జనవరి 19, 2023 న ఆన్ లైనులో జరిగిన వీక్షణం సాహితీ సమావేశం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ముందుగా డా.కె.గీతామాధవి గారు సభకు ఆహ్వానం పలకగా, శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు సభలోని తొలిభాగానికి నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ ఎలనాగ (డాక్టర్ సురేంద్ర నాగరాజు) విచ్చేసారు. "తెలుగు కవిత్వం - అనువాద ప్రాముఖ్యత" అనే అంశం మీద ప్రసంగించారు.
శ్రీ ఎలనాగ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల. మొత్తం రచనల సంఖ్య: 37 (తెలుగులో స్వతంత్ర రచనలు - 16; ఇంగ్లీష్ లో స్వతంత్ర రచనలు - 2). అనువాదాల సంఖ్య: 19 (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి - 10; తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి - 9). ఇంగ్లీష్ లో రాసిన కవితా సంపుటి, Dazzlers కు Ukiyoto Global Publishers వారి Poet of the Year Award - 2023 వచ్చింది. అదే పుస్తకం టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్, జపనీస్ భాషలలోకి అనువదింపబడింది. వీరు ప్రముఖ కవి, అనువాదకులు శ్రీ నాగరాజు రామస్వామి గారికి సహోదరులు.
శ్రీ ఎలనాగ గారు అనువాదానికి సంబంధించిన ఎన్నో అంశాలు చేర్చుకుంటూ విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ప్రతి పదానికి రంగు, రుచి, బరువు ఉంటాయని కవితాత్మకంగా పేర్కొన్నారు. తెలుగులోనూ, ఆంగ్లంలోను సరిసమానమైన ప్రతిభా పాటవాలతో అనేక పదాల్ని ఎలా తర్జుమా చేయాలో వివరించారు. ఒక భాషలోంచి మరొక భాషలోకి అనువాదం చెయ్యాలంటే రెండు భాషల్లోనూ సమాన నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. స్వీయ అనుభవాల నుండి కొన్ని పదాలను, పదబంధాలను, వాక్యాలను ఉదహరిస్తూ వాటి అనువాదానికి తాను పడ్డ కష్టాన్ని వివరించారు. అనువాదానికి, అనుసరణకు, అనుసృజనకు భేదాల్ని పేర్కొన్నారు. దాదాపు నలభై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో అనేక అంశాల్ని ప్రస్తావిస్తూ అనువాద ప్రాముఖ్యాన్ని సునాయాసంగా వివరించారు. మొత్తంగా అనువాదానికి సంబంధించిన ఒక చక్కని తరగతి నిర్వహించినట్లుగా ఉందని సభలోని వారు పేర్కొనడం విశేషం.
తరువాత డా.గీతామాధవి గారు డిసెంబరు నెల కవితా పోటీ విజేతగా ఈ. వెంకటేష్ ను ప్రకటించారు. "బిచ్చవ్వ" అనే కవితకు గాను ఈ బహుమతి లభించింది.
ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనానికి నిర్వహణ బాధ్యత శ్రీమతి ప్రశాంతి రామ్, డా.సంధ్యారాణి కొండబత్తిని, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సంయుక్తంగా చేపట్టారు. ఇందులో భారతదేశం నుండి ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు, వసీరా గార్లతో బాటూ, శ్రీసుధ కొలచన, డా.సంధ్యారాణి కొండబత్తిని, డా. నీహారిణి కొండపల్లి, డా. కె.గీతామాధవి, అపర్ణ గునుపూడి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శారద సాయి, ఈ. వెంకటేష్, మందా వీరాస్వామి గౌడ్, అమ్మాల కామేశ్వరి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి), వెంకటేశ్వర్లు లింగుట్ల, వుండవల్లి సుజాతామూర్తి, మండపాక అరుణ కుమారి, యు.వి. రత్నం, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, డాక్టర్ ఎం. ఎన్. బృంద, ఎస్ రత్నలక్ష్మి, చిట్టాబత్తిన వీరరాఘవులు, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), రవీంద్రబాబు అరవా, సత్య వీణా మొండ్రేటి, దేవి గాయత్రి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మోటూరి నారాయణరావు, జె వి కుమార్ చేపూరి, పొన్నాల ధనమ్మరెడ్డి, శరత్కవి డబ్బీరు వెంకట రమణమూర్తి, డాక్టర్ గడ్డం శాంత కుమారి, డాక్టర్ కోదాటి అరుణ. ఆర్.ప్రవీణ్, మన్నె లలిత, డా. దూత. రామకోటేశ్వరరావు, బొమ్మిడి వినోదరెడ్డి, కలివే నాగేశ్వరరావు మొ.నవారు ఎందరో పాల్గొన్నారు. ప్రశాంతి రామ్, శారద సాయి శ్రావ్యమైన పాటలు పాడి వినిపించారు.
ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, సాహిత్యాభిలాషులు ఎంతోమంది పాల్గొన్నారు. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.