Menu Close
మాలికాప్రహేళిక
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
సీ.
ఇసుమంత యొకప్రక్క నింపుగా నింపఁగా
...........నటుప్రక్కఁ జేరఁగ నవతరించి,
నేను నిద్రించినఁ దాను నిద్రింపక
...........యలు పెఱుఁగక సేవ లందఁజేసి
కర్తవ్యబోధన గావించు శ్రమజీవి,
...........వివిధాకృతులలోన విస్మయముగ
దర్శనం బిచ్చుచు ధనికేతరులకైన
...........నందుబాటున నుండు నాప్తసఖుఁడు,
కరచాలనస్ఫటికస్పందనాదులే
...........జీవనాధారమౌ చెల్మికాఁడు,
రెండుచేతులఁ బ్రేమ నిండారు సంజ్ఞలఁ(1)
...........దన యునికినిఁ దెల్పుఁ దనయు భంగి,
శుకపికాదులఁ బోలు సుస్వరంబులఁ గూడఁ
...........బలకరించును మేను పులకరింప,
కనుమఱుఁ గగునట్టి కాలమహత్వమున్
...........గనులకుఁ గట్టెడు కర్మశీలి,
తే.గీ.
కరము, కుడ్యము, నెద, యలంకారశయన
కర్మవేదిక లాదిగాఁ గల నెలవులఁ
జక్కఁగా నిక్కి(2) చొక్కెడు నిక్కమైన
యా మహాజ్ఞాని కర్పింతు నంజలు లివె!
...........(1) సైగలతో/గుర్తులతో (2) వర్ధిల్లి
Posted in October 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!