పద్మనాయక – రెడ్డిరాజుల యుగం
భాస్కర రామాయణ కవులు-రామాయణ విశేషాలు
భారతీయ సాహిత్యంలో ఆదికవి వాల్మీకి ఆదికావ్యం రామాయణం అయితే తెలుగు సాహిత్యంలో పద్యకావ్యంగా వెలసిన మొట్టమొదటి రామకథ భాస్కర రామాయణం.
ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో పలువురు భాస్కరులు ఉన్నారు. అందువల్ల భాస్కర రామాయణ కర్త ఎవరు అనేది నిరూపించగలిగిన ఒక బలమైన సాక్షం భాస్కర రామాయణం లోని యుద్ధకాండ. అందులో చివరి పద్యంలో కవి ఇలా చెప్పారు.
“అమర హుళక్కి భాస్కర మహాకవి చెప్పగనున్న యుద్ధ కాండ.’ ఈ పద్యం వల్ల హుళక్కి భాస్కరుడు యుద్ధకాండలో కొంత భాగం చెప్పినట్లు తెలుస్తున్నది. ఇంతమటుకే మనకు దొరికే ఆధారం. ఎందుకంటే అన్ని కృతుల వలె భాస్కర రామాయణానికి అవతారిక లేదు. గద్యాలు ఒక్కో కాండంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ రెండూ ఉన్నప్పుడు కవి ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. అందుకని పై పద్యంలో ఉన్న “హుళక్కి భాస్కర మహాకవి చెప్పిన ....” అన్న వాక్యమే ఏకైక సాక్ష్యం.
భాస్కర రామాయణం లోని గద్యలను బట్టి ఈ కావ్యాన్ని నలుగురు వ్రాసినట్లు తెలుస్తున్నది. వారు
- హుళక్కి భాస్కరుడు – అరణ్య కాండం, యుద్ధ కాండంలో కొద్దిగా వ్రాశాడు.
- మల్లికార్జున భట్టు – ఇతడు హుళక్కి భాస్కరుని కుమారుడు. యితడు బాల కిష్కింధ, సుందర కాండలను వ్రాసినట్లు తెలుస్తున్నది.
- అయ్యలార్యుడు – ఇతడు భాస్కరుడు వదిలిపెట్టిన యుద్ధకాండను పూర్తి చేశాడు.
- కుమార రుద్రుడు – అయోధ్య కాండ రచించాడు.
రచనా విధానం: స్థూలంగా భాస్కర రామాయణ రచన ఎలా సాగిందో తెలుసుకోవాలి. ఆరుద్ర మాటల్లో
“సాహిణి మారన భాస్కర బృందం చేత రామాయణం వ్రాయించినా, కృతి అందుకునేలోగా మరణించాడని అందుకే అటువంటి గద్యలు, అవతారిక లేని గ్రంథం, అనంతర కవుల రామాయణ రచనల లోని అసంఖ్యాక మయిన సంకీర్ణ పద్యాలు మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయని మనం అనుకోవాలి” (స.ఆం.సా పేజి 487).
సాహిణి మారన ఎవరు?
32 మంది మంత్రుల యొక్క ఘనతను శ్లాఘించే ఒక సీసమాలిక ఆంధ్రదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. అందులో ఒక పాఠంలో “కొనియె భాస్కరు చేత తెనుగు రామాయణం బారుఢి సాహిణి మార మంత్రి” అని ఉంది. అంతేగాక అయోధ్యకాండ రచించిన కుమార రుద్రదేవుడు సాహిణి మారన కుమారుడు. ఈ విషయాన్ని ఒక శాసనం తెలుపుతున్నది. ఆ శాసనం గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కోటనేమలి పురం లో దొరికింది. దీనికాలం క్రీ.శ. 1311. దీనిని వ్రాయించిన వాడు మారాయ సాహిణి రుద్ర దేవం గారు. యితడు ప్రతాపరుద్రుని సామంతుడు. అరవై ఊర్లకు అధికారి. అయితే భాస్కర రామాయణం వ్రాయమని చెప్పిన సాహిణి మారన ఇతడేనా అని ఆరుద్ర అనుమానం. ఆరుద్ర మాటల్లో “కాకతీయ మహా సామ్రాజ్యానికి పాలకుడైన ప్రతాపరుద్రుని పోషణలో ఉండే హుళక్కి భాస్కరుడు అరవై గ్రామాలకు మాత్రం ఏలికగా ఉండే సాహిణి మారనకు ఇంత గొప్ప గ్రంథం అంకితమిస్తాడా? (స.ఆం.సా పేజి 488).
అటు తర్వాత దీనిని గూర్చి ఆరుద్ర భాస్కరుని పేర ఈ గ్రంథం ఎందుకు వెలువడింది? మొదలైన విషయాలు కొంత చర్చించారు.
రామాయణ రచనా విశేషాలు:
హుళక్కి భాస్కరుడు అరణ్యకాండ తోనే రచన ప్రారంభించాడని చెప్తారు. అతని తొలి పద్యం, తర్వాత కవులకు ఎలా దారి చూపించిందో ఆరుద్ర మాటల్లో –
“తెలుగు సాహిత్యంలో ఈ పద్యం పుట్టాక ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చూచారని వర్ణిస్తే ‘అటజని కాంచె’ అనే మాటలు వస్తే ఈ శబ్దాలంకారం వాడడం ఒక ఫేషనయింది.”
భాస్కరుని తర్వాత ఈ రామాయణం లోనే కుమార రుద్రుడు “అటజని కాంచిరంత ...” అంటూ అయోధ్యా 287 వ పద్యంలో వాడాడు. ఇంతకు భాస్కరుని పద్యం చెప్పలేదు-
“పుణ్య చరిత్రు డత్రి ముని పుంగవు వీడ్కొని....
కాంచె దండకారణ్యము...పూర్ణ సరోవరేణ్యమున్”
అటు తర్వాత ఈ రకం పద్యాలను ఎర్రన, నాచన, సోముడు, జక్కన, అల్లసాని పెద్దనాధులు వ్రాసి ప్రజలను మెప్పించారు.
హుళక్కి భాస్కరునిది ప్రౌఢ కవిత్వమని విమర్శకుల మాట. రావణుని చేత జిక్కిన సీత యొక్క వ్యధను, హాహాకారాలను భాస్కరుడు జటాయువు నోట 17 కందపద్యాలలో పలికించాడు. అన్నీ గొప్పవే.
రాముని మానసిక వ్యధను దెల్పే పద్యాలలో ఒక పద్యం ప్రశ్నలు జవాబులతో కూడి ఉండడం ఒక ప్రత్యేకత.
“ఏమ్మెట్టియది మెట్టుగాదిది వనం బేరాకుమారుండనో సౌమిత్రీ? విను నీవు రాముండవే వత్సా నిక్కమేరాముడన్ భూమీశుండవు రామచంద్రుడవు హా భూమీజ చంద్రాననా ....” ఇలా సాగింది ఈ పద్యం.
మాయలేడిని గూర్చి హుళక్కి భాస్కరుడు గొప్పగా ఊహించి వ్రాశాడు. “నెలలోని యిర్రికి నీలకంఠుని చేత బొలుపారు లేడికి బుట్టెనొక్కో ...”
“ఇసుము (ఇసుక) చల్లినరాలని ఘోర కాననము” “నిప్పు చెదలంట నేర్చునే” మొదలైన జాతీయాలు, సామెతలు చక్కగా వాడాడు. భాస్కరుని రచనను గూర్చి చెప్తూ “ఇతనికి విస్ఫులింగములు అనే మాట వాడడం సరదా. ఇది అరణ్యకాండ లో ఎన్నిసార్లు వాడారో శిష్టా రామకృష్ణ శాస్త్రి గారు ఇలా లెక్క వేశారు! (ఆంద్ర వాఙ్మయ సర్వసము)” అని వాటిని ఆరుద్ర తన రచనలో తెలిపారు. ఒక వాక్యాన్ని గూర్చి అంత వివరంగా పరిశోధన జరిపిన శాస్త్రి గారికి, ఆయన శ్రమను పదిమందికి తెలియపరుస్తూ పరిశోధనాత్మక రచనకు సాటిలేదని నిరూపించిన ఆరుద్ర గారికి శతకోటి నమస్సులు కూడా తక్కువే. ఈ వాక్యమే యుద్ధకాండ పూర్వభాగం లోనూ సుందరకాండ లో కూడా ఉండడం వల్ల సుందరకాండ కూడా భాస్కరుడే రచించాడా అనిపిస్తున్నది అని అంటారు ఆరుద్ర. సుందర కాండను తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వ్రాశారేమో అని చదువరులు అనికోవడానికి వీలున్నది దీనివల్ల.
మల్లికార్జునుడు తండ్రికి సరితూగే రచన చేశాడని చెప్పవచ్చు. రాజులు ఆనాడు ఎన్ని రకాల వేటలు ఆడేవారో ఇతడు తెల్పాడు.
వీరిద్దరితో సాటిరాక పోయినా కుమార రుద్రుడు కూడా మంచికవే అన్నారు ఆరుద్ర. అయ్యలార్యుని కవిత్వం అక్కడక్కడా ఔచిత్యలోపంతో కనపడుతుంది. అయ్యలార్యుని రచనలో యుద్ధానంతరం రాముడు సీతను ఎలా అన్నాడో చూడండి.
“భరత లక్ష్మణ శత్రుఘ్న తరణి సూను
వాలినందన దానవ వరులలోన
నీ మనంబున నెవ్వడో నెరి ప్రియుండు
వాని జేకొను మిప్పుడు వనిత యనిన.
ఇతను ఒకరకంగా గొప్ప కవి. మరి ఇలాంటి పద్యాల వల్ల కొంత లోపం ఏర్పడిందనవచ్చు. ఇతని పద్యాలను అనుకరిస్తూ పోతరాజు వ్రాయడం కూడా జరిగిందని ఆరుద్ర తెలిపారు. (స.ఆం.సా. పేజీలు 500-01).
పేరు:
భాస్కర రామాయణం అని హుళక్కి భాస్కరుని పేరున దీనికి పేరు రావడంలోని అంతరార్థాన్ని గూర్చి ఆలోచించినట్లైతే రాముని జీవితంలో, అలాగే రామాయణంలో అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన సమయం అరణ్యవాసమే. అందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భాస్కరుడు అరణ్యకాండ నిర్వహణా భారాన్ని స్వీకరించాడు. చక్కగా తన కవిత్వ పటిమను నిరూపించుకొన్నాడు. వయస్సులో కూడా పెద్దవాడై ఉండవచ్చు. కాబట్టి అతని పేర రామాయణం వెలసిందని చెప్పవచ్చు.
రామాయణం పుట్టుక:
భారత దేశపు పవిత్ర గ్రంథాలలో వాల్మీకి రామాయణం ఒకటి. అయితే ఈ రామాయణాన్ని వాల్మీకి ఎక్కడ ఎలా రచించాడు? ఇతర దేశాలలో రామాయణ కథలున్నాయా అని ప్రశ్నించుకొంటే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద రామాయణానికి మూలం ఎక్కడ అనే ప్రశ్నకు ఆరుద్ర ఇచ్చిన వివరణలోని సారాంశం క్లుప్తంగా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది.
- రామాయణం గాథ ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, మల్లాది వెంకటరత్నం గారి సమాధానం – రాముడు ఈజిప్ట్ మహా ప్రభువు. వాల్మీకికి నారదుల వారు చెప్పిన కథ కాదు. ఈజిప్టును పరిపాలించిన థామ్సన్ అనే మహానుభావుని చరిత్ర. దానిని మన వాల్మీకి తీసుకొని హిందువుల పేర్లతో రచించాడు. ఇది వెంకట రత్నం గారి వాదన. వెంకట రత్నం రచించిన గ్రంథం ‘రామా ది గ్రేటెస్ట్ హీరో అఫ్ ఈజిప్ట్.’ ఇది ఇంగ్లీషులో వ్రాయబడిన గ్రంథం.
- భారతీయ ఇతిహాసాలపై ఎ.డి. పుసాల్కర్ గారు చేసిన పరిశోధనలను భారతీయ విద్యాభవన్ వారు ప్రచురించారు. అందులోని సారాంశం- విదేశాలలో రామాయణ కథలకు మన రామాయణానికి సంబంధమే లేదు. మలయా దేశపు ముస్లింలు వారి కనుగుణంగా రాసుకొన్నారు. చైనా మొ|| దేశాల కథలు వారి వారి దేశానికి తగినట్లు వ్రాయబడినవే. కుప్పుస్వామి శాస్త్రి పరిశోధక సంస్థ ప్రచురించిన ఒక పత్రికలోని వ్యాసం వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. దీనిలోని కథ ప్రకారం సీత రావణాసురుని కుమార్తె. రాముడు వానరుడుగా మారడం; అప్పుడు ఆయనకు హనుమంతుడు పుట్టడం ...ఇలా సాగుతుంది లావోస్ రామాయణం. అయితే లావోస్ రామాయణాన్ని వాల్మీకి మార్చాడా? లేక మన రామాయణాన్ని లావోస్ వారు మార్చారా? అన్న ప్రశ్న వల్ల మల్లాది వెంకటరత్నం గారి వాదనను సులభంగా కొట్టిపారెయ్యలేము అని అన్నారు ఆరుద్ర. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటి ప్రశ్నలకు తన కల్పవృక్షంలో కొంత సమాధానం చెప్పారని అనుకోవచ్చు.
ఆధ్యాత్మిక రామాయణం, శ్రీనాథుడు క్రీడాభిరామంలో చెప్పిన విద్దికూచి రామాయణం స్త్రీలు పాడుకొనే రామాయణ రచనలు. వీటిని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఒకవేళ కాకతీయ యుగంలో ప్రచారంలో ఉండిన ఆట రామాయణం (ఇది ఒక ప్రక్రియ) నుంచో ఆడవాళ్ళు పాడుకునే రామాయణం నుంచో ఈ భాస్కర రామాయణ కవులు ఈ కూర్పులను స్వీకరించియుంటే వాళ్ళను అభినందించాలి. వాల్మీకి పట్ల భక్తితో పాటు తెలుగు తల్లులకు కూడా గౌరవమిచ్చిన ఈ భాస్కర కవులు ప్రశంసనీయులు. (స.ఆం.సా. పేజీలు 501-05).