తేట తెలుగు ముంగిళ్లను పలకరిస్తూ వచ్చింది ఉగాది
శిశిరానికి వీడ్కోలు పలికి వసంతాన్ని స్వాగతిస్తూ
వన్నెలేన్నోసింగారించుకొని వచ్చింది సంవత్సరాది
ఇంటింటా సంబరాలు నింప ఉరకలేస్తు వచ్చి
ఉషోదయాన తలుపు తట్టింది తెలుగువారి యుగాది
కోకిలమ్మలు స్వరాలు సవరించుకొని కొత్త రాగాలు ఆలపించగా
కమ్మనైన కళా తపస్వి తెలుగు ఉగాది వచ్చింది
లేలేత చిగుళ్ళతో అవని తల్లికి హరితవర్ణం చీరకట్టి
ప్రకృతి పరవశించగా
చైత్రమాసమోచ్చే శుభకృత్ నామ ఉగాది సాక్షిగా
ఉల్లాసాన్ని అందించింది తెలుగువారి హృదయాలలో
తీపి..బంధాలలోని మధురిమ
కారం..లోని మమకారం
ఉప్పు..లోని నమ్మకం
పులుపు..లోని పులకింతలు
చేదు..లో కలిగించే చేవ
భావాలు..తెలిపే వగరు
ఆరు రుచుల ఆహార్యం
తీపిచేదు కమ్మదనం, సుఖదుఃఖాలకు సంకేతం..
కారం వగరుల కలయిక, తెలుగు వారి సహనానికి సంకేతం..
పులుపు ఉప్పు కలయిక, రుచికి సుచికి సంకేతం..
షడ్రుచుల సమ్మేళనం, జీవితానికిదే పరమార్థం
కరోనా కాటుతో ఉగాది మహోత్సవ హేళ మూగబోయింది
కళ్లాపి వాకిళ్ళు మెత్తగా పలకరించ లేదు
ముంగిట ముత్యాల ముగ్గులు అద్దలేదు
గుమ్మాలకు మామిడి తోరణాలు మురిసి తలలూచ లేదు
వేకువ జామున తలంటు స్నానాలు లేవు
నూతన వస్త్రాల సింగారింపులు లేవు
కొత్త అల్లుళ్ళ కోలాహలం లేదు
ఆరోగ్య ఔషధం ఉగాది పచ్చడి నోటికి రుచించలేదు
పడుచు పిల్లల హుషారైన తుళ్ళింతలు లేవు
వలస కూలీల వేదన కంటతడి పెట్టించినా
ఎన్నెన్నో ప్రాణాలు నింగికెగిసినా
గానా గంధర్వుడు సకలావనిని
శోకసంద్రంలో ముంచి కనుమరుగైనా
సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నేలకొరిగినా
మనోస్థైర్యంతో మనిషి కాలం చేసిన గాయాలను భరించి
సర్వజనుల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ
ప్రతి తెలుగు గుండె సౌభాగ్యసంపద కొరకై శ్రమిస్తూ
వీర సైనికులై విజయ బావుటా ఎగర వేస్తూ
ఆనందోత్సవాలతో ఉగాదికి స్వాగత గీతాలు ఆలపిస్తున్నది.
శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు