్బంది పడుతోందని రాసేరు. దానికి బుద్ధి వచ్చింటుంది. శాంతంగా ఆలోచించు. మనం వెళ్లి దాన్ని మన ఇంటికి తెద్దాం. ఏమంటావ్." అని భర్తకు అనేక విధాల బోధపరిచింది. శంకర్ శాంతించేడు.

"వెళ్లి రాడానికి మూడు రోజులయినా పడుతుంది. వచ్చే సోమవారంనుండి పిల్లల ఎగ్జామ్స్. అంచేత నాకు ఇప్పట్లో కుదరదు." అని తన నిస్సహాయకత తెలియజేసేడు.

"అయితే నేను వెళ్లేదా." అని సునీత నెమ్మదిగా అడిగింది.

"వెళ్లగలిగితే నువ్వు వెళ్ళు..….దానికి అప్పులున్నాయో ఏమిటో. ఎందుకయినా మంచిది: ఓ పాతిక వేలు తీసుకెళ్ళు." అని సలహా ఇచ్చేడు, శంకరం.

సునీత పేపరులోని వివరాలు ఆధారంగా హేమ నివాసం చేరుకొంది. వదినను చూడగానే, హేమ నిర్ఘాంతబోయింది. “వదినా." అని భోరున ఏడుస్తూ సునీత భుజాలమీద వాలిపోయింది. సునీత ఓదార్చింది. తను వచ్చిన కారణం చెప్పింది. హేమ, "వదినా నేను అన్న మొహం చూడలేను. నేను చేసిన పాపాలికి ఇక్కడే ఉండి శిక్ష అనుభవిస్తాను." అని పశ్చాత్తాపం పలికింది.

"హేమా, మీ అన్నయ్యే వచ్చి నిన్ను తీసుకెళదామనుకొన్నారు. ట్యూషన్ పిల్లల పరీక్షల మూలాన్న రాలేకపోయేరు. రేపే మనం బయలుదేరుదాం. మరో ఆలోచన పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఇవ్వవలసినవి ఏవైనా ఉంటే చెప్పు. అవి పే చేసేద్దాం." అని వదిన నోటంట విన్న హేమ సిగ్గుతో తల వంచుకొంది. వదిన, మరదలు, నవరంగపట్నం చేరుకొన్నారు. అన్న కాళ్ళమీద పడి హేమ క్షమాపణలు చెప్పుకొంది. హేమ కూడా ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. గతంలో అన్న చెప్పినట్లు, గతాన్ని తలచుకొని, జీవితాన్ని అర్థం చేసుకొంది.

********

Posted in March 2024, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!