అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
పం. అభేద్యవజ్రసన్నిభోన్నతాసమప్రభాకృతీ! ప్రభూతభూతప్రేతభీతివ్రాతకేతుభాతసా!(1) ప్రభూ! తమోఽరిశిష్య! భాష్యవాగ్విభూతి! రామభూ విభుప్రకీర్తితా! మదాత్మవేదికన్ రహింపుమా 91 (1) అధికమైన భూతప్రేతములవలని భయముల సమూహము అనెడి మేఘము (కేతుభ) లకు వాయువు (అతస) అయినవాడా! ఉ. సంతస మొంది నావుకద సంతతరామపదాబ్జభక్త! యా వంతయు(1) వంత గల్గ రఘువంశమహార్ణవచంద్రు వేఁడ 'నా వంతది (2)' యంచు వచ్చి భయవారణ సేసెడి రామదూత! నీ వంతయుఁ(3) జూచుకొన్నతఱి నంతమె వంతల వం తిఁ కీపయిన్ (4) 92 (1) ఆవగింజ అంత (2) వంతు అది (3) నీవు అంతయు (4) ఇఁక ముందు శ్లో. పతివ్రతాశిరోమణీశిరోమణిప్రదానస మ్భవైకహర్షమానసప్రభుస్తుతం ధృతాచలమ్ ప్రభాతసూర్యగ్రాహకం మరుత్సుతం జితాసురం శనైశ్చరప్రియఙ్కరం నమామి భీతివారకమ్ II 93 ద్విప్రాసకందము కనుమా వినుమా మనుమా యనుమానము లేక స్వాంతమందున; దానన్ జను మా వెత లెల్లను; జే కొనుమా వందనముఁ జేదికొనుమా హనుమా! 94 ఉ. “పంచముఖాంజనేయ” యని ప్రార్థనఁ జేసినఁ జాలు భీతులన్ ద్రుంచుఁ దదాహ్వయంబు తనురోగము లెల్ల హరించు, ధైర్యమున్ నించు మనంబునన్, బలుకు నిశ్చయమైన పటుత్వ మొందు, వా రించును సంకటంబులఁ, దరింపఁగఁ జేయును పంచభూతముల్ 95 చం. పవనకుమారుఁ డల్లదిగొ వంగి నమస్కృతిఁజేసి చూచి తా నవిరళభక్తితోఁ గడిగి యద్దుచు నద్దుకొనంగఁ జక్షురు త్సవముగఁ గంటి దాసజనతాపసమానసవాసభాసుర ప్రవిమలభూమిసూనుకరపల్లవసేవితరామపాదముల్ 96 మ.కో. హృద్యపద్యమె పాద్యమై తరియించు వేళఁ దవార్చనన్ వాద్యముల్ హృదయాన నుండు కవాటముల్; కరతాళముల్ చోద్యమౌ నెద చప్పడుల్; కనుచూపులే కుసుమంబులై సద్య(1)సత్ఫలితం బొసంగ నసాధ్య మున్నె? హరీశ్వరా! 97 (1) వెంటనే పం. సమీరణాంజనాతనూజ! సర్వశాస్త్రకోవిదా! సమస్తఖేదభూతదుష్టశక్తిభీతిభంజనా! తమోఽపహారిపుత్రికేశ! తార్క్ష్యభీమదర్పహా! నమో ధరాత్మజాహృదీశనామగానశేఖరా! 98