ఆరోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభోదయం ఆగస్ట్ పదిహేనవ తారీకు. ఆవరణంతా పచ్చని చెట్లతోనూ, విరబోసిన పూలతో కనులవిందుగా ఉన్న మొక్కలతోనూ, ఆహ్లాదంగా ఉండి అలంకరించిన జెండాతోరణాలతో అందంగా మెరిసిపోతోంది. నేలతల్లి కూడా దిద్దిన రంగవల్లికలతో నాకేం తక్కువ? అన్నట్లుగా వెలిగిపోతోంది. గుడిలోని ధ్వజస్తంభంలా పూలతో అలంకరించిన జెండా స్తంభం దర్పంగా నిలబడింది. ఆరోజు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రివర్యులు రాబోతున్నారు.
అది రాష్ట్రంలోని పేరుమోసిన కారాగారంలో మహిళా ఖైదీలుండే ప్రాంతం. ఆ జైలు సూపరింటెండెంట్ సుధారాణి ప్రతిరోజూ ఖైదీలనందరిని పరామర్శించి వాళ్ళ మంచిచెడులను గమనిస్తూంటారు. ప్రతినెలా ఒక ఖైదీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఆమెలో వస్తున్న మానసిక మార్పులను తెలుసుకుంటూంటారు.
ఖైదీల ఇంటి పరిస్థితులను కూడా విచారించి ఎవరికైనా చిన్న పిల్లలూ, వయోవృధ్ధులు ఇంటిదగ్గర బాధపడుతూంటే ఒకవారం పాటు ఇంటికి పంపుతారు. ఖైదీలకు రెండేళ్ళకొకసారి ఆ సౌకర్యం ఉపయోగించుకునే వీలువుంటుంది.
అక్కడ పగలు జైలు ఆవరణ నాలుగు గోడల మధ్య స్వేచ్ఛగా తిరగవచ్చు. తోటపని, వంటపని, చదువుకునే ఆసక్తి వుంటే తరగతులు, వృత్తివిద్యలు అన్నీ నేర్పించే వీలు ఉంది. ఆ జైలులో ప్రస్తుతం ఏభై మంది మహిళా ఖైదీలున్నారు.
సుధారాణి గదిలోకి కాఫీ తీసుకుని వచ్చింది కాంచన. హత్యానేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్న ఆమె ఆ జైలుకొచ్చి పన్నెండేళ్ళవుతోంది.
“మేడం! మీరు ఈరోజు వకుళ గురించి మంత్రిగారితో మాట్లాడతారా? వకుళ పరిస్థితి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇంటి ధ్యాసలేని తండ్రి పెంపకంలో పెరుగుతున్న పిల్లవాడు ఆతండ్రికి వారసునిగా ఆ పోలికలతో తయారవుతాడని వకుళ భయం. మీరు తనపై దయచూపించి క్షమాబిక్ష పెట్టించి, రెండేళ్ళముందుగా ఆమెను విడుదల చేయమని అడగండమ్మా!” అంటూ కన్నీళ్ళపర్యంతమౌతూ చెప్పింది..
“కాంచనా! నీ ఇంటి పరిస్థితికూడా అలాంటిదేగా. అయినా నీగురించి అడగమని కాకుండా, నీతోటి ఖైదీ బాగోగులగురించి నీవు ఆలోచిస్తున్నావు. నీ మంచితనానికి ఇంతకు మించిన ఉదాహరణలేదు. ఈరోజు నేను తప్పకుండా మీ ఇద్దరిగురించి మంత్రిగారితో మాట్లాడి, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను” అంది సుధారాణి.
ఇంతలో మంత్రిగారి సిబ్బంది నుండి ఫోను వచ్చింది. మంత్రిగారు అయిదు నిముషాలలో సభాస్థలికి వస్తున్నారని చెప్పారు. మంత్రిగారు వచ్చిన తరువాత జెండా వందనం అంతా క్రమపధ్ధతిలో జరిగింది.
కాంచన "ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా.." అంటూ తాను రాసిన పాటను పాడింది. మంత్రిగారు దేశభక్తిని పెంపొందించేలా ప్రసంగించారు.
ఖైదీలతో మాట్లాడుతూ “మీరంతా ఈ జైలును ఓ పర్ణశాలలా మార్చారు. మీరు చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు మీ మేడంగారు నాకు ఫోను ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను” అంటూ సుధారాణితో పాటు కదిలి ఖైదీలకు కల్పించిన వసతులు, వాళ్ళు తయారుచేసిన చేతివృత్తుల ఉత్పత్తులను ఒక్కొక్కటిగా చూసి మెచ్చుకున్నారు.
“మీకేమైనా సమస్యలుంటే మీ మేడంగారి ద్వారా నాకు పంపండి. పరిష్కరించటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను” అని చెప్పి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు.
మంత్రిగారు వెళ్ళాక సుధారాణి ఖైదీలతో మాట్లాడుతూ “నేను మిమ్మల్ని నా తోడబుట్టిన వారిలాగానే భావిస్తున్నాను. నేనిక్కడున్నంత కాలం మీరు పూర్తి స్వేచ్చ ఉండటానికి ఏర్పాటు చేస్తాను. మీరు మీఇంటిదగ్గర వున్నంత వీలుగా ఉంటారు. మీ అందరి గురించి నేను ఎప్పటికప్పుడు మంత్రిగారితో చెపుతూనే వున్నాను. భయపడకండి, మీ కష్టాలను పరిష్కరించే దిశగా అండగా ఉంటాను” అని చెప్పారు. ఖైదీలంతా “ఈ తల్లి మనపాలిటి దేవత” అనుకున్నారు.
కాంచన ఆ రోజు సాయంత్రం ఓ ఉత్తరం వ్రాసి సుధారాణి దగ్గరకు తీసుకొచ్చింది. “అమ్మా! ఇది చదివి తప్పు లేదనుకుంటే పోస్ట్ చేయించండమ్మా” అని చెప్పింది.
సుధారాణి ఆ ఉత్తరం చదవటం మొదలుపెట్టింది.
“ప్రియమైన శ్వేతకు, నేను మీ అమ్మను. నీకు దూరంగా ఉండి వారంవారం ఫోనులో మాత్రమే మాట్లాడే అమ్మ ఇలా ఉత్తరం రాస్తోందేమిటని ఆశ్చర్య పడుతున్నావా?
రెండేళ్ళకొకసారి నాప్రాణమైన నిన్ను కలసి చాక్లెట్లు, బొమ్మలు ఇచ్చి మభ్యపెట్టి కనుమరుగయ్యే నేను, నీకు నాగురించి నిజం చెప్పే రోజు వచ్చిందమ్మా! మరి నువ్వు ఆ విషయం విన్న తరువాత ఈ అమ్మను ఎలా స్వీకరిస్తావో అనే భయంతో నీ జవాబు గురించి దీనంగా ఎదురుచూస్తూ ఉంటాను. నేను ఆరేళ్ళ చిన్నారి శ్వేతను ఒంటరిగా వదిలి ఇన్నేళ్ళుగా హత్యానేరంపై జైలుజీవితం గడుపుతున్నానమ్మా! నీవిప్పుడు పెద్దదానివయ్యావు. పరిస్థితులను అర్ధంచేసుకునే విచక్షణాశక్తి నీకు వచ్చింది. అందుకే నాగురించి నీకు చెపుతున్నాను.
మీ నాన్నగారిది క్యాంపులకెళ్ళే ఉద్యోగం. నెలలో 15రోజులు ఆయన బయట ఊళ్ళకెళ్ళేవారు. మన ఇంటి ప్రక్కనే మీ నాన్నగారి స్నేహితుడు ఉండేవాడు. ముందురోజులలో నాన్నగారు ఉన్నప్పుడే వచ్చి ‘చెల్లాయ్’ అంటూ ఆప్యాయంగా పలకరించి వెళ్తూండేవాడు. క్రమంగా నాన్నగారు లేని సమయంలో కూడా వచ్చి చిన్నచిన్న పనులలో సాయంచేస్తూండేవాడు. అప్పుడే అతనిలోని మృగత్వం తెలిసివచ్చింది నాకు. అందుకే నాన్నగారు లేని సమయంలో రావద్దని చాలాసార్లు చెప్పాను. “మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ” అంటారు. పశువుకంటే హీనమైన ప్రవృత్తికలిగిన వాడు కనుకనే నాన్నగారు లేని సమయాలలో కూడా రావటం మానలేదు.
ఆ వేసవికాలంలో అమ్మమ్మ తాతయ్యలు మనింటికి వచ్చారు. వాళ్ళు వెళ్ళేరోజు నీవు గొడవచేసి అమ్మమ్మతో కలసి ప్రయాణమయ్యావు. అమ్మ నన్ను కూడా రమ్మంది. నాన్నగారు రెండు రోజులలో వస్తానన్నారు, ఆయన వచ్చే సరికి ఇంటిదగ్గరలేకపోతే బాగుండదని నేను ఒక్కదానినే ఇంటిదగ్గర ఉండిపోయాను. మీతో వచ్చినా బాగుండేది. ఆ ఘోరం జరిగేది కాదు.
చుట్టుపక్కల వారు సాయంరావడానికి వీలులేని వేళ, తాగివచ్చిన ఆ ప్రబుద్ధుడు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి వీధి తలుపు గడియ వేసి, నాపై బలవంతం చేయబోయాడు. వాడికి లోబడలేక, ఎదిరించే శక్తిలేక, అతనిని తప్పించుకోవటానికి వంటగదిలోకి వచ్చిన నాకు కత్తిపీట చేతికి అందింది. అతనినుండి తప్పించుకునే వేరుదారిలేక ఆ కత్తితో అతనిని విచక్షణారహితంగా నరికేశాను. రక్తపు మడుగులో నిర్జీవంగా పడున్న అతనిని చూసిన నాకు “ఇక నాలాంటి ఆడవారికి ఇతనివల్ల ఏబాధా ఉండదు” అనిపించింది. బయటకొచ్చి పోలీసులకు లొంగిపోయాను.
“నాతిచరామి..” అంటూ నా చేయి పట్టుకున్న నాన్నగారు నన్ను, నిన్ను వదిలి ఎటో వెళ్ళిపోయారు. హత్యచేసి జైలుకెళ్ళిన తల్లిగా నీ మనసులో ముద్రపడితే నీ మానసిక స్థితి ఎలా మారుతుందోననే భయంతో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నిన్ను తాతయ్య దగ్గరే ఉంచాను.
నా సత్ప్రవర్తన, తోటి ఖైదీలకు నేను చేసిన సేవలకు గుర్తింపుగా నాకు శిక్షను తగ్గించి ఇంటికి పంపిస్తామంటున్నారు జైలు అధికారులు. మన భారత దేశంలోని ఏస్త్రీ అయినా తన ప్రాణం కన్నా శీలం గొప్పదని భావిస్తుంది. అలాంటి శీలానికి హాని జరగబోయే స్థితిలో యాదృశ్చికంగా నేను చేసిన హత్య అది. అంతేకానీ తెలిసి తెలిసి చేసిన నేరం కాదు. మరి నీవు ఈ అమ్మను అర్ధం చేసుకుని ఆదరిస్తావా?
జీవితంలో అన్నిటిని కోల్పోయిన నేను నా మిగిలిన సమయాన్ని అమ్మానాన్నలకు సేవచేస్తూ నిన్ను చూసుకుంటూ గడిపేస్తాను. ఇంతకాలం నీకు అందించలేకపోయిన ప్రేమనంతా మూటకట్టుకుని వచ్చి నీతో పంచుకుంటాను. నీ తల్లి హంతకి అని సమాజాన చెప్పుకోలేక నీవు తలదించుకోవాల్సి వచ్చిందని నీకేమైనా అనిపిస్తే, ఇక్కడే ఉండి ఈ ఉమ్మడికుటుంబంలో అందరికి నాకు తోచిన రీతిలో సేవచేసుకుంటు శేషజీవితాన్ని గడిపేస్తాను.
“తప్పని స్థితిలో మరోగత్యంతరంలేక చేసిన నేరానికి కుంగిపోక శిక్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటు తోటివారి బాగోగులు చూసుకుంటూ రాబోయే కాలానికి పునాదిరాళ్ళను వేసుకుంటూంటే దయామయుడైన పరమాత్ముడు ఆ వ్యక్తిని ఒడ్డుకు జేరుస్తాడు” అని మా సుధామేడం గారు చెపుతూంటారు. ఆ వాక్యాలు నా పట్ల నిజమయ్యాయి. నా బాధలకు శాశ్వతంగా సెలవు ప్రకటించే నీ సమాధానం కోసం ఆశగా వసంతుని రాకకై ఎదురుచూసే కోయిలమ్మలా.. అమ్మ కాంచన” అంటూ ఉత్తరం చదవటం ముగించింది సుధారాణి.
మనసులో జరిగే సంఘర్షణను అదుపుచేసుకుంటూ అంతసేపూ మేడంగారి పక్కనే నిలుచునుంది కాంచన.
కాంచన తలనిమురుతూ, “మంచినిర్ణయం తీసుకున్నావమ్మా! ఈ ఉత్తరం మీ అమ్మాయికి చేరుస్తాను. అక్కడ నీ స్నేహితులు నీ కోసం ఎదురుచూస్తుంటారు, నువ్వెళ్ళి ఆ పని చూడు” అంది సుధారాణి.
వయోజనులకు రోజూ పాఠాలను, కథలను చెప్తూండే కాంచన గుండెలలోని బరువు దిగిపోగా నెమ్మదిగా కదిలింది.
కాంచన వెళ్ళిన వైపుచూస్తూ “శిక్షా కాలంలో పి.జి.లో ఉత్తీర్ణురాలయిన కాంచనకు, బయటకు వెళ్ళగనే ఏదయినా ఉద్యోగం చూస్తే ఆమె బాధలు కొంతయినా తీరతాయి” అని తలపోసింది సుధారాణి.
కాంచన తన కూతురినుండి వచ్చే సమాధానంకోసం వానచినుకుకై ఎదురుచూసే చేతక పక్షిలా ఎదురుచూసింది. తనే ఫోనుచేసి మాట్లాడదామంటే శ్వేత ఏంసమాధానమిస్తుందో? లేదా అసలు తనతో మాట్లాడటానికి ఇష్టంలేక ఫోను కట్ చేస్తుందేమో?” అని భయపడింది. పదేపదే ఆఫీసు రూంకు వచ్చి సుధామేడం గారిదగ్గరకు వెళ్ళి తనకు ఏమైనా ఉత్తరం వచ్చిందేమోనని అడిగేది.
ఆమె కంగారుకు సుధారాణి ఒక్కింత ఆశ్చర్యపడుతూనే “ఏమిటి కాంచనా! శ్వేత ఒక్కటే లోకమా నీకు? మేమేమీకాదా? అని వేళాకోళమాడుతూ నవ్వేసేది. అలా రోజులు గడిచిపోతున్నాయి.
నెలరోజులైనా కూతురినుండి సమాధానం రాకపోవటంతో కాంచన ఆ విషయం పట్టించుకోవటం మానేసింది. “శ్వేత ఈతరానిపిల్ల. స్నేహితులతో, సమాజంలో తిరగాల్సిన పిల్ల. తన తల్లి నేరస్థురాలని ఎలా చెప్పుకోగలదు?. దేవుడు ఆడించే బొంగరాలాటలో మన జీవితాలు ఎవరి పరిధిలో వారు తిరగాల్సిందే కదా. నేను దిగులుపడి, ఆలోచించి చేసేదేమీలేదు” అనుకుంటూ తన రోజువారీ కార్యక్రమాలలో మునిగిపోయింది కాంచన.
తమ బ్రతుకును తాము తీర్చిదిద్దుకుని మానసిక సంస్కరణలతోను, ధర్మవర్తనతోనూ పదిమందికి వెలుగులనిచ్చే దీపాల్లా తయారైన ముగ్గురు మహిళా ఖైదీలకు ప్రభుత్వంవారు క్షమాబిక్ష ఇచ్చారు. గాంధీజయంతినాడు వారిని విడుదల చేయాలని ఉత్తర్వులొచ్చాయి. వారిలో వకుళ, కాంచనా చోటుచేసుకున్నారు.
“శ్వేతనుండి ఏసమాధానము అందుకోని కాంచనకు బాహ్యప్రపంచానికి వెళ్ళాలని అనిపించలేదు. అదేమాటను సుధారాణీకు చెప్పింది.
“శిక్షపూర్తయిన తరువాత జైలులో ఉండటం కుదరదు. అయినా ఈ నాలుగుగోడలమధ్యకన్న అందమైన జీవితాన్ని నీవు అందుకుంటావు బయట” అంది సుధారాణి.
గాంధీజయంతి రానే వచ్చింది. ఆరోజు ఉదయమే అందరితో కలసి టీత్రాగి దేశభక్తి పాటలు పాడుకున్నారు. అంతా కలసి క్షమాబిక్షతో విడుదలైన ముగ్గురు ఖైదీ లకు వీడ్కోలు పలికారు. వారు స్వేచ్ఛావిహంగాలుగా జైలుగోడలు దాటి విశాలమైనప్రపంచంలోకి వచ్చారు.
చేతిలో పూలబొకే పట్టుకుని ఓ తెల్లనికారు పక్కనే అప్పటిదాకా నిల్చునివున్న అమ్మాయి కాంచనను చూసి పరిగెత్తుకొచ్చి ఆలింగనం చేసుకుంది.
“అమ్మా! శ్వేతా! ఈతల్లిని క్షమించావా?” అంటూ బిడ్డను కౌగిలిలోకి తీసుకుంది కాంచన. ఆ తల్లీకూతుళ్ళ ప్రేమను చూసి చుట్టుపక్కలవారి కళ్ళు చెమర్చాయి. పుడమికూడా పులకించేటట్లుగా చిన్నగా వర్షం మొదలయ్యింది.
“అమ్మా! నీకు ఆనందాశ్చర్యాలను కలిగించాలనే సుధారాణిగారి సలహాతో నీకు ఉత్తరం రాయలేదమ్మా!. నిన్ను బాధపెట్టాను. నన్ను మన్నించమ్మా!. నీవిప్పుడు వందలాది మందికి భవిష్యత్తును ఇచ్చే ఉపాధ్యాయురాలివైనావమ్మా! ఇదిగో నీకు బహుమతిగా సుధారాణిగారిచ్చిన నీ అపాయింట్మెంట్ ఉత్తరం” అంటూ తల్లికి అందించింది.
వానవెలిసి మబ్బుల చాటునుండి బయటకు వచ్చిన సూర్యుడు తన నులివెచ్చని కిరణాలతో ప్రకృతిని మైమరపిస్తున్నాడు.