మేటి అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్త - డాక్టర్ సూరి భగవంతం
డాక్టర్ సూరి భగవంతం గారు అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్త మరియు దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. భారతదేశము లోని ప్రసిద్ధ పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా ఉంటూ దాని బహుళార్ధ ఆవశ్యకతలను పూర్తి చేసి అభివృద్ధి చేసి జాతికి అందించిన మేటి శాస్త్రవేత్త భగవంతం గారు. అంతే కాకుండా డి.ఆర్. డి.ఓ రథసారధిగా ఉంటూ దేశమంతటా 17 పరిశోధనా సంస్థలను స్థాపించి భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర ప్రగతి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన శాస్త్రవేత్త సూరి భగవంతం గారు. దాదాపు ముప్పై ఏళ్ళ పాటు నిర్మించిన ఈ సంస్థలే దేశ రక్షణ పరిశోధన ప్రయోజనాలను సమకూర్చాయి.
ఆయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామములో అక్టోబర్ 14, 1909 లో జన్మించారు. స్వగ్రామంలోనే స్కూలు చదువు పూర్తిచేసుకొని హైదరాబాద్ నిజాం కళాశాలలో, ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రములో యునివర్సిటి టాపర్ గా డిగ్రీ అందుకున్నాడు. డిగ్రీతో పాటు అనేక పథకాలు కూడా అందుకున్నాడు. యూనివర్సిటీ లో జరిగిన వ్యాస రచనల పోటీలో ఆయన గెలుచుకున్న బహుమతి ఆయనను సర్ సి వి రామన్ దృష్టిలో పడేటట్లు చేసింది. ఆ విధంగా పాతికేళ్ళ చిన్న వయసులో నోబెల్ బహుమతి గ్రహీత మేటి శాస్త్రవేత్త వద్ద పని చేసే అవకాశం వచ్చింది. అనతి కాలంలో తన మార్గదర్శనంలో డాక్టరేట్లు సాధించే మేటి విద్యార్ధులను రూపుదిద్దారు. ఇది డాక్టర్ భగవతం గారి ప్రతిభా పాటవాలకు నిదర్శనము. కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు. తన మేథో సంపత్తితో, శాస్త్రీయ దృక్పథంతో, ఆలోచనా సరళితో, ప్రయోగశీలతతో సి.వి.రామన్ అభిమానాన్ని చూరగొని ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. భగవంతం గారి మీద సర్ సి.వి.రామన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గార్ల ప్రభావం ఉండేది. దానికి కారణం వీరి ముగ్గురితో ఆయనకున్న అనుబంధమే.
1932లో తన 22వ ఏట భగవంతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర శాఖలో అధ్యాపకులుగా చేరాడు. 28 ఏళ్ల వయసుకే ప్రొఫెసర్ గా పదోన్నతి పొందడం అపూర్వమైన విషయం. అప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన సారథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. భగవంతం గారు బోధనా విధానం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఆయన బోధన అరటి పండు ఒలిచి పెట్టినట్టు ఉండేది. ఆయన క్లాసులు వినడానికి ఇతర శాఖల విద్యార్థులు ఇతర శాఖల అధ్యాపకులు హాజరు అయ్యేవారు. ఈయనకన్నా వయస్సులో పెద్దవారైనా అధ్యాపకులు ఆయన బోధనా పద్ధతులు అనుకరించేవారు అని చెప్పేవారు. ఇంత సామర్థ్యం ఉండబట్టే 32 వ ఏట ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రిన్సిపాల్ గా బాధ్యత తీసుకున్న సమయములోనే స్వాతంత్రోద్యమము ఒక వైపు విద్యార్థుల అలజడి, మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వంటి తీవ్ర సమస్యల మధ్య ప్రిన్సిపాల్ గా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు భగవంతం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన నాలుగైదు సంవత్సరాల్లో భౌతికశాస్త్ర శాఖలో 12 మందికి డాక్టరేట్ డిగ్రీ లభించడం ఆయన కృషికి నిదర్శనం. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం వాతావరణం పూర్తిగా మారిపోయి, పరిశోధనల దిశగా సాగింది.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు శాస్త్ర సలహాదారుడిగా ఉంటూ విశేష కృషి చేసి జాతీయ భావాలను పెంపొందించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1948-49 లో ఒక సంవత్సరం పాటు లండన్లోని భారత రాయబారి వి.కె. కృష్ణ మీనన్ కార్యాలయంలోని వైజ్ఞానిక సలహాదారుగా పనిచేసారు. ప్రముఖ విదేశీ శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వానికి దేశ రక్షణ కోసం కావాల్సిన సామాగ్రిని దిగుమతి చేసుకోవాలని సలహా ఇస్తే ఆ సలహాను సున్నితముగా తిరస్కరించి జాతీయ పరిశోధనా సంస్థలను స్థాపించి రాడార్లు మిలిటరీ వాహనాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వనరులను అభివృద్ధి పరిచిన ఘనత సూరి భగవంతం గారిది. ఆయన డి.ఆర్.డి.ఓ కు నేతృత్వం వహించిన 9 సంవత్సరాల కాలంలో మిస్సైల్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఏరో ఇంజన్స్ కంబాట్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్ ఫెర్ సిస్టమ్స్ మొదలైన వాటిని అభివృద్ధి చేసి ఉద్యోగులకు శిక్షణ ఇప్పించి సాంకేతిక నైపుణ్యత అభివృద్ధి చేశారు. 1961 లో క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే బృహత్తర గ్రంథ రచన చేసి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్ అధ్యక్షులుగా సి.వి. రామన్ పరిశోధించిన రామన్ ఎఫెక్ట్ అంశం మీద ప్రామాణిక పరిశోధనలు చేసిన అద్వితీయ శాస్త్రవేత్తగా కీర్తి గడించారు. రామన్ ఎఫెక్ట్, క్రిస్టల్ స్ట్రక్చర్ మొదలగు అంశాల మీద అవిశ్రాంత పరిశోధనలు జరిపి గ్రంథ రచనలు చేశారు. సర్ సి వి రామం భగవంతం గారి పుస్తకానికి ముందు మాట రాస్తూ భగవంతం గారిని భౌతిక శాస్త్రములో అగ్రగామి పరిశోధకుడిగా పేర్కోన్నారు. ఆయన గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలుగా గుర్తింపబడి ఇతర భాషలలోకి అనువదింపబడ్డాయి. పలు యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి.
జీవితపు చివరి రోజుల్లో కొంత కాలం సత్య సాయిబాబా దగ్గర ఉన్నారు. అప్పట్లో బాబా గారి తెలుగు ప్రసంగాలకు తక్షణమే ఆంగ్ల అనువాద ప్రసంగాలు చేసేవారు. అనేక సామాజిక కార్యమ్రాలను స్వచ్ఛందంగా చేపట్టారు. ఫిబ్రవరి 6, 1989 లో స్వర్గస్తులైన సూరి భగవంతం ఓ మేటి ఆచార్యుడిగా, భౌతిక శాస్త్రవేత్త గా, పరిపాలనా దక్షుడిగా వ్యవహరించి ఉన్నత ప్రమాణాలు గల సంస్థల నెలకొల్పనకూ, వ్యవస్థీకరణకు మిక్కిలి కృషి చేసి అనేక క్షేత్ర విజయాలకు కారకులయ్యారు. 2009లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన జయంతి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఆయనతో ప్రగాడ అనుబంధం ఉన్న సంస్థలు డి ఆర్ డి ఓ, ఎన్ జి ఆర్ ఐ సమిష్టిగా శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించాయి. డాక్టర్ సూరి భగవంతం గారు నిస్వార్ధ దోరణితో చేసిన అవిరళ కృషి అందరికీ మార్గదర్శం. వారి మార్గదర్శకత్వం లో రూపొందిన అగ్రగామి శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు దేశానికి సేవలు అందిస్తున్నారు. ఆయన కుమారుడు సూరి బాలకృష్ణ కూడా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త.