4. అశోకుడు
అశోకుడి రోదన, ఆధ్యాత్మికత, శిలా శాసనాలు
కళింగ యుద్ధం వల్ల జరిగిన దుష్పరిణామాన్ని, మహా వినాశనాన్ని, సంక్షోభాన్ని అశోకుడు చూసి అమితంగా చలించి, రోదించి, భావోద్వేగం పొంది, తన శేష జీవితనాన్ని పూర్తిగా మరో మార్గం వైపు మలచటం జరిగింది. తత్ఫలితంగా వచ్చిన మానసిక పరివర్తన వల్ల రాచరికంలో ప్రజలను అణచివేతకు గురిచేసే బదులు వారి యెడల కరుణ చూపటం అత్యుత్తమని, అది ప్రజారంజక పరిపాలనలో ప్రాధమిక సూత్రం అని ఆయన భావించాడు. ఈ పరివర్తన ద్వారా అశోకుడి దృష్టిలో శక్తివంతమైన శ్రేష్ఠులు, శిష్టులు, రాజాధికారుల కంటే సామాన్య ప్రజలు, పౌరులు పరిణామాత్మిక వ్యక్తులు. ఈ నూతన అవగాహనలో భాగంగా కళింగ యుద్ధంలో తాను విజయం సాధించినా అది ఓటమి (అపజయం) అనే ఆయన భావించటం జరిగింది. ఇది ఓటమి అయినా, ఆధ్యాత్మికంగా తనకు పరిణతి వచ్చిందని తెలు సుకున్నాడు.
తత్ఫలితంగా క్రీ.పూ. 260 తరువాత అశోకుడు వివిధ ప్రాంతాలలోని (ఉత్తరాన యమునా నది తీరం నుంచి దక్షిణాన కర్ణాటకలోని కొండల వరకు) తన అధికారులకు ఒక సమాచార ప్రకటన పంపించటం జరిగింది. ఈ రాజాజ్ఞను తన సామ్రాజ్యంలోని కొండలలో ఉన్న బండరాళ్ళమీద (శిలల) మీద వ్రాయించాడు. ఇవి ‘Minor rock edicts’ (చిన్న శిలా శాసనాలు) గా ప్రాచుర్యం పొందాయి. ఈ శాసనాలలో కళింగ యుద్ధంలో తాను పొందిన బాధను అశోకుడు వెల్లడించాడు. వీటిని చదివి తన ప్రజలు ప్రేరేపితులు అవుతారని ఆయన భావించటం జరిగింది.
కొండ రాళ్లమీద అశోకుడు తన శాసనాలు చెక్కించే కాలం వరకు బౌద్ధ వ్యాఖ్యానాలకు రాజులకు సంబంధం లేదు. ఈ మౌఖిక ఉపన్యాసాలు కేవలం గౌతమ బుద్ధ బోధనలు, ఆయన పూర్వ జన్మలు, సన్యాసులు, సన్యాసినిలు ఆచరించవలసిన పద్ధతులకు మాత్రమే పరిమితమైనాయి.
అశోకుడి సామ్రాజ్యం ఉత్తరాన గాంధార (ఆఫ్గనిస్తాన్) నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, పశ్చిమాన గుజరాత్ నుంచి తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఇంత విశాల సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించటానికి రాజకుమారులు నియమించబడ్డారు. వీరికి తగిన సూచనలు, ఆదేశాలు అశోకుడు శిలా శాసనాలద్వారా ఇవ్వటం జరిగింది. వీటిల్లో యుద్ధ విషయాలతో పాటు శాంతి సందేశాలు కూడా ఉన్నాయి. ఈ ఆజ్ఞలను నెరవేర్చే క్రమంలో అధికారులకు శిక్షలు, అనుగ్రహాలు, బహుమతులు, మినహాయింపులు, మొదలగునవి ఉన్నాయి.
అశోకుడికి ముందు అనేక మంది రాజులు తమ అధికారులకు సందేశాలు పంపించినా అవి ఎంతో కాలం నిలవలేదు. ఇవి తాటి ఆకులు, బూర్జ పత్రాలు, పత్తి వస్త్రాలు, చెక్క పలకల మీద వ్రాయబడ్డాయి. ఇవి అశాశ్వతం కాబట్టి ఎంతోకాలం మన్న లేదు. కాని అశోకుడి శాసనాలు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా శిలల మీద లిఖించబడ్డాయి లేదా చెక్కించబడ్డాయి. దీనికి ముఖ్య కారణం కళింగ యుద్ధంలో జరిగిన ఘోర మానవహరణం, సంక్షోభం. ఈ శిలా శాసనాలు 2,400 ఏళ్ల తరువాత కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డాయి. ఈ శాసనాల ద్వారా అశోకుడు తనను అన్ని కాలాల ప్రజలు గుర్తు పెట్టుకొనేటట్లు చేసుకోవటం జరిగింది.
ఆంధ్ర, కర్ణాటక, ఇతర ప్రదేశాలలో శిలా శాసనాలు
అశోకుడి మొదటి అధికారిక ప్రకటన అన్ని ప్రాంతీయ ప్రదేశాలకు చేరినప్పుడు ఈ శాసనాలు ఎటు వంటి శిలలు, రాళ్ల మీద వ్రాయాలి అని అచ్చటి అధికారులు తర్జన భర్జన పడ్డారు. కొన్ని చోట్ల (ఉదాహరణకు కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం లోని ‘రాజుల మందగిరి’, ఢిల్లీ లోని ‘శ్రీనివాసపురం’లో) చదునైన సమాంతర (horizontal) రాళ్ల మీద చెక్కితే, మరికొన్ని చోట్ల (కర్ణాటక, రాయచూరు జిల్లాలోని ‘మస్కి’; తుముకూరు జిల్లాలోని ‘నిట్టూరు’) నిలువెత్తు చదునైన రాతి ఫలకాల (stone pillars) మీద చెక్కబడ్డాయి. ఈ ఫలకాలు కొన్ని ప్రదేశాలలో చూపరులకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు రాజస్థాన్ జైపూర్ జిల్లాలోని ‘బైరాత్’ లోని పెద్ద గుండ్రాయి (boulder) రహదారి ప్రక్కన ఉన్న ఒక చిన్న కొండ దిగువనే ఉంది. రోడ్డు ప్రక్కన ఉన్న ఇటువంటి గుండ్రాయి మీదనే అనంతపురం జిల్లాలోని ‘ఎర్ర గుడి’ శిలాశాసనం కూడా చెక్కబడింది.
కొన్ని ప్రదేశాలలో ఈ శాసనాలు ప్రజలకు దూరంగా చెక్కబడినాయి. ఇటువంటివి ఉదాహరణ కు కర్ణాటక కొప్పల్ జిల్లాలోని ‘పల్కిగుండు' (Palkigundu), ‘గవిమఠం’ (Gavimath) లోనూ, బీహారులో ‘Rohtas’ జిల్లాలోని ‘సాసారం’ (Sasaram)లో ఉన్నాయి. ఈ చోట్ల ఇవి ప్రజలకు అతి దూరంగా దుర్గమ మయిన కొండ శిఖరం మీద చెక్కబడి ఉన్నాయి. దుర్గమయమయిన ఇటువంటి ప్రదేశాలలో ఈ శిలా శాసనాలు ఎందుకు చెక్కబడ్డాయో తెలియదు.
కొన్ని శిలాఫలక శాసనాల మీద కరువులు, క్షామములు సంభవించిన సమయంలో ప్రజలకు ఆహారధాన్యాలు ఎలా పంపిణి చేయాలి అనే విషయం మీద ‘మహామాత్ర’ లకు ఆదేశాలకు సంబంధించినవి. ఇటువంటి శాసనాలు బంగ్లాదేశ్ లోని ‘Masthangarh’, ఉత్తరప్రదేశ్ లోని ‘Sohguara’ లోనూ ఉన్నాయి.
శిలా శాసనాలలోని భాష, లిపి
ఈ వివిధ శాసనాలు బ్రహ్మి లిపిలో చెక్కబడ్డాయి. కాని భాష మాత్రం ప్రాకృత సంబంధిత మాండలికాలు (dialects). ఆంధ్ర, కర్ణాటక లలో మాత్రం వాడుక భాష ప్రాకృతం కాకపోయినా అచ్చటి శాసనాలకు ఈ భాషే వాడటం జరిగింది. అందువల్ల అచ్చటి అధికారులు ప్రజలకు ప్రాంతీయ భాషలలో అనువదించి చెప్పవలసివచ్చింది.
వివిధ ప్రాంత అధికారులకు అశోకుడు పంపించిన సందేశం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. తన సమస్త రాజ్యంలోని ప్రజలు ఒకే విధమైన సందేశం వినాలని, తెలుసుకోవాలని అయన ఉద్దేశం. కొన్ని సందేశాలు అశోకుడి ఆజ్ఞలతోనే అయన పర్యటనలో ఉన్నప్పుడే కూర్చబడ్డాయి. వీటిని అయన తన రాజప్రతినిధి (viceroy)కి ఇస్తే, లేక పంపించితే, అతను తన అధికారులకు అందజేశాడు. వీరు లేఖకులచేత శాసనాలు చెక్కించటం జరిగింది. ఒక సందర్భంలో ఒకే సందేశానికి మూడు నకళ్లు మూడు చోట్ల కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే చెక్కించబడ్డాయి. ఇది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా లోని బ్రహ్మగిరి, సిద్ధపుర, జతింగ-రామేశ్వర లలో జరిగింది. ఇచ్చట ‘ఆర్య పుత్ర’ (అశోకుడి పుత్రుడు, రాజప్రతినిధి) తన రాష్ట్ర రాజధాని ‘సువర్ణగిరి’ నుంచి తన అధికారులకు శుభాశీస్సులు అందిస్తూ, వారి క్షేమాన్ని కాంక్షిస్తూ శిలల మీద చెక్కించవలసిన సందేశాన్ని పంపించాడు.
అశోకుడి శిలా శాసనాలను చెక్కే ప్రాంతీయ వృత్తికారులు (లిపికారులు) కేవలం తెరచాటు వ్యక్తులు మాత్రమే. ఒక ‘లిపికారుడు’ మాత్రం శాసనం చెక్కిన తరువాత చివరిగా తన పేరు కూడా చెక్కి అమర్త్యుడయ్యాడు!
శిలా శాసనం చెక్కిన శైలి లిపికారిని బట్టి, అతని నైపుణ్యం బట్టి ఉంటుంది. ఆంధ్రదేశంలో ఎర్ర గుడి శాసనం చెక్కిన లిపికారి ద్వైయాంశిక (bidirectional) పధ్ధతి ఉపయోగించాడు. అంటే ఎడమవైపు నుంచి కుడివైపుతో పాటు, కుడివైపు నుంచి ఎడమ వైపుకు కూడా చెక్కటం జరిగింది. ఇటువంటి పధ్ధ తి అనుసరించటంలో అతని అత్యుత్సాహం అవగతమవుతుంది.
కొన్ని శిలాఫలకాలలో అశోకుడు తన పేరును ‘దేవనామప్రియ’ (Dear of the Gods) లేక ‘దేవ నామప్రియ ప్రియదర్శి’ గా చెక్కమని సూచించటం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అధికారులు ఈ బిరుదులతో పాటు రాజు పేరు (అశోక) ను కూడా చెక్కించారు. కాని కర్ణాటక లోని ‘మస్కి’ (Maski) బిరుదులను వదిలి కేవలం చక్రవర్తి పేరు మాత్రమే చెక్కటం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ (Jhansi) కు సమీపంలోని ‘గుజ్జర’ లో ‘అశోక రాజా’ అని చెక్కటం జరిగింది. శిలల మీద చెక్కే ముందు నియమించబడిన అధికారి అశోకుడు నుంచి వచ్చిన సందేశాన్ని ప్రజలకు చదివి వినిపించిన తరువాత శిల్పికి ఇచ్చి అతని చేత చెక్కించటం జరిగింది.
అశోకుడు తన మొదటి శాసనం ద్వారా ప్రజలకు అందించిన సందేశం ఏమిటి?
అశోకుడి మొట్టమొదటి శిలాశాసనం (minor rock edict) మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ దగ్గరలో ఉన్న‘రూపనాథ్’ సమీపం లోని ‘కైమూర్’ కొండ మీద క్రీ.పూ. 3 వ శతాబ్దంలో చెక్క బడింది. ఈ రూపనాథ్ శాసనం కళింగ యుద్ధం తరువాత అశోకుడి మానసిక స్థితి, పరివర్తన విదితమవుతుంది. అప్పటికే అయన బౌద్ధమతం స్వీకరించాడు.
ఈ మొట్టమొదటి శిలాశాసనంలో దేవనామ ప్రియ సందేశం ఈ విధంగా ఉంది.
“నేను ‘శాక్య’ (బుద్ధుడి శిష్యుడు) అయిన తరువాత రెండున్నర సంవత్సరాలు, అంతకంటే కొంచెం ఎక్కువ కాలం, గడచిపోయాయి. కాని ఒక సంవత్సరం నేను పూర్తి ఉత్సాహం చూపించలేదు. కాని ఒకటిన్నర సంవత్స రాల క్రితం నేను బౌద్ధ సంఘం దర్శించిన తదుపరి అతి ఉత్సాహంగా ఉన్నాను. ఆ సమయంలో జంబుద్వీపం లో దేముళ్ళు మానవులతో సంచరించారు. వారు నన్ను మానవులతో కలిసేటట్లు చేశారు. ఇదే నా అమిత ఉత్సాహానికి కారణం.”
“ఈ ఉత్సాహం ఉన్నత శ్రేణి వ్యక్తులే మాత్రమే కాదు, దిగువ శ్రేణి వ్యక్తులు కూడా ఉత్సాహంగా ఉండి ధర్మం పాటిస్తే స్వర్గం చేరుకోవచ్చు.”
“అందువల్ల ఈ క్రింది ప్రకటన నా రాజ్య సరిహద్దులలోపల ఉన్న వారితో పాటు, సరిహద్దుల బయట ఉన్న ఉత్సాహభరితులైన బీదవారు, ధనికుల కొరకు ఇవ్వబడింది; ఈ ఉత్సాహం ప్రజలలో దీర్ఘకాలం కొనసాగాలి.”
“ఈ కార్యం నా చేత కనీసం ఒకటిన్నర రెట్లు పురోగతి సాధించేటట్లు చేస్తుంది. అవకాశం లభించినప్పుడు నా అధికారులు ఈ విషయం గురించిన వివరాలు శిలలమీద చెక్కిస్తారు.”
“మరియు శిలా స్తంభాలు (rock pillars) ఉన్నచోట్ల, ఈ వివరాలు వాటిమీద చెక్కించబడతాయి.”
“ఈ ప్రకటన ఉత్తరువు మీ (అధికారుల) మదిలో ఉంచుకుని మీరు (అధికారులు) మీ అధీనంలో ఉన్న ప్రదేశాలను పర్యటించి తెలియజెప్పాలి, ప్రజలు ఆచరించేటట్లు చేయాలి.”
“ఈ అధికార ఉత్తరువు నేను పర్యటనలో ఉన్నప్పుడు ఇవ్వబడింది; అప్పుడు నేను 256 రాత్రులు రాజధానికి (పాటలీపుత్రకు) దూరంగా ఉన్నాను.”
---------
అశోకుడి మొదటి శిలాశాసన సముదాయం (rock edicts) అయన తాను చేసిన తప్పును (కళింగులతో యుద్ధం) ఒప్పుకునట్లుగా ఉంది. ఈ ఆత్మావలోకనం కలిగిన తరువాత ఇది తన ప్రజలతో పంచుకోవాలని అనిపించింది. ఈ పై సందేశం అయన రాజ్యంలో సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పుడు 256 వ రోజున ఇవ్వటం జరిగింది.
ఈ సందేశంలో అశోకుడు తాను బౌద్ధ మతస్తుడుగా పరివర్తన చెంది, తన ప్రజలు కూడా ఈ పరివర్తన పొందాలని పరితపించటం జరిగింది.
అయన బౌద్ధ మతస్థుడుగా మారిన తరువాతే అశోకుడు తన బడుగు ప్రజలతో పూర్తిగా మమేకమవ్వటం జరిగింది. ప్రపంచంలో ఈ మొట్ట మొదటి బౌద్ధ చక్రవర్తి రాజస్థాన్ లోని ‘బైరాట్’ (విరాట నగరం), దిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలోని ‘అహృరా’ (Ahrura), బీహార్ లోని ‘సాసారం’ (Sasaram), రాజస్థాన్ లోని ‘గుజ్జర’ (Gujjara); మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలోని ‘రూపనాథ్’ (పైన తెలిపిన శాసనం); దక్షిణ భారత్ లోని ఆంధ్ర, కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో ఈ నూతన బౌద్ధవాది తన సందేశాన్ని మొత్తం 10 ప్రదేశాల శిలల మీద చెక్కించటం జరిగింది.
ఈ సందేశాన్ని చదివితే ఈ మౌర్య చక్రవర్తి బౌద్ధమతం గురించి ఎంత ఉత్సాహంగా ప్రచారం చేయ సంకల్పించాడో అవగతమవుతుంది. మొదటగా అయన తాను ‘శాక్య’ (బుద్ధుడి/శాక్యముని శిష్యు డు) గా ఎలా మారాడో తెలి పాడు. మరి కొన్ని శాసనాలలో తనను తాను బౌద్ధమత ఉపాసకుడిగా వర్ణించటం జరిగింది.
చిన్న రకపు శిలాశాసనాలు (Minor Rock Edicts)
ఈ చిన్న రకపు శిలాశాసనాలు అశోకుడి పాలనలో 10 ఏళ్ళు దాటిన తరువాత (11 వ ఏట; అయన లౌకిక బౌద్ధ మతస్థుడుగా మారిన తరువాత రెండున్నర ఏళ్లకు) చెక్కించటం జరిగింది. ఈ శాసనాలలో సాంకేతిక నాణ్యత తక్కువగా ఉంది.
అశోకుడి కాలపు భారతావనిలోని శిలాశాసనాలు
ఊరు/పట్టణం | జిల్లా | రాష్ట్రం |
కాందహార్ | --- | ఆఫ్గనిస్తాన్ (ఇప్పటి దేశం) |
లంపక | -- | ఆఫ్గనిస్తాన్ (ఇప్పటి దేశం) |
బాహాపూర్ | -- | ధిల్లీ (దక్షిణ) |
బైరాత్ (విరాట్ నగర్) | జైపూర్ కు దగ్గర | రాజస్థాన్ |
భబ్రు | బైరాత్ కు దగ్గరలో ఉన్న రెండవ కొండ | రాజస్థాన్ |
రూపనాథ్ | ఝాన్సీ | మధ్య ప్రదేశ్ |
పంగురారియా | సెహోర్ | మధ్య ప్రదేశ్ |
సోహాగౌర | గోరక్ పూర్ | ఉత్తర ప్రదేశ్ |
సాసారం | రోహతాస్ | బీహార్ |
బరాబార్ గుహలు | జహానాబాద్ | బీహార్ |
మహాస్థాన్ | బొగ్ర | బంగ్లాదేశ్ (ఇప్పటి దేశం) |
రాజుల మందగిరి | కర్నూలు | ఆంధ్ర ప్రదేశ్ |
పల్కిగుండు; గవిమత్ | కొప్పల్ | కర్ణాటక |
బ్రహ్మగిరి | చిత్రదుర్గ | కర్ణాటక |
జతింగ-రామేశ్వర (భ్రహ్మగిరి దగ్గర) | చిత్రదుర్గ | కర్ణాటక |
సిద్ధాపూర్ (భ్రహ్మగిరి దగ్గర) | చిత్రదుర్గ | కర్ణాటక |
మస్కి | రాయచూరు | కర్ణాటక |
నిత్తూరు | బళ్లారి | కర్ణాటక |
ఉడెగోళం | బళ్లారి | కర్ణాటక |
అశోకుడు తన పాలనలో 26-27 వ ఏట నెలకొల్పిన కొన్ని శిలా-స్థూప శాసనాల (pillar edicts) ద్వారా ప్రజలకు ఈ క్రింది సందేశం పంపించటం జరిగింది. వీటిల్లో నాణ్యత చాలా ఎక్కువ. ఈ స్థూప శాసనం ఒకటి అనంతపురం జిల్లాలోని ‘ఎర్రగుడి’ (Erragudi) లో కూడా ఉంది. అది ఈ వ్యాసంలో మూడవ చిత్రంలో చూడవచ్చు. ఈ శాసనం చెక్కిన లిపికారుడు అత్యుత్సాహం ప్రదర్శించి ద్వైయాంశిక (bidirectional) పధ్ధతి ఉపయోగించాడు. అంటే ఎడమవైపు నుంచి కుడివైపుతో పాటు, కుడివైపు నుంచి ఎడమ వైపుకు కూడా చెక్కటం.
“తల్లి, తండ్రుల యెడల విధేయతతో ఉండాలి; అలాగే పెద్దవారి యెడల కూడా. జంతువుల విషయంలో నిస్సంచయంగా కరుణ చూపించాలి; ఎల్లపుడు నిజం పలకాలి; నైతిక సద్గుణాలు ఆచరించాలి. శిష్యుడు ఎల్లప్పుడూ గురువు ఎడల ఆరాధనాభావం చూపించాలి. బంధువుల ఎడల ఎల్లప్పుడూ అనుకూలంగా ప్రవర్తించాలి. ఇది సనాతన నియమం; మరియు ఇది దీర్ఘ మైన, ప్రశాంతమైన జీవితం ప్రసాదిస్తుంది.”
………………………….
అశోకుడి గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.
మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com