శుభ కృత్యాలు చేయ
కాలాన్ని చీల్చుకు ఏతెంచిన
శుభకృత్ ఉగాదీ!
శుభ స్వాగతం! నీకు సుస్వాగతం!!
అన్య జాతి పక్షుల వృక్షాలపైనే
వలస పక్షులమై వసిస్తున్న
ప్రవాస ఆవాసం మాది
మాతృభూమికి, వలస నేలకి
రాత్రింబగళ్ళు ఏకకాలంలో
అనుభవించలేనంత దూరం
మాతృనేలలోనే భిన్న విభిన్న కుల, మత,
వర్గాదులతో సహజీవనానికి అలవాటుపడ్డవాళ్ళం
మేముండే అన్య దేశాల్లో, ప్రదేశాల్లో
ఆహార, ఆహార్యాల్లో వ్యత్యాసమున్నా
మన సంస్కృతి, సంప్రదాయాల్ని మరవక
పండగపబ్బాల్ని పాటించడంలో వెరవక
నిత్యం అనునిత్యం అనుసరిస్తూనే ఉన్నం
జగాదినుంచి వస్తున్న ఉగాదిని పాటించే
అంతర్జాతీయ తెలుగు జాతీయులం
ప్రవహిస్తున్న ప్రవాస జీవనంలో
సూర్యుడు నిప్పులు చెరగక
హిమ కిరణాల్ని ప్రసరిస్తున్నందుకు
వేపపూత, మామిడికాతకై చెట్లులేక
కోకిలల గానామృతం మృగ్యమైనా
జన వనాల్లో కవి కోకిలల కవనాలతో...
ఇంటింటా భక్ష్యాలను భుజిస్తూ...
తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరులైన
షడ్రుచుల మిశ్రమ పచ్చడిని ఆస్వాదిస్తూ...
నిన్నాహ్వానించే తెలుగు వెలుగు జాతీయులం
ఉద్యోగ విధులతో మా కలల్ని, వేడుకల్ని
వారాంతంలోనే జరుపుకుంటామని తెల్సి
శనివారం వేంచేస్తున్న శుభకృతు నామ ఉగాదీ!
యుగాది నుంచీ నీకు ఆహ్వానం పలుకుతూనే ఉన్నాం!!
సాంకేతికతతో ఎక్కడికైనా క్షణాల్లో
సమాచార సంచారం ధారాపాతమౌతూ
గ్లోబలీకరణతో నేలనేలంతా కుగ్రామమై
సమస్త అవస్థలతో జీవనమొక సంగ్రామమై
మన వికృత కృత్యాల కరోనాదులతో
ప్రకృతి ప్రకోపాలమయమై
మా(నవ) జీవన శకటం నిర్జీవ శకలమైనా
కాలాన్ని చీల్చుకు ఏతెంచిన శుభకృత్ ఉగాదీ!
మా కవితాక్షర మాలలేసి
నిన్ను ఆహ్వానిస్తున్నాం ఎందుకో తెలుసా?!
మాతృదేశమైన అమృత భారతిన
మాతృభాషల అమలు పెంచ
రైతుల ఆత్మహత్యలు నిలువరించ
శ్రమశక్తి దోచుకొనే శ్రేణుల తుంచ
కుల మతాల కండకావరాన్ని వంచ
సమసమాజ శుభోదయం పూయించ
శుభకృత్ వై వేంచేస్తున్న ఉగాదీ!
శుభస్వాగతం! నీకు సుస్వాగతం!!