రావమ్మ తెలుగు యుగాదమ్మ రావమ్మా
శ్రీకర శుభకర శాంతులతో రావమ్మా
గతమంత కరోనాల కలవరింత
బ్రతుకు విలువెంతో తెలిసె కొంత
ఎంత డబ్బు దర్పము బలములున్న నేమని
మనిషి జీవితం శాశ్వతం కాదని కాదని
మనిషికి తెలిసేను కరోనా తెలిపేను
ప్రకృతియే గొప్పని తెలిసేను తెలిపేను
ఆరు రుచులు సరిపోక ఆశపెరిగి
స్వార్థమనెడి ఆ రుచి మరిగి మరిగి
డబ్బు డబ్బను జబ్బుతో గబ్బు గొట్టి
మానవత్వం మరిచిపోతున్న మనిషికి
పరులసేవే పరమావధి యని
ప్రకృతి రక్షణే పరమార్థమని
శిశిరం రాల్చిన కొమ్మలకు చివురులిచ్చి
చితికిన బ్రతుకులకు విరులనిచ్చి
మనుషులందరికి మంచి మనసునిచ్చి
పుడమి మురియ పూవు పూవులా రావమ్మా
తెలుగు ఇళ్ళకు శుభకృత్ నామ ఉగాదమ్మ
ఆత్మ పరమాత్మల కలయికే ఉగాదిగా
అంతరంగాల శోధనే సత్య పెన్నిధిగా
హిందూ ధర్మమే జగతికి నిత్య సన్నిధిగా
సిరుల సిరిమల్లె లు విరియ
భక్తి భావాలు మదిన మురియ
విశ్వమంత సుఖశాంతులు కురియ
తెలుగు ఇళ్ళకు రావమ్మ వెలుగులిచ్చి
తెలుగు వేష భాషలు గొప్పని తీర్పులిచ్చి
మా మనసంతా వసంతాలు నింపమ్మా
ముద్దు ముచ్చట్లు ముంగిట తేవమ్మా