Menu Close
తెలుగు పద్య రత్నాలు 21
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం మరోసారి పోతన మహాభాగతం లోనిదే. పరిక్షిత్తుకి శాపం ప్రకారం వారం రోజులలో చావు రాసిపెట్టి ఉంది. కాలూ చేయీ ఆడని స్థితిలో ఏమి చేయాలో తెలియనపుడు శుకమహర్షి వచ్చాడు. “ఇంకా వారం ఉంది కదా, ఈ లోపున భగవంతుడి గురించి వింటూ ఆయననే తలుచుకుంటూ ఉంటే చావు నిన్నేం చేయగలదు?” అని చెప్పి భాగవతం కధ చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపు పది స్కంధాలలో విష్ణువు అవతారాలు చెప్పాక కృష్ణావతారం మొదలుపెడుతూ చెప్తున్నాడు ఎల్లవేళలా ఎలా భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలనేది.

ఎందుకు అంతలా గుర్తుంచుకోవడం? ఎందుకంటే పోయే ముందు మనసులో ఏ రూపం మెదులుతుందో అదే వచ్చే జన్మలో సంప్రాప్తమౌతుంది కనక. జీవితాంతం బంధువులూ, స్నేహితులూ అంటూ పరుగులు పెడుతుంటే పోయేటపుడు భగవంతుడు ఎందుకు, ఎలా గుర్తొస్తాడు? అందుకే జపం, పూజా పునస్కారాలనేవి క్రమం తప్పకుండా అలా చేస్తూనే ఉండాలి. అదృష్టం కొద్దీ మనకి భగవంతుడు గుర్తొస్తే మంచిదే. కానీ కంచెర్ల గోపన్న పద్యంలో చూసాం కదా, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చినవేళ అంటూ చెప్పడం? అలా యముడి భటులు మన గుమ్మంలోకి వచ్చినప్పుడు మనకి గుర్తొచ్చేది భగవంతుడా లేక విపరీతమైన భయమా? ఎలాగో ఒకలాగ భగవంతుడి బొమ్మ చేత్తో పట్టుకునో, ఎదురుగుండా ఉంచుకునో కళ్ళు తెరిచి ఎప్పుడూ ఆయనని చూస్తూ గుర్తుపెట్టుకున్నాం. కానీ చివర్లో పోయేటపుడు కళ్ళు మూతలు పడిపోయాయి. అప్పుడు భగవంతుడు గుర్తున్నాడా? ఉంటే ఎలా గుర్తు ఉన్నాడు? అదే ఈ పద్యంలో చెప్తున్నాడు శుకమహర్షి.

చ.

గుమొగమున్‌ సుమధ్యమును ల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
గతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌. [పోతన భాగ. 11-124]

నవ్వు మొహము, చక్కని నడుము (సుమధ్యము), నల్లని శరీరం, లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము (లచ్చికాటపట్టగు నురమున్‌), పెద్ద బాహువులు, అందమైన కుండలాలు కల చెవులు (అంచిత కుండలకర్ణముల్), గజగమనము (మదేభగతియు – మద+ఇభ+గతి = మదించిన ఏనుగు వంటి నడక), నల్లనిజుట్టు (నీలవేణి),  దయారసం చిందే చూపు కలిగిన (గృపారసదృష్టియు గల్గు) విష్ణుమూర్తి (వెన్నుడు) నేను కనులు మూసినపుడు తెరచినపుడు నాకు పొడచూపు గాక.

గమనించారా? కళ్ళు మూసినప్పుడు, తెరిచినప్పుడు కూడా భగవంతుడు గుర్తుండాలి. దీని అర్ధం ఏమిటంటే మనసులో ఎప్పుడూ భగవంతుడే ఉన్నప్పుడు చావొచ్చినా సరే భయం అక్కర్లేదు. ఎన్ని తప్పులు చేసినా భగవంతుడంటే ఎలాంటివాడో చెప్పాడు కదా గోపన్న - దాశరధీ కరుణాపయోనిధీ అంటూ? కృపారస దృష్టియు కల్గి అంటే ఇదే. భగవంతుడి రూపులో తల నుంచి పాదాలదాకా ఎప్పుడూ అలా ఆయన గురించి ఆలోచిస్తూనే ఉంటే ప్రాణం పోయేటపుడు కూడా ఆయన గుర్తు రావడానికి అవకాశం ఉంది కదా. అందుకే చెప్తున్నాడు శుకమహర్షి – తాను చెప్పే కధలో ఇరుక్కుపోయి చివరకి కధ ఏమౌతుంది అనేది ఆలోచించక - భగవంతుణ్ణే మనసులో పెట్టుకో అని.

కృష్ణావతారం గురించి ఒకసారి చెప్పుకుందాం. రామావతారంలో రాముణ్ణి చూడగానే ఎవరికీ ఇంకేమీ గుర్తుండేది కాదుట. రాముడు ఎలా ఉండేవాడు అనేది చెప్పడానికి వాల్మీకి ఏమంటారంటే, రామో విగ్రహాన్ ధర్మః – ధర్మం పోత పోసిన విగ్రమే రాముడు.  దశావరాతాల్లో రామావతారం వచ్చేసరికి జీవులు జలచరంగా పుట్టి నీటిలోంచి (మత్స్యావతారం) బయటకి వచ్చి భూమ్మీద రూపాంతరం చెందుతూ, కోపం వదిలేసి (పరశురామావతారం) శాంతమూర్తిగా మారాడు. అందుకే త్యాగరాజు ‘పరమశాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల జగదానందకారకా’ అంటాడు రాముణ్ణి. ఆ తర్వాతది కృష్ణావతారం. ఈ అవతారంలో కృష్ణుణ్ణి చూస్తే ఎవరికీ అసలు తామేమిటో, తామెక్కడున్నారో అనే ఊహే లేక వళ్ళు మైమర్చిపోయేవారుట. గోపికలకి, యాదవులకీ కూడా జరిగినది అదే. అలాగే రామకృష్ణ పరమహంస దగ్గరకి వెళ్తే కనిపించేది ఏమిటంటే వంటిమీద బట్టలు ఉన్నాయో లేదో అనే ఊహే ఉండేది కాదుట ఆయనకి ఎందుకంటే ఆయనుండేది మరో అద్భుతమైన స్థితిలో. జయదేవుడి అష్టపదుల్లో కూడా మనం వినేది అదే – తవ విరహే కేశవా అంటూ. యోగమార్గంలో ఒక స్థితి చేరుకున్నాక మనసు భగవంతుడి గురించి తప్ప మరేమీ వినాలని కోరుకోదు అంటారు రామకృష్ణులు. భగవంతుడి నుంచి దూరంగా వెళ్తే కలిగే విరహం ఎలా ఉంటుందనేది అష్టపదుల్లో తెలుస్తూ ఉంటుంది.

ఇంత ఎందుకు చెప్తున్నారంటే పరీక్షిత్తు పుట్టడమే ఓ వింత. పుట్టాక కృష్ణుడు వచ్చి బతికించకపోతే ఏమై ఉండేవాడో? ప్రాణం లేకుండా పుట్టిన నిన్ను బతికించిన భగవంతుడి కంటే ఈ స్థితిలో – అంటే వారం రోజులలో చావురాబోయే - నువ్వు ఎవర్ని గుర్తు పెట్టుకోవడం మంచిది? అందువల్ల కళ్ళు మూసినా తెరిచినా భగవంతుణ్ణే గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. భగవంతుణ్ణి ఎలాంటి రూపుతో గుర్తుపెట్టుకునేది? మనసులో ఆనందం కలిగించే రూపుతో - నవ్వు మొహంతో అద్భుతంగా ఉన్న కృపారసంతో ఉంటే భగవంతుణ్ణి తల నుంచి పాదాలదాకా తలుచుకుంటూ ఉండాలి. ఇదే “కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్థుభం….”  అనే శ్లోకంలో కూడా తల నుంచి పాదాలదాకా వివరిస్తూ చెప్పేది. దాదాపు ఇటువంటి శ్లోకమే రాముడి మీద కూడా రాసాడు పోతన. అది ముందు ముందు చూద్దాం.

 

****సశేషం****

Posted in March 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!