Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. సొంత సుఖము చూసుకుంటే, పనికిరారు ఎవ్వరికి!
    పరుల సుఖము కోరుకుంటే, ధన్యజీవులెన్నటికి!!
  2. ప్రతిఫలమును కోరకుండగ, బ్రతుకు తరువే ధన్యము!
    దోచుకుంటే పరుల ధనము, బ్రతుకున మిగులు శూన్యము!!
  3. నైతిక విలువలు కొరవడిన, బ్రతుకులు గాడి తప్పును!
    వ్యక్తి పద్ధతిగ బ్రతికితే, సంఘము గౌరవించును!!
  4. మనుషులు దూరమైనపుడే, మనసులు దగ్గరవునులె!
    కోల్పోకనే విలువనెరిగి, నిలుపుకొనుము బంధములె!!
  5. దుఃఖము అనుభవించవలె, ఒంటిరిగానె యెప్పుడు!
    సుఖమును పంచుకోవలెలే, పదిమందితోనెప్పుడు!!
  6. నమ్మినవారినే మనుజుడు, వెన్నుపోటు పొడుచునుగ!
    జంతువైనను సాకినచో, విశ్వాసము చూపునుగ!!
  7. ప్రణాళికలు లేని యోజన, నడిసంద్రంలో నావ!
    వ్యాపకమన్నది లేకుంటే, బ్రతుకొక చిల్లుల పడవ!!
  8. జ్ఞానము లేని వాడినెపుడు, పండితునిగ చూడకుము!
    మాయల ఫకీరులనెపుడూ, దైవములని తలచకుము!!
  9. నలుగురితో కలిసి నడచుట, నాయకత్వ లక్షణము!
    తానడిచినదె దారియనుట, అవివేకుల లక్షణము!!
  10. కులమత వర్గములు మనిషే, సృజన చేసేను నాడు!
    జాతిని కాల్చు నిప్పులవని, తెలిసి వగచేను నేడు!!
  11. దేశ భాషలన్నిటియందు, తెలుగు భాషే మధురము!
    భాషలెన్ని నేర్చుకున్నను, మాతృభాష మరువకుము!!

**** సశేషం ****

Posted in April 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!