కుచేలుడు శ్రీకృష్ణుడికి బాల్యం నుంచీ స్నేహితుడు. ఒకే గురుకులంలో సాందీపని అనే గురువు దగ్గిర చదువుకున్నవాడు. అయితే అనేక కారణాల వల్ల దరిద్రుడిగానే కాలం వెళ్ళదీస్తున్నాడు. ఎంత దరిద్రం ఉన్నా భగవంతుణ్ణి మర్చిపోలేదు. చాలాకాలం వేచి చూసాక భార్య గొడవపడలేక కృష్ణుణ్ణి చూడ్డానికి బయల్దేరాడు. ఏమీ లేదు కూడా తీసుకెళ్ళి ఇవ్వడానికి. అందువల్ల ఉన్న రెండు గుప్పిళ్ళ అటుకులు మూట కట్టుకుని బయల్దేరాడు. దరిద్రం ఎంతటి పనికి ప్రేరేపిస్తుందో చెప్పడానికిదో ఉదాహరణ. కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్తే ఆయనే బయటకొచ్చి కాళ్ళు కడిగి తన భవనంలోకి తీసుకెళ్ళి సమస్త ఉపచారాలు చేసాడు. ‘ఓహో ఈయన ఎవరో చాలా గొప్పవాడై ఉంటాడు, లేకపోతే సాక్షాత్తూ పరమేశ్వరుడైన కృష్ణుడు ఈయన కాళ్ళు కడగడం ఏమిటీ,’ అంటూ ఆశ్చర్యపోతారు రుక్మిణితో సహా అందరూ కూడా. కృష్ణుడు వాళ్లకి ఈయన నా బాల్య స్నేహితుడు అని పరిచియం చేసాక నాకేం పట్టుకొచ్చావు అని అడిగితే కుచేలుడికి నోటమ్మట మాట రాదు. తనని అంత ఘనంగా చూసిన రారాజు కృష్ణుడు. అటువంటివాడికి ఇచ్చేది అటుకులా? తనలో తాను కుచించుకుపోతే కృష్ణుడే ఆయన దాచుకున్న అటుకులు తీసుకుని నోట్లో వేసుకుంటాడు.
ఆ తర్వాత చేతిలో పైసా కూడా పెట్టకుండా బయటకి పంపుతాడు కుచేలుణ్ణి. వఠ్ఠి చేతులతో వెనక్కి వచ్చే దారిలో కుచేలుడు తనకి జరిగినదంతా గుర్తు చేసుకుని తనలో తాను ఏమనుకుంటున్నాడో చెప్పేదే ఈ నెల కుచేలోపాఖ్యానంలోని పోతన పద్యం. పోతన వాడిన పదాలు జాగ్రత్తగా గమనించండి.
ఉ.
న్నీని తెఱంగు గానఁబడె; నెన్న దరిద్రుఁడు సంపదంధుఁడై
కానక తన్నుఁ జేరఁ డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే? [10.2.1019]
శ్రీనిధి (శ్రీ అంటే సంపద, నిధి – మూలమైనవాడు – లక్ష్మీపతి లేదా కృష్ణుడు) నన్ను బాగా చూసాడు సరే (యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ). కుచేలుడు ఎందుకొచ్చాడు అసలు? నోరు విప్పి అడగలేదు కానీ వచ్చినదే ధనం కోసం, తన దరిద్రం తీరడం కోసం. అందువల్ల ఆయన మనసులో భగవంతుడు ‘శ్రీనిధి’ గానే ఉన్నాడు. ఆలోచనలు డబ్బు గురించే అన్నట్టూ. ఇంతచేసినా తనకి డబ్బేమీ ఇవ్వలేదు (విత్తమేమియున్నీని తెరుంగు). ఎందుకంటే ఈ దరిద్రుడు (అంటే తాను కుచేలుడు) డబ్బులిస్తే దానివల్ల కళ్ళు మూసుకుపోయి (సంపదంధుడై కానక) నన్ను మర్చిపోతాడని (తన్ను జేరడనికాక) అనుకుని ఉంటాడు. లేకపోతే శ్రితార్తి హరుండు (శ్రిత – ఆశ్రయించినవారిని ఆర్తి – దు:ఖాలని, హరుండు - పోగొట్టేవాడు), సత్కృపాంభోనిధి (మిక్కిలి దయ గలిగిన భగవంతుడు) నాకు అన్ని సంపదలూ ఇచ్చి ఉండేవాడు కదా (సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే)? ఈ పద్యంలో పోతన విష్ణువుని సందర్భానుసారంగా శ్రీనిధి, శ్రితార్తి హరుండు అని ఎందుకన్నడో అర్ధమైంది కదా? కుచేలుడి మనఃస్థితి అది.
అయితే ఆయన ఇంటికి వచ్చేసరికే కృష్ణుడు ఆయనని అప్పటికే సర్వవస్తుపరిపూర్ణునిగా చేసాడని తెలుస్తుంది. ఇటువంటి ఆలోచనలు గలవాడు కనకే తనకి అలా సంపద లభించినా అంతా పట్టించుకోక భగవంతుడి మీద మనసు నిలిపి చివరవరకూ బతుకుతాడు కుచేలుడు. ఇందులో మరో రెండు విషయాలు చూద్దాం. మొదటిది, ఇంతటి సంపద వచ్చాక గర్వం వచ్చి భగవంతుణ్ణి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగేదే. అయితే కుచేలుడు ఏమనుకుంటాడంటే, “నేను లేశమాత్రంగా ఇచ్చిన అటుకులే కోటి రెట్లు అనుకుంటూ తీసుకుని నన్ను ధనవంతుణ్ణి చేసాడు కృష్ణుడు. తాను వేసుకున్న చిరిగిపోయిన బట్టలన్నింటినీ చూసినా నన్ను తీసుకెళ్ళి కాళ్ళు కడిగి, మంచి భోజనం పెట్టి ఆదరించాడు హంతూలికా తల్పంమీద. తాను తీసుకెళ్ళిన అటుకులు తీసుకుని తనని ధనవంతుడిగా చేయడం ఆయనకున్న నిర్హేతుకమైన దయ తప్ప మరోటి కాదు. అందువల్ల గోవిందుడి పాదాలు నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి.” ఇలా అనుకుంటూ ఆయన భక్తితో జీవితం గడిపి సంసారం లోంచి బంధనాలు తెంచుకుని పరలోక ప్రాప్తి పొందాడు. రెండో విషయం భగవంతుడికి మనం ఏమిచ్చాం అన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు. ఏది ఇచ్చినా అది ఇచ్చేటపుడు మన మనఃస్థితి ఎలా ఉందనేది ముఖ్యం. ఇదే మనం భగవద్గీతలో చూడవచ్చు – కృష్ణుడు చెప్పిన విషయమే.
తదహం భక్త్యు ప్రహృతం అశ్నామి ప్రియతాత్మనః [భగవద్గీత 9-26]
ఇచ్చేది పళ్ళు, పుష్పాలు, పత్రాలు ఆఖరికి నీళ్ళైనా సరే అది ఫలాపేక్షలేకుండా ఇస్తే భగవంతుడు తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడనేది కూడా చెప్తున్నాడు – ఆశ్నామి ప్రియతాత్మనః (ప్రీతితో స్వీకరిస్తాట్ట). నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా అనే బేర సారాలు వద్దు. నా దగ్గిర ఉన్నది ఇదే, దయచేసి తీసుకో, అంతే. నువ్వేం ఇస్తావు నాకు అనే ప్రశ్నే వద్దు. ఏమిస్తాడో ఆయనిష్టం. ఏమీ ఆయన ఇవ్వకపోయినా అది కూడా ఆయన ఇష్టమే. అలా భగవంతుణ్ణి మనసులో ఉంచుకున్న నాడు మనకి కావాల్సినదేమీ ఉండదు. కోరికలనేవి అలా అంతరించగానే కలిగేది ముముక్షత్వం. ఆ తర్వాతది భగవంతుణ్ణి చేరుకోవడం. అంతకన్నా కావాల్సిందేవుంటుంది?
చదువుతుంటే అమృతం తాగినట్లు ఉంది. నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏