ఏల?
కలగనని కనులకు అసలు కళయేల?
కలువ తామరలతో తారతమ్యమేల?
పలుకలేని పెదాలకు సుస్వర పదాలేల?
రాగమాలపించని మౌన విపంచికి తీగలేల?
చెలి లేని చెలిమికి స్నేహపు వలపు పిలుపేల?
కోయిల లేని ఆమనికి అవనిపై ఆగమనమేల?
తావి లేని విరులకు సుందరోద్యానవనమేల?
ఉపయుక్తము కాని సిరులకు భాండాగారమేల?
చిగురించదన్న బ్రతుకుకు మరి చింతనేల?
మోడు బీడు వల్లకాడులతో సరిపొంతనేల?
చీకటి ఎదురు చూడని ఉషోదయమేల?
వెలుగు వైపు పయనించని హృదయమేల?
ఆకలి ఆశించని మృష్టాన్నభోజనమేల?
అన్నార్థి కడుపు నింపని అన్నదానాలేల?
ఆపన్నులనాదుకోని అసురాత్ములకు అధికారమేల?
విపన్నులనాదరించని పిసినిగొట్టుకు స్తితిగతులేల?
భక్తులు ఆర్తిగా పిలిచిననూ పలుకని దేవుడేల?
ముక్తినొసంగని శిలారూపానికి గుడి గోపురాలేల?